డిసెంబర్ 20వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు
మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం
పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు
జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగనున్న శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి.
ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్లమెంట్‌లో సమావేశాల్లో ముందుగా ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలియజేశారు. తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై జగదాంబికా పాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను ఈవారం సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంది. దానిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుని ఆమోదించే అవకాశాలున్నాయి.
26న పాత పార్లమెంట్ భవనంలోప్రత్యేక కార్యక్రమం
భారతæ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగవు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల ఎంపీలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ «ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తోపాటు సంస్కృతం, మైథిలీ బాషలతో కూడిన భారత రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు.
‘అదానీ, మణిపూర్’పై చర్చించాలి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డాతోపాటు 30 పారీ్టల నేతలు పాల్గొన్నారు. అదానీపై గ్రూప్‌పై ఆరోపణలు, మణిపూర్ సంక్షోభం, వాయుకాలుష్యం, రైలు ప్రమాదాలపై విస్తృతంగా చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీ అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలన్నీ సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment