మహబూబ్‌నగర్: దామరగిద్ద పోలీస్‌స్టేషన్ పరిధిలో అన్నను చంపిన తమ్ముడిపై యావజ్జీవ కారాగార జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే.. 2021 ఏప్రిల్ 7న గుండు స్వామి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ గోవర్ధన్ నిందితుడు బ్యాగరి బుగ్గప్పపై కేసు నమోదు చేశారు.
దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన బ్యాగరి బుగ్గప్పకు తన అన్న హన్మంతుకు భూతగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో గ్రామ పెద్దలు, కులస్తుల సమక్షంలో మాట్లాడిన బ్యాగరి బుగ్గప్ప రాజీకి వచ్చారు. అదే ఏడాది ఏప్రిల్ 6 బొంబాయి హన్మంతు అలియాస్ బ్యాగరి హన్మంతు (55) రాత్రి పొలం వద్ద వరి చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు.
గమనించిన బుగ్గప్ప వరి పొలం వద్ద వెళ్లి తన అన్నతో గొడవపడుతుండగా పక్క పొలంలో ఉన్న బ్యాగరి బాలప్ప గమనించి విడిపించేందుకు ప్రయత్నించాడు. అతనిని పక్కకు నెట్టి తన చేతిలో ఉన్న పదునైన ఆయుధంతో హన్మంతును పొడవగా స్పృహతప్పి పడిపోయినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై అప్పటి సీఐ శ్రీకాంత్‌రెడ్డి నేర పరిశోధన చేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ వేశారు. నేరము రుజువు కావడంతో జిల్లా జడ్జి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment