నీ పని కావాలంటే.. ఫ్లోర్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలి ! | Hyderabad: Adikmet Corporator Ask Money Audio Leaked Goes Viral | Sakshi
Sakshi News home page

నీ పని కావాలంటే.. ఫ్లోర్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలి !

Published Sat, Aug 28 2021 8:24 AM | Last Updated on Sat, Aug 28 2021 10:48 AM

Hyderabad: Adikmet Corporator Ask Money Audio Leaked Goes Viral - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,ముషీరాబాద్‌( హైదరాబాద్‌): ఓ ఇంటిని నిర్మిస్తున్న యజమాని నుంచి అంతస్తుకు రెండు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని అడిక్‌మెట్‌ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్‌ సి.సునిత ప్రకాష్‌గౌడ్, ఆమె కుమారుడు తరుణ్‌ మాట్లాడిన ఆడియో, వీడియోలు వైరల్‌గా మారాయి. శుక్రవారం ఈ ఆడియో, వీడియోలు నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశం అయ్యాయి.  

►  నల్లకుంట కూరగాయల మార్కెట్‌ రోడ్డులో నైషదం సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి నూతన భవనం నిర్మిస్తున్నారు. కొందరు స్థానికులు  అక్రమ నిర్మాణం అని జీహెచ్‌ఎంసీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేసి భవనాన్ని సీజ్‌ చేశారు. అయితే తన భవనాన్ని సీజ్‌ చేసిన విషయాన్ని స్థానిక అడిక్‌మెట్‌  కార్పొరేటర్‌ సునిత ప్రకాష్‌ గౌడ్‌కు సత్యనారాయణ మూర్తి ఫోన్‌ చేసి పనులు ఆపించారని మీ కుమారుడు తరుణ్‌ ఫ్లోర్‌కు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాడని నేను కూడా బీజేపీలో ఉన్నానని అన్నాడు.

దీనికి సమాధానంగా ఏమైనా ఉంటే బాబుతో మాట్లాడుకోండి అంటూ ఫోన్‌ను కుమారుడికి ఇవ్వడంతో.. ఈ విషయాలు మమ్మీ మాట్లాడదు నేనే మాట్లాడుతాను అని తరుణ్‌ చెప్పడం ఆడియో విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  

►  దీంతో పాటు రాంనగర్‌ చౌరస్తాలోని కార్యాలయానికి రమ్మని పిలిపించి ఫ్లోర్‌కు ఎంతిస్తారని తరుణ్‌ అడగడం.. దానికి ఇంటి యజమాని మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పగా అందుకు తరుణ్‌ నాలుగున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, అదే వీడియోలో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగి రాజయ్య కూడా ఈ చర్చల్లో పాల్గొనడం స్పష్టంగా కనిపించింది. ఈ విషయం రెండు ఆడియోలు,  ఒక వీడియో రూపంలో బయటకు రావడం కళకళం రేపింది.  

► జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్‌ఎస్‌ అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ బి.హేమలత భర్త జయరాంరెడ్డి ఓ బిల్డింగ్‌కు సంబంధించి డబ్బుల విషయంపై మాట్లాడుతున్న ఆడియో బయటకు రావడం దానిని ప్రతిపక్షంలో ఉన్న అడిక్‌మెట్‌ డివిజన్‌ బీజేపీ నాయకుడు ప్రకాష్‌గౌడ్‌ వైరల్‌ చేశారు. ఇప్పుడు పాత్రలు మారాయి. ఇటీవల కరోనాతో ప్రకాష్‌గౌడ్‌ మరణించగా.. కార్పొరేటర్‌ అయిన ఆయన భార్య సునీత, కుమారుడు తరుణ్‌లు ఇదే ఆడియో, వీడియోలో అడ్డంగా దొరకడం గమనార్హం. అలాగే ఇటీవల రాంనగర్‌ కార్పొరేటర్‌ కె. రవిచారి కూడా అదే డివిజన్‌కు చెందిన ఓ బీజేపీ నాయకుడిని దూషించిన ఆడియో వైరల్‌ కావడంతో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కార్పొరేటర్ల ఆడియో, వీడియోలు బయటకు రావడం పరిపాటిగా మారిపోయింది.  

దురుద్దేశంతోనే ఆరోపణలు 
నైషధం సత్యనారాయణ మూర్తి నల్లకుంట కూరగాయల మార్కెట్‌లో నిర్మిస్తున్న భవనం అక్రమమని స్వయానా ఆయన సోదరుడు, వదిన నాకు ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీలో ఫిర్యాదు చేయమని వారికి సూచించాను. ఈ విషయం టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ మూర్తి మాపై కక్ష పెంచుకున్నారు. కావాలనే ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి దురుద్దేశంతో వైరల్‌ చేశారు. డబ్బులు అడిగిన మాట అవాస్తవం. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.  
– సునిత ప్రకాష్‌గౌడ్, అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement