‘ఈ కర్మభూమిలో ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది’ అంటుంది ఇంజా రోజియ. అమెరికన్ టూరిస్ట్ రోజియ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి రాజస్థాన్‌లోని పుష్కర్ నగరానికి వచ్చింది.
బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని ఎర్రటి ఎండలో కూర్చున్న గుడియ అనే మెహందీ ఆర్టిస్ట్ కనిపించింది. మెహందీ వేయించుకుంటూ గుడియతో కబుర్లలో పడింది రోజియ. తెలిసీ తెలియని ఇంగ్లీష్‌లోనే తన జీవితకథను రోజియతో పంచుకుంది గుడియ. రోజియ వయసే ఉన్న గుడియకు నలుగురు పిల్లలు.
విద్యుత్ సౌకర్యం కూడా లేని చిన్న పల్లెలో ఉండేది. తల్లిదండ్రులు చనిపోయారు. భర్త తాగుబోతు. ఎప్పుడూ ఏదో రకంగా హింసించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పట్టణానికి వచ్చింది. తనకు తెలిసిన ‘మెహందీ ఆర్ట్’తో బతుకుబండి లాగిస్తోంది అంటూ గుడియ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రోజియ. ‘నా జీవితం ఇలా అయిపోయింది... అంటూ ఆమె కన్నీళ్లతో బాధ పడలేదు. ఎవరి మీదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేదు. జరిగిందేదో జరిగింది. బతుకుపోరు చేస్తాను...అనే స్ఫూర్తి ఆమెలో బలంగా కనిపించింది. గుడియ నలుగురు పిల్లలకు తల్లి. తల్లి ప్రేమకు ఉన్న శక్తి ఏమిటంటే జీవితంలో ఎన్నో యుద్ధాలను గెలిచేలా చేస్తుంది’ అంటూ రాసింది రోజియ.
Comments
Please login to add a commentAdd a comment