లీగల్(కడప అర్బన్): కేసులకు సంబంధించి తీర్పులిచ్చేటప్పుడు అన్నికోణాల్లో పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, పోర్ట్‌ఫోలియో జడ్జి జి. శ్యాం ప్రసాద్ అన్నారు. హైకోర్టు, న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు కేసుల్లో తీర్పు ఇచ్చే విధానం, నూతనంగా ఆలోచించేవిధానం గురించి వర్క్‌షాపు నిర్వహించారు. వర్క్‌షాపును ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించేది న్యాయమూర్తులేనన్నారు.
కొత్తగా విధుల్లోకి వచ్చిన మేజిస్ట్రేట్‌లు ఆవేశపడకూడదన్నారు. కేసుల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయవాదుల వాదనలను ఓపికగా వినాలన్నారు. ప్రొసీజర్‌లాను ప్రతి న్యాయమూర్తి అనుసరించాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులవారు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తొలుత ఆయన గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కోర్టు ఆవరణలో మొక్కనాటి నీళ్లు పోశారు. అనంతరం న్యాయమూర్తులందరూ ఆయనతో కలిసి గ్రూప్‌ఫొటో దిగారు.
హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కేజి శంకర్, గుంటూరు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సుల్తానా సిరాజుద్దీన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. ప్రవీణ్‌కుమార్, శాశ్వతలోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్ రెడ్డి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సుధాకర్, నాల్గవ అదనపు న్యాయమూర్తి చక్రపాణి, ఆరో అదనపు న్యాయమూర్తి బి. మంజరి, మేజిస్ట్రేట్‌లు ప్రత్యూషకుమారి, పద్మశ్రీ, పవన్‌కుమార్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment