Call Records
-
కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్ 18.1ని విడుదల చేసింది. వినియోగదారులకు మరింత సేవలందిచేలా, యూజర్లను ఆకట్టుకునే కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా గతంలో ఐఓఎస్ వర్షన్లో లేని కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కొత్త ఓఎస్‌లో ప్రవేశపెట్టింది. దాంతోపాటు యాపిల్ ఇంటెలిజెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఐఫోన్ వినియోగదారులు గతంలో తమ కాల్స్‌ను రికార్ట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఓఎస్ 18.1లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ రికార్డ్ చేసిన కాల్ డేటాను రియల్‌టైమ్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా టెక్స్ట్ ఫార్మాట్లో అందించేందుకు వీలుగా యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంటే మీరు ఫోన్లో మాట్లాడే మాటలు రికార్డ్ అవ్వడంతోపాటు మీ కన్వర్జేషన్ మొత్తం టెక్స్ట్ ఫార్మాట్లోకి మారుతుంది. అయితే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జాపనీస్, కొరియన్, ఫోర్చుగీస్, స్పానిష్..వంటి భాషల్లో అందుబాటులో ఉందని తెలిపింది.మీ ఐఫోన్ల్లో కాల్స్ రికార్డ్ చేయడానికి ముందుగా డివైజ్ సెట్టింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఐఓఎస్ 18.1 వర్షన్‌ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లుయాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ పవర్డ్ టూల్స్ సూట్‌గా పని చేస్తోంది.మెయిల్, మెసేజ్‌లు, నోట్స్ వంటి యాప్‌లలో సమగ్ర సమాచారాన్ని క్లుప్తంగా అందిస్తుంది.మెయిళ్లు, మెసేజ్‌లకు సంక్షిప్తంగా యూజర్ అనుమతితో రిప్లై ఇస్తుంది.ఏదైనా టెక్ట్స్, ఆర్టికల్ రాసేప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది. రైటింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.గ్యాలరీ స్టోరేజీలో ప్రత్యేకమైన రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలు కలెక్ట్ చేసి మెమోరీస్‌ను క్రియేట్ చేస్తుంది.యాప్స్ వాడుతున్నప్పుడు ఇంటర్నల్‌గా ఎదురయ్యే ల్యాగ్‌ను తగ్గించేందుకు టూల్‌ను క్లిన్ చేస్తూంటుంది.చాట్‌జీపీటీను ఇంటిగ్రేట్ చేస్తూ కావాల్సిన సమాచారం అందిస్తుంది.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!ఐఓఎస్ 18.1 అన్ని ఐఫోన్ మోడళ్లలో సపోర్ట్ చేయదు. ఐఫోన్ 11, 12, 13, 14, 15, 16, ఎక్స్ఎస్, ఎక్స్ఆర్, ఎస్ఈ(2వ ఎడిషన్) డివైజ్‌ల్లో మాత్రమే వినియోగించవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను మాత్రం ఐఫోన్ 16 సిరీస్, 15 ప్రో సిరీస్, 14 ప్రో సిరీస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మారణహోమానికి దారి తీసింది. వరుసగా ఏడో రోజుకూడా ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన అనేక హృదయ విదారక దృశ్యాలు, కథనాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో తొలి విపత్తు కాల్ చేసిన మహిళ కాల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే మహిళ ఫోన్ కాల్, ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పడ్డ తపన పలువురి గుండెల్ని పిండేస్తోంది.వివరాలను పరిశీలిస్తే..జూలై 30న జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నీతూ జోజో అనే మహిళ తొలుత స్పందించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రాణాలకే ప్రమాదం.. రక్షించండి! అంటూ కాల్ చేశారు. డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ సిబ్బందికి కాల్ రికార్డింగ్‌లో నీతూ, "చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మేం పాఠశాల వెనుక ఉంటున్నాం, దయచేసి మాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా పంపగలరా?" అని చాలా ఆందోళనతో వేడుకున్నారు. ఇంటిచుట్టూ నీరే ఉందని తెలిపారు. అంతేకాదు తమతోపాటు ఏడు కుటుంబాలవారు తన ఇంట్లో ఆశ్రయం పొందారని తెలిపింది. అయితే తాము దారిలో ఉన్నామని, కంగారు పడొద్దని రెస్క్యూ టీమ్‌లు తమ ఆమెకు ధైర్యం చెప్పాయి. కానీ వారు వెళ్లేసరికే ఆలస్యం జరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట. రాత్రికి రాత్రే దూసుకొచ్చిన నదీ ప్రళయఘోష బెడ్రూంకి చేరడంతో ఆమెకు మెలకువ వచ్చింది. చూరల్‌మలలోని హైస్కూల్ రోడ్డులోని ఆమె ఇంట్లోకి నీళ్లొచ్చాయి. ఎటు చూసిన కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి,బురద భయంకరంగా కనిపించాయి. మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేసే నీతులో ఆందోళన మొదలైంది. వెంటనే తన భర్త జోజో జోసెఫ్‌ను నిద్ర లేపారు. ఇంతలోనే సమీపంలోని ఏడు కుటుంబాల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. వారికి కొండపైకి ఎత్తైన ఆమె ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. దీంతో 1.30 గంటలకు ఆసుపత్రికి ఫోన్ చేసింది. మళ్లీ 2.18 గంటలకు ఆమె మళ్లీ తన ఆసుపత్రికి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాలకే ఆమె ఇంట్లోని వంటగది కొట్టుకుపోయింది. నీతూ మాత్రం సాయం కోసం ఎదురుచూస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు, మిగిలిన రెండు గదుల్లో ఉన్న జోజో తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్, మరొక సిబ్బంది ఆమెతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉన్నారు కానీ, చెట్లు నేలకొరగడంతో రోడ్డు మార్గం స్థంభించిపోయింది. దీంతో రక్షణ బృందాలు చేరుకోలేకపోయాయి. వీళ్లు వెళుతున్న క్రమంలోనే రెండో కొండచరియలు విరిగిపడటంతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. చూరల్మల వంతెన కొట్టుకు పోయింది. అంబులెన్స్‌లు, ఇతర రెస్క్యూ సిబ్బంది నీతు వద్దకు చేరుకోలేకపోయింది. ఐదు రోజుల తర్వాత నీతు మృతదేహం చలియార్లో లభ్యమైంది. నీతు ధరించిన ఆభరణాలను బట్టి బంధువులు ఆమెను గుర్తించారు.కాగా జూలై 30న వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో 360 మందికి పైగా మరణించారు ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్లు, డ్రోన్లు, భారీ యంత్రాలను ద్వారా రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను వేగవంతం చేశాయి. -
మూడు నెలల క్రితం తండ్రి మృతి.. తల్లి కాల్ రికార్డు విని కూతురు షాక్
ముంబై: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో విస్తుపోయే ఘటన జరిగింది. తండ్రి చనిపోయిన మూడు నెలల తర్వాత కూతురు షాకింగ్ విషయం కనిపెట్టింది. తన తల్లే తండ్రిని చంపిందని తెలిసి నమ్మలేక పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వాళ్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ నేరం అంగీకరించింది. తానే భర్తను చంపినట్లు ఒప్పుకుంది. ఏం జరిగిందంటే..? రంజన రామ్తెకే భర్త విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఆగస్టు 6న ఆయన గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి రంజన అతడి మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసింది. దీంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్తను చంపేశానని, తెల్లవారాక బంధువులకు ఫోన్ చేసి గుండెపోటుతో చనిపోయాడని చెబుతానని అతనికి చెప్పింది. చెప్పినట్లుగానే మరునాడు అలానే చేసింది. అయితే బంధువులెవరికీ రంజనపై అనుమానం రాలేదు. నిజంగానే ఆమె భర్త గుండెపోటుతో చనిపోయాడు అనుకున్నారు. అంతిమసంస్కారాలు కూడా పూర్తయ్యాయి. అంతా ప్లాన్ ప్రకారమే జరగడంతో రంజన ఇక ప్రియుడితో హ్యాపీగా రిలేషన్ కొనసాగించవచ్చని సంబురపడింది. మూడు నెలల తర్వాత రంజనను చూసేందుకు కూతురు శ్వేత వచ్చింది. ఓ కాల్ చేసుకునేందుకు తల్లి ఫోన్ తీసుకుంది. ఈ క్రమంలోనే కాల్ రికార్డులను పరిశీలించగా ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. రంజన తన భర్తను చంపాక ప్రియుడితో మాట్లాడిన కాల్ రికార్డు అందులో ఉంది. వెంటనే శ్వేత పోలీసులకు సమాచారం అందించింది. వారు రంగంలోకి దిగి రంజన, ఆమె ప్రియుడు ముకేశ్ త్రివేదిని విచారించగా.. నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు -
వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ ఎలా చేయాలంటే!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. కానీ వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ వంటి ముఖ్యమైన ఫీచర్ల విషయంలో వాట్సాప్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ వాట్సాప్ వాయిస్ రికార్డ్ ఫీచర్ అవసరమైన యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వాట్సాప్ సంస్థ.. కమ్యూనిటీస్, వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్య పెంచడం, ఎమోజీ రియాక్షన్స్, ఎక్కువ మందికి వాయిస్ కాల్స్ చేసుకోవడం, చాట్ ఫిల్టర్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఏడాదిలో మరో 15 కొత్త ఫీచర్లను విడుదల చేయాల్సి ఉండగా .. ఇప్పుడు మనం అదే థర్డ్ పార్టీ యాప్స్‌ను వినియోగించి వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం. వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ ఎలా చేయాలంటే వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేయాలంటే ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న క్యూబ్ కాల్ అనే వాట్సాప్ రికార్డ్ వాయిస్ కాల్స్ థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఆ యాప్స్‌కు మనం మాట్లాడుతున్న వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేసేందుకు సెట్టింగ్‌లో అనుమతి ఇవ్వాలి. సెట్టింగ్‌లో యాక్సెప్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే కాల్స్ రికార్డ్ చేయలేం. ఒకవేళ ఉచితంగా కాల్ రికార్డ్ ఆప్షన్ లేకపోతే వారానికి లేదంటే నెలకి కొంతమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించినప్పుడు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. -
Google Play Store: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. యాప్స్ విషయంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మీ ఫోన్లో వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారనే అలర్ట్ వస్తుంది. ఇదిలా ఉండగా.. కాల్ రికార్డింగ్‌కు గగుల్ ఎప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. -
దమ్కీ కహానీ.. రూ.కోటి ఇవ్వకుంటే నీకు, నీ భార్యకు మరణమే!
సాక్షి, సిటీబ్యూరో: బోయిన్‌పల్లికి చెందిన బల్క్ డ్రగ్ వ్యాపారి మనోజ్ సలేచా జైన్‌ను టార్గెట్ చేసి, అతడి కుమార్తె కిడ్నాప్ కుదరక వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్‌తో బెదిరింపులకు దిగిన జవారీలాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్‌ను బోయిన్పల్లి పోలీసులు సేకరించారు. ఇతడిని పట్టుకోవడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. కొన్నాళ్ల క్రితం మానుకోటలో జరిగిన బాలుడి కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తును తలదన్నే చర్యలు తీసుకున్నారు. ♦ ఈ నెల 10న జవారీ ఇద్దరు అనుచరులతో కలిసి మనోజ్ కుమార్తెను ఈ నెల 10న కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అది విఫలం కావడంతో బెదిరింపులకు దిగి డబ్బు గుంజాలని పథకం వేశాడు. దీనికోసం తన స్పాట్ ఫోన్లో ఓ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ♦ ఆ యాప్ వినియోగిస్తూ మనోజ్‌కు వీఓఐపీ కాల్స్ చేశాడు. 10, 11 తేదీల్లో 12 కాల్స్ చేసిన ఇతగాడు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. తన అనుచరుల ద్వారా మనోజ్ ఇంటిపై నిఘా వేసి ఉంచడంతో పోలీసుల కదలికల్నీ గుర్తించాడు. ♦ దీంతో ‘ఓ కాల్లో పోలీసులకు చెప్పొద్దంటే చెప్పావు కదా... ఇక నాకు డబ్బు వద్దు నీ ప్రాణమే కావాలి’ అంటూ హెచ్చరించాడు. ఆపై మళ్లీ రూ.కోటి (ఏక్ కోకా) ఇవ్వకపోతే మనోజ్‌తో పాటు అతడి భార్యనూ అంతం చేస్తానన్నాడు. ♦ ఇంటి చుట్టూ పోలీసులకు ఉంచుకున్నా దేవుడి దయ ఉన్న తాను చిక్కననీ, డబ్బు ఇవ్వకుంటే మూడునాలుగు నెలలకైనా కాల్చి చంపేస్తానన్నాడు. తన వద్ద రూ.కోటి లేదని, అంత ఇచ్చుకోలేనని మనోజ్ అతగాడిని బతిమలాడాడు. ♦ తొలుత తగ్గింపు కుదరదని చెప్పిన జవారీలాల్ చివరకు రూ.5 లక్షలు తగ్గించి రూ.95 లక్షలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా నిందితులను పట్టుకోవడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ♦ యాప్ ద్వారా వీఓఐపీ కాల్స్ చేస్తే వాటిని అందుకునే వారికి రకరకాల నంబర్లు కనిపిస్తుంటాయి. సాధారణ కాల్స్ మాదిరిగా వీటితో దాన్ని వినియోగిస్తున్న వారిని పట్టుకోవడం సాధ్యం కాదు. దీంతో టాస్క్‌ఫోర్స్ సాంకేతికంగా ముందుకు వెళ్లింది. ♦ ఎదుటి వ్యక్తి ఏ యాప్ ద్వారా ఈ కాల్స్ చేస్తున్నా డో కూడా తెలియదు. దీంతో పోలీసులు వీఓఐపీ సేవలు అందిస్తున్న 20 టాప్ యాప్స్‌ను ఎంచుకున్నారు. వాటి నిర్వాహకులకు ఈ–మెయిల్ పంపిస్తూ అందులో మనోజ్ నెంబర్ పొందుపరిచారు. ♦ ఈ నెంబర్‌కు ఫలానా తేదీ, సమయంలో మీ యాప్ నుంచి వచ్చిన కాల్ ఎవరు చేశారో చెప్పగలరా? అంటూ కోరారు. దీనిపై స్పందించిన ఓ యాప్ నిర్వాహకుడు చేసిన వ్యక్తి నెంబర్ చెప్పలేమంటూ అయితే అతడు రిజిస్టర్ చేసుకోవడానికి వాడిని ఈ–మెయిల్ ఐడీ అందించారు. ♦ దీంతో పాటు సదరు కాల్స్ చేయడానికి ఆ వ్యక్తి యాప్‌లోకి లాగిన్ అయిన ఐపీ అడ్రస్‌లు అందించారు. ఈ అడ్రస్‌లను సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన పోలీసులు ఏ సెల్‌ఫోన్ నెంబర్‌తో ఈ ఐపీ అడ్రస్‌లు యాక్టివ్ అయ్యాయో చెప్పమని కోరారు. ♦ ఈ నేపథ్యంలో ఓ సర్వీస్ ప్రొవైడర్ 300 ఫోన్ నంబర్లను పోలీసులకు అందించారు. వీటిని విశ్లేషిస్తూనే అధికారులు మరికొన్ని వివరాలు ఇవ్వాలంటూ యాప్‌ను సంప్రదించారు. ♦ ఈసారి స్పందించిన యాప్ నిర్వాహకుడు తమ యాప్ వినియోగానికి నిర్ణీత మొత్తం చెల్లించాలని, సదరు వ్యక్తి రాజస్తాన్ ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఆ 300 నంబర్లలో రాజస్తాన్‌తో సంబంధం ఉన్న వాటిని గుర్తించడానికి ప్రయత్నించారు. ♦ ఫలితంగా జవారీలాల్ నంబర్ తెలియడంతో పాటు అతడు జీడిమెట్లలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరినీ గుర్తించి పట్టుకున్నారు. ♦ గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బోయిన్పల్లి పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ♦ వీరిని లోతుగా విచారించి తుపాకీ, తూటాలు విక్రయించిన మధ్యప్రదేశ్ వ్యక్తిని గుర్తించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అతడూ కీలకం కావడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
నీ పని కావాలంటే.. ఫ్లోర్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలి !
సాక్షి,ముషీరాబాద్( హైదరాబాద్): ఓ ఇంటిని నిర్మిస్తున్న యజమాని నుంచి అంతస్తుకు రెండు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని అడిక్‌మెట్ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్, ఆమె కుమారుడు తరుణ్ మాట్లాడిన ఆడియో, వీడియోలు వైరల్‌గా మారాయి. శుక్రవారం ఈ ఆడియో, వీడియోలు నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశం అయ్యాయి. ► నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో నైషదం సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి నూతన భవనం నిర్మిస్తున్నారు. కొందరు స్థానికులు అక్రమ నిర్మాణం అని జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి భవనాన్ని సీజ్ చేశారు. అయితే తన భవనాన్ని సీజ్ చేసిన విషయాన్ని స్థానిక అడిక్‌మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్‌కు సత్యనారాయణ మూర్తి ఫోన్ చేసి పనులు ఆపించారని మీ కుమారుడు తరుణ్ ఫ్లోర్‌కు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడని నేను కూడా బీజేపీలో ఉన్నానని అన్నాడు. దీనికి సమాధానంగా ఏమైనా ఉంటే బాబుతో మాట్లాడుకోండి అంటూ ఫోన్‌ను కుమారుడికి ఇవ్వడంతో.. ఈ విషయాలు మమ్మీ మాట్లాడదు నేనే మాట్లాడుతాను అని తరుణ్ చెప్పడం ఆడియో విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ► దీంతో పాటు రాంనగర్ చౌరస్తాలోని కార్యాలయానికి రమ్మని పిలిపించి ఫ్లోర్‌కు ఎంతిస్తారని తరుణ్ అడగడం.. దానికి ఇంటి యజమాని మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పగా అందుకు తరుణ్ నాలుగున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, అదే వీడియోలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి రాజయ్య కూడా ఈ చర్చల్లో పాల్గొనడం స్పష్టంగా కనిపించింది. ఈ విషయం రెండు ఆడియోలు, ఒక వీడియో రూపంలో బయటకు రావడం కళకళం రేపింది. ► జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అడిక్‌మెట్ కార్పొరేటర్ బి.హేమలత భర్త జయరాంరెడ్డి ఓ బిల్డింగ్‌కు సంబంధించి డబ్బుల విషయంపై మాట్లాడుతున్న ఆడియో బయటకు రావడం దానిని ప్రతిపక్షంలో ఉన్న అడిక్‌మెట్ డివిజన్ బీజేపీ నాయకుడు ప్రకాష్‌గౌడ్ వైరల్ చేశారు. ఇప్పుడు పాత్రలు మారాయి. ఇటీవల కరోనాతో ప్రకాష్‌గౌడ్ మరణించగా.. కార్పొరేటర్ అయిన ఆయన భార్య సునీత, కుమారుడు తరుణ్‌లు ఇదే ఆడియో, వీడియోలో అడ్డంగా దొరకడం గమనార్హం. అలాగే ఇటీవల రాంనగర్ కార్పొరేటర్ కె. రవిచారి కూడా అదే డివిజన్‌కు చెందిన ఓ బీజేపీ నాయకుడిని దూషించిన ఆడియో వైరల్ కావడంతో ముషీరాబాద్ నియోజకవర్గంలో కార్పొరేటర్ల ఆడియో, వీడియోలు బయటకు రావడం పరిపాటిగా మారిపోయింది. దురుద్దేశంతోనే ఆరోపణలు నైషధం సత్యనారాయణ మూర్తి నల్లకుంట కూరగాయల మార్కెట్లో నిర్మిస్తున్న భవనం అక్రమమని స్వయానా ఆయన సోదరుడు, వదిన నాకు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేయమని వారికి సూచించాను. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ మూర్తి మాపై కక్ష పెంచుకున్నారు. కావాలనే ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి దురుద్దేశంతో వైరల్ చేశారు. డబ్బులు అడిగిన మాట అవాస్తవం. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. – సునిత ప్రకాష్‌గౌడ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ -
నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ అని కాల్ రికార్డు చేసి..
సాక్షి, మెదక్: ‘నాకు పక్షవాతం.. నా భార్యకు కడుపునొప్పి మమ్ములను సరిగ్గా చూస్తే బతికేవాళ్లమేమో.. నా అనారోగ్యమే నాకు బతకాలనే ఆశ లేకుండా చేసింది.. మేము ఎవరికీ భారం కావొద్దని చనిపోతున్నాం.. నాకు ఇద్దరు బిడ్డలు నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ మల్లేశా’ అంటూ ఫోన్లో రికార్డు చేసి దంపతులిద్దరూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని గాంధీ నగర్లో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడమంచి రాములు (54), కడమంచి లక్ష్మి (48) దంపతులు చాలా ఏళ్ల క్రితం మెదక్ నుంచి బతుకు దెరువు కోసం కామారెడ్డికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కామారెడ్డిలో పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు గతంలోనే పెళ్లిళ్లు చేసి పంపారు. రాములుకు ఏడాది క్రితం పక్షవాతం వచ్చి కాలు చేతి పని చేయలేని పరిస్థితి. భార్య లక్ష్మికి కిడ్నీలో రాళ్లు ఉండి తరచూ కడుపు నొప్పితో బాధపడేది. ఉన్నదంతా వైద్యానికి ఆస్పత్రులకు ఖర్చు పెట్టారు. అసలే రెక్కల కష్టం ఆధారంగా బతుకు బండిలాగే వారికి కరోనా మరో ఇబ్బందిగా మారింది. కనీసం అప్పు ఇచ్చేవారు కూడా లేకపోవడంతో ఆరు నెలల క్రితం మెదక్‌లోని గాంధీ నగర్లో ఉండే తన తమ్ముడి వద్దకు వచ్చారు. చిన్నపాటి అద్దె ఇంట్లో ఉండి ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. అయినా బాగు కాకపోవటంతో శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఎందుకు చనిపోతున్నామో ఫోన్లో రికార్డు చేసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవటంతో మృతుడి తమ్ముడు మల్లేశం పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా ఫ్యానుకు ఉరివేసుకొని విగత జీవులుగా కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించి కేసు దర్యాపు చేన్నట్లు తెలిపారు. చదవండి: Banjara Hills: సహజీవనం.. విషాదం -
బాలీవుడ్ ప్రముఖుల కాల్ రికార్డులు దోచేసి..
పేరున్న వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ కాల్ రికార్డులను సేకరిస్తూ పోలీస్ ఐటీ సెల్ విభాగం కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని గుడ్ గావ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. సెలబ్రిటీల కాల్ డేటాలను అందిస్తే ఉద్యోగం చూపుతానన్న వ్యక్తికి ప్రదీప్ కుమార్(30) సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆ వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ పేరును దీప్ బురాగా ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇరువురి మధ్య దాదాపు 15 మంది సెలబ్రిటీల కాల్ డేటాలు చేతులు మారినట్లు వివరించారు. ఫోన్ నంబర్లు ఏ సెలబ్రిటీకి చెందినవో కూడా కుమార్ కు తెలియదని, కేవలం ముంబైకు చెందిన వ్యక్తి డేటాను అందించి అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటుంటాడని ఎస్సై సజ్జన్ కుమార్ చెప్పారు. కుమార్ నుంచి ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్, ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిలాస్ పూర్ లోని క్రైమ్ యూనిట్ 6 నుంచి అధికారిక ఈ మెయిల్ ఐడీ ద్వారా కాల్ రికార్డులు కావాలంటూ పంపడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. -
చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతం
-
అన్నను చంపిన తమ్ముడు
* చెడు అలవాట్లను అడ్డుకున్నందుకు.. * కాల్ రికార్డ్స్ ఆధారంగా హత్య కేసు ఛేదింపు బాన్సువాడ : తనకు ఉన్న చెడు అలవాట్లను అడ్డుకుంటున్న అన్ననే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. అన్నపై గడ్డపారతో దారుణంగా దాడి చేసి హతమార్చిన తమ్ముడు, శవాన్ని తన స్నేహితుని సహాయంతో స్కూటర్‌పై తీసుకెళ్ళి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా, పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చలో నివసించే ఉల్లెపు సాయిలుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉల్లెపు సాయిలు (24) దినసరి కూలీగా పని చేయగా, చిన్న కుమారుడు ఉల్లెపు పాపయ్య (22) జులాయిగా తిరిగేవాడు. తనకు ఆటో కొనివ్వాలని తండ్రిని పలుమార్లు కోరాడు. అయితే అతని అన్న సాయిలు అడ్డుకొని, ఆటో కొని ఇచ్చినా సంపాదించడని, జులాయిగానే తిరుగుతాడని తండ్రికి చెప్పాడు. ప్రతి పనిలో తనను తన అన్న అడ్డుకొంటున్నాడని కోపోద్రిక్తుడైన పాపయ్య, అన్నను హతమార్చడానికి పథకం పన్నాడు. గత నెల 30న తండ్రి సాయిలు, వ్యక్తిగత పని నిమిత్తం భార్యతో కలిసి ఆర్మూర్‌కు వెళ్ళగా, ఇంట్లో కేవలం అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు. దీంతో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పాపయ్య గడ్డపారతో అన్న వీపుపై, వృషణాలపై తీవ్రంగా చితకబాదాడు. అనంతరం ఉరి వేసి హతమార్చాడు. శవాన్ని బీడీవర్కర్స్ కాల నీలో ఉన్న పాడుబడ్డ బావిలో తన స్నేహితుడైన నాగరాజు సహాయంతో పడేసి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు మరుసటి రోజు ఇంటికి రాగా, సాయిలు లేకపోవడంతో ఆందోళన చెందారు. నాలుగురోజుల తరువాత తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొడుకు కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో, నిందితుడైన చిన్న కొడుకు , అన్నయ్య శవం బీడీవర్కర్స్ కాలనీలోని బావిలో ఉందని చెప్పాడు. దీంతో లబోదిబోమంటూ తల్లిదండ్రులు ఈనెల 9న శవాన్ని కనుగొని, పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చా కచక్యంగా కేసు ను విచారించారు. తమ్ముడైన పాపయ్యపైనే అనుమానాలు రావడంతో అతని కాల్రికార్డ్స్ను పరిశీలించారు. అలాగే మృతుడి సెల్‌ఫోన్‌ను చంపిన మరుసటిరోజే రియాజ్ అనే వ్యక్తికి పాపయ్య విక్రయించినట్లు తేలింది. దీంతో హత్య ఇతనే చేశాడనే కోణంలో విచారణ జరుపగా, వాస్తవాలు బయటపడ్డా యి. నిందితుడైన పాపయ్యను, అతని మిత్రుడైన నాగరాజును అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా, తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ప్రతీ పనిలోనూ తనను అడ్డుకొంటున్నందుకే హత్య చేశానంటూ పాపయ్య పేర్కొన్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.