విక్రమ్ కొఠారీ (ఫైల్ ఫోటో)
సాక్షి, లక్నో: కాన్పూర్‌కు చెందిన వ్యాపార వేత్త, రొటొమ్యాక్ పెన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కొఠారీనీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ ప్రకటించారు. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో కొఠారి సహా, మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కొఠారి నివాసం, కార్యాలయాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. సోమవారం తెల్లవారుఝామునుంచి సోదాలు నిర్వహిస్తున్న సీబీఐఅధికారులు కొఠారి భార్యను, కుమారుడిని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు భారీ ఎత్తున బ్యాంకులకు రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేశాడన్న వార్తలపై కొఠారి స్పందించారు. ఇది కుంభకోణం కాదని , తాను రుణాలను ఎగవేయలేదనీ, ఎక్కడికీ పారిపోలేదని, కాన్పూరులోనే ఉన్నానని కొఠారి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకులు తన కంపెనీని ఎన్‌పీఏగా ప్రకటించినప్పటికీ, తాను ఢీఫాల్టర్‌ని కాదని వివరణ ఇచ్చారు. ఈ విషయం ఇప్పటికీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలో ఉందనీ, తాను బ్యాంకులతో సన్నిహితంగా ఉన్నాననీ, తీసుకున్నరుణాలను త్వరలోనే తిరిగి చెల్లిస్తానని వెల్లడించారు. అటు కొఠారి రుణాలను చెల్లించలేకపోతే, ఆయన ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని అలహాబాద్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ గుప్తా ప్రకటించారు.
కాగా నీరవ్‌మోదీ కుంభకోణం వ్యవహారం మరిచిపోకముందే రొటొమ్యాక్ పెన్స్ కంపెనీ యజమాని కొఠారీ.. రూ. 800 కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయాడన్న వార్త కలకలం రేపింది. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి తీసుకున్న రూ. 800 కోట్ల రుణాలను ఎగవేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment