Mehndi designers
-
బతుకు పోరు
‘ఈ కర్మభూమిలో ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది’ అంటుంది ఇంజా రోజియ. అమెరికన్ టూరిస్ట్ రోజియ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి రాజస్థాన్‌లోని పుష్కర్ నగరానికి వచ్చింది. బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని ఎర్రటి ఎండలో కూర్చున్న గుడియ అనే మెహందీ ఆర్టిస్ట్ కనిపించింది. మెహందీ వేయించుకుంటూ గుడియతో కబుర్లలో పడింది రోజియ. తెలిసీ తెలియని ఇంగ్లీష్‌లోనే తన జీవితకథను రోజియతో పంచుకుంది గుడియ. రోజియ వయసే ఉన్న గుడియకు నలుగురు పిల్లలు. విద్యుత్ సౌకర్యం కూడా లేని చిన్న పల్లెలో ఉండేది. తల్లిదండ్రులు చనిపోయారు. భర్త తాగుబోతు. ఎప్పుడూ ఏదో రకంగా హింసించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పట్టణానికి వచ్చింది. తనకు తెలిసిన ‘మెహందీ ఆర్ట్’తో బతుకుబండి లాగిస్తోంది అంటూ గుడియ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రోజియ. ‘నా జీవితం ఇలా అయిపోయింది... అంటూ ఆమె కన్నీళ్లతో బాధ పడలేదు. ఎవరి మీదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేదు. జరిగిందేదో జరిగింది. బతుకుపోరు చేస్తాను...అనే స్ఫూర్తి ఆమెలో బలంగా కనిపించింది. గుడియ నలుగురు పిల్లలకు తల్లి. తల్లి ప్రేమకు ఉన్న శక్తి ఏమిటంటే జీవితంలో ఎన్నో యుద్ధాలను గెలిచేలా చేస్తుంది’ అంటూ రాసింది రోజియ. -
మెహందీ డిజైన్లు వేసుకుంటూ రైఫిల్ షూటర్‌గా ఎదిగిన బనారస్ అమ్మాయి
అరచేతిలో అందమైన మెహిందీ డిజైన్లను నేర్పుగా వేస్తూ అందమైన జీవితం కోసం కలలు కంటూ ఉండేది పూజావర్మ. తన కలకో లక్ష్యాన్ని ఏర్పరుచుకుని రైఫిల్ షూటర్ కావాలనుకుంది. పండగలు, పెళ్ళిళ్లకు అమ్మాయి చేతుల్లో మెహిందీ డిజైన్స్ వేస్తూ అలా వచ్చిన డబ్బుతో షూటర్‌గా నైపుణ్యం సాధించింది. రాష్ట్రస్థాయి పోటీల్లో నెంబర్‌వన్ షూటర్‌గా నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్ వాసి అయిన 26 ఏళ్ల పూజావర్మ తన కలను సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పెద్ద పెద్ద కలలు కనగానే సరిపోదు, కలల సాధనకు ఎంతటి కష్టమైనా భరించాల్సిందే అని ఇరవై ఆరేళ్ల్ల పూజా వర్మను చూస్తే అర్ధమవుతుంది. సవాళ్లతో కూడిన ఆమె జీవనశైలి నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇటీవల మీడియాకు వివరించిన ఆ స్ఫూర్తివంతమైన కథనం ఆమె మాటల్లోనే... అప్పుగా ఐదు లక్షలు ‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అక్కడ ఎన్సీసీ వల్ల క్రీడలపై ఆసక్తి ఏర్పడింది. అక్కడే షూటింగ్ రైఫిల్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో స్కూల్ నుంచే రైఫిళ్లు, బుల్లెట్లు ఉచితంగా వచ్చేవి. ఇది చాలా ఖరీదైన గేమ్ అని నాకు అప్పుడు తెలియదు. స్కూల్ అయిపోగానే ఉచితంగా వచ్చే అవకాశాలన్నీ పోయాయి. కానీ, షూటింగ్లో దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కల కనేదాన్ని. అయితే, ఇంటి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అమ్మ గృహిణి. నాన్న డ్రైవర్. అన్నయ్య బట్టల దుకాణం నడుపుతున్నాడు. అక్క పెళ్లి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సాధారణ కుటుంబంలోనైనా ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనడానికి వీలు లేదు. కానీ, నా కుటుంబం మాత్రం అడుగడుగునా నాకు అండగా నిలిచింది. 2015లో నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం కావడానికి నాకు సొంత రైఫిల్ అవసరం. ఐదు లక్షలకన్నా తక్కువ ధరకు రైఫిల్ అందుబాటులో లేదు. రోజుకు మూడు షిప్టులలో వేర్వేరు ఉద్యోగాలు చేసేదాన్ని. అయినా అంత డబ్బు సమకూరలేదు. అమ్మనాన్న, మా అన్న డబ్బు అప్పు తెచ్చి ఇచ్చారు. రైఫిల్ కొన్నాను. మొదటిసారి నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఏడు సంవత్సరాలుగా అప్పు తీరుస్తూనే ఉన్నాం. శిక్షణకు సాయం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కోచ్ బిప్లాప్ గోస్వామిని కలిశాను. నాలో ఆసక్తి, ప్రతిభ గమనించి, డబ్బులు తీసుకోకుండానే శిక్షణ ఇవ్వడానికి సాయం చేశారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి రాష్ట్ర ఛాంపియన్షిప్ వరకు ఫెడరేషన్ సహాయంతో చాలా సార్లు రైఫిల్స్‌ను అరువుగా తీసుకున్నాను. ఇలాగే జిల్లా నుండి రాష్ట్రానికి తరువాత జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగాను. షూటర్ ప్రాక్టీస్‌కు షూటింగ్ రేంజ్ అవసరం. ఇతర క్రీడల మాదిరిగా పార్కులోనో, దగ్గరలో ఉన్న మైదానంలోనో ప్రాక్టీస్ చేయలేం. అందుకే రెండేళ్ల క్రితం డిస్ట్రిక్ట్ రైఫిల్ క్లబ్ ఆఫ్ బనారస్‌కు చేరుకున్నాను. క్లబ్ ఎంట్రీ ఫీజు 12 వేల రూపాయలు. ఇది నాకు చాలా పెద్ద మొత్తం. ఒకేసారి చెల్లించలేనని సిటీ మెజిస్ట్రేట్ ఆఫీసు చుట్టూ నెల రోజులు ప్రదక్షణలు చేస్తే, చివరకు వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టడానికి అంగీకరించారు. జాతీయ స్థాయి శిబిరానికి వెళ్లడానికి రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. కానీ, కరోనాతో ఆ అవకాశమూ పోయింది. ఒక రైఫిల్ బుల్లెట్ ధర 30 నుంచి 32 రూపాయలు. ఒక గేమ్ ఆడటానికి కనీసం 70 నుంచి 80 బుల్లెట్లు ఖర్చవుతాయి. దీంతో అత్యంత ఖరీదైన క్రీడలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన బుల్లెట్లు కూడా అవసరం. దేశంలో ఎక్కడైనా ఛాంపియన్షిప్ పోటీలు జరిగితే రిజిస్ట్రేషన్ ఫీజు, బుల్లెట్ల కొనుగోలు, బస–వసతి సదుపాయలు, ప్రయాణ ఖర్చులు.. అన్నీ కలిపి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. వీలైనన్ని ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి నా వద్ద అంత డబ్బు లేదు. మెహందీ డిజైన్లు.. డ్రైవింగ్.. రాష్ట్రస్థాయి అధికారులను కలిశాను. కానీ, ఎలాంటి సాయమూ అందలేదు. చుట్టుపక్కల స్కూళ్లలో పిల్లలకు క్రీడలలో శిక్షణ ఇస్తుంటాను. పెళ్లి, వివిధ సందర్భాలలో జరిగే వేడుకలలో మెహందీ డిజైన్లు వేస్తాను. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇలా రెండేళ్లపాటు కృషి చేస్తే కొంత డబ్బు జమయ్యింది. 2021 నుండి మళ్లీ ఆడటం ప్రారంభించాను. 43వ యుపి స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించాను. స్టేట్ నెంబర్ 1 ర్యాంకులో నిలిచాను. ఇప్పుడు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించడానికి శిక్షణ తీసుకుంటున్నాను. బ్యాచులర్ ఆఫ్ ఫిజికెల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను. మాస్టర్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను’’ అని తన కల కోసం, లక్ష్య సాధనకు చేస్తున్న కృషి గురించి వివరిస్తుంది పూజావర్మ. లక్ష్య సాధనలో.. షూటింగ్ బోర్డ్‌లోని లక్ష్య కేంద్రాన్ని బుల్సీ షూటింగ్ లేదా బుల్స్ ఐ అంటారు. రైఫిల్ షూటింగ్ అంటే అంత సులువు కాదు. లక్ష్యాన్ని చాలా ఖచ్చితత్వంతో ఛేదించాలి. ‘మావలంకర్’ షూటింగ్ పోటీలో బెస్ట్ క్యాడెట్, 41వ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో త్రీ పొజిషన్ రైఫిల్‌లో బంగారు పతకం, ఆర్మీ క్యాంపు షూటింగ్లో బంగారు పతకాలు సాధించింది. -
Mehandi: హార్ట్ డిజైన్, పక్షి మూలాంశంతో డిజైన్... వీటి అర్థాలు తెలుసా?
మెహెందీతో వేసే ప్రతీ అందమైన డిజైన్ వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకునే డిజైన్ల వల్ల కలిగే సానుకూల భావనలు మనలో అంతర్గత శక్తిని పెంచుతాయంటున్నారు మెహెందీ ఆర్టిస్ట్‌లు. ఈ సందర్భంగా పండగలు, వేడుకల్లో అతివల జీవితంలో భాగమైన మెహెందీ డిజైన్స్ గురించి... మనకు తరతరాలుగా గోరింటాకు ఎర్రదనమే పరిచయం. వీటి మీద పుట్టిన పాటలు కూడా విదితమే. కానీ, మెహెందీ డిజైన్లు మాత్రం మనకు మధ్య యుగంలోనే పరిచయం అయినట్టు చరిత్ర చెబుతోంది. అయితే, ప్రతి అందమైన మెహెందీ డిజైన్ వెనుక ఓ అర్థం ఉందంటున్నారు నేటి మెహందీ డిజైనర్లు రకరకాల మెహందీ డిజైన్స్ గురించి వివరిస్తూ.. హార్ట్ డిజైన్... గుండె ఆకృతిలో వేసే మెహెందీ డిజైన్ ఆధునిక శైలికి అద్దం పడుతుంది. చిన్న మూలాంశంతో హృదయాకారంలో వేసే మెహందీ డిజైన్ స్వచ్ఛతను, నమ్మకాన్ని సూచిస్తుంది. ఇది బంధానికి బలమైన పునాది అని నమ్ముతారు. ఈ కారణంగా, పెళ్లికూతురుకు వేసే మెహెందీ డిజైన్‌లో హార్ట్ షేప్ తప్పక మెరిసిపోతుంది. వధూవరుల డిజైన్... చాలా వరకు పెళ్లిలో వధూవరులను మెహెందీ డిజైన్లలో చిత్రిస్తారు. వధూవరుల షెహనాయ్ కూడా ఉంటుంది. భార్యాభర్త ఎప్పటికీ విడిపోక అన్యోన్యంగా కలిసి ఉంటారనే సంకేతాన్ని ఇస్తుంది ఈ డిజైన్. పక్షి మూలాంశంతో డిజైన్... ప్రాచీన కాలంలో, పక్షి జీవితంలోని ఆనందాన్ని, స్వర్గానికి, భూమికి మధ్య గల సంబంధాన్ని తలపునకు తెస్తుంది. బర్డ్ మోటిఫ్ డిజైన్ ప్రజల స్వతంత్ర స్వభావాన్ని, వారి అంతర్గత ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. పువ్వుల డిజైన్... పూల డిజైన్లు ఎవ్వరినైనా ఇష్టపడేలా చేస్తాయి. చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే, డిజైన్ వేయడం కూడా సులభం. ఇది వైవాహిక జీవితంలోని సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నం. పువ్వులు స్వచ్ఛతకు చిహ్నం. బురదలో వికసించే కమలం మనసును ఆకర్షిస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ డిజైన్ బంధం లోని సామరస్యత, ప్రేమ, శ్రేయస్సులకు సంకేతం. ఇది స్త్రీ సున్నితమైన స్వభావాన్ని, అందాన్ని చూపుతుంది. సర్కిల్ డిజైన్... ఇది సులభమైన అత్యంత అందమైన డిజైన్. దీనిలో, చేతి మధ్యలో ఒక వృత్తం వేసి, దాని చుట్టూ, లోపల వివిధ రకాల డిజైన్లను సృష్టిస్తారు. హిందూ, బౌద్ధమతాలలో దీనిని మండలం అంటారు. ఇది విశ్వానికి చిహ్నం. నెమలి డిజైన్... పెళ్లికూతురు మెహెందీలో నెమలి డిజైన్ అత్యంత ఇష్టమైనది. మన దేశ జాతీయ పక్షి అందం, సృజనాత్మకతకు చిహ్నం. ఇది స్త్రీలోని దయను తెలియజేస్తుంది. కలశం డిజైన్... ఈ డిజైన్ మార్వాడీ సమాజంలో ఒక ట్రెండ్. పూర్ణ కుంభాన్ని నిండైన జీవితానికి పర్యాయపదంగా పరిగణిస్తారు పెద్దలు. ఎరుపును చిందించే కలశం శ్రేయస్సుకు, సంతోషానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. చదవండి: Priyanka Panwar Success Story: ఆమెకు వంద ముఖాలు! అతడి మరణవార్త విని.. మొదటిసారి.. -
నీతా చేతి గోరింటాకు!
కళ గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం మాత్రమే కాదు కళ కూడా. మెహెందీ పేరుచెప్పగానే ఏ మహిళైనా వెంటనే చేయి చాపుతుంది. ఆసక్తిని కాస్తా ఆర్ట్‌గా మార్చుకున్న నీతా దేశాయ్ శర్మ మనదేశంలో టాప్‌టెన్ మెహందీ డిజైనర్లలో ఒకరు. సామాజిక సేవకురాలిగా పనిచేస్తున్న నీతా దేశాయ్ పుణెలో జన్మించారు. సేవాకార్యక్రమాల్లో భాగంగా...విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో నీతా మెహెందీ కళపై దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుంచి మెహందీని ఇష్టపడే నీతాకు అప్పటికే బోలెడు డిజైన్లు వచ్చు. ఇండియన్, పాకిస్తాన్, అరబ్ మెహందీ డిజైన్లపై ప్రత్యేకంగా చేసిన సాధన నీతాలోని ఓ కళాకారిణిని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసింది. మెహందీ డిజైన్లపై నీతా చేసిన ప్రయోగాలన్నింటికీ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న నీతా విదేశీ పర్యటనలో భాగంగా ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, యూరప్‌లలో తన మెహెందీ డిజైన్లను పరిచయం చేసింది. ఆమె కనుగొన్న కొత్తడిజైన్లకు సంబంధించి రెండు పుస్తకాలు కూడా వేసింది. ఇక ఇండియన్ డిజైన్ల విషయానికొస్తే ఎడమ చేతిపై పెళ్లికూతురు ముఖాన్ని, కుడి చేతిపై పెళ్లికొడుకు ముఖాన్ని కోన్‌తో వేయడం నీతా ప్రత్యేకతన్నమాట. మెహెందీ కళలో మేమంటే మేము...అంటూ పోటీపడేవాళ్లలో నీతా ఎప్పుడూ ముందంజలో ఉంటున్నారంటూ కితాబిచ్చారు వరల్డ్ ఫ్యాషన్ మ్యాగజైన్వారు.