విశ్లేషణ
దేశంలో ప్రజా సమస్యలు వెనుకబడిన పరిస్థితులలో మహారాష్ట్రలో నవంబర్ 20న శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి కొన్ని రైతు సంఘాలు 38 డిమాండ్లతో ‘రైతు మేనిఫెస్టో’ ప్రకటించి రాజకీయ పార్టీలకు సవాలు విసిరాయి. మేనిఫెస్టోను సమర్థించే వారికే ఓటు వేస్తామని చెప్పాయి. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పీ)కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం బోనస్ అందించడం, 10 హెక్టార్ల లోపు భూమి ఉన్నవారికి రుణమాఫీ చేయడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఈ డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కావు. వ్యవసాయాన్ని, రైతును బతికించుకోవడానికి అడుగుతున్నవే. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా చైతన్యానికి మహారాష్ట్ర మేనిఫెస్టో ఒక నమూనా కావాలి!
అమెరికా, చైనా, రష్యా, బ్రెజిల్, జపాన్ వంటివి వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకు వెళుతుండగా, భారత దేశంలో రైతాంగం ఇంకా నేల చూపులు చూస్తోంది. కనీస మద్దతు ధరల కోసం, రుణమాఫీ కోసం రోడ్ల మీదకొచ్చి ఉద్యమాలు చేస్తూ రైతులు పోలీసుల లాఠీల దెబ్బలు తింటున్నారు. వ్యవసాయం గిట్టు బాటుకాక, చేసిన అప్పులు తీర్చేదారిలేక, బలవన్మరణాలకు పాల్పడు తున్నారు. నిజం చెప్పాలంటే, భారతదేశ రైతాంగం వెతలు ముగింపు లేని డైలీ టీవీ సీరియల్‌లా కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో మహారాష్ట్ర రైతు సంఘాలు ఉమ్మడిగా ‘రైతు మేనిఫెస్టో’ ప్రకటించి రాజకీయ పార్టీలకు సవాలు విసరడం విశేషం. అనేక దశాబ్దాలుగా రైతాంగం తరుఫున పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు, ప్రముఖ జర్నలిస్టులైన పాలగుమ్మి సాయినాథ్, దినేష్ అబ్రాల్ నేతృత్వంలో రూపొందిన 38 డిమాండ్లతో కూడిన ‘రైతు మేనిఫెస్టో’లో నిజానికి కొత్త అంశాలేమీలేవు. రైతులు అనాదిగా ఎదుర్కొంటున్న సమస్యలే.
అందులో ప్రధానమైనవి: కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పీ)కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం బోనస్ అందించాలి; 10 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేయాలి; ప్రధాన మంత్రి గ్యారంటీ పథకాన్ని కొన్ని రాష్ట్రాలకు బదులుగా అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలి; పర్యాటకం, మౌలిక సదుపాయాల పేరుతో సముద్రతీర ప్రాంత మత్స్యకార కుటుంబాలను బలవంతంగా వెళ్లగొట్టడం మాను కోవాలి; ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగ సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి.
ఇవిగాక, ఇంకా భూమికి సంబంధించినవి, కౌలు రైతులకు వర్తింపజేసేవి, బలవన్మ రణాలకు పాల్పడ్డ రైతాంగ కుటుంబాలకు అందించే పరిహారం మొదలైనవి ఉన్నాయి.
గొంతెమ్మ కోర్కెలు కావు!
ఈ డిమాండ్లు వ్యవసాయాన్ని, రైతును బతికించుకొని దేశానికి ఆహార భద్రత చేకూర్చడానికి అడుగుతున్నవే. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. పారిశ్రామికంగా అగ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాల సరసన ఉన్నది. అయినా, బలవన్మరణాలకు పాల్పడే రైతుల సంఖ్య దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ఇది ఒక సామాజిక, రాజకీయ వైచిత్రి. కారణం మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలు ఒకే రీతిలో ఉండవు. విదర్భలో వర్షాభావం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి.
ఇక్కడ పత్తి, సోయాబీన్, ఉల్లి, చెరకు పంటలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. వీటికి కేంద్రం ప్రకటించే మద్దతు ధరల కంటే తక్కువ ధరలు లభిస్తున్నందున కేరళ, కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 శాతం బోనస్ ప్రకటించాలని రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్‌లో హేతుబద్ధత ఉంది.
ఇక, అధికారంలోకి రావడం కోసం రైతాంగాన్ని ప్రసన్నం చేసు కోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి గ్యారంటీ పథ కాన్ని ప్రకటించిందిగానీ దానిని అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ఎన్నికల ముందు అక్కడ అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
ఆ హామీని తమ రాష్ట్రంలో కూడా అమలు చేయమని మహారాష్ట్ర రైతాంగం డిమాండ్ చేయడంలో అనౌచిత్యం కనపడదు. కేంద్ర పథకం కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేయడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా పరిణమించదా? పీఎం గ్యారంటీ ద్వారా ఎంఎస్‌పీకి 30 శాతం బోనస్ అందిస్తారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలకు అమలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వానికి రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు!
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ
దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఇన్ఫర్మేషన్, బయోటెక్నాలజీ రంగాలలో ముందంజ వేసిన మాట నిజమే. వ్యవసాయ రంగంలో అదే రకమైన ప్రగతి ఎందుకు జరగడం లేదు? నాలుగైదు దశాబ్దాల క్రితం పట్టిపీడించిన సమస్యలు నేటికీ వ్యవసాయాన్ని వీడక పోవడానికి కారణం ఏమిటి? 2004లో దేశంలో పత్తి ఉత్పాదకత హెక్టారుకు సగటున 446 కిలోలు ఉండగా, రెండు దశాబ్దాల తర్వాత 2023 నాటికి ఆ మొత్తం 470 కిలోలకు మాత్రమే చేరింది. అదే చైనాలో 2004లో 496 కిలోలు ఉండగా, 2023 నాటికి 1,990 కిలోలకు చేరింది.
పత్తి ఒక్కటే కాదు... వరి, గోధుమ, మొక్కజొన్న, సోయా తదితర పంటల ఉత్పాదకతలో మన వృద్ధిరేటు 10 శాతం ఉంటే... చైనా, అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయెల్ తదితర దేశాలు రెండు దశాబ్దాల వ్యవధిలో 400 శాతం వృద్ధిరేటు సాధించాయి. ఇందుకు కారణం వాతావరణ మార్పుల్ని, చీడ పీడల్ని సమర్థవంతంగా తట్టుకొని మొల కెత్తగల జన్యుపరమైన వంగడాలను ఆ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించగలుగుతున్నారు.
దేశీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇతర రంగాలతో పోలిస్తే తక్కువే. వ్యవ సాయ రంగంలో సైతం కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని అభివృద్ధి చెందిన దేశాలు వేగవంతం చేశాయి. భూసార పరీక్షలు చేయడం, ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయవచ్చు, ఏ పంటకు ఎంత దిగుబడి వస్తుంది, వాతావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయి మొదలైన సమాచారాన్ని ‘కృత్రిమ మేధ’ అందిస్తుంది.
పంట తెగుళ్లను చాలా ముందుగానే ప్రారంభ దశలోనే గుర్తించడం ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యపడుతుంది. ఏ పంటకు ఎంత నీరు, ఎరువు అవసరమో తెలి యజేస్తుంది. భూసారాన్ని పెంచడం కూడా ఈ విధానంలో సాధ్య మవుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. పండ్ల సాగులో కొన్ని దేశాలు రోబోటిక్స్‌ను వినియోగిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చివేయడం ఖాయ మని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ, పాడి, ఉద్యాన మొదలైన రంగాలను బలోపేతం చేయడానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ‘డిజిటల్ అగ్రికల్చర్ మిషన్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
అన్ని రాష్ట్రాల్లోనూ...
అధిక మొత్తంలో ధర చెల్లించి పప్పు ధాన్యాల్ని దిగుమతి చేసుకొనే బదులుగా, ప్రోత్సాహకాలు అందిస్తే రైతులే అధికంగా
పంటలు వేస్తారు. కానీ, కేంద్రం అందుకు చొరవ చూపడం లేదు. దాంతో, పప్పు ధాన్యాల సాగు, ఉత్పత్తిలో క్షీణత కనిపిస్తోంది. మరోపక్క, దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాలలో పర్యాటకం, మౌలిక సదుపాయాల వృద్ధిపేరుతో అక్కడి మత్య్సకారుల్ని వెళ్లగొట్టడం ఎక్కువైంది.
నిజానికి వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పరిగణిస్తున్న మత్స్యరంగంలోనే అధిక వృద్ధి నమోదవుతోంది. రొయ్యలు, చేపల ఎగుమతిలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఈ రంగంపై ఆధారపడిన కోట్లాది మంది మెరుగైన ఉపాధి పొందు తున్నారు. కానీ సముద్రానికీ, మత్స్యకారులకూ ఉండే బంధాన్ని దెబ్బతీసే యత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని మహారాష్ట్ర రైతు సంఘాలు రైతు మేనిఫెస్టో ద్వారా దేశ ప్రజల దృష్టికి తెచ్చాయి.
తమ మేనిఫెస్టోను సమర్థించే వారికే ఓటు వేస్తామని పార్టీలకతీతంగా రైతులు చెప్పడాన్ని ఆహ్వానించాలి. ఒక్క మహారాష్ట్రయే కాదు... అన్ని రాష్ట్రాలు ప్రతి అసెంబ్లీ సమావేశాలలో ఒకటి, రెండు రోజులు ప్రత్యేకంగా రైతాంగ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడానికీ, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించ డానికీ చొరవ చూపాలి. ఇందుకు మహారాష్ట్ర రైతు మేనిఫెస్టో ఓ మోడల్ కావాలి.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment