* చెడు అలవాట్లను అడ్డుకున్నందుకు..
* కాల్ రికార్డ్స్ ఆధారంగా హత్య కేసు ఛేదింపు
బాన్సువాడ : తనకు ఉన్న చెడు అలవాట్లను అడ్డుకుంటున్న అన్ననే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. అన్నపై గడ్డపారతో దారుణంగా దాడి చేసి హతమార్చిన తమ్ముడు, శవాన్ని తన స్నేహితుని సహాయంతో స్కూటర్‌పై తీసుకెళ్ళి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా, పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు.
పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చలో నివసించే ఉల్లెపు సాయిలుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉల్లెపు సాయిలు (24) దినసరి కూలీగా పని చేయగా, చిన్న కుమారుడు ఉల్లెపు పాపయ్య (22) జులాయిగా తిరిగేవాడు. తనకు ఆటో కొనివ్వాలని తండ్రిని పలుమార్లు కోరాడు. అయితే అతని అన్న సాయిలు అడ్డుకొని, ఆటో కొని ఇచ్చినా సంపాదించడని, జులాయిగానే తిరుగుతాడని తండ్రికి చెప్పాడు. ప్రతి పనిలో తనను తన అన్న అడ్డుకొంటున్నాడని కోపోద్రిక్తుడైన పాపయ్య, అన్నను హతమార్చడానికి పథకం పన్నాడు.
గత నెల 30న తండ్రి సాయిలు, వ్యక్తిగత పని నిమిత్తం భార్యతో కలిసి ఆర్మూర్‌కు వెళ్ళగా, ఇంట్లో కేవలం అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు. దీంతో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పాపయ్య గడ్డపారతో అన్న వీపుపై, వృషణాలపై తీవ్రంగా చితకబాదాడు. అనంతరం ఉరి వేసి హతమార్చాడు. శవాన్ని బీడీవర్కర్స్ కాల నీలో ఉన్న పాడుబడ్డ బావిలో తన స్నేహితుడైన నాగరాజు సహాయంతో పడేసి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు మరుసటి రోజు ఇంటికి రాగా, సాయిలు లేకపోవడంతో ఆందోళన చెందారు.
నాలుగురోజుల తరువాత తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కొడుకు కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో, నిందితుడైన చిన్న కొడుకు , అన్నయ్య శవం బీడీవర్కర్స్ కాలనీలోని బావిలో ఉందని చెప్పాడు. దీంతో లబోదిబోమంటూ తల్లిదండ్రులు ఈనెల 9న శవాన్ని కనుగొని, పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చా కచక్యంగా కేసు ను విచారించారు. తమ్ముడైన పాపయ్యపైనే అనుమానాలు రావడంతో అతని కాల్‌రికార్డ్స్‌ను పరిశీలించారు.
అలాగే మృతుడి సెల్‌ఫోన్‌ను చంపిన మరుసటిరోజే రియాజ్ అనే వ్యక్తికి పాపయ్య విక్రయించినట్లు తేలింది. దీంతో హత్య ఇతనే చేశాడనే కోణంలో విచారణ జరుపగా, వాస్తవాలు బయటపడ్డా యి. నిందితుడైన పాపయ్యను, అతని మిత్రుడైన నాగరాజును అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా, తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ప్రతీ పనిలోనూ తనను అడ్డుకొంటున్నందుకే హత్య చేశానంటూ పాపయ్య పేర్కొన్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
అన్నను చంపిన తమ్ముడు
Published Thu, Dec 25 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement
Advertisement