మద్రాసులో మరో తెలుగు దివ్వె కనుమరుగైంది. మూల ద్రావిడ భాషల్లో బహువచన ప్రత్యయమే లేదని పరిశోధనాత్మకంగా తేల్చిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య జీవీయస్సార్ కృష్ణమూర్తి మరణంతో ప్రతిష్ఠాత్మక మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ తెలుగు శాఖ చిన్నబోయింది. తొంభై నాలుగేళ్ళ ఆ శాఖతో దాదాపు సగం కాలం అనుబంధం, అధ్యాపకత్వం మాస్టారివి. ఇన్నేళ్ళుగా మద్రాసులో తెలుగు భాషా పరిశోధనకూ, విద్యార్థులకూ పెద్దదిక్కుగా నిలి చిన మంచి మనిషిగా... మూల ద్రావిడ పదాలను ఎలా గుర్తించాలి, ఆ పదాల అర్థాలు, అర్థవిపరిణామానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన అరుదైన భాషావేత్తగా... జీవీయస్సార్ ఓ కొండగుర్తు.
గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ళలో బతికిచెడ్డ కుటుంబంలో పుట్టిన జీవీయస్సార్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తూమాటి దొణప్ప వద్ద భాషాశాస్త్ర అధ్యయనం చేశారు. ‘ద్రావిడ భాషల్లో సమాన పదజాలం’పై పరిశోధించారు. అది ఆయనను పాండిత్యంలో సానబెట్టింది. చెన్నపురికి చేర్చింది. 1978 నుంచి ఇప్పటి దాకా మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు ఊపిరిగా నిలి పింది. ఆ శాఖలో దశాబ్దాల క్రితమే తెలుగు సాహితీ అధ్యయనాన్ని ప్రాయోగికంగా మారుస్తూ, జర్నలిజమ్ పేపర్‌ను ప్రవేశపెట్టడంలో కీలక భాగస్వామి ఆయన. భాషావికాసం - జర్నలిజాల బోధన, ద్రావిడభాషా పరిశోధన–రెండూ చివరి దాకా ఆయనకు రెండు కళ్ళు.
జీవనపోరాటంలో కష్టనష్టాలెన్నో చూసిన అనుభవం ఆయనది. అందుకే, సుదూరం నుంచి వచ్చిన విద్యార్థుల ఈతిబాధలు మాస్టారికి తెలుసు. అలా 4 దశాబ్దాల్లో కొన్ని వందల మంది తెలుగు పిల్లలకు ఆయన గురువే కాదు, తల్లి- తండ్రి- ఆత్మబంధువయ్యారు. అవస రానికి సలహాల నుంచి అడిగిందే తడవుగా ఆర్థికసాయాల దాకా అన్నీ చూసే స్నేహితుడయ్యారు. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనంలో కొన్ని పదుల మంది పరిశోధకులకు మార్గదర్శకులయ్యారు. కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, నిడదవోలు వెంకటరావుల పరంపరలో ఆచార్య గంధం అప్పారావు, రామచంద్ర చౌదరి, అక్కిరెడ్డి తర్వాత తెలుగుశాఖకు అధ్యక్షులయ్యారు. ఏ హోదాలో ఉన్నా సరే చదువుకోవడానికొచ్చే పిల్లలతో అదే ఆత్మీయత. అదే వాత్సల్యం.
రిటైరైన తరువాత కూడా రెండు దశాబ్దాలు రోజూ తెలుగు శాఖకు వచ్చి, విద్యార్థులను తీర్చిదిద్దిన నిష్కామకర్మ, నిబద్ధత జీవీ యస్సార్‌వి. ఎనిమిది పదులకు దగ్గరవుతున్నా... రోజూ ఉదయాన్నే వచ్చేదీ, పొద్దుపోయాకెప్పుడో రాత్రి ఆఖరున వెళ్ళేదీ ఆయనే. అనేక సార్లు ఆగుతూ వచ్చిన చదువును కొనసాగిస్తూ, సైన్స్ చదివి, ఎమ్మేలో లెక్కలు వేసి, జీవనోపాధికి అనేకానేక చిరు ఉద్యోగాలు చేసి, ఆనక తెలుగులో పరిశోధన రాసి ఆచార్యుడైన జీవీయస్సార్‌కు జీవితంలోని డబ్బు లెక్కలు తెలియవు. అడిగినవారికి లేదనకుండా, కష్టంలో ఉన్న విద్యార్థికి కన్నీరు విడవకుండా ఆయన చేసిన సాయాలు, దానాలు, చెప్పిన సలహాలు కొల్లలు. కానీ, తనకంటూ అవసరమున్నా ఎవరినీ అర్థించని ఆత్మాభిమాని. అనర్గళంగా ఆయన భాషాశాస్త్ర పాఠం చెబుతుంటే అది వినముచ్చట. పాఠంలో, పరిశోధనలో సీరియస్‌గా అనిపించే మనిషి... కిందకు దిగి, క్యాంటీన్‌లో కుర్రకారుతో కలసి సర దాగా కబుర్లాడుతుంటే అదో చూడముచ్చట. ఆచార్యుడైనా, శాఖాధ్య క్షుడైనా, ఆఖరుకు ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి పదవి ఆఖరి క్షణంలో అందకుండా పోయినా– ఆయన మాత్రం అంతే సాదా సీదాగా గడిపేయడం ఓ అరుదైన ముచ్చట. నిన్నటి దాకా స్లెట్, యూజీసీ నెట్ నుంచి ఐఏఎస్ దాకా ఏ తెలుగు పరీక్షాపత్రం సిద్ధం చేయాలన్నా మాస్టారి చేయి పడాల్సిందే!
భద్రిరాజు కృష్ణమూర్తి, పీఎస్ సుబ్రహ్మణ్యం, దొణప్పల తరువాతి తరంలో భాషాశాస్త్రంలో అవిరళ కృషి చేసిన జీవీయస్సార్ ఎక్కు వగా ఇంగ్లీషులోనే పరిశోధనలన్నీ రాశారు. వాటిని కనీసం పుస్తకంగా నైనా వేయలేదు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే వెళ్ళిపోవడంతో తెలుగు సమాజానికి ఆయన కృషి పూర్తిగా తెలియలేదు. సంపదనూ, సమ యాన్నీ, పరిశోధనా మేధనూ స్వీయప్రతిష్ఠ కోసం కాకుండా విద్యా ర్థుల కోసం వెచ్చించడం గురువుగా ఆయనలోని అరుదైన లక్షణం. ఆయన దగ్గర చదువుకొని కొందరు సినీ రచయితలయ్యారు. ఇంకొం దరు సాహితీవేత్తలయ్యారు. మరికొందరు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఆచార్యులయ్యారు. శాఖలో ఆయన ప్రత్యక్ష శిష్యులు మాడభూషి సంపత్ కుమార్ కూడా అదే శాఖకు అధ్యక్షులవడం సాక్షాత్ గురుకృప. చెన్నపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేసిన మైలాపూర్ భవనంతో, ఆ సొసైటీతో, అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రపంచ తెలుగు సమాఖ్య - బీఎస్సార్‌కృష్ణ ‘రచన’ లాంటి సంస్థలతో జీవీయస్సార్ సాన్నిహిత్యం, వాటిల్లో ఆయన క్రియాశీలక కృషి చిరకాల జ్ఞాపకాలు. మల్లిక్, ఆచార్య కాసల నాగభూషణంతో కలసి ‘అరసం’ మద్రాసు శాఖ అధ్యక్షుడిగా ఆయన జరిపిన కార్యక్రమాలు వందలు.
‘నిండు మనంబు నవ్య నవనీత సమంబు... పల్కు దారుణ శస్త్ర ఖండనా తుల్యంబు...’ అన్న నన్నయ భారత చిత్రణ... సాహితీ పరిశో ధకుల మౌఖిక పరీక్షా సందర్భంలో మాస్టారికి సరిగ్గా సరిపోలుతుంది. సెమినార్లలో ఎవరు మాట్లాడినా, పరిశోధకులు ఏ తప్పు రాసినా ఆయన ఆత్మీయతను వదిలేసి, సత్యవాదిగా వాదనకు దిగేవారు. కొందరు సన్నిహితులకు సైతం రుచించకపోయినా, అది జీవీయస్సార్ జీవలక్షణం. భాషాశాస్త్రంలో çపట్టుసడలని పరిశోధనా దృష్టి, తెలుగు శాఖాభివృద్ధిలో పట్టువదలని కార్యదీక్ష, ఏదైనా సరే పట్టుకున్నది నెరవేరేలా చూసే వ్యవహార దక్షత, ఏటికి ఎదురీదే సాహసం, ఆప దలో పడితే తార్కికంగా చక్రం అడ్డువేసే శిష్యవాత్సల్యం, అవసరంలో ఉన్నవారికి సాయపడే సద్గుణం - ఇదీ ఆయన వ్యక్తిత్వం. అవన్నీ ఇకపై ప్రతి సందర్భంలోనూ చెన్నై తెలుగు వేదికపై ఆయన లేని లోటును పదే పదే గుర్తుచేస్తాయి. పదిమందీ గుర్తించేలా చేస్తాయి. అభ్యుదయ పరంపరాగత ఆత్మీయ గురువులకు అశ్రునివాళి.
- డాక్టర్ రెంటాల జయదేవ
మెరీనా క్యాంపస్ మూగబోయింది
Published Sun, Jul 18 2021 12:39 AM | Last Updated on Sun, Jul 18 2021 12:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment