లండన్ నుంచి ఇండియాకు వచ్చిన తొలినాళ్ల ఫొటో
ఈ ఫొటోలో గేదె పాలు పితుకుతున్న యువతి.. ఆ ఫొటోలో ట్రాక్టర్ ఎక్కి పొలం దున్న అమ్మాయి.. కుడిపక్క ఫొటోలో ఎయిర్ హోస్టెస్ ఐడి కార్డు ధరించి ఉన్నదీ... ఒక్కరే. అదే అమ్మాయి మరో ఫొటోలో భర్త, కొడుకుతోపాటు పొలంలో పని చేస్తోంది. ఇంకో ఫొటోలో గుర్రం సవారీకి సిద్ధమవుతోంది. ఆమే.. భారతి ఖుటి. ఆమె గురించి గుజరాత్ రాష్ట్రంతోపాటు, దేశమంతా ఎందుకు మాట్లాడుకుంటోందనే విషయాన్ని ఈ ఫొటోలే చెప్తున్నాయి.
భారతిది గుజరాత్ రాష్ట్రం, పోర్‌బందర్ జిల్లాలోని బేరాన్ గ్రామం. ఆమె 2010లో రామ్‌దేని పెళ్లి చేసుకుని లండన్‌కు ప్రయాణమైంది. రామ్‌దే అప్పటికే అక్కడ మేనేజిరియల్ ఎగ్జిక్యూటివ్‌గా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. భారతి అక్కడికి వెళ్లి ట్రావెల్ అండ్ టూరిజమ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేసింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగంలో చేరింది. ఈస్ట్ లండన్‌లోని స్టాట్‌ఫోర్డ్‌లో నివాసం. 2014లో కొడుకు ‘ఓమ్’ పుట్టాడు. సంతోషంగా సాగిపోతోంది జీవితం. ఆ సమయంలో సొంతూరులో ఉన్న భారతి అత్తమామల ఆరోగ్యం ఆందోళనకు గురి చేసింది. రామ్‌దే, భారతి ఇద్దరూ పెద్దవాళ్లకు మంచి వైద్యం చేయించి స్వస్థత చేకూరే వరకు అంటిపెట్టుకుని ఉండి, తిరిగి యూకే వెళ్లారు. అయితే ఈ వయసులో అమ్మానాన్నలను ఇండియాలో ఉంచి తాము యూకేలో స్థిరపడడం కష్టంగా తోచింది రామ్‌దేకి. అదే విషయాన్ని భార్యతో చెప్పాడు. అందుకామె సరేనంది. అలా ఐదేళ్ల కిందట బేరాన్‌కి తిరిగి వచ్చేశారు.
విమానం దిగి.. ట్రాక్టర్ ఎక్కింది
మొత్తం రెండు వందల కుటుంబాలు నివసించే గ్రామం బేరాన్. దాదాపుగా అందరూ వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తుల మీదనే జీవిస్తున్నారు. పంట పొలాలన్నీ రసాయనాలతో కలుషితమై ఉన్నాయి. దాదాపుగా ఓ నలభై ఏళ్ల కిందట... హరిత విప్లవంలో భాగంగా ఇన్‌సెంటివ్ మెన్యూర్ స్కీమ్‌ను పరిచయం చేసింది ప్రభుత్వం. అందుబాటులో ఉన్న సాగునేల దేశం మొత్తానికి కడుపు నింపేటంతటి ఆహారధాన్యాలను పండించడం కోసం చేసిన ప్రయత్నం అది. రసాయనిక ఎరువుల వాడకాన్ని రైతులకు పనిగట్టుకుని నేర్పించింది కూడా ప్రభుత్వమే. ఆ ప్రయత్నం విజయవంతమైంది. మన దేశం ఆహారభద్రత సాధించగలిగింది. కానీ పంట నేలలను నిస్సారం చేసుకుంది. ఇప్పుడు మరో విప్లవం రావాలి. అదే ఆర్గానిక్ రివల్యూషన్. ఈ వినూత్న విప్లవాన్ని తమ గ్రామంలో తొలి అడుగు వేయించింది భారతి.
పంటకు తోడు పాడి
ఏడు ఎకరాల భూమిలో వేరుశనగ, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, జొన్నలు పండిస్తోంది. రసాయన ఎరువుల ప్రస్తావనే లేకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులుతో వ్యవసాయం చేస్తున్నారు ఈ దంపతులు. వ్యవసాయానికి అనుబంధంగా గేదెలతో డైరీ ఫార్మ్ కూడా పెట్టి పాడికి –పంటకు మధ్య ఉన్న పరస్పర ఆధారిత బంధాన్ని రుజువు చేస్తున్నారు. తన డైలీ రొటీన్‌ను స్వయంగా షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి, వ్యవసాయంలో సంపాదన యూకేలో ఉద్యోగంలో మిగిలే డబ్బుకంటే ఎక్కువగానే ఉంటోందని చెబుతోంది భారతి. ఈ దంపతులు ఇప్పుడు ఆ గ్రామస్థులకు రోల్ మోడల్స్. వీళ్ల గురించి తెలిసిన వాళ్లు ‘వీళ్లు బేరాన్ గ్రామానికి మాత్రమే కాదు మొత్తం దేశానికంతటికీ రోల్ మోడల్స్’ అని ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. –మంజీర
నేల మీద సాము
అది 2015. లండన్‌లో ఉంటున్న రామ్‌దే నిర్ణయాన్ని సొంతూరిలో ఉన్న బంధువులందరూ వ్యతిరేకించారు. అప్పుడు రామ్‌దేకు అండగా నిలిచింది అతడి భార్య భారతి మాత్రమే. భారతి ఇచ్చిన భరోసాతో ఇండియా వచ్చేశాడు రామ్‌దే. ఇప్పుడు గుజరాత్‌లోని రామ్‌దే సొంతూరు బేరాన్ గ్రామస్థులతోపాటు ఆ రోజు నవ్విన బంధువులు కూడా భారతి ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నుతుంటే కళ్లారా చూస్తున్నారు. ఆ దృశ్యాన్ని వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. యువత కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ అంటూ ఖండాలు దాటిపోతుంటే... భారతి వాటిని వదిలేసి మన నేలను మించిన ఉపాధి హామీ మరెక్కడా ఉండదని నిరూపిస్తోందని ఆమె వీడియోలు చూసిన వాళ్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ తరం నేల విడిచి సాము చేస్తుంటే భారతి నేల మీద సాము చేస్తోంది. అదే ఆమె సక్సెస్ అని మరికొందరు మెచ్చుకుంటున్నారు. లండన్‌లో మంచి ఉద్యోగం, అక్కడే స్థిరపడే అవకాశాన్ని వదులుకుని జన్మభూమికి వచ్చి పొలం దున్నుతున్న ధీర అని ఆమెకు ట్యాగ్‌లైన్ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment