రొటొమాక్ ప్రమోష్ ఈవెంట్‌లో సల్మాన్‌తో విక్రమ్ కొఠారి (పాత చిత్రం)
రొటొమాక్ పెన్.. ఈ పేరు వినగానే కొన్ని తరాలు వెనక్కి వెళ్లాలనిపిస్తుంది. రబ్బరు గ్రిప్పులు, బాల్‌పాయింట్.. రకరకాల పెన్నులతో రాసిన రాతలే గుర్తుకొస్తాయి. ఐదు, పది రూపాయలు ఆపైనే రేట్లతో.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి ఈ పెన్నులతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ పెన్నులు మార్కెట్‌లోకి రావడానికి ప్రధాన కారణం.. విక్రమ్ కొఠారి. కానీ, ఆయన రాతే బాగోలేదు. ఒకప్పుడు వంద కోట్ల టర్నోవర్ సామ్రాజ్యంతో ఓ వెలుగు వెలిగిన ఈ పెన్ కింగ్.. ‘దివాలాకోరు’ ‘రుణ ఎగవేతదారుడు’ అనే ముద్రలతో తనువు చాలించాడు.
►కాన్పూర్ కేంద్రంగా 1992లో రొటొమాక్ పెన్నుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు విక్రమ్ కొఠారి. అంతకు ముందు కుటుంబ వ్యాపారాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించేవాడు.
►విక్రమ్ తండ్రి మాన్షుక్‌భాయ్ గుజరాత్ నుంచి కాన్పూర్(ఉత్తర ప్రదేశ్)కు వలస వచ్చాడు. మొదట్లో దుకాణాలకు కొబ్బరి నూనె సరఫరా చేసిన మాన్షుక్.. ఆ తర్వాత 1973 నుంచి పాన్ పరాగ్ పాన్ మసాలా అమ్మకాలతో బడా వ్యాపారిగా ఎదిగాడు.
►మొదట్లో విక్రమ్ తన సోదరుడితో కలిసి పాన్ పరాగ్ ఎగుమతులు-దిగుమతుల వ్యవహరాల్ని చూసుకునేవాడు. ఒకానొక టైంలో ప్రధాని చేతుల మీదుగా బెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డును అందుకున్నారు విక్రమ్ కొఠారి. అయితే కుటుంబ విభేధాల తర్వాత విక్రమ్ కొఠారి.. పూర్తిగా రొటొమాక్ కంపెనీ వ్యవహారాలనే చూసుకుంటూ వచ్చారు.
► రొటొమాక్ స్థాపించింది మాన్షుక్‌భాయ్ అయినప్పటికీ.. దాని పూర్తి సక్సెస్ మాత్రం విక్రమ్ కొఠారికే దక్కుతుంది. కారణం.. ఆ కంపెనీ పెట్టాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చింది, జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసింది విక్రమ్ కాబట్టి. 1995-2005 మధ్య రొటొమాక్ పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తుల సామాజ్యంతో వంద కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడాయన. ఈ దెబ్బకు రొటొమాక్ ఒక బ్రాండ్‌గానే కాదు.. విక్రమ్ కొఠారికి ‘ఇండియాస్ పెన్ కింగ్’ అనే బిరుదు దక్కింది. బాలీవుడ్‌లో ఆ పాటికే యమక్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, రవీనా టాండన్‌లు రొటొమాక్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించేవాళ్లు.
►పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల అమ్మకాలతో దక్కిన కమర్షియల్ సక్సెస్‌తో సంఘంలో గొప్ప పేరు దక్కింది విక్రమ్ కొఠారికి. దీంతో లయన్స్ క్లబ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు కూడా. కాలక్రమంలో రొటొమాక్ పెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రొటొమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది.
►ఆపై రియల్ ఎస్టేట్, స్టీల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనూ సక్సెస్ కోసం ప్రయత్నించారు. కానీ.. ఆ సాహసం బెడిసి కొట్టింది. వ్యాపార జిమ్మికులను అంచనా వేయడంలో ఆయన ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో ఎటుచూసినా నష్టాలే మిగిలాయి. సంఘంలోని ఆయన గౌరవం మాయమైపోతూ వచ్చింది ఇక్కడి నుంచే. రొటొమాక్ గ్రూప్ ప్రమోటర్‌గా గొప్ప గౌరవం అందుకున్న విక్రమ్ కొఠారికి చివరిరోజుల్లో మాయని మచ్చలెన్నో దక్కాయి.
►భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు విక్రమ్ కొఠారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీబీఐ, ఈడీ ప్రత్యేకంగా కేసులు దాఖలు చేసి.. దర్యాప్తు జరిపించాయి కూడా. దర్యాప్తు సమయంలో మొత్తం ఏడు బ్యాంకుల నుంచి రూ. 3, 965 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు విక్రమ్ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రొటొమాక్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఆ ఆరోపణలు నిజమని నమ్మాల్సి వచ్చింది.
►2018 ఫిబ్రవరిలో విక్రమ్ అరెస్ట్ అయ్యి.. ఏడాదిపాటు జైల్‌లో ఉన్నారు. ఆపై అనారోగ్యం కారణాల దృష్ట్యా విడుదలయ్యారు. తానేం రుణాలు ఎగ్గొట్టలేదని, ఎలాగైనా తీర్చి తీరతానని మీడియా సాక్షిగా ఆయన దీనంగా వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు, రుణాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. చివరికి 73 ఏళ్ల విక్రమ్ కొఠారి కాన్పూర్‌లోని తన నివాసంలో మంగళవారం (జనవరి 4, 2022) కన్నుమూశాడు. బాత్రూంలో కాలు జారి తీవ్రగాయాలు కావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.
లిఖ్తే.. లిఖ్తే లవ్ హో జాయే అంటూ సాగిన రొటొమాక్ ప్రచారాన్ని విక్రమ్ కొఠారి అస్తమయం నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలామంది గుర్తు చేసుకుంటున్నారు.
-సాక్షి, వెబ్‌స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment