Rotomac Pens
-
విక్రమ్ కొఠారి: పెన్ కింగ్.. దారుణమైన పతనం, విషాదం!
రొటొమాక్ పెన్.. ఈ పేరు వినగానే కొన్ని తరాలు వెనక్కి వెళ్లాలనిపిస్తుంది. రబ్బరు గ్రిప్పులు, బాల్‌పాయింట్.. రకరకాల పెన్నులతో రాసిన రాతలే గుర్తుకొస్తాయి. ఐదు, పది రూపాయలు ఆపైనే రేట్లతో.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి ఈ పెన్నులతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ పెన్నులు మార్కెట్లోకి రావడానికి ప్రధాన కారణం.. విక్రమ్ కొఠారి. కానీ, ఆయన రాతే బాగోలేదు. ఒకప్పుడు వంద కోట్ల టర్నోవర్ సామ్రాజ్యంతో ఓ వెలుగు వెలిగిన ఈ పెన్ కింగ్.. ‘దివాలాకోరు’ ‘రుణ ఎగవేతదారుడు’ అనే ముద్రలతో తనువు చాలించాడు. ►కాన్పూర్ కేంద్రంగా 1992లో రొటొమాక్ పెన్నుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు విక్రమ్ కొఠారి. అంతకు ముందు కుటుంబ వ్యాపారాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ►విక్రమ్ తండ్రి మాన్షుక్భాయ్ గుజరాత్ నుంచి కాన్పూర్(ఉత్తర ప్రదేశ్)కు వలస వచ్చాడు. మొదట్లో దుకాణాలకు కొబ్బరి నూనె సరఫరా చేసిన మాన్షుక్.. ఆ తర్వాత 1973 నుంచి పాన్ పరాగ్ పాన్ మసాలా అమ్మకాలతో బడా వ్యాపారిగా ఎదిగాడు. ►మొదట్లో విక్రమ్ తన సోదరుడితో కలిసి పాన్ పరాగ్ ఎగుమతులు-దిగుమతుల వ్యవహరాల్ని చూసుకునేవాడు. ఒకానొక టైంలో ప్రధాని చేతుల మీదుగా బెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డును అందుకున్నారు విక్రమ్ కొఠారి. అయితే కుటుంబ విభేధాల తర్వాత విక్రమ్ కొఠారి.. పూర్తిగా రొటొమాక్ కంపెనీ వ్యవహారాలనే చూసుకుంటూ వచ్చారు. ► రొటొమాక్ స్థాపించింది మాన్షుక్భాయ్ అయినప్పటికీ.. దాని పూర్తి సక్సెస్ మాత్రం విక్రమ్ కొఠారికే దక్కుతుంది. కారణం.. ఆ కంపెనీ పెట్టాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చింది, జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసింది విక్రమ్ కాబట్టి. 1995-2005 మధ్య రొటొమాక్ పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తుల సామాజ్యంతో వంద కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడాయన. ఈ దెబ్బకు రొటొమాక్ ఒక బ్రాండ్‌గానే కాదు.. విక్రమ్ కొఠారికి ‘ఇండియాస్ పెన్ కింగ్’ అనే బిరుదు దక్కింది. బాలీవుడ్లో ఆ పాటికే యమక్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, రవీనా టాండన్‌లు రొటొమాక్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేవాళ్లు. ►పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల అమ్మకాలతో దక్కిన కమర్షియల్ సక్సెస్‌తో సంఘంలో గొప్ప పేరు దక్కింది విక్రమ్ కొఠారికి. దీంతో లయన్స్ క్లబ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు కూడా. కాలక్రమంలో రొటొమాక్ పెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రొటొమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ►ఆపై రియల్ ఎస్టేట్, స్టీల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనూ సక్సెస్ కోసం ప్రయత్నించారు. కానీ.. ఆ సాహసం బెడిసి కొట్టింది. వ్యాపార జిమ్మికులను అంచనా వేయడంలో ఆయన ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో ఎటుచూసినా నష్టాలే మిగిలాయి. సంఘంలోని ఆయన గౌరవం మాయమైపోతూ వచ్చింది ఇక్కడి నుంచే. రొటొమాక్ గ్రూప్ ప్రమోటర్‌గా గొప్ప గౌరవం అందుకున్న విక్రమ్ కొఠారికి చివరిరోజుల్లో మాయని మచ్చలెన్నో దక్కాయి. ►భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు విక్రమ్ కొఠారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీబీఐ, ఈడీ ప్రత్యేకంగా కేసులు దాఖలు చేసి.. దర్యాప్తు జరిపించాయి కూడా. దర్యాప్తు సమయంలో మొత్తం ఏడు బ్యాంకుల నుంచి రూ. 3, 965 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు విక్రమ్ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రొటొమాక్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఆ ఆరోపణలు నిజమని నమ్మాల్సి వచ్చింది. ►2018 ఫిబ్రవరిలో విక్రమ్ అరెస్ట్ అయ్యి.. ఏడాదిపాటు జైల్లో ఉన్నారు. ఆపై అనారోగ్యం కారణాల దృష్ట్యా విడుదలయ్యారు. తానేం రుణాలు ఎగ్గొట్టలేదని, ఎలాగైనా తీర్చి తీరతానని మీడియా సాక్షిగా ఆయన దీనంగా వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు, రుణాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. చివరికి 73 ఏళ్ల విక్రమ్ కొఠారి కాన్పూర్‌లోని తన నివాసంలో మంగళవారం (జనవరి 4, 2022) కన్నుమూశాడు. బాత్రూంలో కాలు జారి తీవ్రగాయాలు కావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. లిఖ్‌తే.. లిఖ్‌తే లవ్ హో జాయే అంటూ సాగిన రొటొమాక్ ప్రచారాన్ని విక్రమ్ కొఠారి అస్తమయం నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
రొటోమాక్‌కు షాక్ : ఆస్తులు జప్తు
సాక్షి, ముంబై : పీఎన్బీ స్కాం తరువాత రెండవ అతిపెద్ద బ్యాంకు కుంభకోణంగా నిలిచిన రొటోమాక్ వేల కోట్ల రూపాయల స్కాంలో రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, దాని ప్రమోటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ షాక్ ఇచ్చింది. కాన్పూర్‌కు చెందిన రోటోమక్ గ్రూపుకు చెందిన భారీ ఆస్తులను దర్యాప్తు సంస్థ అటాచ్ చేసింది. సుమారు 177 కోట్ల రూపాయలను ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు మంగళవారం ఈడీ తెలిపింది. కన్సార్టియం ఏడు బ్యాంకుల వద్ద రొటోమాక్ ప్రమోటర్లు రూ.3,690 కోట్ల కుంభకోణం నేపథ్యంలో సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఎ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా చర్యకు దిగింది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడాను రూ.456 కోట్లు మోసం చేసిన కేసులో రొటోమాక్ సంస్థ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కొఠారి, డైరెక్టర్ రాహుల్ కొఠారితోపాటు, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ అధికారులపైనా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వేలకోట్లను బ్యాంకును ముంచేసిన కేసుపై గతమూడు నెలలుగా విచారించిన సీబీఐ..లక్నోలోని ప్రత్యేక కోర్టుకు ఇటీవల తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అలాగే ఇది కేవలం బీవోబీని మోసం చేసిన దానిపై మాత్రమే చార్జిషీట్ దాఖలు చేసినట్లు..మిగతా సొమ్ముపై విచారణ కొనసాగుతున్నదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాన్పూర్ కేంద్రగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, సంస్థ డైరెక్టర్ రాహుల్ కొఠారి, బీవోబీ ఏజీఎం ఎస్కే ఉపాధ్యాయ, సీనియర్ బ్యాంక్ మేనేజర్ ప్రకాశ్ కపూర్, బ్యాంక్ మేనేజర్ శశి బిశ్వాస్‌లు ఈ తొలి చార్జిషీట్లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే దర్యాప్తుతో సహకరించడం లేదన్న ఆరోపణలతో ఢిల్లీలో సీబీఐ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడిని అరెస్టు చేయగా, వారు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
విక్రమ్ కొఠారికి బెయిల్ నిరాకరణ
లక్నో : ఉద్దేశపూరిత రుణ ఎగవేత కేసులో రొటోమాక్ గ్లోబల్ ప్రమోటర్, డైరెక్టర్ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్ కొఠారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు గురువారం తోసిపుచ్చింది. రూ 3695 కోట్ల రుణ ఎగవేత కేసులో విక్రమ్ కొఠారి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌నూ మార్చి 7న కోర్టు తిరస్కరించింది. నిందితులిద్దరినీ ఫిబ్రవరి 23న ఢిల్లీలో సీబీఐ అరెస్ట్ చేసినప్పటి నుంచీ వారు జైలు జీవితం గడుపుతున్నారు. ఇంటరాగేషన్ కోసం వారిని ఫిబ్రవరి 24 నుంచి సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. మార్చి 7తో సీబీఐ రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి ఎంపీ చౌధురి వారిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, నిందితులపై తీవ్ర నేరాభియోగాలున్నందున వారికి బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. బ్యాంకుల కన్సార్టియం నుంచి సేకరించిన రుణాలను కంపెనీ డైరెక్టర్లు కొందరు బ్యాంకు అధికారులతో కలిసి కుట్రపూరితంగా దారిమళ్లించి బ్యాంకులను మోసగించారని సీబీఐ సమర్పించిన చార్జిషీట్లో ఆరోపించింది. -
రొటొమ్యాక్ సంస్థలు మూత..?
ముంబై : రొటొమ్యాక్ సంస్థలు మూత పడబోతున్నాయి. బ్యాంకులకు దాదాపు రూ.4000 కోట్లు బకాయి పడిన రెండు రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన సమయం ముగియడంతో, ప్రస్తుతం ఆ కంపెనీలను దివాలా కోర్టు వేలం వేయబోతుంది. రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలు 90 రోజుల అదనపు సమయం కోరగా.. మరింత సమయం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయి. ముందస్తు ఇచ్చిన డెడ్‌లైన్ మార్చి 19తో ముగియబోతుంది. దీంతో విక్రమ్ కొఠారికి చెందిన రొటొమ్యాక్ ఎక్స్‌పోర్ట్స్, రొటొమ్యాక్ గ్లోబల్ సంస్థలను దివాలా కోర్టు వేలం వేయబోతున్నట్టు తెలిసింది. మరో రెజుల్యూషన్ ప్లాన్ లేకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడైంది. రొటొమ్యాక్ కంపెనీల రెజుల్యూషన్ ప్రొఫిషనల్ అనిల్ గోయల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బ్యాంకులు ముందస్తు ఇచ్చిన గడువును పొడగించడానికి తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం తుది గడువు పొడిగింపుపై ఓటింగ్ కోసం సమావేశమైన క్రెడిటార్ల కమిటీ, ఈ సందర్భంగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కొన్ని రోజుల క్రితమే రుణాల డిఫాల్ట్ కేసులో రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్ కొఠారిలను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరు విచారణకు సహకరించకపోవడంతోనే, అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలకు రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.4000 కోట్లు బకాయి పడిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. బ్యాంకు ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొఠారిపై సీబీఐ తొలుత ఈ కేసు నమోదుచేసింది. రొటొమ్యాక్ సంస్థలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 754.77 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 456.63 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 771.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 458.95 కోట్లు, అలహాబాద్ బ్యాంకు రూ. 330.68 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 49.82 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 97.47 కోట్ల రుణాలిచ్చాయి. -
బ్యాంకులకు కొఠారి ఎంత బాకీ పడ్డాడంటే..
న్యూఢిల్లీ : బ్యాంకులను మోసం చేసిన కేసులో రొటోమ్యాక్ పెన్ కంపెనీ యజమాని విక్రమ్ కొఠారి, ఆయన తనయుడు రాహుల్ కొఠారీలను గురువారం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఫిర్యాదు రావడంతో సీబీఐ ఆదివారం కొఠారి కుటుంబసభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు విచారించిన సీబీఐ మోసం జరిగినట్లు ప్రాధమిక ఆధారాలు లభ్యమవడంతో గురువారం అరెస్ట్ చేసింది. ప్రాధమిక విచారణలో కొఠారి కటుంబసభ్యులు వడ్డీలతో కలిపి రూ.3,695 కోట్లు బకాయిలు ఉన్నట్లు తేలింది. కోఠారి వివిధ బ్యాంకుల నుంచి రూ.2,919 కోట్లు లోన్ తీసుకున్నారు. దీనికి వడ్డీ రూ.776 కోట్లు అయింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ.754.77 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా(456.63), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(771.07 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(458.95 కోట్లు), అలహాబాద్ బ్యాంక్(రూ.330.68 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(49.82 కోట్లు), ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(97.47 కోట్లు) బకాయిలు పడినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, భార్య, కొంత మంది బ్యాంకు అధికారులు, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులపై కుట్ర, మోసం, ఫోర్జరీ తదీతర యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి సీబీఐ విచారణ జరుపుతోంది. -
రొటొమ్యాక్ అధినేత విక్రమ్ కొఠారి అరెస్ట్
న్యూఢిల్లీ: రొటొమాక్ అధినేత విక్రమ్ కొఠారిని, ఆయన కుమారుడు రాహుల్ కొఠారినీ సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. కాగా సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. 2008 నుంచి బ్యాంకుల నుంచి పొందిన భారీ రుణాలను రొటొమ్యాక్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించింది. ఎగుమతి ఆర్డర్ల పేరిట బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలను అందుకు వినియోగించకుండా స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎగుమతి ఆర్డర్ల కోసం తప్పుడు ధ్రువపత్రాలతో పొందిన అప్పును విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని.. ఆ డబ్బును తిరిగి కాన్పూర్‌కు చెందిన కంపెనీకే మళ్లించారని సీబీఐ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇక ఇతర కేసుల్లో.. ఎగుమతి కోసం వస్తువుల కొనుగోలుకు బ్యాంకులిచ్చిన రుణాల్ని కూడా రొటొమ్యాక్ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సోమవారం వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే.