వివరాలు వెల్లడిస్తున్న సీపీ సీవీ ఆనంద్ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: బోయిన్‌పల్లికి చెందిన బల్క్ డ్రగ్ వ్యాపారి మనోజ్ సలేచా జైన్‌ను టార్గెట్ చేసి, అతడి కుమార్తె కిడ్నాప్ కుదరక వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్‌తో బెదిరింపులకు దిగిన జవారీలాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్‌ను బోయిన్‌పల్లి పోలీసులు సేకరించారు. ఇతడిని పట్టుకోవడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. కొన్నాళ్ల క్రితం మానుకోటలో జరిగిన బాలుడి కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తును తలదన్నే చర్యలు తీసుకున్నారు.
♦ ఈ నెల 10న జవారీ ఇద్దరు అనుచరులతో కలిసి మనోజ్ కుమార్తెను ఈ నెల 10న కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అది విఫలం కావడంతో బెదిరింపులకు దిగి డబ్బు గుంజాలని పథకం వేశాడు. దీనికోసం తన స్పాట్ ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
♦ ఆ యాప్ వినియోగిస్తూ మనోజ్‌కు వీఓఐపీ కాల్స్ చేశాడు. 10, 11 తేదీల్లో 12 కాల్స్ చేసిన ఇతగాడు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. తన అనుచరుల ద్వారా మనోజ్ ఇంటిపై నిఘా వేసి ఉంచడంతో పోలీసుల కదలికల్నీ గుర్తించాడు.
♦ దీంతో ‘ఓ కాల్‌లో పోలీసులకు చెప్పొద్దంటే చెప్పావు కదా... ఇక నాకు డబ్బు వద్దు నీ ప్రాణమే కావాలి’ అంటూ హెచ్చరించాడు. ఆపై మళ్లీ రూ.కోటి (ఏక్ కోకా) ఇవ్వకపోతే మనోజ్‌తో పాటు అతడి భార్యనూ అంతం చేస్తానన్నాడు.
♦ ఇంటి చుట్టూ పోలీసులకు ఉంచుకున్నా దేవుడి దయ ఉన్న తాను చిక్కననీ, డబ్బు ఇవ్వకుంటే మూడునాలుగు నెలలకైనా కాల్చి చంపేస్తానన్నాడు. తన వద్ద రూ.కోటి లేదని, అంత ఇచ్చుకోలేనని మనోజ్ అతగాడిని బతిమలాడాడు.
♦ తొలుత తగ్గింపు కుదరదని చెప్పిన జవారీలాల్ చివరకు రూ.5 లక్షలు తగ్గించి రూ.95 లక్షలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా నిందితులను పట్టుకోవడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది.
♦ యాప్ ద్వారా వీఓఐపీ కాల్స్ చేస్తే వాటిని అందుకునే వారికి రకరకాల నంబర్లు కనిపిస్తుంటాయి. సాధారణ కాల్స్ మాదిరిగా వీటితో దాన్ని వినియోగిస్తున్న వారిని పట్టుకోవడం సాధ్యం కాదు. దీంతో టాస్క్‌ఫోర్స్ సాంకేతికంగా ముందుకు వెళ్లింది.
♦ ఎదుటి వ్యక్తి ఏ యాప్ ద్వారా ఈ కాల్స్ చేస్తున్నా డో కూడా తెలియదు. దీంతో పోలీసులు వీఓఐపీ సేవలు అందిస్తున్న 20 టాప్ యాప్స్‌ను ఎంచుకున్నారు. వాటి నిర్వాహకులకు ఈ–మెయిల్ పంపిస్తూ అందులో మనోజ్ నెంబర్ పొందుపరిచారు.
♦ ఈ నెంబర్‌కు ఫలానా తేదీ, సమయంలో మీ యాప్ నుంచి వచ్చిన కాల్ ఎవరు చేశారో చెప్పగలరా? అంటూ కోరారు. దీనిపై స్పందించిన ఓ యాప్ నిర్వాహకుడు చేసిన వ్యక్తి నెంబర్ చెప్పలేమంటూ అయితే అతడు రిజిస్టర్ చేసుకోవడానికి వాడిని ఈ–మెయిల్ ఐడీ అందించారు.
♦ దీంతో పాటు సదరు కాల్స్ చేయడానికి ఆ వ్యక్తి యాప్‌లోకి లాగిన్ అయిన ఐపీ అడ్రస్‌లు అందించారు. ఈ అడ్రస్‌లను సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన పోలీసులు ఏ సెల్‌ఫోన్ నెంబర్‌తో ఈ ఐపీ అడ్రస్‌లు యాక్టివ్ అయ్యాయో చెప్పమని కోరారు.
♦ ఈ నేపథ్యంలో ఓ సర్వీస్ ప్రొవైడర్ 300 ఫోన్ నంబర్లను పోలీసులకు అందించారు. వీటిని విశ్లేషిస్తూనే అధికారులు మరికొన్ని వివరాలు ఇవ్వాలంటూ యాప్‌ను సంప్రదించారు.
♦ ఈసారి స్పందించిన యాప్ నిర్వాహకుడు తమ యాప్ వినియోగానికి నిర్ణీత మొత్తం చెల్లించాలని, సదరు వ్యక్తి రాజస్తాన్ ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఆ 300 నంబర్లలో రాజస్తాన్‌తో సంబంధం ఉన్న వాటిని గుర్తించడానికి ప్రయత్నించారు.
♦ ఫలితంగా జవారీలాల్ నంబర్ తెలియడంతో పాటు అతడు జీడిమెట్లలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరినీ గుర్తించి పట్టుకున్నారు.
♦ గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బోయిన్‌పల్లి పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
♦ వీరిని లోతుగా విచారించి తుపాకీ, తూటాలు విక్రయించిన మధ్యప్రదేశ్ వ్యక్తిని గుర్తించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అతడూ కీలకం కావడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment