సినీ మువ్వల సివంగి | Special Story About Saroj Khan Life In Family | Sakshi
Sakshi News home page

సినీ మువ్వల సివంగి

Published Sat, Jul 4 2020 2:27 AM | Last Updated on Sat, Jul 4 2020 4:37 AM

Special Story About Saroj Khan Life In Family - Sakshi

‘ఏక్‌ దో తీన్‌.. చార్‌ పాంచ్‌ ఛే సాత్‌’.... ‘తేజాబ్‌’కు ఆ పాట కలెక్షన్ల వరద సృష్టించింది. ‘కాటే నహి కట్‌ తే ఏ దిన్‌ ఏ రాత్‌’... ‘మిస్టర్‌ ఇండియా’ ఈ పాటతో శ్రీదేవిని టాప్‌ చైర్‌ మీద కూచోబెట్టింది. ‘నింబొడ నింబొడ నింబొడ’... ఏంటి.. ఐశ్వర్యా రాయ్‌ ఇంత బాగా డాన్స్‌ చేస్తుందా అనిపించింది. ‘ఏ కాలే కాలే ఆంఖే’... షారూక్‌ఖాన్‌ ఆమె ఆడమన్నట్టు ఆడాడు. ‘రాధా క్యూ న జలే’ ఆమిర్‌ఖాన్‌ ఆమె చెప్పినట్టు గెంతాడు. సరోజ్‌ ఖాన్‌. బాలీవుడ్‌ను సుదీర్ఘకాలం ఏలిన ఏకైక మహిళా కొరియోగ్రాఫర్‌. ప్రభుదేవా, లారెన్స్, ఫర్హా ఖాన్‌ల జేజమ్మ. మదర్‌ ఆఫ్‌ కొరియోగ్రఫీ ఇన్‌ ఇండియా.

సరోజ్‌ ఖాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు గోడ మీద తన నీడను చూస్తూ డాన్స్‌ చేసేది. తల్లి అది చూసి భయపడింది. కూతురు పుట్టిందనుకుంటే పిచ్చి పిల్ల పుట్టిందేమిటా అని ఆఘమేఘాల మీద డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లింది. ‘ఇది పిచ్చేగాని డాన్స్‌ పిచ్చి. మీ పాపను చైల్డ్‌ ఆర్డిస్టును చేయండి. ఎలాగూ మీకు డబ్బులు అవసరం కదా’ అన్నాడు తెలిసిన డాక్టరు. అప్పటికి ముంబైలో నిరుపేద చాల్‌లో ఉంటున్న ఆ కుటుంబంలోని వారికి ఈ మాటలు నచ్చాయి. సరోజ్‌ ఖాన్‌కు ఐదారేళ్లు వచ్చేటప్పటికి చైల్డ్‌ ఆర్టిస్టును చేశారు. నాలుగైదు సినిమాలు చేసింది. ఆ తర్వాత వేషాలు రాలేదు. సరోజ్‌ ఖాన్‌కు పదేళ్లు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. తన తర్వాత ఇంకా నలుగురు తోబుట్టువులున్నారు. తల్లికి ఏమీ తెలియదు. కుటుంబాన్ని తనే నిలబెట్టాలి. సరోజ్‌ ఖాన్‌ గ్రూప్‌ డాన్సర్‌ అయ్యింది. హీరో హీరోయిన్ల వెనుక పరిగెత్తే పది మందిలో ఒకత్తి అయ్యింది. తిండికి ఎలాగో గడుస్తుంది. కాని ఇది చాలదు.
‘ఏక్‌ దో తీన్‌’ పాటలో మాధురీ దీక్షిత్‌

గురు పరిచయం
అప్పటికి డాన్స్‌ మాస్టర్‌ బి.సోహన్‌లాల్‌ (సుప్రసిద్ధ డాన్స్‌ మాస్టర్‌ హీరాలాల్‌ పెద్దన్న) మద్రాసు (చెన్నై)లో పని చేస్తూ అప్పుడప్పుడు బాంబే (ముంబై) వచ్చి పాటలు చేసేవాడు. అతను గ్రూప్‌డాన్సర్స్‌లో చురుగ్గా ఉంటున్న సరోజ్‌ ఖాన్‌ను గమనించాడు. ఒకరోజు సెట్‌లో సరోజ్‌ ఖాన్‌ హెలెన్‌ను అనుకరిస్తూ స్టెప్స్‌ వేస్తుంటే ‘ఏదీ మొత్తం పాటకు చేసి చూపించు’ అని అడిగాడు. సరోజ్‌ ఖాన్‌ తొణక్కుండా అచ్చు హెలెన్‌లాగే డాన్స్‌ చేసి చూపించింది. అప్పటి దాకా సోహన్‌లాల్‌కు అసిస్టెంట్లు లేరు. పదమూడేళ్ల వయసున్న సరోజ్‌ ఖాన్‌ను అతడు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. ఆయనే ఆమెను తీర్చిదిద్దాడు. సోహన్‌లాల్‌ యూరప్‌కు షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు ఆయన చేయాల్సిన పాటను 13 ఏళ్ల వయసులో సరోజ్‌ కొరియోగ్రాఫ్‌ చేసింది. ఆ సినిమా ‘దిల్‌ హి తో హై’ (1963). అందులో రాజ్‌ కపూర్‌ హీరో. నూతన్‌ హీరోయిన్‌. వాళ్లిద్దరి మీద పాట– ‘నిగాహే మిలానే కో జీ చాహ్‌ తాహై’. కాని సరోజ్‌ ఖాన్‌ తొట్రు పడలేదు. చేసింది. ప్రయాణం మొదలైంది.
ధక్‌ ధక్‌ కర్‌నే లగా’లో మాధురీ, అనిల్‌కపూర్‌

మగ ప్రపంచం
సినిమా ప్రపంచం అంటే మగ ప్రపంచం. మగవారు పెత్తనం చేసే ప్రపంచం. సరోజ్‌ ఖాన్‌కు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత బాగా పాటలు చేస్తున్నా గుర్తింపు ఇచ్చేవారు కాదు. అసలు టైటిల్స్‌లో పేరే ఉండేది కాదు. ఒకసారి షూటింగ్‌లో ఉంటే సీనియర్‌ నటుడు అశోక్‌ కుమార్‌ ఆమెను గమనించి పిలిచాడు. ‘నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా. నీ పేరు స్క్రీన్‌ మీద ఎందుకు వేయరు?’ అని అడిగాడు. సరోజ్‌ ఖాన్‌ మౌనంగా ఉండిపోయింది. సరే.. ఈ సినిమాలో నీ పేరు వేయిస్తాను అని చెప్పి వేయించాడు. అలా ‘ఇంక్విలాబ్‌ కీ ఆగ్‌’ అనే సినిమాలో సరోజ్‌ ఖాన్‌ పేరు మొదటిసారిగా పడింది. కాని అప్పటికీ గుర్తింపు రాలేదు. సుభాష్‌ ఘాయ్‌ ‘హీరో’ (1983) సినిమాలో సరోజ్‌ ఖాన్‌ను కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. ‘హీరో’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. సుభాష్‌ ఘాయ్‌ తీసుకున్నాడంటే ఏదో టాలెంట్‌ ఉండే ఉంటుంది అని మిగిలిన నిర్మాత, దర్శకులు అనుకుని ఆమెను పిలవడం మొదలెట్టారు. టాలెంట్‌ ఎప్పటి నుంచో ఉంది. సుభాష్‌ ఘాయ్‌ లైట్‌ వేశాడంతే.
‘డోలారే డోలారే’లో మాధురీ, ఐశ్వర్యరాయ్‌

ఏక్‌.. దో... తీన్‌...
ఎన్‌.చంద్ర ‘తేజాబ్‌’ (1988) తీశాడు. అందులో మాధురి దీక్షిత్‌ అనే కొత్త హీరోయిన్‌ని తీసుకున్నాడు. ఆమెకు ఒక మంచి పాట పెట్టాడు. ‘ఈ పాట వస్తున్నప్పుడు ప్రేక్షకులు సీట్లలో ఉండకూడదు. అంతే మీకు నేను చెప్పేది’ అన్నాడు సరోజ్‌ఖాన్‌తో. సరోజ్‌ ఖాన్‌ ఈ పాటను ఛాలెంజింగ్‌గా తీసుకుంది. మాధురి దీక్షిత్‌కు ఉన్న డాన్స్‌ టాలెంట్‌ను ఉపయోగించుకుంది. ‘ఏక్‌.. దో... తీన్‌.. చార్‌.. పాంచ్‌’... పాటను అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేసింది. జనం సినిమా కోసం ఒకసారి, ఈ పాట కోసం ఒకసారి థియేటర్లకు వచ్చారు. మాధురి దీక్షిత్‌ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్‌ అయ్యింది. ఫిల్మ్‌ఫేర్‌ వాళ్లు అప్పటివరకు కొరియోగ్రాఫర్‌కు అవార్డ్‌ పెట్టనేలేదు. ఈ సినిమా వచ్చాక ఆ అవార్డును ఇంట్రడ్యూస్‌ చేసి సగౌరవంగా సరోజ్‌ ఖాన్‌కు తొలి అవార్డు ఇప్పించారు. సరోజ్‌ ఖాన్‌ దేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నీ తలెత్తి చూసే కొరియోగ్రాఫర్‌ అయ్యిందిప్పుడు.

హిట్‌ల వరుస
సరోజ్‌ ఖాన్‌ అక్షరాభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దేహ కవళికలతో పాటు ముఖ కవళికలు కూడా ముఖ్యం. వాటికోసం నటీ నటులను సానపెడుతుంది. అందుకే ఆ పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. హిందీలో శ్రీదేవి సరైన హిట్‌ కోసం చూస్తున్నప్పుడు ‘మిస్టర్‌ ఇండియాలో’ నీలిరంగు చీర కట్టుకుని ఆమె వేసిన ‘కాటే నహి కట్‌ తే ఏ దిన్‌ ఏ రాత్‌’ పాట స్టెప్పులు ఆమెకు భారీ ఎట్రాక్షన్‌ను తీసుకొచ్చాయి. అదే సినిమాలోని ‘హవా హవాయి’ కూడా శ్రీదేవి మరణించే వరకు ప్రస్తావనకు వస్తూనే ఉండేది. వీటిని చేయించింది సరోజ్‌ ఖాన్‌. ‘చాందినీ’లో శ్రీదేవి చేసిన ‘మేరే హాతో మే నౌనౌ చూడియా’ పాట ఆ ఇద్దరికీ పేరు తెచ్చింది. ఇక మాధురి దీక్షిత్‌తో సరోజ్‌ ఖాన్‌ హిట్స్‌కు లెక్కే లేదు. ‘బేటా’లో ‘ధక్‌ ధక్‌ కర్‌ నే లగా’, ఖల్‌ నాయక్‌లో ‘చోళీ కే పీఛే క్యా హై’, యారానాలో ‘మేరా పియా ఘర్‌ ఆయా’... చాలా పెద్ద హిట్లు. ఇక సంజయ్‌ లీలా బన్సాలీ తీసిన ‘దేవదాస్‌’లో ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్‌ చేసిన ‘డోల రే డోలరే’ పాట సరోజ్‌ ఖాన్‌ ప్రతిభకు పతాక.
శ్రీదేవితో...

జాతీయ పురస్కారం
సరోజ్‌ ఖాన్‌ అంటే ఎద విరుపులు, కటి కుదుపులు అనుకునే వారు కొందరు ఉండొచ్చు. కాని ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని గౌరవించడమే తెలిసిన ప్రతిభాశాలి. దానికి నూరుశాతం న్యాయం చేయడం బాధ్యత అనుకుంటుంది. అయితే తమిళంలో వచ్చిన ‘శ్రింగారం’ (2005) అనే సినిమాకు ఆమె సమకూర్చిన భరతనాట్య నృత్యరీతులు ఆమెకు జాతీయ అవార్డును తెచ్చి పెట్టాయి. చెన్నైలోని సనాతన నృత్య సంస్థ ‘శ్రీకృష్ణ గానసభ’ ఆ సినిమాలో ఆమె చూపిన ప్రతిభను గౌరవించి మొదటిసారిగా ఒక సినిమా కొరియాగ్రాఫర్‌ని– సరోజ్‌ ఖాన్‌ని– పిలిచి సత్కరించుకుంది. అదీ సరోజ్‌ ఖాన్‌ ప్రతిభ.

ముగింపు
సరోజ్‌ఖాన్‌ స్థూలకాయురాలు. కాని ఆమె డాన్స్‌ చేయడం మొదలెడితే ఆ దేహం విల్లులా వొంగేది. ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా ఆమె నృత్యం మానలేదు. ఆపలేదు. ఎందరో శిష్యులను సినిమా రంగానికి ఇచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మూడేళ్ల  వయసు నుంచి నర్తిస్తున్న ఆమె పాదాలు 71వ ఏట శాశ్వత విశ్రాంతిని తీసుకున్నాయి. కాని భారతీయ వెండితెర మీద ఆమె వేసిన పాదముద్రలు మాత్రం బహుకాలం సజీవంగా ఉంటాయి. – సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement