విప్లవ ‘నారీ’.....విజయ భేరీ | most rebellious women all over the world | Sakshi
Sakshi News home page

విప్లవ ‘నారీ’.....విజయ భేరీ

Published Wed, Feb 21 2018 2:31 AM | Last Updated on Wed, Feb 21 2018 2:31 AM

most rebellious women all over the world - Sakshi

"నాటి స్వాతంత్ర్య పోరాటం మొదలు.....నేటి ‘‘మీ టూ’’(లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా) వచ్చిన ఉద్యమాలు, పోరాటాలు కోకొల్లలు. వీటిల్లో స్త్రీలు సారధ్యం వహించినవి, వహిస్తున్నవి ఎన్నో.....సమాజ గతిని మార్చిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నారీమణులెందరో. వారిలో  నేడు కొందరిని స్మరించుకుందాం ......’’

లక్ష్మి సెహగల్‌
కెప్టెన్‌  లక్ష్మిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మి సెహగల్‌ అజాద్‌ స్థాపించిన ‘‘నేషనల్‌ ఆర్మి’’లో పనిచేసిన ఏకైక మహిళ. తదనంతరం ఆజాద్‌ స్థాపించిన హిందూ గవర్నెమెంటులో మహిళా మంత్రిత్వ శాఖను నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో రాణి ఝాన్సీ దళానికి నాయకత్వం వహించారు. ఈ దళం ప్రత్యేకత దీనిలోని సభ్యులందరూ మహిళలే. వీరు రెండో ప్రపంచ  యుద్ధంలో కూడా పాల్గొన్నారు.

ఆంగ్ సాన్ సూ చీ
తండ్రి స్వాతంత్ర్యం కోసం పోరాడి హత్యకు గురైన గొప్ప యోధుడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది ఆంగ్‌ సాన్‌ సు కీ. 1988 వరకూ కూడా ఆమె తన జీవితాన్ని భారత్‌, అమెరికా, జపాన్‌, ఇంగాండ్‌ దేశాల్లోనే గడిపింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకోవడానికి బర్మాకి తిరిగి వచ్చింది. ఆమె దేశంలో అడుగుపెట్టె సమయానికి ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అధికార పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు నిరసనగా వీధుల్లో ఆందోళన చేస్తున్న ప్రజల మీద ఆర్మి కాల్పులు జరిపింది. ఈ సంఘటనతో ప్రభావితురాలైన సూ చీ ప్రజా ఉద్యమంలో తాను భాగస్వామ్యం కావాలని భావించింది. 1989లో నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీని స్థాపించింది. ఒక్క సంవత్సర కాలంలోనే అంటే 1990లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సూ కీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. కానీ సైనిక బలగాలు మాత్రం సూ చీ కి అధి​కారాన్ని ఇవ్వడానికి నిరాకరించాయి. ఆమెను నిర్భంధంలో ఉంచాయి. కానీ సూ చీ మాత్రం విశ్వసాన్ని కోల్పోలేదు.  సైన్యంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె చర్చలు ఫలించి, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాల మద్దతు వల్ల  15 సంవత్సరాల తర్వాత ఆమెను  నవంబర్‌,2010లో నిర్భంధం నుంచి  విముక్తి చేసింది సైన్యం. 2015లో జరిగిన ఎన్నికల్లో​ సూ చీ పార్టీ ఘన విజయం సాధించింది.  బర్మా ప్రజలు దేవతగా కొలిచే ఆంగ్‌ సాన్‌ సూ చీ  1991లో నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు.

తవాకెల్ కర్మన్
అరబ్‌ దేశాలు అంటేనే విపరీతమైన ఆంక్షలు, కట్టుబాట్లు. స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఆలోచించడం కాదు కదా కనీసం ఆలోచించడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు. అక్కడ ఆడవాళ్లు ఎల్లప్పుడు ముసుగు వేనకే ఉండాలి. చదువుకోవడం మాట దేవుడేరుగు ఇంట్లోనుంచి బయటకు రావాలన్న ఎవరో ఒకరు తొడుగా రావల్సిందే. అలాంటి సమాజంలో ఆ కట్టుబాట్లను ఎదిరించి నిలిచింది తవాక్కల్‌ కర్మాన్‌. ఉక్కు మహిళ, విప్లవ మాత గా యెమెన్‌ ప్రజల చేత పిలవబడుతున్న తవాక్కల్‌  నోబెల్‌ శాంతి బహుమతి పొందిన తొలి అరబ్‌ దేశ వనిత...రెండో ముస్లీం మహిళ(నోబెల్‌ అందుకున్న తొలి ముస్లీం బాలిక మలాల యూసఫ్‌ జాయ్‌). యెమెన్‌లో  మానవహక్కుల రక్షణ కోసం 2005లో 7గురు మహిళా విలేకరులతో కలిసి సంకెళ్లు లేని మహిళా విలేకరులు అనే సంస్థను స్ధాపించి వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షణ కోసం పోరాడుతున్నారు.

కోరజోన్ అక్వినో
సాధరణ గృహిణి స్థాయి నుంచి ఫిలిప్పైన్స్‌ కే కాక మొత్తం ఆసియాలోనే తొలి మహిళా ప్రధానిగా నిలిచిన కోరజోన్‌ అక్వినో జీవిత గమనం ఎంతో స్ఫూర్తిదాయకం. తన భర్త బెనిగ్నొ ఆక్వినో జూ. నాటి ప్రధాని మార్కొస్‌కు బద్ద వ్యతిరేకి కావటంతో అతన్ని దేశబహిష్కరణ చేశారు. అమెరిక ప్రవాసం వెళ్లిన అతన్ని హత్య చేయడంతో కోరజోన్‌ ఫిలిప్పైన్స్‌కు తిరిగి వచ్చి మధ్యంతర ఎన్నికల్లో పోటిచేశారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆమె రెండు వారాల పాటు శాంతియుతంగా పోరాడి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక  ఆమెకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరినప్పటికీ ప్రజాస్వామ్య పరంగా గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అధ్యక్షుని అధికారాలను పరిమితం చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. 1992లో పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రజాస్వామ్యానికి హాని కల్గించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు.  ఆమె చేసిన సేవలకు గాను 1998లో ‘‘రామన్‌ మెగాసెసె’’ అవార్డును పొందారు.

గోల్డా మేయర్‌
పాలస్తినాను విభజించి ఇజ్రాయేల్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి ఆందోళనలు జరిగాయి. చివరకూ ఐక్యరాజ్య సమితి కూడా 1947లో పాలస్తినాను విభజన ప్రతిపాదనను చేసింది. కానీ అరబ్బు దేశాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకింయి. ఆ సమయంలో ఇజ్రాయేల్‌ ఏర్పాటు కోసం జియోనిస్ట్‌ ఉద్యమం  ప్రారంభయ్యింది.ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గోల్డా మేయర్‌. ఒకానొక సందర్భంలో ఉద్యమంలోని కీలక నేతలందరూ అరెస్టు అయినప్పుడు గోల్డా మేయరే ఉద్యమకారుల తరుపున అధికారులతో సంప్రదింపులు జరిపి, 1948లో ఇజ్రాయేల్‌ ఏర్పడడానికి ఎంతో కారణమయ్యారు. నూతన ప్రభుత్వంలో డేవిడ్‌ బెన్‌ గురియన్‌ మంత్రి వర్గంలో పనిచేసారు. అంచెలంచెలుగా ఎదిగి 1973లో ఇజ్రాయేల్‌ ప్రధాని అయ్యారు.

విల్మా లుసిలా ఎస్పిన్‌
చరిత్రలో క్యూబా విప్లవాని​ది ఓ ప్రత్యేక స్థానం. ఈ విప్లవం గురించి తలుచుకోగానే అందరికి గుర్తుకు వచ్చేది చేగువేరా, ఫిడెల్‌క్యాస్ట్రో, లాటిన్‌ ఎల్టైస్‌.....కారణం వీరంతా ప్రజా నాడి తెలిసిన వారు. కానీ ఈ విప్లవంలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఆమె ‘విల్మా లుసిలా ఎస్పిన్‌’. కెమికల్‌ ఇంజనీర్‌ చదివిన విల్మా 1950లో బటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమంలో ఆయుధాలు ధరించి సాధరణ కరేబియన్‌ స్త్రీల ఆహర్యానికి వ్యతిరే​కంగా నిత్యం ఆర్మి దుస్తులు ధరించి ఉండేవారు. తదనంతరం ఫిడెల్‌ క్యాస్ట్రో సోదరుడు రఫెల్‌ను వివాహం చేసుకున్నారు.

జానెట్‌ జగాన్‌
చికాగోలో జన్మించిన జానెట్‌ ప్రేమించిన వాడి కోసం స్వదేశాన్ని వదిలి గయానా వచ్చారు. ఒక  చిన్న షాపు యజమానిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి గయానాకు తొలి మహిళ ప్రధాని అయ్యారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా గయానాలో రోజువారి కూలీలు ప్రారంభించిన ఉద్యమంలో జానెట్‌ కీలక పాత్ర పోషించి అప్పటి బ్రిటన్‌ ప్రధాని వినస్టన్‌ చర్చిల్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఆమెను నాయకత్వం నుంచి వేరు చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్ని వ్యర్థమయ్యాయి. చివరకు బ్రిటన్‌ నుంచి గయానాకు స్వతంత్రం లభించింది. 1997లో గయాని ప్రధాని అయ్యాక దేశ సంపదలో అత్యధిక భాగాన్ని జాతీయం చేశారు.

జియాంగ్‌ క్వింగ్‌
మావో జెడాంగ్‌ భార్యగా అందరికి పరిచితమైన జియాంగ్‌ జీవితంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఆమె అనుభవించిన పేదరికం, నటిగా వైఫల్యాలు ఉంటే, రెండో భాగంలో సాంస్కృతిక విప్లవంలో భాగంగా తీవ్ర వ్విధ్వంసానికి పాల్పడిన కమ్యూనిస్టు సభ్యురాలిగా అన్నింటి​కి మించి పశ్చాత్తాపమంటే తేలియని క్రూరమైన విప్లవకారినిగా ఆధునిక చరిత్రలో నిలిచిపోయారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే తీవ్రవాదులకు నాయకురాలిగా ఎదిగారు. మావోను వివాహం చేసుకున్న అనంతరం సాంస్కృతిక విప్లవంలో ఎక్కువగా నిమగ్నమయ్యారు. తనకు తానే ‘‘నేను మావో పపెంపుడు కుక్కను, అతడు ఎవరిని కరవమంటే వారిని కరుస్తాను’’ అని చెప్పుకునేవారు. ఒక దశాబ్దం పాటు జైలు జీవితం గడిపిన తరువాత 1991లో ఆత్మహత్య చేసుకున్నారు.

నాదెజ్డా క్రుప్స్కాయా
1917లో ‘అక్టోబర్‌ విప్లవం’ రావడానికి ప్రధాన కారకులయిన నాదెజ్డా క్రుప్స్కాయాకి  చిన్నతనం నుంచే అన్యాయాన్ని ఎదదిరించడం అలవాటు. పేద, ధనిక తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలని కోరుకునేవారు. తాను చదువుకుంటునే సాయంత్రం సమయంలో పారిశ్రామిక కార్మికులకు చదువుచెప్పేవారు నాదెజ్డా క్రుప్స్కాయా. ఆ సమయంలోను మార్క్సిజం పట్ట ఆకర్షితురాలయ్యారు. వాద్లిమర్‌ లెనిన్‌తో కలిసి 1895లో ‘‘లీగ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ది ఎమోన్సిపేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ’’ను స్థాపించారు. అనంతరం లెనిన్‌ను వివాహం చేసుకున్నారు. పోలీసులు ఈ జంటను సైబిరియాకు ప్రవాసం పంసారు. మార్క్సిస్టులకోసం ‘‘ఇస్క్రా’’ అనే పతత్రి​కను నడిపారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రష్యా వెళ్లారు. బోల్షివిక్‌ పార్టీని స్థాపించారు. తన జీవితాంతం వరకూ కార్మికుల సంక్షేమం కోసం తపించారు.

సుసాన్‌ బి ఆంటోని
‘‘ఆడపిల్లకు పెద్ద చదువులెందుకు ఊళ్లేలా, ఉద్యోగాలు చేయలా....బస్పు బోర్డు చదవడం తెలిస్తే చాలు’’....ఇప్పటికి వినిపించే మాట. అలాంటిది మరి 18వ శతాబ్దంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు సుసాన్‌. ఆమె చదువుకుంటున్న పాఠశాలలో ఒక మగ ఉపాధ్యాయుడు సుసాన్‌తో ‘‘నీకు ఇంక పెద్ద చదువులు అక్కరలేదు. ఒక ఆడపిల్లకు బైబిల్‌ చదవడం,తన వయసు​ లెక్కించుకోవడం తెలిస్తే సరపోతుంది’’ అన్నారు. ఆ మాటలు ఆమెలో బలంగా నాటుకుపోయాయి. పట్టుదలతో చదివి స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలి స్థాయికి ఎదిగారు. స్త్రీల హక్కుల కోసం ‘‘ది రివల్యూషన్‌’’ అనే పత్రికను స్థాపించారు. ‘‘నేషనల్‌ ఉమెన్‌ సర్ఫెజ్‌ అసోసియేషన్‌’’ను స్థాపించి స్త్రీలకు ఓటు హక్కు కోసం పోరాటం చేసారు. ఆమె చేసిన కృష ఫలితంగా  అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించారు.

ఎమ్మిలైన్‌ పాం​క్రస్ట్‌
మహిళలకు ఓటుహక్కు కల్పించడం కోసం పోరాడిన మరొక మహిళ ఎమ్మిలైన్‌ పాంక్రస్ట్‌. తన తండ్రి ప్రోత్సాహంతో లా  చదివిన ఎమ్మిలైన్‌ మహిళల హక్కుల కోసం పోరడ్డానికి ‘‘వుమెన్స్‌ సోషల్‌ అండ్‌ పొలిటికల్‌ యూనియన్‌’’ను స్థాపించారు. దాని ప్రధాన ఉద్దేశం ‘‘మాటలు కాదు చేతలు’’. ఫలితంగా ఆమెను 12సార్లు అరెస్టు చేశారు. ఆమె చేసిన కృషికిగాను బ్రిటన్‌ ప్రభుత్వం ఆమె మరణించిన సంవత్పరంలోనే(1928)లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి ఆచరణలో కొనసాగుతున్నాయి.

హరియత్‌ టబ్మాన్‌
‘‘నా ముందు రెండు అంశాలున్నాయి- స్వేచ్ఛ, మరణం. ఒకటి లేకపోతే మరొకటి ఉంటుంది’ ఈ వాక్యాలు చేప్పింది హరియత్‌ టబ్మాన్‌. 1820లో మేరీలాండ్‌లో ఒక బానిస కుటుంబంలో జన్మించిన హరియత్‌ టబ్మాన్‌ స్వేచ్ఛ కోసం స్వతంత్ర రాష్ట్రం  పెన్నిసులేనియా వెళ్లారు. ఒక సంవత్పరం తర్వాత మేరీలాండ్‌ తిరిగి వచ్చి తన కుటుంబంతో పాటు, భూగర్భ రైలు రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్న మరో 300మంది బానిసలను కాపాడారు. సైనిక దండయాత్రను ఎదుర్కొన్న తొలి మహిళ  హరియత్‌ టబ్మాన్ చరిత్రలో నిలిచిపోయారు‌.

మేరి వొల్‌స్టోన్‌క్రాఫ్ట్‌
అనాదిగా వస్తున్న ఈ పురుషాధిక్య సమాజంలో 18వ శతాబ్దంలోనే మహిళల హక్కుల కోసం పపోరాడిన వ్యక్తి మేరి వొల్‌స్టోన్‌క్రాఫ్ట్‌. ‘‘ఆస్తుల కంటే ఆడవారు గొప్పవారు’’ అని ప్రచారం చేశారు. ‘‘ఏ విండికేషన్‌ ఆఫ్‌ ద రైట్స్‌ ఆఫ్‌ ద మెన్‌’’(1790), ‘‘ఏ విండికేషన్‌ ఆఫ్‌ ద రైట్స్‌ ఆఫ్‌ ద వుమెన్’’‌(1791) ఆమె చేసిన రెండు గొప్ప రచనలు. మహిళల హక్కుల కోసం తన గొంతును బలంగా వినిపించారరు.

కాన్‌స్టాన్స్‌ మార్కీవిగ్స్‌
కాన్‌స్టాన్స్‌ మార్కీవిగ్స్‌ ఆంగ్లో-ఐరీష్‌ వనిత. ఒక ప్రఖ్యాత విప్లవకారిణి, జాతీయవాది, సోషలిస్టు కూడా. ఐరీష్‌ స్వతంత్రం కోసం పోరాడారు. ఐరీస్‌ క్యాబినేట్‌లో తొలి మహిళా మంత్రి అంతేకాదు బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్‌కు ఎన్నికయిన తొలి మహిళ కూడా కాన్‌స్టాన్స్‌ మార్కీవిగ్సే.

పెట్రా హెర్రార
మెక్సికో విప్లవం సందర్భంగా స్త్రీలు కూడా పురుషులతో పాటు పోరాటం చేయడానికి వెళ్లేవారు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. పురుషులతో సమానంగా పేరు తెచ్చుకున్న పెట్రా హెర్రార ను పపెడ్రో హెర్రార గా పిలిచేవారు. ఈ అసమానతను తట్టుకోలేక సైన్యం నుంచి బయటకు వచ్చి తానే స్వయంగా 400మంది మహిళలతో  ఒక దళాన్ని ఏర్పాటుచేశారు. 1914, మే 30న జరిగిన టోరియన్‌ యుద్దంలో పాల్గొన్నారు.

న్వాన్యెరువా
మహామహా సామ్రాజ్యాలను తమ పాదక్రాంతం చేసుకున్న బ్రిటిష్‌ వారు ఆడవారి ముందు తలవంచారు, న్యాయపరమైన వారి హక్కులను గుర్తించారు. ఆశ్చర్యం గొలిపే ఈ సంఘటన నైజీరియాలో జరిగింది. ఆడవారి ని సైతం పన్నులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్న బ్రిటిష్‌ అధికారులను తన తోటి మహిళలతొ ‍​కలిసి ఎదిరించారు నైజీరియాకు చెందిన న్వాన్యెరువా. 25,000వేల మంది మహిళలను సంఘటిత పరిచి పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా  రెండునెలల పాటు నిరసనలు కొనసాగించారు. చివరకూ ప్రభుత్వం దిగివచ్చి వారిమీద విధించిన పన్నులను రద్దు చేసింది.

సోఫి స్కూల్‌
యూదుల మీద హిట్లర్‌ జరిపిన మారణకాండనను తలుచుకుంటే నేటికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి నియంతకు, ఆయన జరిపే హింసాకాండకు  వ్యతిరేకంగా ప్రారంభమైంది ‘వైట్‌ రోజ్‌’ ఉద్యమం. దీని పని హిట్లర్‌ పాలనకు వ్యతిరేకంగా అహింసా పద్దతిలో కరపత్రాలను పంచడం, గోడలమీద వ్యతిరేక రాతలు రాయడం. ఇదంతా చాలా రహస్యంగా జరిగేది. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సోఫి స్కూల్‌. ఆమె తన సహచరులతో కలిసి మ్యూనీచ్‌ విశ్వవిద్యాలయం దగ్గర కరపత్రాలను పంచుతుండగా ఆమెను బంధించారు. అనంతరం అతి క్రూరంగా  ఆమె తలను నరికి చంపేశారు. ఆమెను చంపేశారు కానీ ఆమె ఆశయాన్ని మాత్ర చంపలేక పోయారు.

సెలియా సాంచెజ్‌
క్యూబా విప్లవం అనగానే మనందరికి వెంటనే గుర్తుకు వచ్చేది ఫిడేల్‌ క్యాస్ట్రో, చేగువేరా. విప్లవానికి ఆధారంగా నిలిచిన సెలియా సాంచెజ్‌ గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. 1952 తిరుగుబాటు తర్వాత బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటులో చేరారు సెలియా సాంచెజ్‌. చరిత్రకెక్కిన జూలై 26 ఉద్యమనానికి స్థాపకురాలైనిరు. విప్లవం ముగిసేంతవరకూ దళాలకు నాయకత్వం వహించారు. బటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడ్డానికి మెక్సికో నుంచి క్యూబాకు వచ్చిన 82 మంది సైనికులకు కావలసిన సదుపాయలను కల్పించారు. విప్లవం ముగిసిన నాటి నుంచి చనిపోయే వరకూ క్యాస్ట్రోకు ఆప్తురాలిగా మెలిగారు.

అస్మా మహఫౌజ్‌
ఆధునిక విప్లవకారిణి. 2011 ఈజిప్టు విప్లవంలో కీలక పాత్ర పోషించారు. తహరీర్‌ స్క్వేర్‌ వద్ద ప్రదర్శించే నిరసనలో తనతోపాటు పాల్గొనడానికి మిగితా వారిని ప్రోత్సాహించడానికి  తన బ్లాగులో ఒక వీడియోను పోస్టు చేసారు. అది ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ‘‘ఈజిప్టు కోయిలేషన్‌ ఆఫ్‌ ద యూత్‌ ఆఫ్‌ ద రివల్యూషన్‌’’లో తాను ప్రముఖ సభ్యురాలు.

లైమా రాబోర్ట గబోయి
లైబిరియాకు చెందిన ప్రముఖ శాంతి కార్యకర్త. లైబిరియాలో శాంతి స్థాపన కోసం ప్రారంభమైన ‘‘వుమెన్‌ ఆఫ్‌ లైబిరియన్‌ ఫర్‌ మాస్‌ యాక్షన్‌ ఆఫ్‌ పీస్‌’’ అనే శాంతి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా 2003లో  రెండవ లైబిరియన్‌ పౌర యుద్ధం ముగిసింది, 2005లో నిర్వహించిన ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. ఆమె  చేసిన సేవలకు గాను  2011లో  నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు.

పూలన్‌ దేవి
బాధించేవారు ఎప్పుడు ఉన్నత వర్గం వారే, బాధితులేప్పుడు అల్పులే. ఎందుకంటే వారి తరపున నిలబడే వారు ఎవ్వరు ఉండరు. తిరగబటడం వారికి చేతకాదు. ఒకవేళ వారే కనక ఎదురుదాడి చేస్తే.....సరిగ్గా అదే జరిగింది పూలన్‌ దేవి విషయంలో. ఉత్తరప్రదేశ్‌లోని ఓ నిమ్న వర్గంలో పేద కుటుంబంలో పుట్టింది పూలన్‌ దేవి.  చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలు పడింది, ఉన్నత వర్గం వారి చేతిలో అనేక మార్లు లైంగిక హింసకు గురయ్యింది. వైవాహిక జీవితం తాను కోరుకున్న మార్పును ఇవ్వలేదు. దాంతో ఇంటి నుంచి పారిపోయి బందిపోట్లతో కలిసిపోయారు. తనకు అన్యాయం చేసిన 20మంది ఉన్నత వర్గం వారిని అదే గ్రామంలో నిలబెట్టి కాల్చి చంపారు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి జైలునుంచి విడుదల​య్యారు. తర్వాత సమాజ్‌వాది పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పేదలు, అణగారిన వర్గాల వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా నిలిచిపోయారు పూలన్‌ దేవి.

- పిల్లి ధరణి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement