Failure Story
-
విక్రమ్ కొఠారి: పెన్ కింగ్.. దారుణమైన పతనం, విషాదం!
రొటొమాక్ పెన్.. ఈ పేరు వినగానే కొన్ని తరాలు వెనక్కి వెళ్లాలనిపిస్తుంది. రబ్బరు గ్రిప్పులు, బాల్‌పాయింట్.. రకరకాల పెన్నులతో రాసిన రాతలే గుర్తుకొస్తాయి. ఐదు, పది రూపాయలు ఆపైనే రేట్లతో.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి ఈ పెన్నులతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ పెన్నులు మార్కెట్లోకి రావడానికి ప్రధాన కారణం.. విక్రమ్ కొఠారి. కానీ, ఆయన రాతే బాగోలేదు. ఒకప్పుడు వంద కోట్ల టర్నోవర్ సామ్రాజ్యంతో ఓ వెలుగు వెలిగిన ఈ పెన్ కింగ్.. ‘దివాలాకోరు’ ‘రుణ ఎగవేతదారుడు’ అనే ముద్రలతో తనువు చాలించాడు. ►కాన్పూర్ కేంద్రంగా 1992లో రొటొమాక్ పెన్నుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు విక్రమ్ కొఠారి. అంతకు ముందు కుటుంబ వ్యాపారాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ►విక్రమ్ తండ్రి మాన్షుక్భాయ్ గుజరాత్ నుంచి కాన్పూర్(ఉత్తర ప్రదేశ్)కు వలస వచ్చాడు. మొదట్లో దుకాణాలకు కొబ్బరి నూనె సరఫరా చేసిన మాన్షుక్.. ఆ తర్వాత 1973 నుంచి పాన్ పరాగ్ పాన్ మసాలా అమ్మకాలతో బడా వ్యాపారిగా ఎదిగాడు. ►మొదట్లో విక్రమ్ తన సోదరుడితో కలిసి పాన్ పరాగ్ ఎగుమతులు-దిగుమతుల వ్యవహరాల్ని చూసుకునేవాడు. ఒకానొక టైంలో ప్రధాని చేతుల మీదుగా బెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డును అందుకున్నారు విక్రమ్ కొఠారి. అయితే కుటుంబ విభేధాల తర్వాత విక్రమ్ కొఠారి.. పూర్తిగా రొటొమాక్ కంపెనీ వ్యవహారాలనే చూసుకుంటూ వచ్చారు. ► రొటొమాక్ స్థాపించింది మాన్షుక్భాయ్ అయినప్పటికీ.. దాని పూర్తి సక్సెస్ మాత్రం విక్రమ్ కొఠారికే దక్కుతుంది. కారణం.. ఆ కంపెనీ పెట్టాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చింది, జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసింది విక్రమ్ కాబట్టి. 1995-2005 మధ్య రొటొమాక్ పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తుల సామాజ్యంతో వంద కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడాయన. ఈ దెబ్బకు రొటొమాక్ ఒక బ్రాండ్‌గానే కాదు.. విక్రమ్ కొఠారికి ‘ఇండియాస్ పెన్ కింగ్’ అనే బిరుదు దక్కింది. బాలీవుడ్లో ఆ పాటికే యమక్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, రవీనా టాండన్‌లు రొటొమాక్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేవాళ్లు. ►పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల అమ్మకాలతో దక్కిన కమర్షియల్ సక్సెస్‌తో సంఘంలో గొప్ప పేరు దక్కింది విక్రమ్ కొఠారికి. దీంతో లయన్స్ క్లబ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు కూడా. కాలక్రమంలో రొటొమాక్ పెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రొటొమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ►ఆపై రియల్ ఎస్టేట్, స్టీల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనూ సక్సెస్ కోసం ప్రయత్నించారు. కానీ.. ఆ సాహసం బెడిసి కొట్టింది. వ్యాపార జిమ్మికులను అంచనా వేయడంలో ఆయన ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో ఎటుచూసినా నష్టాలే మిగిలాయి. సంఘంలోని ఆయన గౌరవం మాయమైపోతూ వచ్చింది ఇక్కడి నుంచే. రొటొమాక్ గ్రూప్ ప్రమోటర్‌గా గొప్ప గౌరవం అందుకున్న విక్రమ్ కొఠారికి చివరిరోజుల్లో మాయని మచ్చలెన్నో దక్కాయి. ►భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు విక్రమ్ కొఠారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీబీఐ, ఈడీ ప్రత్యేకంగా కేసులు దాఖలు చేసి.. దర్యాప్తు జరిపించాయి కూడా. దర్యాప్తు సమయంలో మొత్తం ఏడు బ్యాంకుల నుంచి రూ. 3, 965 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు విక్రమ్ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రొటొమాక్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఆ ఆరోపణలు నిజమని నమ్మాల్సి వచ్చింది. ►2018 ఫిబ్రవరిలో విక్రమ్ అరెస్ట్ అయ్యి.. ఏడాదిపాటు జైల్లో ఉన్నారు. ఆపై అనారోగ్యం కారణాల దృష్ట్యా విడుదలయ్యారు. తానేం రుణాలు ఎగ్గొట్టలేదని, ఎలాగైనా తీర్చి తీరతానని మీడియా సాక్షిగా ఆయన దీనంగా వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు, రుణాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. చివరికి 73 ఏళ్ల విక్రమ్ కొఠారి కాన్పూర్‌లోని తన నివాసంలో మంగళవారం (జనవరి 4, 2022) కన్నుమూశాడు. బాత్రూంలో కాలు జారి తీవ్రగాయాలు కావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. లిఖ్‌తే.. లిఖ్‌తే లవ్ హో జాయే అంటూ సాగిన రొటొమాక్ ప్రచారాన్ని విక్రమ్ కొఠారి అస్తమయం నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఫెయిల్ అవ్వడం ఎలా ?: ఫన్నీ వైరల్ వీడియో
యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. అందుకనే చాలామంది యూపీఎస్సీ పరీక్షల్లో గెలుపు కోసం ఈ పరీక్షల్లో మంచిగా ఉత్తీర్ణత సాధించిన వారి విజయగాథలను ఆదర్శంగా తీసుకుంటూ ప్రిపేర్ అవుతారు. పైగా వాటికి సంబంధించిన మార్గనిర్దేశిక వీడియోలను కూడా తెగ చూస్తుంటారు. కానీ ఎప్పుడైన యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియో గురించి విన్నారా! లేదు కదా. కానీ అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వాయు కాలుష్యంపై చర్యలేవి: సుప్రీంకోర్టు) అసలు విషయంలోకెళ్లితే....ఐఏఎస్ అధికారి అవాంశ్ శరణ్ యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించకూడదనుకంటే చేయవలసిన పనుల సుదీర్ఘ జాబితా గురించి చెప్పుకొస్తారు. ఆ తర్వాత ఆయన "యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఎలా విఫలమవ్వాలి'" అనే గైడ్‌ని నిజాయితీగా ప్రయత్నించవద్దు లేకుంటే మీరు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి" అంటూ చమత్కరిస్తారు. నిజానికి ఈ వీడియో చూడంగానే ఏంటిది అనిపిస్తుంది. ఎలాంటివి చేస్తే ఫెయిలవుతాం అనేవి ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఒక చక్కని సందేశంలా ఉపయోగ పడటమే కాక తాము అలా చేస్తున్నామా అనేది కూడా ఎవరకి వారుగా వ్యక్తిగతంగా తెలుసుకునేలా ఉంటుంది. అయితే నెటిజన్లు కూడా ఈ విషయాలకు ఏకిభవిస్తూ "మేము కూడా ఇలాంటి తప్పిదాలు చేశాం. అందువల్లే విఫలమయ్యానంటూ" రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) How to fail UPSC Civil Services Exam. Well explained. pic.twitter.com/IftbagsJA5 — Awanish Sharan (@AwanishSharan) November 8, 2021 -
విధి వెక్కిరిస్తే.. పోర్న్‌స్టార్ అయ్యాడు
ఆ కుర్రాడి లక్క్ష్యం బలమైందే. ఆ ప్రయత్నంలోనూ అతను సిన్సియర్‌గా ఉన్నాడు. కానీ, అనుకోకుండా జరిగిన ఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా దేశానికి ఆడాలనే కల చెల్లాచెదురు అయ్యింది. 600 అడల్ట్ సినిమాలు.. కోట్లలో సంపాదన, బ్రాండ్ అంబాసిడర్‌గా-సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణింపుతో అదనపు ఆదాయం, సెలబ్రిటీలతో సాన్నిహిత్యం.. ఇదీ 37 ఏళ్ల అడల్ట్ స్టార్ డేనియల్ రెగినాల్డ్ మౌంటేయిన్ సాధించిన ఘనత కానీ ఘనత... డేనియల్ రెగినాల్డ్ మౌంటేయిన్.. ఇంగ్లండ్ బ్రాక్నెల్లో 1984 జులై 18న పుట్టాడు. స్కూల్ వయసులో తొమ్మిదేళ్ల వయసుకే సాకర్‌లో మంచి ప్లేయర్‌గా పేరు రావడంతో చెల్సీ, వెస్ట్ హామ్, స్పర్స్ లాంటి జట్లు అతని మీద నజర్ పెట్టాయి. పదిహేను పదహారేళ్లకే సౌత్ఆంప్టన్ కీ ప్లేయర్‌గా అతని పేరు మారుమోగిపోయింది. ఇక సాకర్ శకంలో అతని టైం మొదలైందనుకున్న టైంలో.. విధివశాత్తూ కాలికి గాయం అయ్యింది అతనికి. మోకాలి గాయం కొన్ని నెలలపాటు వేధించింది అతన్ని. దీంతో ఫుట్‌బాల్‌కు పనికిరాడనే ఉద్దేశంతో సౌత్ఆంప్టన్ అతన్ని ట్రీట్మెంట్కు అయ్యే డబ్బు అందించి.. టీం నుంచి ఉద్వాసన పలికింది. అలా పదహరేళ్ల వయసుకే ఫుట్‌బాల్ కావాలనే కల చెదిరిపోయింది. డేటింగ్ గర్ల్ సాయంతో.. ఫుట్‌బాల్ రేపిన గాయం నుంచి తేరుకున్నాక.. కార్పెంటర్‌గా ఆరేళ్లపాటు పని చేశాడతను. ఆ టైంలోనే.. ఓ డేటింగ్ సైట్ ద్వారా ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అయితే అతన్ని పోర్న్ సినిమాల్లో ప్రయత్నించమని చెప్పిందా యువతి. సిగ్గు-భయంతోనే లండన్‌లో జరిగిన అడిషన్స్‌కు వెళ్లిన అతనికి.. అవకాశం దక్కింది. విషయం తెలిసి ఇంట్లోవాళ్లు బాధపడ్డారు. కొన్నిరోజులకు అలవాటు పడ్డారు. అడల్ట్ సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నా కొద్దీ.. ఆదాయం-క్రేజ్ పెరగడం మొదలైంది. దీంతో 24 ఏళ్లకు లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చాడు. పోర్న్స్టార్లతో డేటింగ్.. పెళ్లి లాస్ ఏంజెల్స్‌లో అడుగుపెట్టాక.. డానీ మౌంటెన్ పేరుతో అడల్ట్ పరిశ్రమలో సూపర్ స్టార్ అయ్యాడు డేనియల్ రెగినాల్డ్. ఆ స్టార్డమ్తో సెలబ్రిటీలు అతనితో డేటింగ్‌కు క్యూ కట్టారు. అడల్ట్ భామలు ఎవా ఎంజెలీనా-మియా మాల్కోవాలు అతని మాజీ భార్యలు కూడా. ఇక హాలీవుడ్ ప్రముఖులు జాసోన్ స్టాథమ్, విన్నీ జోన్స్‌లు డేనియల్‌కి జిగిరీ దోస్తులు. హయ్యెస్ట్పెయిడ్ ప్రస్తుతం అడల్ట్ ఫిల్మ్ స్టార్లలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ టాప్ టెన్ లిస్ట్‌లో డేనియల్ రెగినాల్డ్ ఒకడు. ఏటా 1 మిలియన్ పౌండ్లకు పైనే అడల్ట్ సినిమాలతో సంపాదిస్తున్నాడు. కిందటి ఏడాదిలో డేనియలే నెంబర్ వన్ కూడా(తాజా రిపోర్ట్ ప్రకారం). ఇక హోటల్స్ బిజినెస్‌తో, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా-ఫిట్నెస్ కోచ్‌గా సంపాదన అదనం. డేనియల్‌కు సిల్వీ, జాక్సన్ అనే ఇద్దరూ పిల్లలు. భవిష్యత్తులో వాళ్లను అడల్ట్ సినిమాల్లోకి రానిస్తారా? అంటే.. తెలివైన సమాధానం ఇస్తున్నాడు. ‘చిన్నప్పుడు దేశానికి ఆడాలని కలలు కన్నా. కానీ, కుదరలేదు. ఇవాళ డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కానీ, గాయంతో ఆ లక్క్ష్యం అసంపూర్తిగా ముగిసింది. అందుకే నేను సాధించింది పెద్ద ఘనతేం కాదు. అఫ్కోర్స్.. నాలా చాలా మంది ఉండొచ్చేమో. అలాంటివాళ్లకు ప్రయత్నించకుండా ఆగిపోవద్దని మాత్రం సలహా ఇస్తా. నా ఫెయిల్యూర్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని.. జీవితంలో గెలుపు బావుటా ఎగరేయమని చెప్తా. ఇక అనుకోని వృత్తిలోకి దిగినప్పటికీ.. అనుకున్న గుర్తింపు మాత్రం దక్కలేదని బాధ మాత్రం ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. అలాగని నా పిల్లల భవిష్యత్తును శాసించడం.. నిర్ణయించడం నా చేతుల్లో లేదు. కానీ, ఒక తండ్రిగా నా కూతురికి వద్దనే చెప్తా. కొడుక్కి మాత్రం ‘ధైర్యం చేయమ’ని ప్రొత్సహిస్తా చెప్తున్నాడు 37 ఏళ్ల డేనియల్ రెగినాల్డ్. -
ప్రతి నిమిషం అడిగింది నీ విజయం
ఈరోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి. ఆ మహానుభావుడి మాటలతోనే స్టోరీలోకి వెళదాం. ‘నాకు వేలాది ఐడియాలు వస్తుంటాయి. అందులో ఏ ఒక్కటో మంచిది కావచ్చు. సక్సెస్ కావచ్చు. ఇంతకు మించిన సంతృప్తి ఏం ఉంటుంది!’ ‘సంతృప్తిని మించిన సంపద లేదు’ హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజ్‌కుమార్ స్నేహితులతో కలిసి ‘అగ్రి స్టార్టప్’ ఒకటి మొదలెడదామని రంగంలోకి దిగాడు. అది సక్సెస్ కాలేదు. ఇక అంతే...‘స్టార్టప్’ అనే మాట వినబడగానే బెదిరిపోతాడు. స్టార్టప్ సక్సెస్ కావాలంటే రాసి పెట్టుండాలి అని వేదాంతం కూడా పోతుంటాడు. ఇలాంటి రాజ్‌కుమార్‌లు మీ ఊళ్లోనూ ఉండొచ్చు. కొంతకాలం క్రితం కేరళలోని రేవు పట్టణమైన కొచ్చిలోని ‘ది కిచెన్’ అనే స్వచ్ఛందసంస్థకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదే ఫెయిల్యూర్ ల్యాబ్! సక్సెస్ స్టోరీలు వినడానికి చూపించే ఉత్సాహం ఫెయిల్యూర్స్టోరీల దగ్గరికి రాగానే నీరుగారిపోతుంది. నిజానికి సక్సెస్ కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫెయిల్యూర్ స్టోరీలు వినాల్సిందే. అనుభవాన్ని మించిన పాఠం ఏముంటుంది! ‘నేను మొదలు పెట్టిన రెండు వెంచర్లు ఫెయిలయ్యాయి. థర్డ్ వెంచర్ సాల్ట్ మ్యాంగో ట్రీ, ఫోర్త్ వెంచర్ ప్లింగ్ మాత్రమే క్లిక్ అయ్యాయి’ అంటాడు ‘ది కిచెన్’ స్థాపకుడు ఆండ్రిన్. కంప్యూటర్ హార్డ్‌వేర్ స్టార్టప్ మొదలుపెట్టాడు నీల్. ఫరవాలేదనిపించింది. అదే ఉత్సాహంతో మరో స్టార్టప్ మొదలుపెట్టాడు. కానీ ఇది తీవ్రమైన నిరాశను మిగిల్చింది. ఏడు నెలల తరువాత ఈ స్టారప్కు చెల్లుచీటి ఇచ్చాడు. అంతమాత్రానా చేతులు దులుపుకోలేదు. ‘ఎక్కడ పొరపాటు జరిగింది’ అని విశ్లేషించుకున్నాడు. ‘చాలామంది స్టార్టప్ ఓనర్లు ఈ పని చేయడం లేదు’ అంటాడు నీల్. ‘అగ్రో బిజినెస్’ స్టార్టప్ మొదలుపెట్టిన రఫీక్ మొదట నష్టాల పాలయ్యాడు. తరువాత లోపాలను సవరించుకొని వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు. వీరు మాత్రమే కాదు...ముఖేష్దేవ్, జేమ్ప్, జోఫిన్ జోసెఫ్, రికీ జాకబ్...మొదలైన స్టార్టప్ ఓనర్లు తమ విలువైన అనుభవాలను ఈ ఫెయిల్యూర్ ల్యాబ్‌లో పంచుకున్నారు. ‘ఐడియాలు రావడం సులభమే కావచ్చు. కాని వాటిని ఫలవంతం చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు’ అంటున్నాడు జీన్ పాల్. బిజినెస్ స్ట్రాటజిస్ట్, మోటివేషనల్ కోచ్‌గా గుర్తింపు సంపాదించిన జీన్‌పాల్ రాసిన ‘ఫ్రమ్ ఐడియా టూ రియాల్టీ’ పుస్తకం బాగా పాప్లర్ అయింది. ది ఎసెన్షియల్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ బిజినెస్, ఇట్ స్టార్స్ విత్ పాషన్ అండ్ పర్సస్, సెల్ఫ్ అవేర్నెస్: అండర్స్టాండింగ్ వాట్ డ్రైవ్స్ అండ్ సస్టెన్ యూ, బిల్డింగ్ యువర్ డ్రీమ్ టీమ్ అండ్ బిజినెస్, వై ది వరల్డ్ అండ్ యువర్ బిజినెస్ నీడ్ ఏ మోర్ పాషనెట్ యూ, యువర్ పాషన్ అండ్ పర్పస్ విల్ కీప్ యూ హెల్తీయర్ అండ్ హ్యాపియర్, వై యువర్ స్టోరీ మ్యాటర్స్, డిఫైనింగ్ యువర్ బిజినెస్ మోడల్, గ్రోయింగ్ యువర్ పర్పస్, పాషన్ అండ్ బిజినెస్...వీటిని చాప్టర్లు అనడం కంటే విజయానికి మెట్లు అంటే సరిపోతుంది. ఆకాశంలోకి దూసుకుపోవాలంటే రాకెట్ తయారుచేయగానే సరిపోదు. అందులో ఇంధనం అనివార్యంగా ఉండాలి. ఆ ఇంధనమే ఇన్స్పిరేషన్. ఇది అందించడానికి ‘ఫ్రమ్ ఐడియా టు రియాల్టీ’తో పాటు చూజ్ (ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ బిజినెస్)–రెయాన్ లివెస్క్, వాట్ ఐ విష్ వెన్ ఐ వాజ్ 20–టినా సిలెగ్, ది ఎంటర్ప్రెన్యూర్ (రోలర్ కోస్టర్)–డారెన్ హార్టి, వాట్ ఇట్ టేక్స్ (హౌ ఐ బిల్డ్ ఏ 100 మిలియన్ డాలర్స్ బిజినెస్ అగేనెస్ట్ వోడ్స్ )–మోయ జోన్స్, స్టార్టింగ్ ఏ బిజినెస్ (లాంచింగ్ ఏ సక్సెస్ఫుల్ స్మాల్ బిజినెస్)–కెన్ కోల్వెల్.....ఇలా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం హస్తభూషణం మాత్రమే కాదు... ఆత్మవిశ్వాసం పెంచే ఆయుధం కూడా! ఇక ఆలస్యం ఎందుకు పదండి...ఫెయిల్యూర్ ల్యాబ్స్ నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు జెండా ఎగరేయడానికి. -
నన్ను మోసం చేసింది అనుకున్నా... కానీ!
నా ప్రాణ స్నేహితురాలు అలా చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను ఎవరినైతే నా కంటే ఎక్కువగా ప్రేమించానో తనే ఇలా చేస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నేను నమ్మిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వెన్నుపోటు పొడిచి నాకు ద్రోహం చేసిన ఆ క్షణం నేను ప్రాణాలతో ఎందుకున్నానా అని తొలిసారి అనిపించింది. దేనినైనా భరించగలం కానీ అలాంటి బాధను భరించలేము. అసలేం జరిగిందంటే నా పేరు లిఖిత, తన పేరు లాస్య. మా ఇంటిపక్కనే వాళ్ల ఇళ్లు. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఎప్పుడూ కలిసే ఆడుకునే వాళ్లం, కలిసే స్కూల్‌కు వెళ్లే వాళ్లం. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నేను అన్ని విషయాలు తనతో పంచుకునే దాన్ని. మేం 8వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల నాన్న ఉద్యోగం వేరే చోటకు మారడంతో వాళ్లు హైదరాబాద్ వెళ్లిపోయారు. అయినా కూడా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. తరువాత బీటెక్‌లో మేం ఇద్దరం ఒకే కాలేజీలో చేశాం. చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. బీటెక్ 3వ సంవత్సరంలో నాకు శ్యామ్ అనే ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. తను మా క్లాసే. చాలా జోవియల్‌గా ఉండే వాడు. అతనంటే నాకు కూడా చాలా ఇష్టం. అందుకే తను ప్రపోజ్ చేయగానే నేను కూడా ఓకే చెప్పేశాను. ఆ విషయం నేను వెంటనే లాస్యకు చెప్పాను. లాస్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. శ్యామ్ నేను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. మాతో అప్పుడప్పుడు లాస్య కూడా వచ్చేది. కొన్ని రోజుల తరువాత శ్యామ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. నాకు ఒక రోజు డౌట్ వచ్చి తన ఫోన్‌ను చెక్ చేశాను. ఆ ఫోన్ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే లాస్య శ్యామ్ ఒకరితో ఒకరు చాలా క్లోజ్‌గా చాట్ చేసుకోవడం చూశాను. ఇద్దరు నన్ను మోసం చేశారని తెలుసుకున్నాను. నేను శ్యామ్‌ను ఈ విషయం గురించి ప్రశ్నించాను. నాకు లాస్య అంటే మొదటి నుంచి ఇష్టం. తనతో క్లోజ్ అవడం కోసమే నీకు ప్రపోజ్ చేశాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే నేను ఎంతలా మోసపోయానో అర్ధం అయ్యింది. ఇంకా లాస్యతో మాట్లాడాలి అనిపించక లాస్య హాస్టల్ నుంచి వేరు హాస్టల్‌కు వెళ్లిపోయాను. కొన్ని రోజుల తరువాత శ్యామ్ ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి లాస్య తనని మోసం చేసిందని చెప్పాడు. తనకు అంతకు ముందే లవర్ ఉన్నాడంటా వాడితోనే ఉంటా అంటుంది,నన్ను మోసం చేసింది అన్నాడు. నేను లాస్యను చాలా రోజులు తరువత కలిసి అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా అని అడిగాను. అవుతుంది. నీకు శ్యామ్ అంటే చాలా ఇష్టం కానీ శ్యామ్ ఒక ప్లేబాయ్. ఆ విషయం నీకు అర్థం కావాలనే శ్యామ్‌తో క్లోజ్‌గా ఉన్నట్లు నటించాను. తరువాత మోసం చేస్తే ఎంత బాధగా ఉంటుందో తనకి తెలిసేలా చేశాను అంది. నాకు ఒక్కసారిగా లాస్య మీద ఎంతో గౌరవం పెరిగింది. నేను తనని తప్పుగా అర్థం చేసుకున్నాను అని తెలిసింది. లాస్యను నేను జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పాను. కొన్ని సార్లు మనం నమ్మిన వాళ్లు మోసం చేశారనుకొని ద్వేషం పెంచుకుంటాం. కానీ నిజమైన స్నేహితులు మన మంచి కోసం ఏదైనా చేస్తారు. ప్రేమ విషంలో నేను మోసపోయిన ఫ్రెండ్షిప్ విషయంలో నేను గెలిచాను. లవ్ యూ లాస్య. లిఖిత( ఏలూరు) -
కలరింగ్ లేక తెగ బోర్ కొట్టేది... అప్పుడు!
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో తీపిని నింపుతుంది. కానీ నా జీవితంలో మాత్రం అది విషాన్ని మిగిల్చింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే నా పెదాలపై ఆ నవ్వునే లేకుండా చేసింది రెండక్షరాల ప్రేమ. నేను ప్రేమించిన అమ్మాయి పేరు శ్రావ్య. పేరుకు తగ్గట్టుగానే వినసొంపైన గొంతు, అందమైన రూపం ఆమెది. ఎన్నో ఆశలతో లైఫ్‌ను ఎంజాయ్ చేయెచ్చని ఒక ఆఫీస్‌లో చేరాను. ఆ ఆఫీస్‌లో పనిలో ఒత్తిడి లేకపోయినా కలరింగ్ లేక లైఫ్ చాలా బోర్ కొడుతూ ఉండేది. అలాంటి టైంలో నేను ఉదయం ఆఫీస్‌కు వచ్చే టైంకు నాకు ఒక విషయం తెలిసింది. కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఒక ఐదుగురు అమ్మాయిలు మా డెస్క్‌లో చేరారు అని. వెంటనే వాళ్లని చూడాలనిపించి వాళ్ల కోసం ఎదురుచూశాను. సరిగ్దా ఉదయం 10 గంటలు కాగానే వాళ్లు డెస్క్‌లో అడుగు పెట్టారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ అందులో నలుపు రంగు డ్రెస్‌లో ఉండి హెయిర్ లీవ్ చేసుకున్న ఉన్న అమ్మాయి నాకు బాగా నచ్చింది. చాలా సేపు ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. కొత్తగా రావడంతో వాళ్లు ఒక్కక్కరి దగ్గర ఒక్కో విషయం నేర్చుకుంటూ ఉన్నారు. నా దగ్గరకు ఎప్పుడు వస్తుందా తను అని చాలా రోజులు ఎదురు చూశాను. ఇంకా ఏం చేయాలో తెలియక తను నా కొలిగ్ దగ్గర డౌట్ కోసం వెళితే నా దగ్గరకు పంపియ్యమని రిక్వెస్ట్ చేశాను. తను నా దగ్గరకు వచ్చింది. ఒక్క క్షణం ఆకాశాన్ని జయించినంత ఆనందం కలిగింది. మనసులోనే ఎగిరి గంతేశాను. తను రాగానే పేరు తెలియనట్టు నీ పేరేంటి అని అడిగాను. శ్రావ్య అని చెప్పింది. ఎందుకో అప్పుడే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఫోన్‌నంబర్ చెప్పు అని అడిగేశాను. తను ఏమనుకుందో కానీ ఏదో అనుకుంటూనే నాకు నంబర్ ఇచ్చింది. నేను సాయంత్రం అవగానే తనకు కాల్ చేశాను. తను సరిగా రెస్పాన్డ్ కాలేదు. తరువాత రోజు నేను కాల్ చేయడానికి రీజన్ వేరే ఉంది అని కవర్ చేశాను. తను సరే సార్ అంది. ఆ తరువాత నుంచి కాల్ చేసినప్పుడు బాగానే మాట్లాడేది. చాలా జోవియల్ గా మాట్లాడేది. తన మాటలు రోజు కొత్తగా అనిపించేవి. చాలా అందంగా ఉండేవి ఆ రోజులు. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలుసుకోవడానికి నేను తన ఫ్రెండ్ ఫోన్ నంబర్ కూడా తీసుకొని తనతో క్లోజ్‌గా మాట్లాడుతున్నట్లు నటించాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నన్ను ప్లేబాయ్ అనుకుంది. ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా నీకు నేను కాకపోతే ఇంకోటి వస్తుందిలే అని దూరం పెట్టింది. నా ఫోన్ లిఫ్ట్ చేయదు. మెసేజ్‌కు రిప్లై ఇవ్వదు. అంత మంచిగా మాట్లాడిన తను ఒక్కసారిగా మాట్లాడటం మానేస్తే తట్టుకోలేకపోతున్నా. నేను చేసిన చిన్న తప్పు నన్ను ఆ అమ్మాయి ముందు దోషిగా నిలబెట్టింది. ఆ తప్పు గురించి ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటాను. ప్రవీణ్(విజయవాడ) -
తను ప్రేమించింది మా అన్నయ్యనే!
నా పేరు రవి. మేము వైజాగ్‌లో ఉంటాం. మా స్కూల్లో రాధా అని ఒక అమ్మాయి ఉండేది.నాకెందుకో ఎప్పుడూ ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపిస్తూ ఉండేది. కానీ ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదు. చాలా సైలెంట్‌గా ఉండేది. కానీ చదువులో అన్నింటిలో ముందుండేది. చూడటానికి చాలా అందంగా కూడా ఉండేది. నేనే కాదు మా స్కూల్లో చాలా మంది ఆమె అంటే ఇష్టపడేవాళ్లు. ఆమె మాత్రం వాళ్లను ఎవరిని పట్టించుకునేది కాదు. నా మనసులో మాట చెప్తాదామని చాలా సార్లు అనుకున్నాను.కానీ ఎప్పుడూ ధైర్యం చాలలేదు. నేను తనకు నా ప్రేమ విషయం చెప్పకుండానే మా టెన్త్ క్లాస్ అయిపోయింది. ఇంటర్లో నేను వేరే కాలేజీ, తను వేరే కాలేజీలో చేరాం. కానీ నేనెప్పుడు తనని మర్చిపోలేదు. ఎవరిని చూసిన తనే గుర్తొచ్చేది. ఆ రెండు సంవత్సరాలు నేను ఒక్కసారి కూడా తనని కలవలేదు. చూడలేదు. తరువాత అనుకోకుండా నేను తను బీటెక్‌లో ఒకే బ్రాండ్ ఒకే కాలేజ్‌లో జాయిన్ అయ్యాము. మా కాలేజీలో మొదటిసారి తనని చూసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తను నాకు రాసిపెట్టి ఉంది కాబట్టే మా కాలేజీలో చేరింది అనిపించింది. నా ప్రేమ కొత్త రెక్కలు తొడుక్కున్నట్లు, మళ్లీ చిగురించినట్లు ఎక్కడలేని ఆనందం ఏవేవో ఆలోచనలు. ఎలాగైనా తనతో పరిచయం పెంచుకోవాలని , ప్రతి చిన్న విషయానికి తనతో మాట్లాడేవాడిని. నెమ్మదిగా తను కూడా నాతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఇక చాటింగ్ స్టాట్ అయ్యింది. అక్కడి నుంచి ఫోన్లు మాట్లాడుకోవడం మొదలయ్యింది. తను నాతో క్లోజ్‌గా ఉంటుంది కదా అని నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని క్లారిటి కోసం అడిగాను. అప్పుడు తను చెప్పిన మాట విని నాకు గుండె ఆగినంత పని అయ్యింది. తను ఇంటర్లో ఉండగానే తన సీనియర్ ఒకతన్ని లవ్ చేశాను అని చెప్పింది. అతను ఎవరు అని తెలుసుకుంటే నాకు మరో షాక్ తగిలింది. అతను నాకు వరుసకు అన్నయ్య అవుతాడు. ఇక నాకు అంతా చీకటి అయిపోయినట్లు అనిపించింది. నెమ్మది నెమ్మదిగా తనకి దూరంగా ఉంటూ వచ్చాను. ఇక తనని మర్చిపోవాలని బీటెక్ అయిపోగానే యమ్ ఎస్ చేయడానికి అమెరికా వెళ్లిపోయాను. తన ఆలోచనలను పూర్తిగా తీసేయాలి అనుకున్నాను. నెమ్మది నెమ్మదిగా తనని మర్చిపోతున్నాను. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. రవి (వైజాగ్). -
ఇంట్లో వాళ్లను మోసం చేయలేనంది!
తనని మొదటిసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చూశాను. చూడగానే నచ్చేసింది. రోజు తనని అలాగే చూస్తూ ఉండేవాడిని. తను లాస్ట్ బెంచ్‌లో కూర్చునేది. నేను కూడా అలాగే కుర్చునేవాడిని. 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఒకసారి ధైర్యం చేసి మా ఫ్రెండ్‌కు చెప్పి పంపాను. తను ఒకసారి నా వైపు చూసింది. రెండు రోజుల తరువాత పిలిచి నువ్వే కదా రోజు నాకు ఫోన్ చేసేది అని అడిగింది. నేను కాదు అని చెప్పాను. అదే ఫస్ట్ టైమ్ నేను తనతో మాట్లాడింది. ఆ తరువాత 2,3 సార్లు మాట్లాడాను. డిగ్రీ చివరి ఎగ్జామ్స్ రోజు గుడిలో నాతో మాట్లాడతాను అని తన ఫ్రెండ్ ద్వారా నాకు చెప్పించింది. ఆ రోజు వెళ్లే సరికి తను వెళ్లి పోయింది. తననే అదే చివరిసారి చూశాను. ఆ తరువాత నేను బస్టాండ్‌లో ఉన్నప్పుడు తను కోచింగ్‌కు వెళుతూ ఒకసారి కనిపించింది. తను నన్ను చూసి నవ్వింది. రెండు రోజుల తరువాత తనకి కాల్ చేశాను. తన నంబర్ నా దగ్గర ఉన్న నేను ఎప్పుడూ తనకి కాల్ చేయలేదు. నేను ఫోన్ చేసినప్పుడు తను నాతో చాలా మంచిగా మాట్లాడింది. అలా ఆరోజు నుంచి రోజు ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. మూడు సంవత్సరాలు ఫోన్లో మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడు తనని కలవలేదు. నేను తనని చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఆమె నమ్మింది. కొన్ని రోజుల తరువాత పెళ్లి విషయం వచ్చింది. ఆమె వాళ్ల ఫ్యామిలీ చూపించిన అబ్బాయినే చేసుకుంటాను, ఇంట్లో వాళ్లని మోసం చేయలేను అని చెప్పింది. నేను కూడా ఆలోచించాను. తన ఇష్టానికి నేను కూడా ఓకే చెప్పాను. ఫ్రెండ్స్ లాగా ఉందామని డిసైడ్ అయ్యాం. తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. నన్ను మిస్ అవుతున్నాను అని చెప్పింది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నువ్వంటే ఇష్టమే. ఇప్పటి వరకు నీ పక్కన కూర్చోని మాట్లాడలేకపోయాను అని ఒక బాధ. మిస్ యు. పేరు చెప్పలేదు(కామారెడ్డి). -
నీకు ముందే తెలిసినా ఇలా చేశావు!
ఎక్కడికి చేరుకుంటుందో తెలీదు నా ఈ ప్రయాణం. కదిలే ఈ రైలు కంటే వేగంగా కొట్టుకుంటుంది నా హృదయం. గుండెలో జరిగే ఈ సంఘర్షణలో కొన్ని సంవత్సరాలు వెనుకకు వెళ్ళగానే నీ జ్ఞాపకాల వరదలో మునిగిపోయాను. మనం గడిపిన క్షణాలు, నేను పొందిన అనుభూతులు, మధురస్మృతులన్ని ఒకొక్కటిగా నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నువ్వు నా నుంచి దూరమై నీ తల్లిదండ్రులకి నచ్చిన జీవితాన్ని గడుపుతున్నావు. నీకు ముందే తెలుసు మన పెళ్లి జరగదని మరెందుకు నా జీవితంలోకి వచ్చావు. నవ్వుతు నవ్విస్తూ ఆనందంగా గడుపుతుంటే ఎందుకు నా జీవితాన్ని శోకంలోకి నెట్టేశావ్ కార్తీక్.... సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం పరిచయమయ్యాడు కార్తీక్...చదువు పూర్తి చేసి నాకు నచ్చిన వృత్తిలో స్థిరపడ్డాను. ఎఫ్.ఎం లో ఆర్ జేగా నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్న రోజుల్లో అనుకోకుండా ఒక ఆర్గనైజషన్ ద్వారా పరిచయమయ్యాడు.. మొదటి సారి చూసినప్పుడే అందరికి నచ్చేసే వ్యక్తి కార్తీక్. ఆరడుగుల ఎత్తు, మంచి రంగుతో ఉంటాడు ఎవ్వరినైనా మాటల్తో ఇట్టే ఆకట్టుకునే నేర్పరితనం ఉన్నవాడు. బహుశా ఆ మాటలే నన్ను అతని మాయలో పడేశాయేమో... మొదటి పరిచయంలోనే నాకు చాలా నచ్చేశాడు. కానీ అమ్మాయిని కదా బయటపడలేదు. అప్పటి వరకు మెసేజ్ ల వరకే పరిమితమైన మా పరిచయం సంవత్సరం తర్వాత మొదటి కలయికతో రోజు ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకునే వరకు వెళ్ళింది. సిగ్గువిడిచి ఒకరోజు నేనే కార్తీక్ ని ఇష్టపడుతున్నానని చెప్పేశా. నిన్ను నేను ఇష్టపడుతున్నానని నాకు చెప్పిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ నా లైఫ్ లో నువ్వంటే నాకు ఇష్టం అని నేను చెప్పిన మొదటి వ్యక్తి కార్తీక్. తన సమాధానంతో నా ఆశలు నిరాశగా మిగిలాయి. ఈ ప్రేమ, పెళ్లి నాకు సెట్ అవ్వవు అన్నాడు. కొన్నిరోజులు మాట్లాడకుండా దూరంగా ఉన్నాను కానీ నా వల్ల కాలేదు ఎప్పటికైనా నా ప్రేమని అర్ధం చేసుకుంటాడని రాధనై చిన్ని కృష్ణుడికోసం ఎదురు చూశాను. ఆరు నెలల తర్వాత అనుకోకుండా కలిసిన కార్తీక్ నుంచి అనుకోని స్పందన, ఐ లవ్ యూ అనే మూడు పదాలు నన్ను కొత్త లోకానికి తీసుకెళ్లాయి..కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ఈ ప్రేమ.రోజు గంటలు తరబడి ఫోన్లు, నిమిషానికో మెసేజ్ ఇలా సాగిపోయింది మా ప్రేమ ప్రయాణం. అనుకోని అనూహ్య సంఘటనలు, ప్రమాదాల కలయికే జీవిత ప్రయాణం. ప్రశాంతంగా సాగిపోతున్న నా ప్రేమ కథలోకి వచ్చిందో ప్రమాదం(కార్తీక్ లైఫ్ లోకి మరో అమ్మాయి ) మా మధ్య ఏమిలేదని తను చెప్తున్నా వినిపించుకునేదాన్ని కాదు. ఎంతైనా అమ్మాయిని కదా అనుమానం మా జన్మహక్కు..ఆమె రాక మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. కార్తీక్ ని ఎక్కడ కోల్పోతానో అనే నా భయం తనకి నన్ను మరింత చేరువ చేసింది. నాలో నేను లేను. మనసు, తనువు, ప్రాణం తనదిగా మారిపోయాయి..ఒకరిని విడిచి ఒకరం ఉండలేని అనుబంధం మా మధ్య ఏర్పడింది. తెలియకుండానే ఒకరంటే ఒకరికి ప్రాణమయిపోయాం. ఏ దేవుడు మమ్మల్ని విడదీయలేడు అనుకున్నా... అది అపోహే అని సంవత్సరం తర్వాత తెలిసింది. కార్తీక్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అంతే నా ప్రాణం పోయినంత పనైంది. తన ఫ్యామిలీకి నన్ను పరిచయం చేశాడు. వారికి దగ్గరవడానికి ప్రయత్నించాను.అందరికి నచ్చాను కానీ ఏం చేస్తాం విధి రాతని ఎవరూ మార్చలేరు. ఏ దేవుడు విడదీయలేడు అనుకున్న మా ప్రేమని కులం విడదీయగలదని అర్ధం అయ్యింది. తనకి ముందే తెలుసు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని అందుకే నేను నా ప్రేమని వ్యక్త పరచినప్పుడు ఒప్పుకోలేదు. అలాగే ఒప్పుకోకుండా ఉండుంటే బాగుండేదేమో చాలా దగ్గరైపోయాడు. నా రోజు తన మాటతోనే మొదలవుతుంది. తన మాటతోనే ముగుస్తుంది. ఎంత బిజీ గా ఉన్న నాకు గుడ్ నైట్ చెప్పనిదే పడుకునేవాడు కాదు. తనతో జీవితాంతం ఎలా ఉండాలి, అత్తమామల్ని ఎలా చూసుకోవాలని అనే ఊహల్లోనే గడిచేయేవి రోజులన్నీ.తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది కదా, నా ప్రేమ విషయంలో కూడా అదే జరిగింది. నా ముందున్న అతి పెద్ద సమస్య మా పెళ్లి. కార్తీక్ నేనెవరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు నాకోసం. తన ఫ్యామిలీ చాలా బాధపడ్డారు.కానీ కొడుకు కోసం కులమనే కట్టుబాట్లను మాత్రం తెంపలేకపోయారు. ఆనాటి రాముడు తండ్రి మాటకోసం అడవులకి వెళ్లినట్టు..ఈనాటి నా ఈ రాముడు తన తల్లిదండ్రుల కోసం తల వంచక తప్పలేదు. ప్రేమకి రెండు మనసులు కలిస్తే సరిపోతుంది కానీ పెళ్ళికి రెండు కుటుంబాల అనుమతి కావాలి. నా వైపు నుంచి పెళ్ళికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒకే చేతితో చప్పట్లు మొగవుగా. నువ్వు ముందే చెప్పావు ఇలాగే అవుతుందని కానీ నేనే పట్టించుకోలేదు. నీతో కలిసి తీరం చేరలేనని తెలిసి కూడా అడుగేసేశా. అది నీ తప్పు కాదు నా పిచ్చితనమే. అప్పుడే కాస్త గట్టిగా చెప్పాల్సింది. వదిలేసి నీకు దూరంగా ఉంటున్నప్పుడు మళ్ళీ నా దగ్గరికి నువ్వు రాకుండా ఉంటే ఇంత బాధ ఉండేది కాదేమో. నీ దగ్గర్లోనే ఉంటే నా బాధని చూడలేవు, అటు నీ తల్లిదండ్రులకి ఇచ్చిన మాటని నిలబెట్టలేవు. అందుకే మొదటిసారి మన లైఫ్ కి సంబందించిన నిర్ణయం నేనే తీసుకుంటున్నా. నీకు దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నా, ఎంత ఓర్చుకుంటున్నా నీ జ్ఞాపకాలు పదే పదే గాయం చేస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ప్రేమించిన వారితో జీవితం గడపలేనప్పుడు, వారి జ్ఞాపకాలతోనే జీవితం గడిపితే మంచిదని..కానీ నీకోసం పడే ఈ బాధ కూడా నాకు మధురంగానే ఉంది. నీ తల్లిదండ్రులని ఒప్పించుకొని నన్ను చేరుకుంటావో, తలవంచి వేరొకరి మేడలో తాళి కడతావో. ఏదైనా నేను అంగీకరిస్తాను..అనుమతితో వస్తాని హామీ ఇస్తానంటే జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను. లేదంటే ఇక నువ్విచ్చిన ఈ మధురస్మృతులతోనే జీవితం గడిపేస్తుంది నీ ఈ అమ్ములు. అమ్ములు ( హైదరాబాద్). -
నాలుగేళ్ల నయవంచన : ఇసుక రీచ్‌లలో... ‘శాండ్’కేట్లు!
బాబు మాటలు : ‘‘ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ వ్యవహారంలో నాయకుల ప్రమేయం ఉండటానికి వీల్లేదు. ఏటా 600–700కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా ఇస్తున్నాం. అక్రమాల్లో ఎవరి పాత్ర ఉన్నా వారిపై వేటు పడుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు. ఎవరైనా అడ్డుకుంటే తిరగబడాలి’’.. అని ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి. వాస్తవం : ఆచరణను మాత్రం మాటలను తుంగలో తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ రీచ్ చూసినా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దోపిడీ ఎక్కువగా జరుగుతోంది. సామాన్యులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే పరిస్థితి ఎక్కడాలేదు. అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. సాక్షి, అమరావతి : నాలుగేళ్ల టీడీపీ సర్కారు పాలనలో జరిగిన ఇసుక దందా విలువ అక్షరాలా రూ.8,600 కోట్లు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ విధంగా చెలరేగిపోతోందో ఇది చూస్తే తెలిసిపోతుంది. ఇసుక రేవు (రీచ్)లను కొందరు అధికార టీడీపీ నేతలు సొంత జాగీర్లలా మార్చుకుని అడ్డగోలుగా తోడేస్తున్నారు. ఇటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం మొదలు అటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ అంతటా ఇదే పరిస్థితి. రెండేళ్లుగా ‘ఉచిత ఇసుక’ కాగితాలకే పరిమితమైంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని శాండ్ కమిటీలు నిర్ణయించిన ధరలు ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక మాఫియా చెప్పిందే ధర. ఇక రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డూ అదుపులేదు. వారు చెప్పిందే శాసనం. తనిఖీలతో హుటాహుటిన క్రేన్ల తరలింపు ఇదిలా ఉంటే.. కృష్ణా నదిలో యంత్రాలతో జరుపుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలంటూ ఓ స్వచ్ఛంధ సంస్థ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో వేసిన కేసు నేపథ్యంలో నిజనిర్ధారణ నివేదిక సమర్పణ కోసం ట్రైబ్యునల్ నియమించిన కమిటీ ప్రతినిధులు గుంటూరు జిల్లాలో పర్యటించారు. దీంతో ఇసుక మాఫియా గ్యాంగులు నదుల్లోని భారీ క్రేన్లను అక్కడ లేకుండా చేశారు. కమిటీ ప్రతినిధులు అటు పోగానే మళ్లీ ఎక్కడ క్రేన్లు అక్కడ అమర్చి యథాతథంగా దందా సాగిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 459 ఇసుక రేవులు ఉండగా ప్రజలు సొంత అవసరాలకు ఎక్కడ నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చు. కానీ, ఇది ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక నింపుకోవాలంటే కప్పం కట్టాల్సిందే. ‘రీచ్‌లోకి దారి మేమే నిర్మించాం. అందువల్ల ట్రాక్టరు వెళ్లాలంటే డబ్బు ఇవ్వాల్సిందే..’ అంటూ మాఫియా గ్యాంగులు వసూళ్లు సాగిస్తున్నాయి. చీకట్లో విచ్చలవిడిగా తవ్వకాలు అలాగే, నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు రేవుల్లోకి లారీలను తీసుకెళ్లరాదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే అనుమతులున్నాయి. వీటికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరికరాలు అమర్చామని అధికారులు చెబుతున్నారు. అయితే, జీపీఎస్ పరికరాలను పనిచేయకుండా చేసి రాత్రి వేళల్లో తోడేసి ప్రైవేట్‌గా అధిక రేట్లకు అమ్ముతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు కూడా తరలించడం ద్వారా వేల కోట్లు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి అనుచరులు ఏకంగా ఇసుక రీచ్‌కు అనధికారికంగా రహదారి వేయించి తన సొంత ఆస్తిలా నడుపుతున్నారంటే దోపిడీ ఎంత బహిరంగంగా సాగుతుందో అర్థమవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇలాగే నదిలో రెండు కిలోమీటర్ల పొడవునా అనుమతి లేకుండా రోడ్డు వేసేశారు. ఇదంతా అధికార పార్టీ పెద్దల వ్యవహారం కావడంతో అధికారులు కిక్కురుమనడంలేదు. రెండేళ్లలో రూ.5,000 కోట్లు దోపిడీ జిల్లా కమిటీలు నిర్ణయించిన ధరలతో పోల్చితే దాదాపు అన్ని జిల్లాల్లో 50 నుంచి 100 శాతం అధిక ధరలకు ఇసుకను అమ్ముతున్నారు. ఇది చాలదన్నట్లు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలించి పెద్ద లారీ ఇసుకను రూ.50వేల నుంచి 60 వేల వరకూ విక్రయిస్తున్నారు. తద్వారా టీడీపీ ఇసుక మాఫియా గత రెండేళ్ల కాలంలో (2016 జూన్ నుంచి 2018 మే వరకూ) రూ.5,000 కోట్లకు పైగా దండుకుందని అనధికారిక అంచనా. అలాగే, డ్వాక్రా సంఘాలు ఇసుక రీచ్‌లను నిర్వహించిన కాలంలో (2014 నవంబరు నుంచి 2016 మార్చి వరకూ) టీడీపీ నేతలు రూ.3,600 వేల కోట్లకు పైగా దోచుకున్నారని అంచనా. ఆ కాలంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణావల్ల సర్కారు ఖజానాకు రూ.2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా ప్రకటించడం గమనార్హం. పొంచివున్న పెను ముప్పు నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో ఎక్కువ లోతు వరకు ఇసుక తవ్వకాలు సాగుతుండటం ప్రమాదకరమని పర్యావరణవేత్తలతోపాటు భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని రీచ్‌లలో 2.82 కోట్ల క్యూబిక్ మీటర్ల (సుమారు 4.22 కోట్ల మెట్రిక్ టన్నుల) ఇసుకను ఏటా తవ్వుకోవచ్చని ప్రభుత్వం 2015లో అంచనా వేసింది. కానీ, 7 కోట్ల టన్నులకు పైగా తవ్వుతున్నారు. మీటరు లోతు మించి ఇసుక తవ్వరాదన్న నిబంధనను బేఖాతరు చేస్తూ 2 నుంచి 4 మీటర్ల లోతు వరకూ తవ్వేస్తున్నారు. దీనివల్ల పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో.. గుంటూరు జిల్లాలో నిబంధనలను ‘కృష్ణ’లో కలిపేసి నది మధ్యలో భారీ క్రేన్లు ఏర్పాటుచేసి డ్రెడ్జింగ్ ద్వారా బాగా లోతు వరకూ ఇసుక తోడేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి కనిపించడంలేదు. ఉత్తరాంధ్రకు నేనే మంత్రినని చెప్పుకునే ఒక నేత ఒడిశాకు ఇసుక అక్రమ తరలింపులు జరిపిస్తూ వందల కోట్లు దండుకుంటున్నారు. గోదావరి జిల్లాలో ఒక మంత్రి అతిముఖ్యమైన రేవును సొంత నదిలా మార్చుకుని అనుచరులకు అప్పగించి వాటాలు మింగుతున్నారు. కర్నూలు జిల్లాలో మరో మంత్రి అనుచరులు ఏకంగా తుంగభద్రలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు నిర్మించారనే విషయం ఉన్నత న్యాయస్థానం వరకూ వెళ్లింది. కాగా, తవ్విన ఇసుకను 30 శాతానికిపైగా ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిస్తూ చెక్ పోస్టులను చెకింగ్ లేని పోస్టుల్లా మార్చేశారు. ఇలా గత రెండేళ్లలో టీడీపీ నేతలు ఇసుక మాఫియా ద్వారా దోచుకున్న సొమ్ము రూ.5,000 కోట్ల పైమాటేనని అనధికారిక అంచనా. అంతకుముందు.. డ్వాక్రా సంఘాల ముసుగులో రూ.3,600 కోట్లకు పైగా దోచుకున్నారు. మొత్తం మీద తెలుగుదేశం నాలుగేళ్ల పాలనలో టీడీపీ నేతలు ఇసుక ద్వారా దండుకున్న మొత్తం రూ. 8,600 కోట్ల పైమాటే. -
ఓటమి కూడా ముఖ్యమే...
వ్యాపారం కావొచ్చు.. మరే దైనా కావొచ్చు గెలుపు ఎంత ముఖ్యమో .. ఓటమి కూడా అంతే ముఖ్యం. తొలి ప్రయత్నమైనా మలి ప్రయత్నమైనా ఓటమి ఎదురైతే కుంగిపోకుండా.. దాన్నుంచి నేర్చుకోగలిగితే అదే విజయానికి బాటలు వేస్తుంది. అందుకే గూగుల్, ఫేస్బుక్ వంటి స్టార్టప్ కంపెనీలకు పుట్టిల్లయిన అమెరికాలో ఎంట్రప్రెన్యూర్లు ఓటమికి కూడా చాలా ప్రాధాన్యమిస్తారు. ఏదైనా మొదలుపెట్టేందుకు నిధుల కోసం వెడితే.. ఇన్వెస్టర్లు మిగతా వాటితో పాటు ప్రధానంగా దృష్టి పెట్టేది .. ఫెయిల్యూర్ స్టోరీ ఏదైనా ఉందా అన్నదాని మీదే. అలాంటివి ఒక్కటైనా లేకపోతే.. నిధులు దొరకడం కష్టమే. దీని వెనుక బలమైన కారణమే ఉంది. డబ్బు, వ్యాపారం ఏదైనా సరే పోగొట్టుకుంటే గానీ వాటి విలువ గురించి తెలియదు. ఆ ఫెయిల్యూర్లో నుంచి పుట్టే కసే... విజయం ఎలా సాధించాలన్నది నేర్పుతుంది. అందుకే ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, ఇన్వెంటర్లు దీనికీ ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుంటారు. బల్బును కనుక్కునే ప్రయత్నంలో పదివేల సార్లు విఫలమైనప్పటికీ.. థామస్ ఆల్వా ఎడిసన్ దాన్ని వైఫల్యంగా తీసుకోలేదు. నేనేమీ ఫెయిల్ కాలేదు.. బల్బు తయారీకి ఉపయోగపడని పదివేల పద్ధతులు కనుగొన్నానంతే, ఇదీ అనుభవమేనన్నాడు. కాబట్టి ఎందులో ఫెయిలయ్యాము, ఎలా అధిగమించగలిగాము, దాన్నుంచి ఏం నేర్చుకున్నాము అన్నది చాలా కీలకం. అలాగే, గమ్యంపైనే గురి ఉన్నా.. ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఫెయిల్యూర్ ఇస్తుంది. దాన్ని అందిపుచ్చుకోండి. ఫెయిలవ్వడం వల్ల అప్పటికి గెలవలేకపోయినా ఎంతో విలువైన అనుభవం వస్తుంది కదా. సెలబ్రేట్ చేసుకోండి. ఇక విమర్శలు ఎదురైతే హుందాగా స్వీకరించండి. కలిసిన ప్రతీ ఒక్కరి దగ్గర్నుంచి నేర్చుకోతగిన అంశం ఏదో ఒకటి ఉంటుంది. నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ చుట్టూ మీ కన్నా తెలివైన వారూ, అనుభవజ్ఞులూ ఉండేలా చూసుకోండి. బ్రిటీషర్ల మాదిరిగా గాకుండా అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ల తరహాలో మీ ప్రయత్నాల్లో చుట్టూ ఉన్నవారినీ భాగస్వాములను చేయండి. వారికి సముచిత ప్రతిఫలం అందేలా చూడండి. గమ్యాన్ని చేరడంతో పాటు ప్రయాణాన్నీ ఆస్వాదించండి. ఇలాంటి చిట్కాలు మీ దగ్గరా ఉన్నాయా? పొదుపు, పెట్టుబడులు, మనీ మేనేజ్మెంటుకి సంబంధించి మీకు తెలిసిన, మీరు పాటించే వైవిధ్యమైన చిట్కాలు, విధానాలేమైనా ఉంటే మాకు రాయండి. అలాగే, ఇల్లు, వాహనం, ఉన్నత విద్య మొదలైన లక్ష్యాల సాధన కోసం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళికలు (డౌన్పేమెంట్లు, మార్జిన్లు సమకూర్చుకోవడం, క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టేందుకు ప్లానింగ్ చేసుకోవడం వంటివి) సాధించిన విజయాలను మాతో పంచుకోండి.