కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మారణహోమానికి దారి తీసింది. వరుసగా ఏడో రోజుకూడా ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన అనేక హృదయ విదారక దృశ్యాలు, కథనాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో తొలి విపత్తు కాల్ చేసిన మహిళ కాల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే మహిళ ఫోన్ కాల్, ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పడ్డ తపన పలువురి గుండెల్ని పిండేస్తోంది.
వివరాలను పరిశీలిస్తే..జూలై 30న జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నీతూ జోజో అనే మహిళ తొలుత స్పందించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రాణాలకే ప్రమాదం.. రక్షించండి! అంటూ కాల్ చేశారు. డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ సిబ్బందికి కాల్ రికార్డింగ్‌లో నీతూ, "చూరల్‌మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మేం పాఠశాల వెనుక ఉంటున్నాం, దయచేసి మాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా పంపగలరా?" అని చాలా ఆందోళనతో వేడుకున్నారు. ఇంటిచుట్టూ నీరే ఉందని తెలిపారు. అంతేకాదు తమతోపాటు ఏడు కుటుంబాలవారు తన ఇంట్లో ఆశ్రయం పొందారని తెలిపింది. అయితే తాము దారిలో ఉన్నామని, కంగారు పడొద్దని రెస్క్యూ టీమ్‌లు తమ ఆమెకు ధైర్యం చెప్పాయి. కానీ వారు వెళ్లేసరికే ఆలస్యం జరిగిపోయింది.
మంగళవారం తెల్లవారుజామున 1 గంట. రాత్రికి రాత్రే దూసుకొచ్చిన నదీ ప్రళయఘోష బెడ్‌రూంకి చేరడంతో ఆమెకు మెలకువ వచ్చింది. చూరల్‌మలలోని హైస్కూల్ రోడ్డులోని ఆమె ఇంట్లోకి నీళ్లొచ్చాయి. ఎటు చూసిన కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి,బురద భయంకరంగా కనిపించాయి. మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేసే నీతులో ఆందోళన మొదలైంది. వెంటనే తన భర్త జోజో జోసెఫ్‌ను నిద్ర లేపారు. ఇంతలోనే సమీపంలోని ఏడు కుటుంబాల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. వారికి కొండపైకి ఎత్తైన ఆమె ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. దీంతో 1.30 గంటలకు ఆసుపత్రికి ఫోన్ చేసింది. మళ్లీ 2.18 గంటలకు ఆమె మళ్లీ తన ఆసుపత్రికి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాలకే ఆమె ఇంట్లోని వంటగది కొట్టుకుపోయింది. నీతూ మాత్రం సాయం కోసం ఎదురుచూస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు, మిగిలిన రెండు గదుల్లో ఉన్న జోజో తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు.
అంబులెన్స్ డ్రైవర్, మరొక సిబ్బంది ఆమెతో నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు కానీ, చెట్లు నేలకొరగడంతో రోడ్డు మార్గం స్థంభించిపోయింది. దీంతో రక్షణ బృందాలు చేరుకోలేకపోయాయి. వీళ్లు వెళుతున్న క్రమంలోనే రెండో కొండచరియలు విరిగిపడటంతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. చూరల్‌మల వంతెన కొట్టుకు పోయింది. అంబులెన్స్‌లు, ఇతర రెస్క్యూ సిబ్బంది నీతు వద్దకు చేరుకోలేకపోయింది. ఐదు రోజుల తర్వాత నీతు మృతదేహం చలియార్‌లో లభ్యమైంది. నీతు ధరించిన ఆభరణాలను బట్టి బంధువులు ఆమెను గుర్తించారు.
కాగా జూలై 30న వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో 360 మందికి పైగా మరణించారు ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్లు, డ్రోన్‌లు, భారీ యంత్రాలను ద్వారా రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను వేగవంతం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment