కాశీ విశ్వనాథ ఆలయ ఆవరణలోని అహిల్యాబాయి హోల్కర్ విగ్రహం
దేశమంతా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది మే 31 దాకా అహిల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తెలివి, మేధస్సు, ధైర్యసాహసాలతో ఆమె మహారాణిగా ఎదిగారు. సువిశాల భూభాగంలో పరిపాలన చేసి ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బాలిక విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఆమె.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వద్ద గల చోండి గ్రామంలో అహిల్యాబాయి 1725 మే 31న జన్మించారు. ఆమె తల్లి సుశీలా షిండే, తండ్రి మంకోజీ షిండే. నేటి రాజకీయ భాషలో సంచార తెగల కుటుంబం ఆమెది. చిన్న నాటనే ఆమెకు గల భక్తి, నిర్భీతి చూసి మల్హార రావు హోల్కర్(మరాఠా సుబేదారు) ముగ్ధుడయ్యారు. తన కుమారుడు ఖాండేరావు హోల్కర్‌కు ఇచ్చి వివాహం చేశారు. అప్పుడామె వయస్సు పదేళ్లు, పెళ్లి కొడుకు వయస్సు పన్నెండేళ్లు. అలా రాజ కుటుంబంలోకి ప్రవేశించింది. అక్కడే యుద్ధ విద్యలు, ప్రజా పాలనా విద్యలు నేర్చింది. వారి మామగారి వెంట అనేక యుద్ధాలకు వెళ్లి, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించింది. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరింది.
అయితే, భర్త ఖాండే రావు 1754లో, తండ్రి వంటి మామ మల్హార రావు 1766లో, తర్వాతి ఏడాది కుమారుడు మాలే రావు... ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు. ఈ పిడుగుపాటు ఘటనలతో అహిల్య కుంగిపోలేదు. 16 యేండ్ల కుమారుణ్ణి కోల్పోయిన దుఃఖంలోనే 1767లో సింహాసనం అధిరోహించారు. శివ భక్తురాలుగా శివుని ప్రతినిధిగా పరిపాలన చేపట్టారు. ఇండోర్‌కు దూరంగా, నర్మదా నదీ తీరాన ఉన్న మహేశ్వర్ (మధ్య ప్రదేశ్) గ్రామాన్ని తన ముఖ్య పట్టణంగా నిర్మించారు. అది సమగ్ర పట్టణాభివృద్ధి యోజనకు మంచి ఉదాహరణ.
గొప్ప సంస్కరణ వాది..
మహిళలకు విద్య, భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, వితంతువులకు పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు... ఇలా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు ఆమె తీసుకున్నారు. ఆమె పాలనలో అడవుల నరికివేతను నిషేధించారు. ఆదాయం ఇచ్చే చెట్లను నాటించారు. త్రాగుడును నిషేధించారు. వరకట్నాన్ని నిషేధించారు. ఆమె కోట తలుపులు సామాన్యులు తమ గోడు చెప్పుకోడానికి ఎప్పుడూ తీసే ఉండేవి. వ్యవసాయం కొరకు నూతన చెరువుల నిర్మాణం, నీటి నిల్వకు ట్యాంకులు, నదులపై ఘాట్‌లు నిర్మించారు. వస్త్ర పరిశ్రమ, పట్టు పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలకు వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహేశ్వరీ చీరలు అంటే ఇప్పటికీ మంచి పేరే ఉంది!
భిల్లులు, గోండులు వంటి గిరిజనులకు భూములను ఇచ్చి వారిని వ్యవసాయం వైపు మళ్లించారు. అటవీ ప్రాంతంలో ప్రజలకు దారి చూపుతూ ఉండే భిల్లులకు ప్రజల నుండి భిల్ కావడి వంటి పన్నును సేకరించుకునేట్లు ప్రోత్సహించారు. ఆ ఆదాయంతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, అభివృద్ధి పథకాలు చేపట్టారు.
హిందూ ఆలయాల పునరుజ్జీవనం కోసం..
తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే, గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణరంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత ఆమె. 1783లో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన చంద్రావంత్‌ను అణిచి వేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యాన్ని నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూనాలో గాలిలో శతఘ్నులను పేల్చాడు.
ఆమె హిందూధర్మ పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారు. విదేశీ పాలకుల వల్ల దేశ వ్యాప్తంగా ధ్వంసం అయిన 82 మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి, శ్రీశైలం... ఇలా అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారు. అన్నదాన సత్రాలను కట్టించారు. తన రాజ్యంలో అన్ని కులాల, మతాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించారు. కనుకనే టిప్పు సుల్తాన్ వంటి ముస్లిం రాజులు సైతం ఆమె ధార్మిక నిర్మాణాలకు అడ్డు చెప్ప లేకపోయారు. ఆమె సంస్థానంలో దేశంలోని 13 రాజ్యాలకు చెందిన ప్రతినిధులు ఉండేవారు. వివిధ రాజులతో మిత్రత్వం నడిపి, నూతన దౌత్య విధానాలకు దారి చూపారు. కనుకనే దేశ వ్యాప్తంగా వివిధ రాజుల రాజ్యాలలోని హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయగలిగారు.
సాధారణంగా కవులు... రాజులను పొగిడి ధన సేకరణ చేసుకుంటూ ఉంటారు. కవులు ఆమెను పొగుడుతూ కవిత్వం రాయడాన్ని ఆమె అంగీకరించేది కాదు. ‘నన్ను పొగుడుతూ కవిత్వం చెబితే మీకు ఆదాయం ఉండదు. ఆ శివుడిని పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్న సైనికులను పొగుడుతూ కవిత్వం రాయండి’ అనేది. అయినా ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు గౌరవించారు. 1795 ఆగస్ట్ 13న తన 70వ ఏట తనువు చాలించిన ఆమెను ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా పాశ్చాత్య చరిత్రకారులు కొనియాడారు. ఆమె జన్మించి 300 ఏళ్లయింది. కర్మ యోగిగా, మాతృత్వం నిండిన రాణిగా ఆమెను పేర్కొనడం సముచితం. – శ్యాంప్రసాద్ జీ, అఖిల భారతీయ సంరసతా ప్రముఖ్ (నేటి నుంచి అహిల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాలు ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment