Shyam Prasad
-
గొప్ప పరిపాలనా దక్షురాలు..
దేశమంతా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది మే 31 దాకా అహిల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తెలివి, మేధస్సు, ధైర్యసాహసాలతో ఆమె మహారాణిగా ఎదిగారు. సువిశాల భూభాగంలో పరిపాలన చేసి ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బాలిక విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఆమె.మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వద్ద గల చోండి గ్రామంలో అహిల్యాబాయి 1725 మే 31న జన్మించారు. ఆమె తల్లి సుశీలా షిండే, తండ్రి మంకోజీ షిండే. నేటి రాజకీయ భాషలో సంచార తెగల కుటుంబం ఆమెది. చిన్న నాటనే ఆమెకు గల భక్తి, నిర్భీతి చూసి మల్హార రావు హోల్కర్(మరాఠా సుబేదారు) ముగ్ధుడయ్యారు. తన కుమారుడు ఖాండేరావు హోల్కర్కు ఇచ్చి వివాహం చేశారు. అప్పుడామె వయస్సు పదేళ్లు, పెళ్లి కొడుకు వయస్సు పన్నెండేళ్లు. అలా రాజ కుటుంబంలోకి ప్రవేశించింది. అక్కడే యుద్ధ విద్యలు, ప్రజా పాలనా విద్యలు నేర్చింది. వారి మామగారి వెంట అనేక యుద్ధాలకు వెళ్లి, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించింది. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరింది.అయితే, భర్త ఖాండే రావు 1754లో, తండ్రి వంటి మామ మల్హార రావు 1766లో, తర్వాతి ఏడాది కుమారుడు మాలే రావు... ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు. ఈ పిడుగుపాటు ఘటనలతో అహిల్య కుంగిపోలేదు. 16 యేండ్ల కుమారుణ్ణి కోల్పోయిన దుఃఖంలోనే 1767లో సింహాసనం అధిరోహించారు. శివ భక్తురాలుగా శివుని ప్రతినిధిగా పరిపాలన చేపట్టారు. ఇండోర్‌కు దూరంగా, నర్మదా నదీ తీరాన ఉన్న మహేశ్వర్ (మధ్య ప్రదేశ్) గ్రామాన్ని తన ముఖ్య పట్టణంగా నిర్మించారు. అది సమగ్ర పట్టణాభివృద్ధి యోజనకు మంచి ఉదాహరణ.గొప్ప సంస్కరణ వాది..మహిళలకు విద్య, భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, వితంతువులకు పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు... ఇలా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు ఆమె తీసుకున్నారు. ఆమె పాలనలో అడవుల నరికివేతను నిషేధించారు. ఆదాయం ఇచ్చే చెట్లను నాటించారు. త్రాగుడును నిషేధించారు. వరకట్నాన్ని నిషేధించారు. ఆమె కోట తలుపులు సామాన్యులు తమ గోడు చెప్పుకోడానికి ఎప్పుడూ తీసే ఉండేవి. వ్యవసాయం కొరకు నూతన చెరువుల నిర్మాణం, నీటి నిల్వకు ట్యాంకులు, నదులపై ఘాట్లు నిర్మించారు. వస్త్ర పరిశ్రమ, పట్టు పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలకు వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహేశ్వరీ చీరలు అంటే ఇప్పటికీ మంచి పేరే ఉంది!భిల్లులు, గోండులు వంటి గిరిజనులకు భూములను ఇచ్చి వారిని వ్యవసాయం వైపు మళ్లించారు. అటవీ ప్రాంతంలో ప్రజలకు దారి చూపుతూ ఉండే భిల్లులకు ప్రజల నుండి భిల్ కావడి వంటి పన్నును సేకరించుకునేట్లు ప్రోత్సహించారు. ఆ ఆదాయంతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, అభివృద్ధి పథకాలు చేపట్టారు.హిందూ ఆలయాల పునరుజ్జీవనం కోసం..తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే, గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణరంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత ఆమె. 1783లో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన చంద్రావంత్ను అణిచి వేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యాన్ని నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూనాలో గాలిలో శతఘ్నులను పేల్చాడు.ఆమె హిందూధర్మ పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారు. విదేశీ పాలకుల వల్ల దేశ వ్యాప్తంగా ధ్వంసం అయిన 82 మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి, శ్రీశైలం... ఇలా అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారు. అన్నదాన సత్రాలను కట్టించారు. తన రాజ్యంలో అన్ని కులాల, మతాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించారు. కనుకనే టిప్పు సుల్తాన్ వంటి ముస్లిం రాజులు సైతం ఆమె ధార్మిక నిర్మాణాలకు అడ్డు చెప్ప లేకపోయారు. ఆమె సంస్థానంలో దేశంలోని 13 రాజ్యాలకు చెందిన ప్రతినిధులు ఉండేవారు. వివిధ రాజులతో మిత్రత్వం నడిపి, నూతన దౌత్య విధానాలకు దారి చూపారు. కనుకనే దేశ వ్యాప్తంగా వివిధ రాజుల రాజ్యాలలోని హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయగలిగారు.సాధారణంగా కవులు... రాజులను పొగిడి ధన సేకరణ చేసుకుంటూ ఉంటారు. కవులు ఆమెను పొగుడుతూ కవిత్వం రాయడాన్ని ఆమె అంగీకరించేది కాదు. ‘నన్ను పొగుడుతూ కవిత్వం చెబితే మీకు ఆదాయం ఉండదు. ఆ శివుడిని పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్న సైనికులను పొగుడుతూ కవిత్వం రాయండి’ అనేది. అయినా ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు గౌరవించారు. 1795 ఆగస్ట్ 13న తన 70వ ఏట తనువు చాలించిన ఆమెను ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా పాశ్చాత్య చరిత్రకారులు కొనియాడారు. ఆమె జన్మించి 300 ఏళ్లయింది. కర్మ యోగిగా, మాతృత్వం నిండిన రాణిగా ఆమెను పేర్కొనడం సముచితం. – శ్యాంప్రసాద్ జీ, అఖిల భారతీయ సంరసతా ప్రముఖ్ (నేటి నుంచి అహిల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాలు ప్రారంభం) -
గడువులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ అడ్మిషన్స్లో ఈ ఏడాది సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని పరిష్కరిస్తూ ప్రక్రియను కొనసాగిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించిన సమయానికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీ యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను ఆయన గురువారం మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అడ్మిషన్లకు సంబంధించి పదేళ్లుగా ఒకే సాఫ్ట్వేర్ సంస్థను వినియోగిస్తుండటంతో ఆడిట్ అభ్యంతరాలు తలెత్తాయని, దీంతో టెండర్లు పిలవగా.. హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుందని తెలిపారు. అపోహలకు తావులేదు.. యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 2,342 పీజీ/డిప్లమో సీట్లుండగా, వాటిలో 50 శాతం నేషనల్ పూల్‌కు పోను, రాష్ట్ర కోటాగా 38 స్పెషాలిటీల్లో 1,171 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ పీజీ, డిప్లమో సీట్ల భర్తీకి నవంబర్ 3న నోటిఫికేషన్ ఇచ్చినట్టు వీసీ తెలిపారు. వెబ్సైట్లో కొన్ని సాంకేతిక పరమైన చిక్కులతో డిసెంబర్ 23న రీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మెరిట్ లిస్టును జనవరి 19న ప్రకటించి, నాన్ సర్వీసు కోటాకు సంబంధించి ఫిబ్రవరి 1న సీట్ల అలాట్మెంట్ చేశామన్నారు. కొన్ని లోపాలు తలెత్తినట్టు నిపుణుల కమిటీ గుర్తించి, వాటిని రద్దు చేసి, ఫిబ్రవరి 2న రీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 7న సీట్లు అలాట్ చేసి, 14లోపు జాయిన్ అవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. సర్వీసు కోటాకు సంబంధించి తెలంగాణ వారికీ సీట్లు కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 13న నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. సర్వీస్ కోటాలో మిగిలిన సీట్లు నాన్ సర్వీస్ కోటాలో భర్తీ చేస్తామని తెలిపారు. మార్చి 7 నాటికి పీజీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇందుకోసం యూనివర్సిటీ సిబ్బంది పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో సైతం పనిచేస్తున్నారని, ఎలాంటి అపోహలకు తావులేదని వీసీ వివరించారు. యూజీకి 14 వేల దరఖాస్తులు.. ఎంబీబీఎస్, ఎండీఎస్ అడ్మిషన్ల కోసం జనవరి 28న నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. నోటిఫికేషన్ గడువు ఫిబ్రవరి 8తో ముగిసిందని, ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ నెల 25తో పరిశీలన పూర్తి చేసి, 28న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటిస్తామని వీసీ వివరించారు. మార్చి మొదటి వారంలో మొదటి దశ, రెండో వారంలో రెండో దశ, మూడో వారంలో మూడో ఫేస్ యూజీ కౌన్సెలింగ్ నిర్వహించి మార్చి 19 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. -
వైఎస్సార్ కంటి వెలుగుతో ఎందరికో చూపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు కోల్పోయిన ఎంతో మందిలో వెలుగులు నింపినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ (ఏపీవోఎస్) ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 6వ రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సు ఐకాన్–2021ను శనివారం డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేత్ర వైద్యంలో ఆధునిక పద్ధతులను వివరిస్తూ ముద్రించిన జర్నల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా నేత్ర వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ నమ్రతా శర్మ, ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎం.పర్నికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్.విష్ణువర్ధన్‌రావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ ఎ.శ్రీహరి, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలి
తిరుపతి తుడా : ఆయుర్వేద వైద్యంలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఇందుకు యూనివర్సిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి, కళాశాలలోని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, రోగులు ఎంతో నమ్మకంతో చికిత్స నిమిత్తం డాక్టర్ల వద్దకు వస్తారని, వారితో ఆప్యాయంగా మాట్లాడితే సగం రోగం నయం చేసినట్లేనన్నారు. డాక్టర్లు కేవలం సంపాదన కోసమే కాకుండా పేదలకు మేలు చేసేలా కూడా ఆలోచించాలన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా డాక్టర్లు నైపుణ్యం పెంచుకోవాలని వీసీ సూచించారు. పుస్తకాలు చదవడం కంటే రోగిని డీల్ చేయడమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద వైద్యంలో పరిశోధనలకు మంచి అవకాశాలున్నాయని, ప్రొఫెసర్లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో మరింత పురోగతి సాధించడానికి ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే భావనను విద్యార్థులు తొలగించుకోవాలని హితవు చెప్పారు. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండండి కోవిడ్ థర్డ్ వేవ్‌పై నిపుణుల హెచ్చరికలపట్ల అప్రమత్తంగా వుంటూ ప్రజల్ని చైతన్యపరచాలని డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ కోరారు. కోవిడ్–19 అనేక రకాలుగా రూపాంతరం చెందుతోందని.. ఆయుర్వేద వైద్యంలో కూడా దీని కట్టడికి పరిశోధనలు చేయాలన్నారు. ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఆర్ఎంవో డాక్టర్ జి.పద్మావతి, పీజీ రీడర్ డాక్టర్ రేణుదీక్షిత్‌తో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మంచి సినిమాని ప్రోత్సహించాలి
‘‘నిన్నుతలచి’ టైటిల్లోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఈ టైటిల్‌ను ఖరారు చేసినప్పుడే దర్శక–నిర్మాతలు సగం సక్సెస్ అయ్యారు. పరిశ్రమలో మంచి సినిమానా? కాదా? అని రెండే ఉంటాయి. మంచి చిత్రాన్ని మనం ప్రోత్సహించాల్సిందే. మంచి పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. వంశీ ఎక్కసిరి, స్టెఫీ పాటిల్ జంటగా అనిల్ తోట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్.ఎల్.ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనిల్ తోట మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. శ్రీమణి, పూర్ణాచారి గార్లు అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు.. మంచి స్పందన వస్తోంది. శ్యామ్ ప్రసాద్ చక్కటి విజువల్స్ అందించారు’’ అన్నారు. ‘‘ఓ ఫీల్ గుడ్ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది’’ అని వంశీ ఎక్కసిరి, స్టెఫీ పాటిల్ అన్నారు. ‘‘నిర్మాత అజిత్గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు’’ అన్నారు సంగీత దర్శకుడు ఎలెందర్ మహావీర్. -
అన్నికోణాల్లో పరిశీలించి తీర్పు ఇవ్వాలి
లీగల్(కడప అర్బన్): కేసులకు సంబంధించి తీర్పులిచ్చేటప్పుడు అన్నికోణాల్లో పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, పోర్ట్‌ఫోలియో జడ్జి జి. శ్యాం ప్రసాద్ అన్నారు. హైకోర్టు, న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు కేసుల్లో తీర్పు ఇచ్చే విధానం, నూతనంగా ఆలోచించేవిధానం గురించి వర్క్‌షాపు నిర్వహించారు. వర్క్‌షాపును ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించేది న్యాయమూర్తులేనన్నారు. కొత్తగా విధుల్లోకి వచ్చిన మేజిస్ట్రేట్లు ఆవేశపడకూడదన్నారు. కేసుల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయవాదుల వాదనలను ఓపికగా వినాలన్నారు. ప్రొసీజర్లాను ప్రతి న్యాయమూర్తి అనుసరించాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులవారు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తొలుత ఆయన గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కోర్టు ఆవరణలో మొక్కనాటి నీళ్లు పోశారు. అనంతరం న్యాయమూర్తులందరూ ఆయనతో కలిసి గ్రూప్‌ఫొటో దిగారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కేజి శంకర్, గుంటూరు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సుల్తానా సిరాజుద్దీన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. ప్రవీణ్‌కుమార్, శాశ్వతలోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్ రెడ్డి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సుధాకర్, నాల్గవ అదనపు న్యాయమూర్తి చక్రపాణి, ఆరో అదనపు న్యాయమూర్తి బి. మంజరి, మేజిస్ట్రేట్లు ప్రత్యూషకుమారి, పద్మశ్రీ, పవన్‌కుమార్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
తప్పు తప్పే... శుద్ధ తప్పే!
ఆయన చెబుతున్నారు! త్రిష వింటున్నారు! ఒక్క మాటకు కూడా ఎదురు చెప్పడం లేదు. ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేసేస్తున్నారు. ఇంతకీ, త్రిషను అంతలా కంట్రోల్లో పెట్టుకున్న ఆయనెవరు? అంటే... ఫొటోలో కళ్లజోడు పెట్టుకుని, కాస్త నెరిసిన జుట్టుతో ఉన్నారు చూడండి ఆయనే! మలయాళీ దర్శకుడు శ్యామ్ ప్రసాద్. ప్రస్తుతం త్రిష హీరోయిన్గా ‘హే జ్యూడ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలి హీరో. జనరల్‌గా షూటింగ్ లొకేషన్లో హీరో హీరోయిన్లు, దర్శకుడు మధ్య సీన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతాయి. కానీ, ‘హే జ్యూడ్’ లొకేషన్లో అంతా వన్‌వే ట్రాఫిక్. శ్యామ్ ప్రసాద్ రూటులో అందరూ నడుస్తున్నారు. సెట్లో ఒకరు ‘ఏంటిది? మీరేం క్వశ్చన్ చేయడం లేదు? డైరెక్టర్ బాగానే తీస్తున్నాడా?’ అని త్రిషను అడిగితే... ‘‘హి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఆయన ట్రాక్ రికార్డు చూశావా? శ్యామ్ తీసిన పన్నెండు సినిమాల్లో మూడింటికి ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ మలయాళం’ అవార్డ్స్ వచ్చాయి. ఆయనకు ఏడు స్టేట్ (కేరళ) అవార్డ్స్ వచ్చాయి. టాలెంట్ ఉన్నోడిని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. తప్పు తప్పు... శుద్ధ తప్పు’’ అని చెప్పారట. అదండీ మేటర్!! -
దేశ ఐక్యతకు పాటుపడిన మహానేత శ్యాంప్రసాద్
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశ ఐక్యత కోసం పరితపించి ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు శ్యాంప్రసాద్‌ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆత్మకూర్ (ఎస్)లో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలంతా ఆయన స్ఫూర్తితో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేసి రానున్న 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సకినాల శ్రీనివాస్, దానియేల్, బీజేపీ నాయకులు మర్ల చంద్రారెడ్డి, తోట ప్రభాకర్, సూరకంటి భాస్కర్‌రెడ్డి, కలకోట్ల సైదులు, పందిరి రాంరెడ్డి, గుద్దేటి వెంకట్‌రెడ్డి, జలగం లక్ష్మయ్య, మాతంగి వెంకటయ్య, హుస్సేన్, జాన్‌రెడ్డి, గుండ్ల మల్లయ్య, శ్రీను, లక్ష్మయ్య, లింగయ్య, కృష్ణయ్య, కొల్లు జానయ్య, రాణాప్రతాప్ పాల్గొన్నారు. -
క్వార్టర్స్‌లో రీతుపర్ణ, రుత్విక
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయిలు రీతుపర్ణా దాస్, రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణ 21-15, 21-11తో సాయి ఉత్తేజిత (ఏపీ)పై, ఆరో సీడ్ రుత్విక 21-5, 21-2తో రుత్ మిశా (కర్ణాటక)పై విజయం సాధించారు. వృశాలి (టీఎస్) 21-10, 21-13తో కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్)పై నెగ్గగా, కె.వైష్ణవి (టీఎస్) 15-21, 17-21తో శైలి రాణె (ఎయిరిండియా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో పదో సీడ్ సిరిల్ వర్మ (టీఎస్) 21-16, 18-21, 21-16తో శ్యామ్‌ప్రసాద్ (కేరళ)పై, భమిడిపాటి సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ) 21-13, 21-12తో ప్రతీక్ మహాజన్ (గోవా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వికాస్ హర్ష (ఏపీ)కు 14-21, 9-21తో రోహిత్ యాదవ్ (ఏఏఐ) చేతిలో చుక్కెదురైంది. విజయవాడ క్లబ్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, పి.వి.సింధు, ఇతర క్రీడాకారిణులు. సీనియర్ నేషనల్స్ సందర్భంగా ఆటవిడుపు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, పంజాబ్ పాటలకు క్రీడాకారులు స్టెప్లు వేశారు. -
బళ్లారి గ్యారేజీల్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,బళ్లారి: బళ్లారిని అనంతపురం రోడ్డులోని ఎంజీ పెట్రోలు బంకు సమీపంలోని గ్యారేజీల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గ్యారేజీల్లో పెద్ద శబ్ధం రావడంతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. శబ్ధం వచ్చిన నిమిషాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను ఆర్పివేశారు. అయితే అంతలోపే భారీ నష్టం సంభవించింది. కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలకు రిపేరీతో జీవనం సాగించే శ్యాంప్రసాద్, రాజుప్రసాద్, సత్య, మాబు, షాదిక్, భాష తదితరులకు చెందిన గ్యారేజీలు మొత్తం కాలిపోయాయి. కళ్ల ముందే తమకు జీవనోపాధి కల్పించే యంత్రాలు కాలిబూడిదవుతుండటంతో గ్యారేజీ యజమానులు లబోదిబో మంటున్నారు. ఆరుగురికి చెందిన గ్యారేజీల్లో దాదాపు రూ.20లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ గ్యారేజీ కాంపౌండ్‌లో దాదాపు 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ఆయా కుటుంబాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వారిని ఇళ్ల నుంచి బయటకు పంపి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం సీతారాముల కల్యాణం
=భక్తజనసంద్రమైన జీడికల్ =హాజరైన కర్ణాటక పీఠాధిపతి మహాస్వామీజీ =తలంబ్రాలు తీసుకువచ్చిన ఎమ్మెల్యే రాజయ్య జీడికల్(లింగాలఘణపురం), న్యూస్‌లైన్ : మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై కల్యాణ క్రతువును కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో పొంగిపోయారు. ఏడాదిలో శ్రీరామ నవమి రోజున దేశవ్యాప్తంగా శ్రీరాముని కల్యాణం నిర్వహించ డం ఆనవాయితీ. జీడికల్లో మాత్రం నవమితోపాటు కార్తీక మాసంలో బ్రహోత్సవాలు నిర్వహించడం విశేషం. యాదగిరి లక్ష్మీనరిసింహస్వామి ఆల యం నుంచి పంపిన పట్టువస్త్రాలు, తలంబ్రాలను మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఎమ్మెల్యే రాజయ్య, గ్రామ సర్పంచ్ అవ్వారు శ్యాంప్రసాద్, ఇన్చార్జ్ ఈఓ సదానందం తీసుకురాగా వేదపండితులు యాదగిరిస్వామి, బాలనర్సయ్య సీతారాముల కల్యాణం ప్రారంభించారు. రెండు గంటల పాటు 43 మంది కల్యాణ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. జగదబిరాముడి వివాహ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించి పులకించి పోయారు. హాజరైన ప్రముఖులు కల్యాణోత్సవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన పరమహంస మహాస్వామిజీతోపాటు ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజారపు ప్రతాప్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగేందర్, మాజీ చైర్మన్ నాగబండి సుదర్శనం, నాయకులు మనోహర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హేమలత తదితరులు హాజరయ్యారు. దేవాలయ సిబ్బంది అతిథులకు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలు జీడికల్ జాతరలో జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలకు చెందిన 30 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సేవలు అందించారు. గర్భగుడిలో భక్తులను క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎన్సీసీ ఏఎన్‌ఓ బి.రాజయ్య, ప్రిన్సిపాల్ బాలశేఖర్, ఎస్‌యూ ఓ నవీన్, క్యాడెట్లు తిరుపతి, సాయిరాం, వెంకటేశ్, రాజు, సాగర్, రాంగోపాల్, నవీన్‌తోపాటు పలువురు భక్తుల సేవలో తరించా రు. వెంకటేశ్వర ధార్మిక మండలి భజనలు, రాత్రి హరికథా కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు భజన మండలి అధ్యక్షుడు సిద్ధేశ్వర్ తెలిపారు. ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు.