దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపై డేటా నిర్వహణపై సమాధానం దాటవేస్తున్న కేంద్రం
ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ‘నో డేటా’అంటూ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై సమగ్ర డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతోంది. ప్రకృతి వైపరిత్యాలు సహా దేశంలో పేపర్ లీకేజీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో కులాల ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష వంటి కీలక అంశాలపై ఎలాంటి డేటాను నిర్వహించట్లేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంటోంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రుల నుంచి ‘నో డేటా’అన్న సమాధానమే తరుచుగా వస్తోంది.
డేటా నిర్వహించట్లే..
రెండ్రోజుల కిందటే ఈ నెల 4న రాజ్యసభలో వయనాడ్ వరద బీభత్సం, ఈ విపత్తులో మరణించిన, గాయపడిన వివరాలపై రాజ్యసభ ఎంపీ రణదీప్‌సింగ్ సూర్జేవాలా ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల డేటాను ఈ మంత్రిత్వ శాఖ కేంద్రీకృతంగా నిర్వహించడం లేదు’అని సమాధానమిచ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వయనాడ్ ప్రమాదంలో 359 మంది మరణించడం లేక తప్పిపోయారని, మరో 378 మంది గాయాల పాలయ్యారని కేరళ ప్రభుత్వం తమకు మెమొరాండం సమరి్పంచిందని వెల్లడించారు.
నిజానికి వయనాడ్ దుర్ఘటన సమయంలో కేంద్రం ఓ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపడంతో నష్టం అంచనాలు వేసినప్పటికీ అందుకు సంబంధించిన డేటా మాత్రం తాము నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక సెంట్రల్ యూనివర్శిటీలు, ఐఐటిలు, ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన కేసులపై డేటాను సైతం నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
లోక్‌సభలో జేడీయూ ఎంపీ అలోక్ కుమార్ సుమన్ అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానమిస్తూ ‘విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలలో ఎస్సీ,ఎస్టీల పట్ల వివక్షకు సంబంధించిన డేటాను కేంద్రం నిర్వహించదు’అని బదులిచ్చారు. ఇక కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో పేపర్ లీక్‌లపై డేటాను సైతం నిర్వహించడం లేదని ఈ నెల డిసెంబర్ 2న విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభకు తెలిపారు.
‘రిక్రూట్‌మెంట్‌తో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వివిధ సంస్థలు పోటీ పరీక్షలను నిర్వహిస్తాయి. పరీక్షల నిర్దిష్ట సంఘటనలకు సంబంధించిన డేటాను మంత్రిత్వ శాఖ నిర్వహించదు‘అని తెలిపారు. ఇక దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలు చేసుకున్న మెడికల్ ఇంటర్న్‌ల డేటాను సైతం కేంద్రం నిర్వహించడం లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ రాజ్యసభకు తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన మెడికల్ ఇంటర్న్‌ల సంఖ్య గురించి సుఖేందు శేఖర్ రే అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment