కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తూంటారు.
అంటే దేవుడి సొంత దేశం అని! మరి...
దేవుడు తన సొంత దేశాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు?
వయనాడ్‌లో అంత విలయం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దేవుడు కాదు.. మనిషే!
ఎందుకంటే జూలై 30న కురిసిన కుంభవృష్టి... పల్లెలకు పల్లెలు కొట్టుకుపోవడం...
మానవ చర్యల ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావమే మరి!!
దేవుడి ప్రస్తావన ఎలాగూ తీసుకొచ్చాం కాబట్టి.. కాసేపు రామరాజ్యంలోకి వెళదాం. అప్పట్లో నెలకు రెండు వానలు ఎంచక్కా కురిసేవని, ఏటా బంగారు పంటలు పండేవని.. ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లే వారని పురాణ గాధలు చెబుతాయి. అయితే ఇప్పుడు రాముడు లేడు కానీ.. ప్రకృతిని చెరబడుతున్న రావణాసులు మాత్రం ఎందరో. అభివృద్ది పేరుతో ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీయడం, విద్యుత్తు, తదితరాల కోసం పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వినయోగం పుణ్యమా అని ఇప్పుడు వాతావరణ మార్పులు మనల్ని కబళించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్‌లో కురిసిన కుంభవృష్టి... ఢిల్లీ, ముబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాలను ముంచెత్తిన వరదలు అన్నీ ప్రకృతి ప్రకోపానికి మచ్చుతునకలే. మరో తాజా ఉదాహరణ వయనాడ్ విలయం!.
ఇంతకీ జూలై 30 తేదీన వయనాడ్ ప్రాంతంలో ఏం జరిగింది? అప్పటివరకూ వర్షాభావాన్ని అనుభవిస్తున్న ఆ ప్రాంతం కేవలం ఒకే ఒక్క రోజులో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకు ఎక్కింది. మంచిదే కదా? అనుకునేరు. అతితక్కువ సమయంలో ఎక్కువ వానలు కురవడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మేఘాల నుంచి జారిపడే చినుకులను ఒడిసిపట్టేందుకు.. సురక్షితంగా సముద్రం వరకూ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు అంటే... నదులు, చెరువులు భూమ్మీద లేవు మరి! ఫలితంగానే ఆ విపరీతమైన కుంభవృష్టికి కొండ సైతం కుదేలైంది. మట్టి, బురద, రాళ్లు వేగంగా లోయ ప్రాంతంలోకి వచ్చేసి పల్లెలను మింగేశాయి.
ఏటా నైరుతి రుతుపవనాల రాక కేరళతోనే మొదలవుతుంది మనకు తెలుసు. జూన్‌తో మొదలై సెప్టెంబరు వరకూ ఉండే నైరుతి రుతుపవన కాలంలో వయనాడ్ ప్రాంతంలో సగటు వర్షపాతం 2,464.7 మిల్లీమీటర్లు (మి.మి). అయితే గత ఏడాది రుతు పవనాల వైఫల్యం కారణంగా ఇక్కడ 55 శాతం తక్కువ వర్షం నమోదైంది. అంతేకాదు... 128 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాభావ పరిస్థితులను కేరళ రాష్ట్రం మొత్తం ఎదుర్కొంది. ఈ రాష్ట్రంలోనే ఉన్న వయనాడ్‌లో ఈ ఏడాది జూన్ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో సుమారు సాధారణ వర్షపాతం (574.8 మి.మి) కంటే 42 శాతం తక్కువగా 244.4 మి.మి వర్షం మాత్రమే కురిసింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసినా అది సాధారణం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
జూలై 29న నమోదైన తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సగటు వర్షపాతమైన 32.9 మిల్లీమీటర్లలో నాలుగో వంతు కంటే కొంచెం ఎక్కువ. కానీ జూలై 30న పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. సాధారణ 23.9 మిల్లీమీటర్ల స్థానంలో ఏకంగా 141.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. వయనాడ్ ప్రాంతంలోని వియత్రిలోనైతే ఇది పది రెట్లు ఎక్కువ. అలాగే మనటోడిలో 200 మి.మిలు, అంబాలవయ్యల్‌లో 140 మి.మి. కుపాడిలో 122 మి.మి.ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. అంటే.. నాలుగు నెలల్లో కురవాల్సిన వానలో ఒకే రోజు దాదాపుగా ఆరు నుంచి పది శాతం కురిసేసిందన్నమాట!. జూలై 10 నుంచి జూలై 30 వరకూ కురిసిన వాన కూడా సగటు వర్షపాతంలో 28 శాతం వరకూ ఉండటం గమనార్హం.
కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం వేడెక్కుతోందని.. పరిస్థితిని అదుపు చేయకుంటే.. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయని శాస్త్రవేత్తలు ఏళ్లుగా చేస్తున్న హెచ్చరికలు నిజమేనని మరోసారి రుజువైనట్లు వయనాడ్ ఉదంతం స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment