phoolan devi
-
జీవితానికి బందీలు వీళ్లిద్దరూ
పడని కష్టం లేదు ఫూలన్‌దేవి. ముప్పై ఏళ్లుగా జైల్లోనే నళిని. ఇద్దరివీ పోలికలేని జీవితాలు. ఆ.. ఒక పోలిక ఉంది!! వీళ్లను కన్నీళ్లు పెట్టించిందీ.. కరడు కట్టించిందీ అయినవాళ్లే. ఫూలన్‌ని తండ్రి అమ్మేశాడు. నళిని.. భర్తను నమ్మేసింది! జైలుకు కాదు.. జీవితానికి బందీలు వీళ్లిద్దరూ. పందొమ్మిదేళ్ల క్రితం ముప్పై ఏడేళ్ల వయసులో యూపీలోని మీర్జాపూర్ ఎంపీగా ఉన్నప్పుడు దుండగుల తుపాకీ గుండ్లకు బలైపోయారు ఫూలన్‌దేవి. అంతకు పదేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తన ఇరవై రెండవ యేట నుంచీ జైల్లోనే ఉంది నళిని. ఈ ఇద్దరూ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రావడానికి పెద్ద విశేషం కూడా ఏమీ లేదు నిజానికైతే! యూపీలో కాంగ్రెస్ రాజకీయ నాయకుడొకరు ఫూలన్ మరణించిన జూలై 25వ తేదీన ‘వీరాంగన ఫూలన్‌దేవి’ అని ట్వీట్ చేశారు. ఇరవై రెండు మంది అగ్రవర్ణాల వారిని నిలువునా కాల్చి చంపిన బందిపోటును వీరాంగన అనడం ఏమిటి అని ‘అగ్ర’హ జ్వాలలు రగిలాయి. నళిని కూడా పెద్దగా ప్రాముఖ్యానికి నోచుకోని ఒక కారణం వల్ల ఇటీవలే వార్తల్లోకి వచ్చి వెళ్లారు. జైల్లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనీ, లేదు.. ఆత్మహత్య బెదిరింపుతో జైలు అధికారులను బ్లాక్మెయిల్ చేసిందనీ రెండు మాటలు వచ్చాయి. ఎక్కడా కలిసినవాళ్లు, ఏ విధంగానూ కలిపి చూడ్డానికి వీల్లేనివాళ్లూ.. ఫూలన్ దేవి, నళినీ. అయితే మోసపోవడం అన్నది ఇద్దరి జీవితంలోనూ ఉంది. ఫూలన్‌ని దేవిదిన్ నిషాద్ మోసం చేశాడు. నళినిని శ్రీహరన్ మోసం చేశాడు. నిషాద్ ఫూలన్ తండ్రి. శ్రీహరన్ నళిని భర్త. ఫూలన్ జీవితంలో అన్నీ పోరాటాలే. కాస్త పెద్ద మాటల్లో చెప్పాలంటే.. అణగారిన వర్గాల మహిళల సంక్షేమం కోసం పోరాటం. అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలపై పోరాటం. సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై పోరాటం. స్త్రీగా ఆమె పడిన కష్టాలే ఆమెను ‘వీరాంగన’ను చేశాయి. ఫూలన్‌ను పదహారేళ్ల వయసులో ఆమె పెదనాన్న కొడుకు ఆస్తి విషయమై అన్యాయంగా జైల్లో పెట్టించినప్పుడు మూడు రోజుల పాటు పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. చంబల్ లోయ బందిపోటు నాయకుడు ఆమెను అపహరించుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ముఠానాయకుల మధ్య చేతులు మారిన ప్రతిసారీ ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఇవన్నీ కూడా ఆమె ఇరవయ్యవ యేటకే జరిగిపోయాయి. అన్నిటికన్నా ఆమె పడిన పెద్ద కష్టం పదకొండేళ్ల వయసులో! ఆ కష్టం తెచ్చిపెట్టింది బంధువులో, బందిపోట్లో, అగ్రవర్ణాల వారో కాదు. సొంత తండ్రి!! పుట్టీలాల్ అనే వ్యక్తికి ఫూలన్‌దేవిని అమ్మేశాడు. ధర.. ఒక ఆవు, ఒక సైకిల్. తల్లి నెత్తీనోరు మొత్తుకుంటుంటే తండ్రి ఆమెను కొట్టి ఒక మూలకు నెట్టేయడం చూస్తూనే ఉంది ఫూలన్. ‘‘ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం! కోసుకుంటామా!!’ అని తన గురించి అనడమూ వింటూనే ఉంది. అంతలోనే పుట్టీలాల్ వచ్చి ఫూలన్‌ని భుజాన వేసుకుని వెళ్లిపోయాడు. అతడి నుంచి పారిపోయి రావడంతో ఫూలన్ జీవితంలో పోరాటం మొదలైంది. అవును. ఆ వయసుకు పారిపోవడం కూడా పోరాటమే. అదీ ‘భర్త’అనే వింత జీవి నుంచి. బాధ్యత చూపని తండ్రి నుంచి. ‘నేనొక్కదాన్నే కాదు. ఇంకా చాలామందే ఉన్నారు నాలాంటి వాళ్లు’.. ఇదీ ఫూలన్.. తన బయోగ్రఫీ రాయడానికి 1983–94 మధ్య జైలుకు వచ్చి కలిసిన మాలాసేన్తో తొలిరోజు అన్నమాట. మాలాను పూలన్.. ‘దీదీ’అనేవారు. ఫూలన్ బతికి ఉంటే నళినికి ఇప్పుడు ఆమె ‘దీదీ’ అయి ఉండేవారేమో.. ఇరవై తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్న నళినిని విడిపించడానికి ఢిల్లీ నుంచి ఓ చిన్న పోరాటమో, పెద్ద ప్రయత్నమో చేసి. నళిని జీవిత చరిత్ర కూడా పుస్తకంగా వచ్చింది. ‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే ఆ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత తమిళ్లో రాశారు. ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్ట్ అయ్యే నాటికే నళిని రెండు నెలల గర్భవతి. శ్రీహరన్‌తో ప్రేమబంధం గురించి పుస్తకంలో ఉంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. శ్రీహరన్ ఒక ధ్యేయంతో నళిని ప్రేమించాడు. నళిని ఆ ప్రేమలో పడిపోయి, అతడితోపాటు విలువైన జీవితాన్ని జైలుపాలు చేసుకుంది. జైల్లోనే కూతుర్ని ప్రసవించింది. కూతురి పెళ్లి చేయడానికి పెరోల్ కోసం తిప్పలు పడింది. ఊహించని విధంగా శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించి అంతా అస్తవ్యస్తం చేశాడు. అయితే ఇప్పటికీ ఆమె.. ‘‘రక్తాన్ని దాహంగొన్న తోడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’ అని అంటోందే తప్ప భర్తను, భర్త ప్రేమను తప్పుప ట్టడం లేదు! నళిని తల్లి పద్మావతి. మద్రాసులోని ఓ ఆసుపత్రిలో ఆమె నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అద్దెకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వీళ్ల ఇంటి పక్కన చేరాడు. కొద్దిరోజుల తర్వాత ‘ఒంటి కన్ను’ శివరాసన్ వచ్చి శ్రీహరన్ రూమ్మేట్ అయ్యాడు. ఆ వెంటనే ‘థను’ (మానవబాంబు) వచ్చి చేరింది. ఇదంతా జరుగుతున్నప్పుడే నళిని, శ్రీహరన్ ప్రేమలో పడ్డారు. స్త్రీ జీవితంలోని కల్లోలానికి ప్రతీకలైన రెండు పేర్లు ఫూలన్, నళిని. నిన్న (ఆగస్టు 10) ఫూలన్ దేవి జయంతి. నళినికి జీవితంలో ఎప్పటికీ మరపునకు రాని రోజు మాత్రం మే 21. రాజీవ్ గాంధీ.. హత్యకు గురైన రోజు అది. -
నేరసామ్రాజ్య మహారాణులు
‘క్వీన్స్ ఆఫ్ క్రైమ్’ అనే 288 పేజీల పుస్తకాన్ని ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్’ ఈనెల 20న విడుదల చేస్తోంది. టీవీలో ఏడేళ్లుగా ప్రసారం అవుతున్న హిందీ క్రైమ్ షో ‘సావ్ధాన్ ఇండియా’ వ్యాఖ్యాత సుశాంత్ సింగ్, థ్రిల్లర్ ఫిక్షన్లో చెయ్యి తిరిగిన రచయిత కుల్‌ప్రీత్ యాదవ్ కలిసి రాసిన ఈ ఇంగ్లిషు పుస్తకంలో కరడుగట్టిన పది మంది మహిళల నిజ జీవిత నేర చరిత్ర ఎంతో ఉత్కంఠభరితంగా పొందుపరచబడి ఉందని పెంగ్విన్ ప్రకటించింది. అయితే ఆ పేరుమోసిన మహిళా నేరస్థులు ఎవరన్నది రచయితలు గానీ, పెంగ్విన్ గానీ వెల్లడించలేదు! నో ప్రాబ్లం. ఆ పదిమంది జాబితాలో ఉండేందుకు అవకాశం ఉన్న కొందరు ‘ఉమెన్ క్రిమినల్స్’ గురించి మనమే అంచనావేద్దాం. ఇంద్రాణి ముఖర్జియా భారతదేశ చరిత్రలోనే మోస్ట్ తికమక మర్డర్ కేస్‌లోకి ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్నారు. మలుపుల్లో మెలకువగా ఉండకపోతే దారి తప్పడం ఖాయం. గౌహతిలో ఒక జంట. ఇంద్రాణి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఇంద్రాణి టీనేజ్‌లోకి వచ్చింది. టీనేజ్లోనే గర్భవతి అయింది! కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఆమె గర్భానికి కారణమని అనుమానం. ఇంద్రాణి ఇల్లొదిలి వెళ్లిపోయింది. షీనాకు జన్మనిచ్చింది. సిద్ధార్థ దాస్‌ను పెళ్లి చేసుకుంది. ఇంద్రాణి, సిద్ధార్థ కలిసి మైఖేల్ బోరా అనే బిడ్డకు జన్మనిచ్చారు. ఇంద్రాణి సిద్ధార్థకు విడాకులిచ్చి సంజీవ్ ఖన్నాను పెళ్లి చేసుకుంది. ఇంద్రాణికి, సంజీవ్‌కి విధి ఖన్నా జన్మించింది. ఇంద్రాణి, సంజీవ్ విడాకులు తీసుకున్నారు. ఇంద్రాణి ముంబైకి చేరుకుంది. అక్కడ పీటర్ ముఖర్జియాను చేసుకుంది. షీనా బోరా, విధి ఖన్నా కూడా ముంబై వచ్చి ఇంద్రాణి, పీటర్ దగ్గర ఉండిపోయారు. పీటర్ మాజీ భార్య షబ్నమ్. పీటర్‌కి, షబ్మమ్కి రాహుల్ అనే ఒక కొడుకు ఉన్నాడు. షీనా, రాహుల్ మనసులు కలిశాయి. రిలేషన్లోకి వెళ్లిపోయారు. ఆ రిలేషన్‌కి ఇంద్రాణి, పీటర్ ‘నో’ చెప్పారు. అప్పుడే ఇంద్రాణి తండ్రి ఎవరో బయట పడింది. అతడు బయటి వ్యక్తి కాదు. కుటుంబ సభ్యుడే! షీనా ఫారిన్ అకౌంట్లో భారీ మొత్తంలో డబ్బు ఉంది. ఆ డబ్బు వేసిన ఇంద్రాణి. ఆ డబ్బు కావాలని ఇంద్రాణి అడిగితే షీనా ‘నో’ అంది. షీనాను చంపేయాలని సిద్ధార్థ, (మళ్లెందుకొచ్చాడో!) ఇంద్రాణి డిసైడ్ అయ్యారు. పకడ్బందీగా ప్లాన్ చేసి షీనాను చంపేశారు. ఇదీ కేసు. ఒక్క ముక్క అర్థం కాలేదా! సీబీఐకీ అర్థమైనట్లు లేదు. ఏడేళ్లుగా ఈ కేసు నడుస్తోంది. ఎవరు ఎవరికి జన్మనిచ్చారో, ఎవరికి ఎవరు జన్మించారో బయటపడుతున్న కొద్దీ కేసు కొత్త మలుపుల్లో చిక్కుకుపోతోంది. అంజనాబాయ్ అంజనాబాయ్ ఒకరు కాదు ఇద్దరు. ఇద్దరు కాదు. ముగ్గురు. ముగ్గురు కాదు నలుగురు. అంజన పుణెలో ఉండేది. జేబులు కొట్టేసేది. రైల్వే స్టేషన్లలో చెయిన్ స్నాచింగ్‌లు చేసేది. 125 కేసుల్లో నిందితురాలు. అన్నీ పెట్టీ్ట కేసులే. 1990లో భర్త ఆమెను వదిలేసి ఇంకో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమె నేరస్వభావం అమానుష స్థాయిని చేరుకుంది. అప్పటికి ఆమె వయసు 58 ఏళ్లు. పిల్లల్ని అపహరించడం, వారి చేత చోరీలు చేయించడం, గుట్టు బయట పెట్టేస్తారనుకున్నప్పుడు వాళ్లను చంపేయడం! ఇందుకు ఆమె తన ఇద్దరు కూతుళ్ల సహాయం తీసుకుంది. ఒక కూతురు భర్తను కూడా రొంపిలోకి లాగింది. ఈ తల్లీకూతుళ్లు ఆరేళ్లవ్యవధిలో పన్నెండు మంది పిల్లల్ని అపహరించారు. ఆ పిల్లల్లో కొందరిని కొట్టి చంపారు. మొత్తానికి నలుగురూ చట్టానికి చిక్కారు. అరెస్టయిన ఏడాదికి అంజనాబాయ్ చనిపోయింది. 2001లో ఆమె ఇద్దరు కూతుళ్లను ఉరితీశారు. విచారణలో అల్లుడు నిర్దోషి అని తేలడంతో అతడిని వదిలిపెట్టారు. నేహా వర్మ నేహా వర్మ బ్యూటీషియన్. ముంబైలోని ఆర్బిట్ మాల్లో నిండా నగలు వేసుకుని ఉన్న మేఘా దేశ్‌పాండే ఆమె కంటపడింది. నేహాకు రిచ్ లైఫ్ అంటే వ్యామోహం. మేఘ ఒంటిని, ఇంటిని దోచుకోవాలని ప్లాన్ చేసింది. ఏదైనా ఉద్యోగం చూపించమని పరిచయం చేసుకుంది. మేఘ దగ్గర మంచి మార్కులు కొట్టేసి, ఆమె ఇంటికి రాకపోకలు మొదలు పెట్టింది. దోపిడికి ప్లాన్ చేశాక రాహుల్, మనోజ్‌ల సహాయం తీసుకుంది. రాహుల్ పూర్వ పరిచయస్తుడు. బాగా డబ్బు సంపాదించి అతడితో కలిసి హాయిగా జీవించాలని నేహ ఆశ. ప్లాన్ ప్రకారం ఓ రోజు ముగ్గురూ మేఘ నివాసంలోకి వెళ్లారు. రాహుల్, మనోజ్.. మేఘతో (42) పాటు ఆమె కూతురు ఆశ్లేష (21), ఆమె తల్లి రోహిణిని మొదట తుపాకులతో కాల్చి, కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. లక్షన్నర క్యాష్, ఐదు లక్షల విలువైన ఆభరణాలు, రెండు ఏటీఎం కార్డులు దోచుకెళ్లారు. కాల్పులు జరిపేటప్పుడు రాహుల్ ఆ కంగారులో తన కాలిపై తనే కాల్చుకుని ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరడంతో పోలీసులకు దొరికిపోయాడు. ఆ వెంటే మిగతా ఇద్దరూ పట్టుపడ్డారు. కోర్టు విచారణ జరిపి ‘రేరెస్ట్ ఆఫ్ రేర్’ కేసు అంది. వీళ్లు క్షమార్హులు కాదంది. ముగ్గురికీ మరణశిక్ష విధించింది. సిమ్రాన్ సూద్ బులెట్ దిగబడితేనన్నా బతికి బట్టకడతారేమో. సిమ్రాన్ సూద్ చిన్న లుక్ ఇచ్చిందంటే ఆ మరణాన్ని అనుభవించి తీరవలసిందే. ఆ అమ్మాయిని వలలో వేసుకుని రెండు హత్యలకు స్కెచ్ వేశాడు విజయ్ పలాండే. అప్పటికే గ్యాంగ్‌స్టర్ అతడు. 1998లో ఒక మర్డర్, 2002లో ఇంకో మర్డర్ అతడి క్రిమినల్ అకౌంట్లో ఉన్నాయి. సిమ్రాన్‌ని ‘హనీ ట్రాప్’గా ఎరవేసి, మనీ సంపాదించడం మొదలు పెట్టాడు. మనీ అంటే నోట్ల కట్టలు కాదు. పెద్దపెద్ద ప్రాపర్టీలు! సంతకం పెడతావా, స్పాట్ పెట్టమంటావా అని అడిగేవాడు. సంతకం పెట్టేవాళ్లు. అయినా స్పాట్ పెట్టేవాడు. పలాండే కన్ను వర్థమాన నటుడు అనూజ్ టిక్కు ఉంటున్న లొఖాండవాలా (ముంబై) కాంప్లెక్‌లోని అతడి అపార్ట్మెంట్ మీద పడింది. అతడిపైకి సిమ్రాన్‌ని ప్రయోగించాడు. సిమ్రాన్.. పలక్కాడ్ని తన బ్రదర్‌గా అనూజ్‌కి, కరణ్‌కుమార్ అనే సినీ నిర్మాతకు పరిచయం చేసింది. కరణ్ కుమార్ నిర్మాత. అతడిని చంపేశారు. అనూజ్ తండ్రి అరుణ్‌ని చంపేశారు. తర్వాత పోలీసులు సిమ్రాన్‌ని, పలాండేని అరెస్ట్ చేశారు. మారియా సుసాయ్‌రాజ్ మారియా సుసాయ్‌రాజ్, ముంబైలోని ఒక టీవీ చానల్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ క్లోజ్ ఫ్రెండ్స్. సడన్‌గా నీరజ్ మాయం అయ్యాడు. మారియా పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. విచారణలో వెల్లడైన నిజాలకు పోలీసులే వణికిపోయారు. 2008 మే 6. నీరజ్ చెన్నైలోని మారియా ఫ్లాట్‌లో ఉన్నాడు. ఆ సంగతి మారియా మరో ఫ్రెండ్ ఎమిలీ జెరోమ్‌కి తెలిసింది. ముంబైలో నేవీ ఆఫీసర్ అతడు. నీరజ్, మారియా రిలేషన్లో ఉన్నారని అతడికి అనుమానం వచ్చింది. వెంటనే విమానంలో చెన్నై వచ్చి వాళ్లిద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. నీరజ్‌ని అక్కడికక్కడే చంపేశాడు. శవాన్ని ఫ్లాట్‌లోనే ఉంచి, బయటికి వెళ్లి దగ్గర్లోని మాల్లో కత్తిని కొనుక్కొచ్చి నీరజ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాడు. ఆ ముక్కల్ని గోనె సంచిలో కుక్కి, దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతా చెయ్యడానికి మారియా సహకరించింది. జెరోమ్ తేలికపాటి శిక్షతో బయట పడ్డాడు. సాక్ష్యాల్ని చెరిపే ప్రయత్నం చేసినందుకు మారియాకు పెద్ద శిక్ష పడింది. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘నాట్ ఎ లవ్ స్టోరీ’కి ఈ ఘటన కూడా ఒక ప్రేరణ. బేబీ పటాన్‌కర్ 2015 ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యేనాటికి బేబీ పటాన్‌కర్ వయసు 52 ఏళ్లు. అసలు పేరు శశికళా పటాన్‌కర్. అప్పటికి ఇరవై ఏళ్లుగా ఆమె డ్రగ్స్ బిజినెస్‌లో ఉంది. గంజాయి అమ్ముతూ పట్టుబడి 2001లో ఒకసారి అరెస్ట్ అయి, బయటికి వచ్చింది. బాంబేలో డ్రగ్ బ్యారెన్గా ఎదిగింది. మ్యూ–మ్యూ (పార్టీ డ్రగ్), ఎం–క్యాట్, బబుల్స్.. ఇలా గిరాకీ ఉన్న డ్రగ్గులన్నిటికీ బేబీ అండర్ వరల్డ్ డీలర్. ఆమె పేరు యు.కె. వరకు వెళ్లింది. ఆ టైమ్‌లోనే ఆమె బాయ్‌ఫ్రెండ్ ధర్మరాజ్ కలోఖే దగ్గర 120 కేజీల ‘బబుల్స్’ (మెఫెడ్రోన్) పట్టబడింది. ధర్మరాజ్ పోలీస్ కానిస్టేబుల్. మెరైన్ డ్రైవ్ పోలీస్‌స్టేషన్‌లోనే, అతడి డెస్క్‌లోనే ఇంత డ్రగ్గు బయటపడింది. డొంక కదలింది. బేబీ సామ్రాజ్యం బీటలు వారింది. పోలీసులు అరెస్ట్ చేశారు. సైనేడ్ మల్లిక ‘సైనేడ్ మల్లిక’ పేరు వింటే ఇప్పటికీ బెంగుళూరులో ఆడవాళ్లు మెడలోని ఆభరణాలను తడుముకుంటారు! ఆమె అసలు పేరు కేడీ కెంపన్న. కంట్రీస్ ఫస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్. కర్ణాటకలోని కగ్గరిపుర ఆమె బర్త్ ప్లేస్. చిట్ ఫండ్ బిజినెస్ చేసేది. అందులో భారీగా లాస్ రావడంతో భర్త ఆమెను అప్పులవాళ్లకు వదిలేసి పారిపోయాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి, అప్పులు తీర్చి రిచ్‌గా బతకాలని మల్లిక ఆశ. ఆడవాళ్లను నమ్మించి, వాళ్లను చంపి ఒంటిపై బంగారు నగల్ని దోచుకోవడం మొదలుపెట్టింది. ఒక్క బెంగుళూరులోనే ఆమె ఈ ఇరవై ఏళ్లలో ఐదు హత్యలు చేసింది. గుడులకు తిరగడం, డిప్రెషన్లో ఉన్నవాళ్లను కనిపెట్టడం, పూజ చేస్తే ఫలం ఉంటుందని నమ్మించి పాడుబడిన దేవాలయాలకు తీసుకెళ్లి సైనేడు కలిపిన నీళ్లు తాగించడం, వాళ్లు చనిపోయాక ఒంటి మీద నగలు ఒలుచుకెళ్లడం.. ఇదీ మల్లిక స్టెయిల్ ఆఫ్ క్రైమ్. ఆరో హత్య చేయబోతుండగా కలాసిపాళ్యం పోలీసులకు దొరికిపోయింది. ఫూలన్‌దేవి మన దేశంలోని ఆడపిల్ల పుట్టడమే తాళిబొట్టుతోనైనా పుడుతుందేమో కానీ, తుపాకీ చేతబట్టి మాత్రం పుట్టదు. ఫూలన్ జీవితంలో ఇవి రెండూ జరిగాయి. పదకొండేళ్ల వయసులో ఇష్టంలేని పెళ్లితాడును పుటుక్కున తెంపేసిన ఫూన్దేవి, అగ్రకులాలవారు దురహంకారంతో తనపై జరిపించిన అత్యాచారాలను భరించలేక ఆయుధాన్ని చేతపట్టింది. 21 మందిని గన్‌డౌన్ చేసింది. పోలీస్ హంట్ మొదలైంది. పిట్టకు దొరకలేదు ఫూలన్. చివరికి తనే లొంగిపోతానని చీటీ పంపింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. మధ్యప్రదేశ్ పోలీసులకు మాత్రమే సరెండర్ అవుతానంది. యు.పీ.పోలీసుల మీద నమ్మకం లేదంది. తన ఆయుధాల్ని దుర్గామాత ఎదుటగానీ, మహాత్మాగాంధీ ఫొటో ముందు కానీ పెడతానంది. తనకు మరణశిక్ష విధించబోమన్న హామీ కావాలంది. తన అనుచరులకు వేసే శిక్ష ఎనిమిదేళ్లకు మించకూడదంది. కొంత భూమిని ఇవ్వాలంది. లొంగిపోయే రోజు తన కుటుంబం మొత్తానికీ పోలీస్ ఎస్కార్ట్ ఉండాలంది. అన్నిటికే ‘ఎస్’ అంది గవర్నమెంట్. బందిపోటు రాణిగారు సాక్షాత్కరిస్తే చాలు అనుకుంది! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్, 300 మంది పోలీసులు, పదివేల మంది పౌరులు.. ఇంతమంది హాజరయ్యారు ఫూలన్ లొంగుబాటు కార్యక్రమానికి! ఆమెపై 48 కేసులు పెట్టారు. విచారణ పేరుతో 11 ఏళ్లు జైల్లో ఉంచారు. చివరికి.. సత్ప్రవర్త కలిగి ఉంటాననే హామీ తీసుకుని విడుదల చేశారు. ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఫూలన్ పై కేసులన్నీ తీయించేశారు. రాజకీయాల్లోకి తీసుకున్నారు. ఫూలన్ ఎంపీ అయ్యాక.. పార్లమెంట్లో లంచ్ బ్రేక్‌కి బయటికి వచ్చినప్పుడు దుండగులు ఆమెను కాల్చిచంపారు. భారతదేశంలో ఇప్పుటికీ నటోరియస్ ఉమన్ క్రిమినల్ ఎవరూ అంటే ఫూలన్‌దేవే! చట్టం దృష్టిలోనే ఆమె నటోరియస్ కావచ్చు. అంతకన్నా నటోరియస్.. ఆమెను అలా మార్చిన పరిస్థితులు. -
స్త్రీలోక సంచారం
సమాజంలో బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడి పదవిలోకి వచ్చిన కె.సి.ఆర్., ముఖ్యమంత్రి అయ్యాక తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటివ్వకుండా తిరిగి తనే వివక్షను పాటిస్తున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (పిల్) స్పందించిన హైదరాబాద్ హైకోర్టు.. మంత్రివర్గంలో తప్పనిసరిగా మహిళలకు స్థానం కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించలేదు కనుక మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్‌ని కొట్టివేసింది. అధికార టి.ఆర్.ఎస్. పార్టీ మహిళా ఎమ్మెల్యేలలో దాదాపుగా అంతా ఎస్సీలు, ఎస్టీలు కావడం వల్లనే కె.సి.ఆర్. వారిని తన మంత్రివర్గంలోకి రానివ్వలేదని వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన దారా శ్రీశైలం అనే న్యాయవాది వేసిన ‘పిల్’పై కోర్టు ఈ విధంగా స్పందించింది. అమెరికా ప్రతినిధుల సభకు (దిగువ సభకు) నవంబరులో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో 180 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతుండగా, గత జూన్‌లో ‘సెనెట్’కు (ఎగువ సభకు) జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 42 మంది మహిళలు (24 మంది డెమోక్రాట్లు, 18 మంది రిపబ్లికన్లు) బరిలో నిలిచారని ‘సెంటర్ ఫర్ అమెరికన్ ఉమెన్ పాలిటిక్స్ (సి.ఎ.డబ్లు్య.పి) వెల్లడించింది. రెండేళ్ల కాలపరిమితితో 435 మంది సభ్యులుండే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువస¿¶ కు, ఆరేళ్ల కాలపరిమితితో 100 మంది సభ్యులుండే ఎగువసభకు ప్రతి ‘సరి సంవత్సరం’లో ఖాళీల భర్తీకి ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతుంటాయి. పన్నెండేళ్లుగా సహజీవనం చేసి, 2014లో పెళ్లి చేసుకుని, 2016లో విడిపోయిన హాలీవుడ్ అందాల జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్.. కోర్టు కేసుల పరిష్కారం కోసం ఇప్పుడు అయిష్టంగా ఒకరిముఖం ఒకరు చూసుకోవలసి వస్తోంది! దత్తత తీసుకున్న పిల్లలు, సొంత పిల్లలు కలిపి మొత్తం ఆరుమందిలో కొందరి పోషణ, సంరక్షణ కోసం ఒప్పందం ప్రకారం బ్రాడ్ పిట్ తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వడం లేదని ఏంజెలీనా కోర్టుకు వెళ్లగా, విడిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఏంజెలీనాకు తను అనేక మిలియన్ డాలర్లను చెల్లించినట్లు బ్రాడ్ పిట్ చెబుతున్నారు. లైంగిక అకృత్యాల రాక్షసుడు హార్వీ వైన్‌స్టీన్‌ను తను పూర్తిగా సమర్థించనప్పటికీ, ‘మీటూ’ ఉద్యమానికి మాత్రం మద్దతు ఇవ్వలేకపోతున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి ‘లేలో’ (లిండ్సే లోహన్) సంచలనాత్మక ప్రకటన చేశారు. ‘నేనూ బాధితురాలినే’ అని బయటికి రావడం మహిళల బలాన్ని కాక, బలహీనతను మాత్రమే బయటపెడుతోందని ఆమె అన్నారు. బి.జె.పి మగవాళ్ల పార్టీ మాత్రమేనని, మహిళల్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనీ రాహుల్ ఆరోపించడం బి.జె.పి.లోని మహిళల్ని అవమానించడమేనని అంటూ.. రక్షణమంత్రి మహిళ కాదా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మహిళ కాదా, లోక్‌సభ స్పీకర్ మహిళ కాదా అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ.. రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ‘మహిళా అధికార్ సమ్మేళన్’లో రాహుల్ చేసిన పై ఆరోపణలను తిప్పికొట్టే సందర్భంలో.. ‘తెలియకుండా మాట్లాడ్డం మానాలని’ కూడా రాహుల్‌కు ఆమె హితవు చెప్పారు. 37 ఏళ్ల వయసులో హత్యకు గురైన పార్లమెంటు సభ్యురాలు, న్యాయవాది, ‘బందిపోటు రాణి’ అయిన ఫూలన్ దేవి బర్త్ డే ఇవాళ. స్టార్ చెఫ్ పద్మాలక్ష్మి తన ఎనిమిదేళ్ల కూతురు కృష్ణ, ఆ పాప తండ్రి ఆడమ్ డెల్‌తో కలిసి ప్రస్తుతం ఇటలీలో విహరిస్తున్నారు. అమెరికన్ రియాలిటీ షో ‘టాప్ చెఫ్’ ఫినాలీ ఎపిసోడ్ చిత్రీకరణ నుంచి స్వల్ప విరామం తీసుకోవడంతో దొరికిన వ్యవధిలో పద్మాలక్ష్మి చక్కగా టూర్లు కొడుతూ, ఇష్టమైన ఆహారం తింటూ, కూతురితో, పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న ఆడమ్ డెల్‌తో కుటుంబ అనుబంధాల్లోని మాధుర్యాన్ని గ్రోలుతున్నట్లు రెండు వారాల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)లో పేరు లేని నలభై లక్షల మంది ‘అస్సామీ’లను తరలించే ప్రయత్నాలు మొదలైతే కనుక మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ కరువు అయ్యే ప్రమాదం ఉండొచ్చని అంతర్జాతీయ సామాజిక, పాలనా విధానాల పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతిమ జాబితాను సిద్ధం చేసి, రిజిస్టరులో పేరు లేని పౌరుల తరలింపునకు తొందరపడితే అస్సాంలో కల్లోల పరిస్థితులు తలెత్తవచ్చునని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పూలన్ దేవి హత్య: పెళ్లిపీటలెక్కిన ప్రధాన నిందితుడు
సాక్షి, న్యూఢిల్లీ: బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి హత్య కేసులో నిందితుడు షేర్ సింగ్ రాణా(41) మరోసారి వార్తల్లో నిలిచాడు. షేర్ సింగ్ నిన్న (మంగళవారం) వివాహం చేసుకోవడంతో పూలన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. పూలన్‌దేవి హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న షేర్ సింగ్ కొంతకాలం కిందట బెయిల్ మీద బయటకు వచ్చాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూతురు ప్రతిమా సింగ్‌తో కలిసి షేర్ సింగ్ పెళ్లిపీటలెక్కాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో వైభవంగా ఈ వివాహం జరిగింది. ప్రతిమాసింగ్‌తో వివాహం అనంతరం షేర్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడాడు. 'అంతా దేవుడి మీద భారం వేశాను. కేసు నుంచి బయట పడేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని' షేర్ సింగ్ అన్నాడు. బందిపోటుగా జీవనం సాగించిన అనంతరం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న పూలన్‌దేవి సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఎస్పీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను షేర్ సింగ్ రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి ఆమెను కాల్చి చంపారు. 2014 ఆగస్టులో ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించగా.. రాణా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 2016లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
విప్లవ ‘నారీ’.....విజయ భేరీ
"నాటి స్వాతంత్ర్య పోరాటం మొదలు.....నేటి ‘‘మీ టూ’’(లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా) వచ్చిన ఉద్యమాలు, పోరాటాలు కోకొల్లలు. వీటిల్లో స్త్రీలు సారధ్యం వహించినవి, వహిస్తున్నవి ఎన్నో.....సమాజ గతిని మార్చిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నారీమణులెందరో. వారిలో నేడు కొందరిని స్మరించుకుందాం ......’’ లక్ష్మి సెహగల్ కెప్టెన్ లక్ష్మిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మి సెహగల్ అజాద్ స్థాపించిన ‘‘నేషనల్ ఆర్మి’’లో పనిచేసిన ఏకైక మహిళ. తదనంతరం ఆజాద్ స్థాపించిన హిందూ గవర్నెమెంటులో మహిళా మంత్రిత్వ శాఖను నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో రాణి ఝాన్సీ దళానికి నాయకత్వం వహించారు. ఈ దళం ప్రత్యేకత దీనిలోని సభ్యులందరూ మహిళలే. వీరు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆంగ్ సాన్ సూ చీ తండ్రి స్వాతంత్ర్యం కోసం పోరాడి హత్యకు గురైన గొప్ప యోధుడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది ఆంగ్ సాన్ సు కీ. 1988 వరకూ కూడా ఆమె తన జీవితాన్ని భారత్, అమెరికా, జపాన్, ఇంగాండ్ దేశాల్లోనే గడిపింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకోవడానికి బర్మాకి తిరిగి వచ్చింది. ఆమె దేశంలో అడుగుపెట్టె సమయానికి ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అధికార పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు నిరసనగా వీధుల్లో ఆందోళన చేస్తున్న ప్రజల మీద ఆర్మి కాల్పులు జరిపింది. ఈ సంఘటనతో ప్రభావితురాలైన సూ చీ ప్రజా ఉద్యమంలో తాను భాగస్వామ్యం కావాలని భావించింది. 1989లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని స్థాపించింది. ఒక్క సంవత్సర కాలంలోనే అంటే 1990లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సూ కీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. కానీ సైనిక బలగాలు మాత్రం సూ చీ కి అధికారాన్ని ఇవ్వడానికి నిరాకరించాయి. ఆమెను నిర్భంధంలో ఉంచాయి. కానీ సూ చీ మాత్రం విశ్వసాన్ని కోల్పోలేదు. సైన్యంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె చర్చలు ఫలించి, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాల మద్దతు వల్ల 15 సంవత్సరాల తర్వాత ఆమెను నవంబర్,2010లో నిర్భంధం నుంచి విముక్తి చేసింది సైన్యం. 2015లో జరిగిన ఎన్నికల్లో సూ చీ పార్టీ ఘన విజయం సాధించింది. బర్మా ప్రజలు దేవతగా కొలిచే ఆంగ్ సాన్ సూ చీ 1991లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. తవాకెల్ కర్మన్ అరబ్ దేశాలు అంటేనే విపరీతమైన ఆంక్షలు, కట్టుబాట్లు. స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఆలోచించడం కాదు కదా కనీసం ఆలోచించడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు. అక్కడ ఆడవాళ్లు ఎల్లప్పుడు ముసుగు వేనకే ఉండాలి. చదువుకోవడం మాట దేవుడేరుగు ఇంట్లోనుంచి బయటకు రావాలన్న ఎవరో ఒకరు తొడుగా రావల్సిందే. అలాంటి సమాజంలో ఆ కట్టుబాట్లను ఎదిరించి నిలిచింది తవాక్కల్ కర్మాన్. ఉక్కు మహిళ, విప్లవ మాత గా యెమెన్ ప్రజల చేత పిలవబడుతున్న తవాక్కల్ నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి అరబ్ దేశ వనిత...రెండో ముస్లీం మహిళ(నోబెల్ అందుకున్న తొలి ముస్లీం బాలిక మలాల యూసఫ్ జాయ్). యెమెన్‌లో మానవహక్కుల రక్షణ కోసం 2005లో 7గురు మహిళా విలేకరులతో కలిసి సంకెళ్లు లేని మహిళా విలేకరులు అనే సంస్థను స్ధాపించి వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. కోరజోన్ అక్వినో సాధరణ గృహిణి స్థాయి నుంచి ఫిలిప్పైన్స్ కే కాక మొత్తం ఆసియాలోనే తొలి మహిళా ప్రధానిగా నిలిచిన కోరజోన్ అక్వినో జీవిత గమనం ఎంతో స్ఫూర్తిదాయకం. తన భర్త బెనిగ్నొ ఆక్వినో జూ. నాటి ప్రధాని మార్కొస్కు బద్ద వ్యతిరేకి కావటంతో అతన్ని దేశబహిష్కరణ చేశారు. అమెరిక ప్రవాసం వెళ్లిన అతన్ని హత్య చేయడంతో కోరజోన్ ఫిలిప్పైన్స్కు తిరిగి వచ్చి మధ్యంతర ఎన్నికల్లో పోటిచేశారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆమె రెండు వారాల పాటు శాంతియుతంగా పోరాడి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఆమెకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరినప్పటికీ ప్రజాస్వామ్య పరంగా గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అధ్యక్షుని అధికారాలను పరిమితం చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. 1992లో పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రజాస్వామ్యానికి హాని కల్గించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమె చేసిన సేవలకు గాను 1998లో ‘‘రామన్ మెగాసెసె’’ అవార్డును పొందారు. గోల్డా మేయర్ పాలస్తినాను విభజించి ఇజ్రాయేల్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి ఆందోళనలు జరిగాయి. చివరకూ ఐక్యరాజ్య సమితి కూడా 1947లో పాలస్తినాను విభజన ప్రతిపాదనను చేసింది. కానీ అరబ్బు దేశాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకింయి. ఆ సమయంలో ఇజ్రాయేల్ ఏర్పాటు కోసం జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభయ్యింది.ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గోల్డా మేయర్. ఒకానొక సందర్భంలో ఉద్యమంలోని కీలక నేతలందరూ అరెస్టు అయినప్పుడు గోల్డా మేయరే ఉద్యమకారుల తరుపున అధికారులతో సంప్రదింపులు జరిపి, 1948లో ఇజ్రాయేల్ ఏర్పడడానికి ఎంతో కారణమయ్యారు. నూతన ప్రభుత్వంలో డేవిడ్ బెన్ గురియన్ మంత్రి వర్గంలో పనిచేసారు. అంచెలంచెలుగా ఎదిగి 1973లో ఇజ్రాయేల్ ప్రధాని అయ్యారు. విల్మా లుసిలా ఎస్పిన్ చరిత్రలో క్యూబా విప్లవానిది ఓ ప్రత్యేక స్థానం. ఈ విప్లవం గురించి తలుచుకోగానే అందరికి గుర్తుకు వచ్చేది చేగువేరా, ఫిడెల్‌క్యాస్ట్రో, లాటిన్ ఎల్టైస్.....కారణం వీరంతా ప్రజా నాడి తెలిసిన వారు. కానీ ఈ విప్లవంలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఆమె ‘విల్మా లుసిలా ఎస్పిన్’. కెమికల్ ఇంజనీర్ చదివిన విల్మా 1950లో బటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమంలో ఆయుధాలు ధరించి సాధరణ కరేబియన్ స్త్రీల ఆహర్యానికి వ్యతిరేకంగా నిత్యం ఆర్మి దుస్తులు ధరించి ఉండేవారు. తదనంతరం ఫిడెల్ క్యాస్ట్రో సోదరుడు రఫెల్‌ను వివాహం చేసుకున్నారు. జానెట్ జగాన్ చికాగోలో జన్మించిన జానెట్ ప్రేమించిన వాడి కోసం స్వదేశాన్ని వదిలి గయానా వచ్చారు. ఒక చిన్న షాపు యజమానిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి గయానాకు తొలి మహిళ ప్రధాని అయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గయానాలో రోజువారి కూలీలు ప్రారంభించిన ఉద్యమంలో జానెట్ కీలక పాత్ర పోషించి అప్పటి బ్రిటన్ ప్రధాని వినస్టన్ చర్చిల్ ఆగ్రహానికి గురయ్యారు. ఆమెను నాయకత్వం నుంచి వేరు చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్ని వ్యర్థమయ్యాయి. చివరకు బ్రిటన్ నుంచి గయానాకు స్వతంత్రం లభించింది. 1997లో గయాని ప్రధాని అయ్యాక దేశ సంపదలో అత్యధిక భాగాన్ని జాతీయం చేశారు. జియాంగ్ క్వింగ్ మావో జెడాంగ్ భార్యగా అందరికి పరిచితమైన జియాంగ్ జీవితంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఆమె అనుభవించిన పేదరికం, నటిగా వైఫల్యాలు ఉంటే, రెండో భాగంలో సాంస్కృతిక విప్లవంలో భాగంగా తీవ్ర వ్విధ్వంసానికి పాల్పడిన కమ్యూనిస్టు సభ్యురాలిగా అన్నింటికి మించి పశ్చాత్తాపమంటే తేలియని క్రూరమైన విప్లవకారినిగా ఆధునిక చరిత్రలో నిలిచిపోయారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే తీవ్రవాదులకు నాయకురాలిగా ఎదిగారు. మావోను వివాహం చేసుకున్న అనంతరం సాంస్కృతిక విప్లవంలో ఎక్కువగా నిమగ్నమయ్యారు. తనకు తానే ‘‘నేను మావో పపెంపుడు కుక్కను, అతడు ఎవరిని కరవమంటే వారిని కరుస్తాను’’ అని చెప్పుకునేవారు. ఒక దశాబ్దం పాటు జైలు జీవితం గడిపిన తరువాత 1991లో ఆత్మహత్య చేసుకున్నారు. నాదెజ్డా క్రుప్స్కాయా 1917లో ‘అక్టోబర్ విప్లవం’ రావడానికి ప్రధాన కారకులయిన నాదెజ్డా క్రుప్స్కాయాకి చిన్నతనం నుంచే అన్యాయాన్ని ఎదదిరించడం అలవాటు. పేద, ధనిక తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలని కోరుకునేవారు. తాను చదువుకుంటునే సాయంత్రం సమయంలో పారిశ్రామిక కార్మికులకు చదువుచెప్పేవారు నాదెజ్డా క్రుప్స్కాయా. ఆ సమయంలోను మార్క్సిజం పట్ట ఆకర్షితురాలయ్యారు. వాద్లిమర్ లెనిన్తో కలిసి 1895లో ‘‘లీగ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ది ఎమోన్సిపేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ’’ను స్థాపించారు. అనంతరం లెనిన్‌ను వివాహం చేసుకున్నారు. పోలీసులు ఈ జంటను సైబిరియాకు ప్రవాసం పంసారు. మార్క్సిస్టులకోసం ‘‘ఇస్క్రా’’ అనే పతత్రికను నడిపారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రష్యా వెళ్లారు. బోల్షివిక్ పార్టీని స్థాపించారు. తన జీవితాంతం వరకూ కార్మికుల సంక్షేమం కోసం తపించారు. సుసాన్ బి ఆంటోని ‘‘ఆడపిల్లకు పెద్ద చదువులెందుకు ఊళ్లేలా, ఉద్యోగాలు చేయలా....బస్పు బోర్డు చదవడం తెలిస్తే చాలు’’....ఇప్పటికి వినిపించే మాట. అలాంటిది మరి 18వ శతాబ్దంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు సుసాన్. ఆమె చదువుకుంటున్న పాఠశాలలో ఒక మగ ఉపాధ్యాయుడు సుసాన్‌తో ‘‘నీకు ఇంక పెద్ద చదువులు అక్కరలేదు. ఒక ఆడపిల్లకు బైబిల్ చదవడం,తన వయసు లెక్కించుకోవడం తెలిస్తే సరపోతుంది’’ అన్నారు. ఆ మాటలు ఆమెలో బలంగా నాటుకుపోయాయి. పట్టుదలతో చదివి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలి స్థాయికి ఎదిగారు. స్త్రీల హక్కుల కోసం ‘‘ది రివల్యూషన్’’ అనే పత్రికను స్థాపించారు. ‘‘నేషనల్ ఉమెన్ సర్ఫెజ్ అసోసియేషన్’’ను స్థాపించి స్త్రీలకు ఓటు హక్కు కోసం పోరాటం చేసారు. ఆమె చేసిన కృష ఫలితంగా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ఎమ్మిలైన్ పాంక్రస్ట్ మహిళలకు ఓటుహక్కు కల్పించడం కోసం పోరాడిన మరొక మహిళ ఎమ్మిలైన్ పాంక్రస్ట్. తన తండ్రి ప్రోత్సాహంతో లా చదివిన ఎమ్మిలైన్ మహిళల హక్కుల కోసం పోరడ్డానికి ‘‘వుమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’’ను స్థాపించారు. దాని ప్రధాన ఉద్దేశం ‘‘మాటలు కాదు చేతలు’’. ఫలితంగా ఆమెను 12సార్లు అరెస్టు చేశారు. ఆమె చేసిన కృషికిగాను బ్రిటన్ ప్రభుత్వం ఆమె మరణించిన సంవత్పరంలోనే(1928)లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి ఆచరణలో కొనసాగుతున్నాయి. హరియత్ టబ్మాన్ ‘‘నా ముందు రెండు అంశాలున్నాయి- స్వేచ్ఛ, మరణం. ఒకటి లేకపోతే మరొకటి ఉంటుంది’ ఈ వాక్యాలు చేప్పింది హరియత్ టబ్మాన్. 1820లో మేరీలాండ్‌లో ఒక బానిస కుటుంబంలో జన్మించిన హరియత్ టబ్మాన్ స్వేచ్ఛ కోసం స్వతంత్ర రాష్ట్రం పెన్నిసులేనియా వెళ్లారు. ఒక సంవత్పరం తర్వాత మేరీలాండ్ తిరిగి వచ్చి తన కుటుంబంతో పాటు, భూగర్భ రైలు రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్న మరో 300మంది బానిసలను కాపాడారు. సైనిక దండయాత్రను ఎదుర్కొన్న తొలి మహిళ హరియత్ టబ్మాన్ చరిత్రలో నిలిచిపోయారు. మేరి వొల్‌స్టోన్‌క్రాఫ్ట్ అనాదిగా వస్తున్న ఈ పురుషాధిక్య సమాజంలో 18వ శతాబ్దంలోనే మహిళల హక్కుల కోసం పపోరాడిన వ్యక్తి మేరి వొల్‌స్టోన్‌క్రాఫ్ట్. ‘‘ఆస్తుల కంటే ఆడవారు గొప్పవారు’’ అని ప్రచారం చేశారు. ‘‘ఏ విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద మెన్’’(1790), ‘‘ఏ విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద వుమెన్’’(1791) ఆమె చేసిన రెండు గొప్ప రచనలు. మహిళల హక్కుల కోసం తన గొంతును బలంగా వినిపించారరు. కాన్స్టాన్స్ మార్కీవిగ్స్ కాన్స్టాన్స్ మార్కీవిగ్స్ ఆంగ్లో-ఐరీష్ వనిత. ఒక ప్రఖ్యాత విప్లవకారిణి, జాతీయవాది, సోషలిస్టు కూడా. ఐరీష్ స్వతంత్రం కోసం పోరాడారు. ఐరీస్ క్యాబినేట్లో తొలి మహిళా మంత్రి అంతేకాదు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్‌కు ఎన్నికయిన తొలి మహిళ కూడా కాన్స్టాన్స్ మార్కీవిగ్సే. పెట్రా హెర్రార మెక్సికో విప్లవం సందర్భంగా స్త్రీలు కూడా పురుషులతో పాటు పోరాటం చేయడానికి వెళ్లేవారు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. పురుషులతో సమానంగా పేరు తెచ్చుకున్న పెట్రా హెర్రార ను పపెడ్రో హెర్రార గా పిలిచేవారు. ఈ అసమానతను తట్టుకోలేక సైన్యం నుంచి బయటకు వచ్చి తానే స్వయంగా 400మంది మహిళలతో ఒక దళాన్ని ఏర్పాటుచేశారు. 1914, మే 30న జరిగిన టోరియన్ యుద్దంలో పాల్గొన్నారు. న్వాన్యెరువా మహామహా సామ్రాజ్యాలను తమ పాదక్రాంతం చేసుకున్న బ్రిటిష్ వారు ఆడవారి ముందు తలవంచారు, న్యాయపరమైన వారి హక్కులను గుర్తించారు. ఆశ్చర్యం గొలిపే ఈ సంఘటన నైజీరియాలో జరిగింది. ఆడవారి ని సైతం పన్నులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్న బ్రిటిష్ అధికారులను తన తోటి మహిళలతొ కలిసి ఎదిరించారు నైజీరియాకు చెందిన న్వాన్యెరువా. 25,000వేల మంది మహిళలను సంఘటిత పరిచి పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా రెండునెలల పాటు నిరసనలు కొనసాగించారు. చివరకూ ప్రభుత్వం దిగివచ్చి వారిమీద విధించిన పన్నులను రద్దు చేసింది. సోఫి స్కూల్ యూదుల మీద హిట్లర్ జరిపిన మారణకాండనను తలుచుకుంటే నేటికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి నియంతకు, ఆయన జరిపే హింసాకాండకు వ్యతిరేకంగా ప్రారంభమైంది ‘వైట్ రోజ్’ ఉద్యమం. దీని పని హిట్లర్ పాలనకు వ్యతిరేకంగా అహింసా పద్దతిలో కరపత్రాలను పంచడం, గోడలమీద వ్యతిరేక రాతలు రాయడం. ఇదంతా చాలా రహస్యంగా జరిగేది. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సోఫి స్కూల్. ఆమె తన సహచరులతో కలిసి మ్యూనీచ్ విశ్వవిద్యాలయం దగ్గర కరపత్రాలను పంచుతుండగా ఆమెను బంధించారు. అనంతరం అతి క్రూరంగా ఆమె తలను నరికి చంపేశారు. ఆమెను చంపేశారు కానీ ఆమె ఆశయాన్ని మాత్ర చంపలేక పోయారు. సెలియా సాంచెజ్ క్యూబా విప్లవం అనగానే మనందరికి వెంటనే గుర్తుకు వచ్చేది ఫిడేల్ క్యాస్ట్రో, చేగువేరా. విప్లవానికి ఆధారంగా నిలిచిన సెలియా సాంచెజ్ గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. 1952 తిరుగుబాటు తర్వాత బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటులో చేరారు సెలియా సాంచెజ్. చరిత్రకెక్కిన జూలై 26 ఉద్యమనానికి స్థాపకురాలైనిరు. విప్లవం ముగిసేంతవరకూ దళాలకు నాయకత్వం వహించారు. బటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడ్డానికి మెక్సికో నుంచి క్యూబాకు వచ్చిన 82 మంది సైనికులకు కావలసిన సదుపాయలను కల్పించారు. విప్లవం ముగిసిన నాటి నుంచి చనిపోయే వరకూ క్యాస్ట్రోకు ఆప్తురాలిగా మెలిగారు. అస్మా మహఫౌజ్ ఆధునిక విప్లవకారిణి. 2011 ఈజిప్టు విప్లవంలో కీలక పాత్ర పోషించారు. తహరీర్ స్క్వేర్ వద్ద ప్రదర్శించే నిరసనలో తనతోపాటు పాల్గొనడానికి మిగితా వారిని ప్రోత్సాహించడానికి తన బ్లాగులో ఒక వీడియోను పోస్టు చేసారు. అది ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ‘‘ఈజిప్టు కోయిలేషన్ ఆఫ్ ద యూత్ ఆఫ్ ద రివల్యూషన్’’లో తాను ప్రముఖ సభ్యురాలు. లైమా రాబోర్ట గబోయి లైబిరియాకు చెందిన ప్రముఖ శాంతి కార్యకర్త. లైబిరియాలో శాంతి స్థాపన కోసం ప్రారంభమైన ‘‘వుమెన్ ఆఫ్ లైబిరియన్ ఫర్ మాస్ యాక్షన్ ఆఫ్ పీస్’’ అనే శాంతి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా 2003లో రెండవ లైబిరియన్ పౌర యుద్ధం ముగిసింది, 2005లో నిర్వహించిన ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. ఆమె చేసిన సేవలకు గాను 2011లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. పూలన్ దేవి బాధించేవారు ఎప్పుడు ఉన్నత వర్గం వారే, బాధితులేప్పుడు అల్పులే. ఎందుకంటే వారి తరపున నిలబడే వారు ఎవ్వరు ఉండరు. తిరగబటడం వారికి చేతకాదు. ఒకవేళ వారే కనక ఎదురుదాడి చేస్తే.....సరిగ్గా అదే జరిగింది పూలన్ దేవి విషయంలో. ఉత్తరప్రదేశ్‌లోని ఓ నిమ్న వర్గంలో పేద కుటుంబంలో పుట్టింది పూలన్ దేవి. చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలు పడింది, ఉన్నత వర్గం వారి చేతిలో అనేక మార్లు లైంగిక హింసకు గురయ్యింది. వైవాహిక జీవితం తాను కోరుకున్న మార్పును ఇవ్వలేదు. దాంతో ఇంటి నుంచి పారిపోయి బందిపోట్లతో కలిసిపోయారు. తనకు అన్యాయం చేసిన 20మంది ఉన్నత వర్గం వారిని అదే గ్రామంలో నిలబెట్టి కాల్చి చంపారు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి జైలునుంచి విడుదలయ్యారు. తర్వాత సమాజ్‌వాది పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పేదలు, అణగారిన వర్గాల వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా నిలిచిపోయారు పూలన్ దేవి. - పిల్లి ధరణి -
అయ్యో! తల్లీ!!
ఆకలికాలం ఉత్తరప్రదేశ్‌లో రేపు చివరి విడత పోలింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ పోలింగ్ గురించి కాదు. ఎప్పుడో జరిగిపోయిన నాల్గవ విడత పోలింగ్ గురించి! ఆ విడతలో 53 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటిల్లో కల్పి అసెంబ్లీ నియోజకర్గం కూడా ఉంది. అక్కడి నుంచి ఛోటేసింగ్ (బి.ఎస్.పి.), నరేంద్రపాల్ సింగ్ (బి.జె.పి.), ప్రస్తుత ఎమ్మెల్యే ఉమాకాంతి (కాంగ్రెస్) పోటీ చేశారు. ప్రజలకు వీళ్లు ఎలాంటి హామీలు ఇచ్చారో కానీ, ఈ ముగ్గురిలో ఎవరైతే తనకు ఇంత ముద్ద పెడతారో వారికే నా ఓటు అని మూలాదేవి అనే ఓటరు పోలింగ్‌కి ముందే చెప్పేశారు. మూలాదేవిది కల్పి నియోజకవర్గంలోని షేక్‌పూర్‌గూడా గ్రామం. 70 ఏళ్ల ఈ వృద్ధురాలు దాదాపుగా ఆకలితో మరణించే స్థితిలో ఉన్నట్లు అక్కడి కరువు గ్రామాలపై సర్వేచేసిన ‘బుందేల్‌ఖండ్ దళిత్ అధికార్ మంచ్’ అనే ఎన్జీవో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఒక నిరుపేద... ఆకలిబాధతో కడుపు చేతపట్టుకోవడం మన దేశంలో ఎప్పుడూ ఉండే విషాదమే. కానీ మూలాదేవి వేరు. మీర్జాపూర్ ఎంపీ అయిన ఫూలన్‌దేవి తల్లి ఆమె! అయితే పదిహేడేళ్ల క్రితం ఫూలన్‌ని ఆమె ఎంపీగా ఉన్నప్పుడే ఆమె విరోధులు ఢిల్లీలో కాల్చి చంపారు. అప్పటి నుంచి మూలాదేవి ‘పూలన్ తల్లి’గా ప్రత్యేక హోదాను కోల్పోయారు. ఉన్న కొద్దిపాటి భూమినీ కబ్జాదారులు తన్నుకుపోయారు. మూలాదేవి, ఆమె చిన్న కూతురు రామ్‌కలి ఇప్పుడు చిరుగుల డేరాలాంటి పూరి గుడిసెలో ఉంటున్నారు. రామ్‌కలిలో ఫూలన్ పోలికలు ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో లబ్ది పొందడానికి కొన్ని పార్టీలు రామ్‌కలిని స్టేజ్ ఎక్కిస్తుంటాయి. అప్పుడు మాత్రం ఇంతో అంతో ఆమె చేతిలో పెడతుంటాయి. మిగతా అప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో గిన్నెలు కడిగి రామ్‌కలి కొంత డబ్బు సంపాదించుకొస్తుంది. అదే వారి కుటుంబానికి ఆధారం. రామ్‌కలికి టిక్కెట్ ఇస్తానని ములాయం సింగ్ హామీ ఇచ్చారు కానీ, అదీ జరగలేదు. చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారో? గెలిచినవారు మూలాదేవికి ఇంత ముద్ద పెడతారో లేదో! అధికారంలోకి వచ్చిన వారెవరైనా ముందు చేయవలసిన పని అదే కదా. ‘బందిపోటు రాణి’ ఫూలన్ దేవి -
ఫూలన్ దేవి తల్లికి ఎంత కష్టం!
చంబల్ లోయ ప్రాంతాన్ని గడగడ వణికించిన దొంగల రాణి.. ఫూలన్ దేవి. ఆమె పేరు వింటే చాలు.. భూస్వాముల వెన్నులో వణుకు పుట్టేది. 1980 ప్రాంతాలలో ఆమెను పట్టుకోవాలన్నా పోలీసులు కూడా భయపడేవారు. అలాంటి ఫూలన్ దేవి ఎంత డబ్బు కూడబెట్టిందో అనుకుంటాం కదూ. కానీ, ఇప్పుడు ఆమె తల్లి మాత్రం తిండికి కూడా గతి లేక అల్లాడుతున్నారు. ఫూలన్ దేవి తల్లి మూలాదేవికి ఇప్పుడు 70 ఏళ్ల వయసుంది. ఫూలన్ దేవి బందిపోటుగా ఉన్నప్పుడు మూలాదేవి బయటకు వచ్చారంటే చాలు.. జనం వంగి వంగి సలాములు చేసేవారు. ఆమెను చూసేందుకే పెద్దసంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు కేవలం ఆ జ్ఞాపకాలతోనే ఆమె బతకాల్సి వస్తోంది. గత సంవత్సరం కరువు ప్రాంతాలపై సర్వే చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మూలాదేవి, ఆమె కూతురు రామ్‌కలీ (ఫూలన్ చెల్లెలు) కనిపించారు. ఇద్దరూ కూడా కరువుతో దాదాపు చావుకు దగ్గరగా ఉన్నారు. అప్పటికి వాళ్లింట్లో కొద్దిపాటి గోధుమ పిండి, పావుకిలో ఉల్లిపాయలు తప్ప ఏమీ లేవు. 17 ఏళ్ల క్రితం ఎంపీగా కూడా పనిచేసిన ఒక మహిళ కుటుంబ సభ్యులు ఇంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారంటే ఆ ప్రతినిధులు నమ్మలేకపోయారు. షేఖ్‌పూర్ గుఢా గ్రామం శివార్లలో వారికి మూడు బిఘాల భూమి ఉంది. కానీ ఇప్పుడు రామ్‌కలీ ఉపాధి హామీ పనులు దొరికితే వాటికి వెళ్లి నెలకు రూ. 300-400 వరకు తెస్తుంది. అక్కడ అంతకంటే ఎక్కువ పని దొరకడంలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ వద్దకు వస్తారని, వాళ్లు తనను స్టేజి మీద చూపించి, తనకు రూ. 200 ఇస్తారని రామ్‌కలీ చెప్పారు. కానీ తర్వాతి కాలంలో వేరే అభ్యర్థుల నుంచి తనకు బెదిరింపులు రావడంతో అది కూడా మానేశానన్నారు. ఫూలన్ దేవి 1983లో పోలీసులకు లొంగిపోయారు. ఆమెపై 48 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం కొట్టేసింది. 1994లో ఆమె జైలు నుంచి విడుదలై, రెండేళ్ల తర్వాత మీర్జాపూర్ ఎంపీగా గెలిచారు. 1999లో మరోసారి కూడా నెగ్గారు గానీ, 2001 జూలై 25వ తేదీన ఆమె అధికారిక నివాసం వద్దే కాల్పుల్లో చనిపోయారు. ఫూలన్ హత్య తర్వాత తమ భూమిని ఠాకూర్లు లాగేసుకున్నారని, అప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని మూలాదేవి చెప్పారు. తన చిన్న కూతురికి పార్టీ టికెట్ ఇస్తామని ములాయం చెప్పారు గానీ, తర్వాత ఏమీ జరగలేదన్నారు. ఫూలన్ సొంత గ్రామం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోకి వస్తుంది. అక్కడి నాయకులు తాము వాళ్లకు సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు గానీ.. వాస్తవంలో చూస్తే అవేమీ కనిపించడంలేదు. -
'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు
-
'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు
న్యూఢిల్లీ: పూలన్ దేవి హంతకుడు షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. అతడికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది. ఈ నెల 8న అతడిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ఆగస్టు 12న శిక్ష ఖరారవుతుందని భావించినా రెండు రోజులు ఆలస్యంగా తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు హత్యకు గురైయ్యారు. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు.