నువ్వు ఒంటరివి కావు... నీ వెంటే మేముంటాం...
ఉద్విగ్న క్షణాల్లో జాన్సన్ – శ్రుతి
కన్నీటికి కూడా ఇష్టం ఉన్నట్టుంది. కన్నీటికి కూడా ఒక మనిషి కంటినే అంటి పెట్టుకొని ఉండాలన్న కోరిక ఉన్నట్టుంది. కన్నీరు ఎందుకనో ఒకే మనిషిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఆ మనిషికి మరింత ప్రేమను పంచాలని అనుకుంటున్నట్టుంది. కేరళలో ఒకమ్మాయి శ్రుతి. ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా కన్నీరు కారుస్తోంది. ఆమెను ఊరడించడానికి కేరళ ప్రభుత్వం, కేరళ ప్రజలు కదిలారు. ఈ ప్రేమ కోసమేనా కన్నీరుకు ఆమెపై ప్రేమ?
‘బాధ పడకు. నీకు నేనున్నాను. నేను చనిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీకంటూ ఒక భరోసా ఉండేలా చూస్తాను’ అన్నాడా యువకుడు ఆ అమ్మాయితో ఓదార్పుగా. ఇవాళ ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ యువకుడి మాటలను గుర్తు చేసుకుంటున్న కేరళ ప్రజలు ‘మేమున్నాం’ అంటూ ఆ అమ్మాయికి తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదు.
ఆ అమ్మాయి పేరు శ్రుతి..
అందరు అమ్మాయిల్లాంటిదే శ్రుతి. కోజికోడ్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేయడం... సెలవులలో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడపడం... తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి చిన్న షాపు నడిపేది... చెల్లెలు కాలేజీ చదువుతోంది. వాళ్ల కుటుంబం వాయనాడ్‌లోని చూరలమలలో కొత్త ఇల్లు కట్టుకుని వరదలకు నెల ముందే షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రుతి నిశ్చితార్థం జరిపించారు. ఈ డిసెంబర్‌లో పెళ్లి చేయాలని 4 లక్షల డబ్బు. 15 సవర్ల బంగారం ఇంట్లో దాచారు. అంతా సంతోషమే. కాని...
జూలై 30 రాత్రి..
ఆ రాత్రి ఉద్యోగరీత్యా శ్రుతి చూరలమలకు రెండు గంటల దూరంలో ఉన్న కోజికోడ్‌లో ఉంది. వరద విజృంభించింది. శ్రుతి వాళ్ల కొత్త ఇల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు... పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు. ఏమీ మిగల్లేదు. శ్రుతి కన్నీరు కట్టలు తెంచుకుంది. అది ఆగలేదు. ఆపేందుకు ఒక్కడు పూర్తిగా ప్రయత్నించాడు. అతని పేరు జాన్సన్. శ్రుతికి కాబోయే భర్త.
నేనే తోడుంటా..
‘శ్రుతికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు. అంతమాత్రం చేత నేను వదిలేస్తానా? పదేళ్లుగా మేము స్నేహితులం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయినా నేను వదలను. తోడుంటా. నేను చనిపోయినా ఆమె ఒంటరిదై పోకుండా మంచి ఉద్యోగం, ఇల్లు ఏర్పాటు చేస్తా’ అన్నాడు. ఆ మాటలు ఎందుకన్నాడో. అవి వాయనాడ్ విషాదాన్ని ప్రసారం చేసేటప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి.
ఆ తోడు కూడా పోయింది...
శ్రుతికి ఇక ఏడవడానికీ కన్నీరు మిగల్లేదు. జాన్సన్ చనిపోయాడు. మొన్నటి మంగళవారం వాయనాడ్‌లో అతను, శ్రుతి, శ్రుతి బంధువులు కొంతమంది ప్రయాణిస్తున్న వ్యాను బస్సుతో ఢీకొంది. శ్రుతి, ఆమె బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. కాని జాన్సన్ మృత్యువుతో పోరాడి బుధవారం మరణించాడు. అన్నీ కోల్పోయిన శ్రుతికి ఆఖరి ఆసరా కూడా పోయింది. ఆమె ఏం కావాలి?
మేమున్నాం..
ఇక కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నాం అంటూ శ్రుతి, జాన్సన్ జంట ఫొటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్‌బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శ్రుతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది... కేరళ ప్రజలది అన్నారు. శ్రుతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శ్రుతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయినవారిని లాక్కుని పరాయివారినెందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం. కన్నీరా కనికరించు... చల్లగా చూడు అనడం తప్ప.
ఇవి చదవండి: బెయిలా? జైలా?.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు
Comments
Please login to add a commentAdd a comment