కాన్పూర్‌లో సీబీఐ సోదాలు నిర్వహించిన విక్రమ్ కొఠారి బంగ్లా
న్యూఢిల్లీ/కాన్పూర్: రూ. 800 కోట్లు కాదు.. ఏకంగా రూ. 3,695 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని రొటొమ్యాక్ పెన్స్ ప్రమోటర్ విక్రమ్ కొఠారి ముంచేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సోమవారం వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి.
రొటొమ్యాక్ కంపెనీ ఖాతాల పరిశీలన తర్వాత ఆ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ల నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది.
ఈ బ్యాంకుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 2919 కోట్ల రుణాల్ని పొందగా అసలు, వడ్డీ, కలుపుకుంటే ఆ మొత్తం రూ. 3,695 కోట్లుగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 754.77 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 456.63 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 771.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 458.95 కోట్లు, అలహాబాద్ బ్యాంకు రూ. 330.68 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 49.82 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ. 97.47 కోట్ల రుణాలిచ్చాయి.
ఇంకా అరెస్టు చేయలేదు: సీబీఐ
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ఆధారంగా కాన్పూర్‌కు చెందిన రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కొఠారి మోసాలపై దర్యాప్తు కోసం సీబీఐ ఆదివారమే రంగంలోకి దిగింది. విక్రమ్ కొఠారి, అతని భార్య సాధన, కుమారుడు రాహుల్, మరికొందరు గుర్తు తెలియని బ్యాంకు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సోమవారం ఉదయం కాన్పూర్‌లో కొఠారి ఇల్లు, కార్యాలయంతో పాటు మూడు చోట్ల సీబీఐ తనిఖీలు ప్రారంభించింది. ఇంతవరకూ ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని, కొఠారి, అతని భార్య, కుమారుడ్ని విచారిస్తున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు.
రుణాల్ని ఎక్కడికి మళ్లించారో విచారిస్తున్నాం: ఈడీ
సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రొటొమ్యాక్ పెన్స్ యాజమాన్యంపై ఈడీ కూడా మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. విక్రమ్ కొఠారి, అతని కుటుంబసభ్యుల్ని కేసులో నిందితులుగా చేర్చింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని దారి మళ్లించారా? అక్రమాస్తులు కూడగట్టేందుకు, నల్లధనం సృష్టికి ఆ డబ్బును వాడారా? అన్న కోణంలో విచారణ చేస్తామని ఈడీ తెలిపింది.
ఎగుమతి ఆర్డర్ల పేరిట రుణాల దారి మళ్లింపు
సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. 2008 నుంచి బ్యాంకుల నుంచి పొందిన భారీ రుణాలను రొటొమ్యాక్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించింది. ఎగుమతి ఆర్డర్ల పేరిట బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలను అందుకు వినియోగించకుండా స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేసింది. ఎగుమతి ఆర్డర్ల కోసం తప్పుడు ధ్రువపత్రాలతో పొందిన అప్పును విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని.. ఆ డబ్బును తిరిగి కాన్పూర్‌కు చెందిన కంపెనీకే మళ్లించారని సీబీఐ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇక ఇతర కేసుల్లో .. ఎగుమతి కోసం వస్తువుల కొనుగోలుకు బ్యాంకులిచ్చిన రుణాల్ని కూడా రొటొమ్యాక్ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment