Vikram Kothari
-
విక్రమ్ కొఠారి: పెన్ కింగ్.. దారుణమైన పతనం, విషాదం!
రొటొమాక్ పెన్.. ఈ పేరు వినగానే కొన్ని తరాలు వెనక్కి వెళ్లాలనిపిస్తుంది. రబ్బరు గ్రిప్పులు, బాల్‌పాయింట్.. రకరకాల పెన్నులతో రాసిన రాతలే గుర్తుకొస్తాయి. ఐదు, పది రూపాయలు ఆపైనే రేట్లతో.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి ఈ పెన్నులతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ పెన్నులు మార్కెట్లోకి రావడానికి ప్రధాన కారణం.. విక్రమ్ కొఠారి. కానీ, ఆయన రాతే బాగోలేదు. ఒకప్పుడు వంద కోట్ల టర్నోవర్ సామ్రాజ్యంతో ఓ వెలుగు వెలిగిన ఈ పెన్ కింగ్.. ‘దివాలాకోరు’ ‘రుణ ఎగవేతదారుడు’ అనే ముద్రలతో తనువు చాలించాడు. ►కాన్పూర్ కేంద్రంగా 1992లో రొటొమాక్ పెన్నుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు విక్రమ్ కొఠారి. అంతకు ముందు కుటుంబ వ్యాపారాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ►విక్రమ్ తండ్రి మాన్షుక్భాయ్ గుజరాత్ నుంచి కాన్పూర్(ఉత్తర ప్రదేశ్)కు వలస వచ్చాడు. మొదట్లో దుకాణాలకు కొబ్బరి నూనె సరఫరా చేసిన మాన్షుక్.. ఆ తర్వాత 1973 నుంచి పాన్ పరాగ్ పాన్ మసాలా అమ్మకాలతో బడా వ్యాపారిగా ఎదిగాడు. ►మొదట్లో విక్రమ్ తన సోదరుడితో కలిసి పాన్ పరాగ్ ఎగుమతులు-దిగుమతుల వ్యవహరాల్ని చూసుకునేవాడు. ఒకానొక టైంలో ప్రధాని చేతుల మీదుగా బెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డును అందుకున్నారు విక్రమ్ కొఠారి. అయితే కుటుంబ విభేధాల తర్వాత విక్రమ్ కొఠారి.. పూర్తిగా రొటొమాక్ కంపెనీ వ్యవహారాలనే చూసుకుంటూ వచ్చారు. ► రొటొమాక్ స్థాపించింది మాన్షుక్భాయ్ అయినప్పటికీ.. దాని పూర్తి సక్సెస్ మాత్రం విక్రమ్ కొఠారికే దక్కుతుంది. కారణం.. ఆ కంపెనీ పెట్టాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చింది, జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసింది విక్రమ్ కాబట్టి. 1995-2005 మధ్య రొటొమాక్ పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తుల సామాజ్యంతో వంద కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడాయన. ఈ దెబ్బకు రొటొమాక్ ఒక బ్రాండ్‌గానే కాదు.. విక్రమ్ కొఠారికి ‘ఇండియాస్ పెన్ కింగ్’ అనే బిరుదు దక్కింది. బాలీవుడ్లో ఆ పాటికే యమక్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, రవీనా టాండన్‌లు రొటొమాక్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేవాళ్లు. ►పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల అమ్మకాలతో దక్కిన కమర్షియల్ సక్సెస్‌తో సంఘంలో గొప్ప పేరు దక్కింది విక్రమ్ కొఠారికి. దీంతో లయన్స్ క్లబ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు కూడా. కాలక్రమంలో రొటొమాక్ పెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రొటొమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ►ఆపై రియల్ ఎస్టేట్, స్టీల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనూ సక్సెస్ కోసం ప్రయత్నించారు. కానీ.. ఆ సాహసం బెడిసి కొట్టింది. వ్యాపార జిమ్మికులను అంచనా వేయడంలో ఆయన ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో ఎటుచూసినా నష్టాలే మిగిలాయి. సంఘంలోని ఆయన గౌరవం మాయమైపోతూ వచ్చింది ఇక్కడి నుంచే. రొటొమాక్ గ్రూప్ ప్రమోటర్‌గా గొప్ప గౌరవం అందుకున్న విక్రమ్ కొఠారికి చివరిరోజుల్లో మాయని మచ్చలెన్నో దక్కాయి. ►భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు విక్రమ్ కొఠారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీబీఐ, ఈడీ ప్రత్యేకంగా కేసులు దాఖలు చేసి.. దర్యాప్తు జరిపించాయి కూడా. దర్యాప్తు సమయంలో మొత్తం ఏడు బ్యాంకుల నుంచి రూ. 3, 965 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు విక్రమ్ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రొటొమాక్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఆ ఆరోపణలు నిజమని నమ్మాల్సి వచ్చింది. ►2018 ఫిబ్రవరిలో విక్రమ్ అరెస్ట్ అయ్యి.. ఏడాదిపాటు జైల్లో ఉన్నారు. ఆపై అనారోగ్యం కారణాల దృష్ట్యా విడుదలయ్యారు. తానేం రుణాలు ఎగ్గొట్టలేదని, ఎలాగైనా తీర్చి తీరతానని మీడియా సాక్షిగా ఆయన దీనంగా వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు, రుణాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. చివరికి 73 ఏళ్ల విక్రమ్ కొఠారి కాన్పూర్‌లోని తన నివాసంలో మంగళవారం (జనవరి 4, 2022) కన్నుమూశాడు. బాత్రూంలో కాలు జారి తీవ్రగాయాలు కావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. లిఖ్‌తే.. లిఖ్‌తే లవ్ హో జాయే అంటూ సాగిన రొటొమాక్ ప్రచారాన్ని విక్రమ్ కొఠారి అస్తమయం నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
విక్రమ్ కొఠారికి బెయిల్ నిరాకరణ
లక్నో : ఉద్దేశపూరిత రుణ ఎగవేత కేసులో రొటోమాక్ గ్లోబల్ ప్రమోటర్, డైరెక్టర్ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్ కొఠారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు గురువారం తోసిపుచ్చింది. రూ 3695 కోట్ల రుణ ఎగవేత కేసులో విక్రమ్ కొఠారి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌నూ మార్చి 7న కోర్టు తిరస్కరించింది. నిందితులిద్దరినీ ఫిబ్రవరి 23న ఢిల్లీలో సీబీఐ అరెస్ట్ చేసినప్పటి నుంచీ వారు జైలు జీవితం గడుపుతున్నారు. ఇంటరాగేషన్ కోసం వారిని ఫిబ్రవరి 24 నుంచి సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. మార్చి 7తో సీబీఐ రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి ఎంపీ చౌధురి వారిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, నిందితులపై తీవ్ర నేరాభియోగాలున్నందున వారికి బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. బ్యాంకుల కన్సార్టియం నుంచి సేకరించిన రుణాలను కంపెనీ డైరెక్టర్లు కొందరు బ్యాంకు అధికారులతో కలిసి కుట్రపూరితంగా దారిమళ్లించి బ్యాంకులను మోసగించారని సీబీఐ సమర్పించిన చార్జిషీట్లో ఆరోపించింది. -
రొటొమ్యాక్ సంస్థలు మూత..?
ముంబై : రొటొమ్యాక్ సంస్థలు మూత పడబోతున్నాయి. బ్యాంకులకు దాదాపు రూ.4000 కోట్లు బకాయి పడిన రెండు రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన సమయం ముగియడంతో, ప్రస్తుతం ఆ కంపెనీలను దివాలా కోర్టు వేలం వేయబోతుంది. రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలు 90 రోజుల అదనపు సమయం కోరగా.. మరింత సమయం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయి. ముందస్తు ఇచ్చిన డెడ్‌లైన్ మార్చి 19తో ముగియబోతుంది. దీంతో విక్రమ్ కొఠారికి చెందిన రొటొమ్యాక్ ఎక్స్‌పోర్ట్స్, రొటొమ్యాక్ గ్లోబల్ సంస్థలను దివాలా కోర్టు వేలం వేయబోతున్నట్టు తెలిసింది. మరో రెజుల్యూషన్ ప్లాన్ లేకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడైంది. రొటొమ్యాక్ కంపెనీల రెజుల్యూషన్ ప్రొఫిషనల్ అనిల్ గోయల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బ్యాంకులు ముందస్తు ఇచ్చిన గడువును పొడగించడానికి తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం తుది గడువు పొడిగింపుపై ఓటింగ్ కోసం సమావేశమైన క్రెడిటార్ల కమిటీ, ఈ సందర్భంగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కొన్ని రోజుల క్రితమే రుణాల డిఫాల్ట్ కేసులో రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్ కొఠారిలను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరు విచారణకు సహకరించకపోవడంతోనే, అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలకు రొటొమ్యాక్ గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.4000 కోట్లు బకాయి పడిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. బ్యాంకు ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొఠారిపై సీబీఐ తొలుత ఈ కేసు నమోదుచేసింది. రొటొమ్యాక్ సంస్థలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 754.77 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 456.63 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 771.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 458.95 కోట్లు, అలహాబాద్ బ్యాంకు రూ. 330.68 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 49.82 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 97.47 కోట్ల రుణాలిచ్చాయి. -
సీబీఐ అదుపులో విక్రమ్ కొఠారి
-
‘రొటొమ్యాక్’ కొఠారి అరెస్టు
ముంబై/న్యూఢిల్లీ: రూ. 3,695 కోట్ల రొటొమ్యాక్ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. గత నాలుగు రోజులుగా రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారి, అతని కుమారుడు రాహుల్‌ను విచారించిన సీబీఐ గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరైన వారిద్దరూ విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేశామని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. విక్రమ్, రాహుల్‌లు డైరెక్టర్లుగా ఉన్న ‘రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్’ 2008 నుంచి ఏడు జాతీయ బ్యాంకుల నుంచి రూ. 2,919 కోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ ఆరోపించిన సంగతి తెలిపిందే. అసలు, వడ్డీ కలిపి బ్యాంకులకు రొటొమ్యాక్ కంపెనీ రూ. 3,695 కోట్లకు పైగా చెల్లించాలని తేల్చింది. హైదరాబాద్ సెజ్‌లో.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 11,400 కోట్లకు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు మోసగించిన కేసులో.. పన్ను ఎగవేత ఆరోపణలపై హైదరాబాద్ సెజ్‌లో గీతాంజలి గ్రూపునకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ గురువారం అటాచ్ చేసింది. ఇప్పటికే గీతాంజలి గ్రూపు, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీకి చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని, ఏడు ఆస్తుల్ని ఐటీ శాఖ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గురువారం ఎనిమిదో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగిస్తూ.. చోక్సీ, అతని గ్రూపునకు చెందిన రూ. 86.72 కోట్లు, మోదీ గ్రూపునకు చెందిన రూ. 7.8 కోట్ల మ్యూచువల్ ఫండ్లు, షేర్లు స్వాధీనం చేసుకుంది. రూ.కోట్ల రూపాయల విలువైన కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని.. సీజ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,826 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన కార్లలో రోల్స్‌రాయిస్ ‘ఘోస్ట్’, మెర్సిడెస్ బెంజ్, పోర్షే పనమెరా, మూడు హోండా కంపెనీ కార్లు, ఒక టయోటా ఫార్చూనర్, ఇన్నోవా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నీరవ్ కుచెందిన 15 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నీరవ్ గురువారం తన ముందు హాజరుకాకపోవడంతో .. ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26లోపు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తన పాస్‌పోర్టును తాత్కాలికంగా రద్దు చేయడం వల్లే హాజరుకాలేదని ఈడీకి నీరవ్ చెప్పినట్లు సమాచారం. ఆచరణసాధ్య ఆలోచనతో రండి! బకాయిల చెల్లింపునకు స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికతో ముందుకు రావాలని పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంకు లేఖలో కోరింది. పీఎన్బీ అత్యుత్సాహం వల్లే బకాయిలు చెల్లించే సామర్థ్యం తగ్గిపోయిందని మోదీ రాసిన లేఖకు సమాధానమిస్తూ.. ‘కొందరు బ్యాంకు అధికారులు అక్రమంగా జారీ చేసిన ఎల్వోయూల్ని తప్పుడు మార్గాల్లో మీరు పొందారు. ఏ దశలోను అలాంటి సదుపాయాల్ని మీ కంపెనీలకు మా బ్యాంకు కల్పించలేదు’ అని లేఖలో పీఎన్బీ జనరల్ మేనేజర్ (అంతర్జాతీయ బ్యాంకింగ్ విభాగం) అశ్వినీ వత్స్ పేర్కొన్నారు. ‘మొత్తం అప్పును తీర్చేందుకు మీరు చూపిన నిబద్ధత, చొరవలో ఎక్కడా కూడా ముందస్తు చెల్లింపుల ప్రస్తావన, నిర్దేశిత సమయం పేర్కొనలేదు. ఏదేమైనా బకాయిల్ని తీర్చేందుకు మీ వద్ద సరైన ప్రణాళిక ఉంటే.. ఇప్పటికైనా సమాధానమివ్వండి’ అని లేఖలో పీఎన్బీ పేర్కొంది. సంస్థ వాటాలు, ఆస్తులు అమ్మి రుణం చెల్లిస్తానని చెప్పినా.. అత్యుత్సాహంతో ఆస్తుల్ని సీజ్ చేసి తన బ్రాండ్ పేరును నాశనం చేశారంటూ ఫిబ్రవరి 13, 15 తేదీల్లో పీఎన్బీకి నీరవ్ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో బకాయిలు చెల్లించడం కష్టమేనని అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు కొఠారి ఎంత బాకీ పడ్డాడంటే..
న్యూఢిల్లీ : బ్యాంకులను మోసం చేసిన కేసులో రొటోమ్యాక్ పెన్ కంపెనీ యజమాని విక్రమ్ కొఠారి, ఆయన తనయుడు రాహుల్ కొఠారీలను గురువారం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఫిర్యాదు రావడంతో సీబీఐ ఆదివారం కొఠారి కుటుంబసభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు విచారించిన సీబీఐ మోసం జరిగినట్లు ప్రాధమిక ఆధారాలు లభ్యమవడంతో గురువారం అరెస్ట్ చేసింది. ప్రాధమిక విచారణలో కొఠారి కటుంబసభ్యులు వడ్డీలతో కలిపి రూ.3,695 కోట్లు బకాయిలు ఉన్నట్లు తేలింది. కోఠారి వివిధ బ్యాంకుల నుంచి రూ.2,919 కోట్లు లోన్ తీసుకున్నారు. దీనికి వడ్డీ రూ.776 కోట్లు అయింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ.754.77 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా(456.63), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(771.07 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(458.95 కోట్లు), అలహాబాద్ బ్యాంక్(రూ.330.68 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(49.82 కోట్లు), ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(97.47 కోట్లు) బకాయిలు పడినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, భార్య, కొంత మంది బ్యాంకు అధికారులు, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులపై కుట్ర, మోసం, ఫోర్జరీ తదీతర యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి సీబీఐ విచారణ జరుపుతోంది. -
రొటొమ్యాక్ అధినేత విక్రమ్ కొఠారి అరెస్ట్
న్యూఢిల్లీ: రొటొమాక్ అధినేత విక్రమ్ కొఠారిని, ఆయన కుమారుడు రాహుల్ కొఠారినీ సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. కాగా సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. 2008 నుంచి బ్యాంకుల నుంచి పొందిన భారీ రుణాలను రొటొమ్యాక్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించింది. ఎగుమతి ఆర్డర్ల పేరిట బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలను అందుకు వినియోగించకుండా స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎగుమతి ఆర్డర్ల కోసం తప్పుడు ధ్రువపత్రాలతో పొందిన అప్పును విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని.. ఆ డబ్బును తిరిగి కాన్పూర్‌కు చెందిన కంపెనీకే మళ్లించారని సీబీఐ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇక ఇతర కేసుల్లో.. ఎగుమతి కోసం వస్తువుల కొనుగోలుకు బ్యాంకులిచ్చిన రుణాల్ని కూడా రొటొమ్యాక్ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సోమవారం వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
రొటొమ్యాక్ కుంభకోణం 3,695 కోట్లు
న్యూఢిల్లీ/కాన్పూర్: రూ. 800 కోట్లు కాదు.. ఏకంగా రూ. 3,695 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని రొటొమ్యాక్ పెన్స్ ప్రమోటర్ విక్రమ్ కొఠారి ముంచేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సోమవారం వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి. రొటొమ్యాక్ కంపెనీ ఖాతాల పరిశీలన తర్వాత ఆ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ల నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ బ్యాంకుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 2919 కోట్ల రుణాల్ని పొందగా అసలు, వడ్డీ, కలుపుకుంటే ఆ మొత్తం రూ. 3,695 కోట్లుగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 754.77 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 456.63 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 771.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 458.95 కోట్లు, అలహాబాద్ బ్యాంకు రూ. 330.68 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 49.82 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 97.47 కోట్ల రుణాలిచ్చాయి. ఇంకా అరెస్టు చేయలేదు: సీబీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ఆధారంగా కాన్పూర్‌కు చెందిన రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కొఠారి మోసాలపై దర్యాప్తు కోసం సీబీఐ ఆదివారమే రంగంలోకి దిగింది. విక్రమ్ కొఠారి, అతని భార్య సాధన, కుమారుడు రాహుల్, మరికొందరు గుర్తు తెలియని బ్యాంకు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం ఉదయం కాన్పూర్‌లో కొఠారి ఇల్లు, కార్యాలయంతో పాటు మూడు చోట్ల సీబీఐ తనిఖీలు ప్రారంభించింది. ఇంతవరకూ ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని, కొఠారి, అతని భార్య, కుమారుడ్ని విచారిస్తున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. రుణాల్ని ఎక్కడికి మళ్లించారో విచారిస్తున్నాం: ఈడీ సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా రొటొమ్యాక్ పెన్స్ యాజమాన్యంపై ఈడీ కూడా మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. విక్రమ్ కొఠారి, అతని కుటుంబసభ్యుల్ని కేసులో నిందితులుగా చేర్చింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని దారి మళ్లించారా? అక్రమాస్తులు కూడగట్టేందుకు, నల్లధనం సృష్టికి ఆ డబ్బును వాడారా? అన్న కోణంలో విచారణ చేస్తామని ఈడీ తెలిపింది. ఎగుమతి ఆర్డర్ల పేరిట రుణాల దారి మళ్లింపు సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. 2008 నుంచి బ్యాంకుల నుంచి పొందిన భారీ రుణాలను రొటొమ్యాక్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించింది. ఎగుమతి ఆర్డర్ల పేరిట బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలను అందుకు వినియోగించకుండా స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేసింది. ఎగుమతి ఆర్డర్ల కోసం తప్పుడు ధ్రువపత్రాలతో పొందిన అప్పును విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని.. ఆ డబ్బును తిరిగి కాన్పూర్‌కు చెందిన కంపెనీకే మళ్లించారని సీబీఐ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇక ఇతర కేసుల్లో .. ఎగుమతి కోసం వస్తువుల కొనుగోలుకు బ్యాంకులిచ్చిన రుణాల్ని కూడా రొటొమ్యాక్ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. -
కుంభకోణం కాదు, నేను డీఫాల్టర్ని కాదు
సాక్షి, లక్నో: కాన్పూర్‌కు చెందిన వ్యాపార వేత్త, రొటొమ్యాక్ పెన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కొఠారీనీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ ప్రకటించారు. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో కొఠారి సహా, మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కొఠారి నివాసం, కార్యాలయాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. సోమవారం తెల్లవారుఝామునుంచి సోదాలు నిర్వహిస్తున్న సీబీఐఅధికారులు కొఠారి భార్యను, కుమారుడిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారీ ఎత్తున బ్యాంకులకు రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేశాడన్న వార్తలపై కొఠారి స్పందించారు. ఇది కుంభకోణం కాదని , తాను రుణాలను ఎగవేయలేదనీ, ఎక్కడికీ పారిపోలేదని, కాన్పూరులోనే ఉన్నానని కొఠారి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకులు తన కంపెనీని ఎన్పీఏగా ప్రకటించినప్పటికీ, తాను ఢీఫాల్టర్ని కాదని వివరణ ఇచ్చారు. ఈ విషయం ఇప్పటికీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పరిధిలో ఉందనీ, తాను బ్యాంకులతో సన్నిహితంగా ఉన్నాననీ, తీసుకున్నరుణాలను త్వరలోనే తిరిగి చెల్లిస్తానని వెల్లడించారు. అటు కొఠారి రుణాలను చెల్లించలేకపోతే, ఆయన ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని అలహాబాద్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ గుప్తా ప్రకటించారు. కాగా నీరవ్‌మోదీ కుంభకోణం వ్యవహారం మరిచిపోకముందే రొటొమ్యాక్ పెన్స్ కంపెనీ యజమాని కొఠారీ.. రూ. 800 కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయాడన్న వార్త కలకలం రేపింది. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి తీసుకున్న రూ. 800 కోట్ల రుణాలను ఎగవేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.