నమితా దుబే.. చాలామంది నటీమణుల్లాగానే ఆమే మోడలింగ్ నుంచి నటనవైపు మళ్లింది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్స్ మీద వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అవకాశాలను అందుకుంటోంది. తన హావభావాలతో వీక్షకులను అలరిస్తోంది.
నమితా పుట్టిపెరిగింది లక్నోలో. వాళ్ల నాన్న వినయ్‌ప్రియ్ దుబే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమితా.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బిఏ ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత ముంబై వెళ్లి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ వర్క్‌లో పీజీ చేసింది.
చదువైపోయాక ‘వరల్డ్ వెల్ఫేర్ చిల్డ్రన్ ట్రస్ట్’లో కొన్నాళ్లు, ‘సలామ్ బాలక్ ట్రస్ట్’లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఒక యాడ్‌లో అయిదు నిమిషాలు నటించినందుకు 20 వేల పారితోషికం అందుకుంది. అది ఆమెకు తన కెరీర్‌నే యాక్టింగ్ ఫీల్డ్‌కి షిఫ్ట్ చేసుకునేంత ఉత్సాహాన్నిచ్చింది.
నటనారంగంలో కొనసాగేముందు తన అభినయ కళకు మెరుగులు దిద్దుకోవాలనుకుని ‘జెఫ్ గోల్డెన్‌బర్గ్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్’లో చేరింది. ట్రైన్డ్ యాక్ట్రెస్‌గా బిందాస్ చానెల్ సీరియల్ ‘యే హై ఆషిరీ’తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందులోని ‘రాధిక’రోల్‌తో ఆమె పాపులర్ అయింది. అది ఆమెకు సోనీ, కలర్స్ లాంటి ఇతర టాప్ చానెల్స్‌లో అవకాశాలను తెచ్చిపెట్టింది.
టీవీ గుర్తింపు నమితాకు సినిమా చాన్స్‌నూ ఇచ్చింది.. ‘మై తేరా హీరో’లో. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. తత్ఫలితం.. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెండ్ మూవీ ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో మంచి పాత్ర దక్కడం.
ఇలా టీవీ సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యాస్పిరెంట్స్’ అనే సిరీస్‌తో ఓటీటీలోనూ నటించే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో.. అందులోని ‘ధైర్య’ భూమికతో ఆమే అంతే ఫేమస్ అయ్యి ఓటీటీ వీక్షకుల అభిమాన నటిగా మారిపోయింది.
"ఇంపార్టెంట్ రోల్ దొరికితే చాలు.. అది సీరియలా.. సిరీసా.. సినిమానా అని చూడను. నాకు తెలిసి నిజమైన యాక్టర్స్ ఎవరైనా తమ పాత్ర గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని ప్రదర్శించే వేదిక గురించి కాదు!" – నమితా దుబే
Comments
Please login to add a commentAdd a comment