
బీఎస్సీ డిగ్రీ పొందిన తొలి భారతీయ మహిళ ఈకే జానకీ అమ్మాళ్. ఈమె 1921లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుంచి బాటనీలో పట్టభద్రులయ్యారు. తర్వాత 12 ఏళ్లకు బొంబాయి యూనివర్సిటీ నుంచి కమలా సాహ్ని, తర్వాతి సంవత్సరం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాధా పంత్ బీఎస్సీ డిగ్రీ పొందిన మహిళలు. అయితే వైద్యశాస్త్రంలో మాత్రం కాస్త ముందుగానే అంటే 1886లో కాదంబినీ గంగూలీ కలకత్తా మెడికల్ యూనివర్సిటీ, ఆనందీ బాయి జోíషీ పెన్సిల్వేనియా ఉమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి వైద్యశాస్త్రంలో పట్టాలు పొందిన తొలితరం భారతీయ మహిళలు.
ఈ రెండు విజ్ఞాన స్రవంతుల మధ్య మూడున్నర దశాబ్దాల ఎడం ఉండటమెందుకు? సిపాయిల తిరుగు బాటుగా బ్రిటిష్ వారు పిలిచిన భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలైన 1857 లోనే తొమ్మిది నెలల వ్యవధిలో కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వ విద్యాలయాలు తొలిసారిగా ఏర్పడ్డాయి. 1884లో లార్డ్ డఫ్రిన్ భారతదేశపు వైస్రాయ్ అయ్యారు. లేడీ డఫ్రిన్‌గా పిలవబడిన హ్యారియట్ జార్జినా రోవాన్ హామిల్టన్ చొరవతో 1885లో ఏర్పడిన ఈ ఫండ్ ద్వారా మనదేశ మహిళలు వైద్యులుగా, సహాయకులుగా, నర్సులుగా తర్ఫీదు పొందడానికీ, చదువుకోడానికీ వీలైంది. డఫ్రిన్ ఫండ్ వల్ల భారతీయ యువతులు ఇంగ్లాండులో వైద్యశాస్త్రం చదువుకోవడానికీ; అలాగే ఇంగ్లాండ్, ఇతర ఐరోపా నుంచి మహిళలు భారతదేశానికి వచ్చి వైద్యం చేయడానికీ వీలైంది.
ఈ ఫండ్‌కు కశ్మీరు, దర్భంగా వంటి సంస్థానాధీశులు ఆర్థిక సాయం చేశారు. అలాగే బ్రిటిష్ ప్రముఖులతో పాటు మహారాజా జ్యోతీంద్ర మోహన్ ఠాగూర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సర్ దిన్షా మానేక్ జీ పేటిట్ వంటి భారతీయులు కూడా ఎంతో తోడ్పడ్డారు. అయితే లేడీ డఫ్రిన్ స్పందించే గుణం, చొరవ కారణంగానే ఈ ఫండ్ రూపుదిద్దుకుని కొనసాగింది. 1908 నాటికి దీని ద్వారా కేవలం 43 మంది మాత్రమే యోగ్యులైన మెడికల్ ప్రొఫెషనల్స్ తయారు అయ్యారనీ, వారిలో కేవలం 11 మంది మాత్రమే పట్టభద్రులనీ తెలుస్తోంది. ఈ ఫండ్ ద్వారానే 1886లో తొలి భారతీయ వైద్యశాస్త్ర మహిళా పట్టభద్రులు తయారయ్యారు. 2005లో ‘డఫ్రిన్ ఫండ్ యాక్ట్ –1857’ రద్దయ్యింది.
భారతీయ వైద్యరంగానికి మహిళల అవసరం చాలా ఉన్నందున, క్రమంగా జీవ శాస్త్రాల పట్ల కూడా మహిళలకు ఆసక్తి పెరిగింది. అయితే మహిళలు సైన్స్ చదువు కోవడానికి అవకాశం పెద్దగా ఉండేది కాదు. దాంతో అరకొర అవకాశాలు, అంతకు
మించిన వివక్ష ఉన్న పరిస్థితుల్లో భారతీయ మహిళలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తొలి అడుగులు వేశారు.
– డా‘‘ నాగసూరి వేణుగోపాల్
విశ్రాంత ఆకాశవాణి అధికారి ‘ 94407 32392
Comments
Please login to add a commentAdd a comment