Failure of government
-
‘సారీ.. నో డేటా’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై సమగ్ర డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతోంది. ప్రకృతి వైపరిత్యాలు సహా దేశంలో పేపర్ లీకేజీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో కులాల ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష వంటి కీలక అంశాలపై ఎలాంటి డేటాను నిర్వహించట్లేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంటోంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రుల నుంచి ‘నో డేటా’అన్న సమాధానమే తరుచుగా వస్తోంది. డేటా నిర్వహించట్లే.. రెండ్రోజుల కిందటే ఈ నెల 4న రాజ్యసభలో వయనాడ్ వరద బీభత్సం, ఈ విపత్తులో మరణించిన, గాయపడిన వివరాలపై రాజ్యసభ ఎంపీ రణదీప్‌సింగ్ సూర్జేవాలా ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల డేటాను ఈ మంత్రిత్వ శాఖ కేంద్రీకృతంగా నిర్వహించడం లేదు’అని సమాధానమిచ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వయనాడ్ ప్రమాదంలో 359 మంది మరణించడం లేక తప్పిపోయారని, మరో 378 మంది గాయాల పాలయ్యారని కేరళ ప్రభుత్వం తమకు మెమొరాండం సమరి్పంచిందని వెల్లడించారు. నిజానికి వయనాడ్ దుర్ఘటన సమయంలో కేంద్రం ఓ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపడంతో నష్టం అంచనాలు వేసినప్పటికీ అందుకు సంబంధించిన డేటా మాత్రం తాము నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక సెంట్రల్ యూనివర్శిటీలు, ఐఐటిలు, ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన కేసులపై డేటాను సైతం నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ అలోక్ కుమార్ సుమన్ అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానమిస్తూ ‘విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలలో ఎస్సీ,ఎస్టీల పట్ల వివక్షకు సంబంధించిన డేటాను కేంద్రం నిర్వహించదు’అని బదులిచ్చారు. ఇక కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో పేపర్ లీక్‌లపై డేటాను సైతం నిర్వహించడం లేదని ఈ నెల డిసెంబర్ 2న విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభకు తెలిపారు. ‘రిక్రూట్మెంట్తో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వివిధ సంస్థలు పోటీ పరీక్షలను నిర్వహిస్తాయి. పరీక్షల నిర్దిష్ట సంఘటనలకు సంబంధించిన డేటాను మంత్రిత్వ శాఖ నిర్వహించదు‘అని తెలిపారు. ఇక దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలు చేసుకున్న మెడికల్ ఇంటర్న్‌ల డేటాను సైతం కేంద్రం నిర్వహించడం లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ రాజ్యసభకు తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన మెడికల్ ఇంటర్న్‌ల సంఖ్య గురించి సుఖేందు శేఖర్ రే అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. -
Sonia Gandhi: వ్యవస్థలు కాదు.. కేంద్రం విఫలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. ఈ విషయంలో విఫలమైంది ప్రభుత్వమే తప్ప, వ్యవస్థ కాదన్నారు. శుక్రవారం సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం వర్చువల్ వేదికగా జరిగింది. ‘కరోనాపై జరుగుతున్న పోరు రాజకీయ విభేదాలకు అతీతమైంది. జాతి యావత్తూ కలిసికట్టుగా ఈ పోరాటం సాగించాలి. ఇందులో భాగంగా, మొట్టమొదటగా మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలి’అని పేర్కొన్నారు. ‘మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యవస్థలు విఫలం కాలేదు. విఫలమైంది మోదీ ప్రభుత్వమే అన్నది సుస్పష్టం. దేశానికి ఉన్న బలాలు, వనరులను ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వినియోగించుకోలేకపోయింది. ప్రజల పట్ల ఏమాత్రం సానుభూతి లేని దేశ రాజకీయ నాయకత్వంతో దేశం యావత్తూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను గాలికొదిలేసింది’అని మండిపడ్డారు. ‘సమయం ఇంకా మించిపోలేదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సామర్థ్యం, దృఢచిత్తం, దూరదృష్టిగల నాయకత్వం అవసరం’అని సోనియా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత కారణంగా దేశం కష్టాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. ఈ సమయంలో ఎంపీలంతా ప్రజలకు సేవ చేసేందుకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో మహమ్మారిని కలిసికట్టుగా, జవాబుదారీతనంతో ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు స్టాండింగ్ కమిటీలు సమావేశం కావాలన్నారు. ఇటీవల ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో పార్టీ పనితీరు తీవ్ర నిరుత్సాహం కలిగించిందనీ, ఇందుకు కారణమైన పరిస్థితులపై ఆత్మావలోకనం చేసుకుని, పాఠాలు నేర్చుకోవాలని ఎంపీలకు ఆమె సూచించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, తరుణ్ గొగోయ్ సహా మాజీ పార్లమెంటు సభ్యులకు నివాళి అర్పించిన అనంతరం ఈ సమావేశం ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ప్రధాని రాజీనామా చేయాలి
బారక్‌పోర్/ కృష్ణానగర్: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం డిమాండ్ చేశారు. ఆరోగ్య అత్యయిక స్థితిని ఎదుర్కొనడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటి వేవ్ సద్దుమణిగాక... ఎంతో సమయం లభించినా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి కేంద్రం ఏమాత్రం సంసిద్ధం కాలేదన్నారు. అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్, టీకాల సరఫరా లేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయని... ఈ సమస్యను అధిగమించడానికి మోదీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. బారక్‌పోర్‌లో ఆమె శనివారం మాట్లాడుతూ... దేశంలో ఒకవైపు వ్యాక్సిన్లకు కొరత ఉంటే మరోవైపు మోదీ అంతర్జాతీయంగా తన ఇమేజ్ను పెంచుకోవడానికి విదేశాలకు టీకాలను ఎగుమతి చేశారన్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభానికి ఆయనే కారణమని, అందుకే ప్రధాని రాజీనామా చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు, కార్యాకర్తలు వచ్చి బెంగాల్లో కోవిడ్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. -
కరోనా పోరులో ట్రంప్ విఫలం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు. వైట్‌హౌస్‌లో తనతో కలిసి పనిచేసిన సిబ్బందితో శుక్రవారం రాత్రి ఒబామా మాట్లాడారు. దీనిని అమెరికా మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. సమర్థవంతమైన పాలకులు అధికారంలో ఉన్నప్పటికీ కరోనా వంటి ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడం కత్తి మీద సామేనని, అలాంటిది నాకేంటి అన్న ధోరణిలో అధ్యక్షుడు ఉండడంతో అగ్రరాజ్యం కొంప మునిగిందని ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాతో వచ్చే ముప్పేమీ లేదని ఫిబ్రవరిలో వాదించిన ట్రంప్, మార్చికల్లా అది ఎంతో ప్రమాదకరమైందని అన్నారని ఇలా ఊగిసలాట ధోరణిలోనే ఆయన కాలం గడిపేశారని విమర్శించారు. కరోనాని ట్రంప్ ఎదుర్కొన్న తీరు ఈ విపత్తుని మరింత గందరగోళానికి గురి చేసి అందరిలోనూ తీవ్రమైన నిరాశ నిస్పృహలను నింపిందని ఒబామా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నవంబర్‌లో జరగనుండగా ట్రంప్‌పై డెమొక్రాట్ అయిన ఒబామా తీవ్రంగా విమర్శలు చేయడం చర్చకు దారితీసింది. వైట్‌హౌస్ సభ్యులతో మాట్లాడుతూ ఒబామా పదే పదే డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతునివ్వాలని కోరారు. క్వారంటైన్లో వైట్‌హౌస్ సిబ్బంది వైట్‌హౌస్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిలో ముగ్గురు క్వారంటైన్లోకి వెళ్లారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోని ఫాసీతో పాటు మరో ఇద్దరు ముందు జాగ్రత్తగా క్వారంటైన్లోకి వెళ్లారు. ► కరోనాతో అమెరికాలో 24 గంటల్లో 1,568 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80 వేలకి చేరువలో ఉంది. ళీ దక్షిణ కొరియా ఆంక్షలు సడలించడంతో నైట్ క్లబ్స్‌కి వెళ్లిన 50 మందికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం క్లబ్బులను మూసివేయాలని వెంటనే ఆదేశాలిచ్చింది. ► చైనాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. వూహాన్లో కూడా ఒక కేసు నమోదు అయింది. చైనాలో ఏప్రిల్ 28 తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ► రష్యాలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. గత 24 గంటల్లోనే 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. -
కాంగ్రెస్ నాశనం చేసింది
రెవారీ/ఎలెనాబాద్: శనివారం ప్రధాని హరియాణాలోని రెవారీ, ఎలెనాబాద్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే తాత్కాలిక ఆర్టికల్ 370ని రద్దు చేయకుండా కాంగ్రెస్ 70 ఏళ్లు కాలయాపన చేసింది. 370 రద్దు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించింది. ఆ రాష్ట్రంలో పరిస్థితులు విషమిస్తున్నా పట్టించుకోకుండా నిద్ర పోయింది. ఇదే అదనుగా పాకిస్తాన్ కశ్మీర్లో ఒక భాగాన్ని ఆక్రమించుకుంది. సోదర భావాన్ని బోధించే సూఫీ సంస్కృతి నశించింది. ఇలా కాంగ్రెస్ విధానాలతో దేశం, కశ్మీర్ నాశనమయ్యాయి. ఢిల్లీలోని అప్పటి పాలకులు ప్రధాని పదవిని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నించారు’ అని విమర్శించారు. -
రాహుల్ సినిమాలో ‘కథ’ లేదా..!
న్యూఢిల్లీ: ఓ సినిమా బాగా ఆడాలంటే పేరు మోసిన హీరో హీరోయిన్లు, కళ్లు చెదిరే గ్రాఫిక్కులు ఉంటేనే సరిపోదు.. ఆ సినిమాకు సంబంధించిన కథనం బాగుండాలి. కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పగలగాలి. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాన పోటీదారు కాంగ్రెస్ పరిస్థితి కథనం లోపించిన సినిమాలాగానే ఉందని హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ రీసెర్చి ఫౌండేషన్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. కాంగ్రెస్‌ను అతిపెద్ద పార్టీగా అవతరింపజేయడంలో రాహుల్ విఫలమయ్యారని, ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయారని తేలింది. కాంగ్రెస్ ‘సినిమా’లో ‘కథనం’ లోపించింది. ప్రచారంలో మోదీ గురించి తప్ప ఇతరత్రా దేని గురించీ ఆ పార్టీ మాట్లాడలేదు. కానీ నిజం ఏమిటంటే మోదీ ఒక్కరే కీలక విషయం కాలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి లక్ష్యంగా చేసే వ్యతిరేక ప్రచారం వల్ల పొందగలిగేదేమీ ఉండదు. అలాగని రాహుల్ మౌనంగా ఏమీ లేరు. నిన్నమొన్నటి బాలాకోట్ వైమానిక దాడుల వరకు ఆయన మోదీ ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల ముందుంచడంలో ఆయన విఫలమయ్యారు. ‘సూటు బూట్ల ప్రభుత్వం’, ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’, ‘చౌకీదార్ చోర్ హై’ వంటి చెణుకులు బాగానే పేలాయి. ప్రజల్లోకి కూడా బాగానే వెళ్లాయి. కానీ పదే పదే అవే వ్యాఖ్యలు చేస్తుండటంతో రానురానూ పాతబడిపోయిన దలేర్ మెహిందీ, బాబా సెహగల్ పాప్ సంగీతం లాగా విన్పించడం మొదలయ్యింది. మరోవైపు రఫేల్ కుంభకోణం క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదని వెల్లడయ్యింది. భ్రమలు తొలగిపోయి మోదీపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లే తమ వద్దకు రావాలన్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సామాన్యుల్ని కష్టాల పాలుచేసిన నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తేవడంలో కూడా కాంగ్రెస్ విఫలమయ్యింది. అలాగే ఏపీ, తెలంగాణలతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, రైతులకు కనీస మద్దతు ధర అనేదే ప్రధానాంశంగా ఉండటాన్ని పీపుల్స్ పల్స్ గమనించింది. ఈ అంశాలు కూడా అంతగా హైలైట్ కాలేదు. రూ.65 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి సంబంధించి యూపీఏ–1 నిర్ణయాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగ సమస్యను కూడా కాంగ్రెస్ ఉపయోగించుకోలేక పోయింది. మాటకు కట్టుబడి ఉంటామనే హామీ ఇవ్వడం తప్ప అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో వివరించలేదు. ధరల పెరుగుదల అంశాన్నీ కాంగ్రెస్ పెద్దగా లేవనెత్తలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారంలోకి తెచ్చిన ‘న్యాయ్’ గురించి పార్టీ అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ ప్రస్తావించడం లేదు. చాలామందికి దాని గురించే తెలియదంటే అతిశయోక్తి కాదు. -
‘వన’గూరిందేమీ లేదు
సాక్షి, అమరావతి : టీడీపీ నేతల బురిడీ మాటలకు శిలాఫలకాలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి పేరిట వారు చెప్పిన మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. ప్రచార ఆర్భాటం కోసం అనేక హామీలు గుప్పించి ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలను బుట్టలో వేసుకొన్నారు. అభివృద్ధి మంత్రం అని చెప్పి మాయ మాటలతో నమ్మించి వారు చేసిన అభివృద్ధి పనులు శిలాఫలకాల్లో మాత్రమే దర్శనమిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పేరేచర్లలో 531 ఎకరాల్లో విస్తరించి ఉన్న నగరవనంలో పర్యాటకుల కోసం అనేక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అడుగు ముందుకు పడలేదు. పర్యాటకులను ఆకర్షించటానికి మాత్రం ముఖ ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. లోపలకు వెళ్లితే మాత్రం కొండలు, రహదారులు, ఎండిపోయిన మొక్కలు పర్యాటకులను వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. కుటుంబాలతోపాటు వనాన్ని వీక్షించటానికి వచ్చిన వారు ఇక్కడ పరిస్థితిని చూసి నోరెళ్ల బెడుతున్నారు. అనవసరంగా వచ్చామని బాధ పడుతున్నారు. కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే నిధులు ప్రకటించారా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రకరకాల ఔషధ మొక్కలు పెంపకం అని చెప్పారేగానీ అక్కడ అలాంటివేమీ కనిపించకపోగా ఉన్న మొక్కలు కూడా నీరులేక ఎండిపోయాయి. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సైక్లింగ్ చేయటానికి అక్కడ సైకిళ్లు, ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌పూల్ లాంటివి ఏమీ లేవు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నగరవనం గుంటూరు కేంద్రానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ జంటల విడిది ఎక్కువగా కనిపిస్తుంది. వారు తప్పితే వనంలో ఎక్కడా పర్యాటకులు కనిపించకపోవటం గమనార్హం. చుట్టూ ఎత్తయిన కొండలు, పొదలు ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అనుకున్నంత ఏమీ లేదు నగరవనం అని అనేక మంది చెబితే వారాంతంలో సేద తీరటానికి బాగుంటుందని వెళ్లాను. కనీస వసతులు కూడా అక్కడ కనిపించలేదు. అభివృద్ధి చేస్తే పర్యాటకులు దూరం నుంచైనా వస్తారు కానీ ఇలా ఉంటే ఎవరూ రారు. ఇక్కడ కాలుష్యం మినహా ఏమీ లేదు. ప్రచార ఆర్భాటానికి నిధులు కేటాయించామని చెప్పడమేగానీ వాటితో ఏమి అభివృద్ధి చేశారో ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. – షేక్ఇమామ్వలి, మేడికొండూరు అభివృద్ధి ఆనవాళ్లేవీ ? నగరవనం అని ఇక్కడకు వచ్చాం. పిల్లలను కూడా తీసుకొచ్చాం. కానీ వనం లోపలకు వెళితే చెట్లు, కొండలు తప్పితే ఏమీ లేవు. కనీసం పిల్లలు ఆసక్తిగా తిలకించటానికి, వారు ఆడుకోవటానికి ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, ఇక్కడ వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. -
కమీషన్ల కోసమే..మిషన్ కాకతీయ : కాంగ్రెస్
నేరడిగొండ : పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ అనిల్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూమి అని ఎన్నో పథకాలను అమలు చేస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి నేటికీ ఒక్కటికూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు మాత్రం తమ కమీషన్ల కోసం అమలు చేస్తూ మిగితా వాటిని మరిచిపోయారని విమర్శించారు. గ్రామాల్లో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కార్యకర్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మార్కెట్‌యార్డులో కందులు అమ్మిన రైతులకు నేటికీ డబ్బులురాక ఆందోళన చెందుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ఇప్పుడు శనగపంటను అమ్ముదామన్నా రైతులకు ఇబ్బందులే ఉన్నాయన్నారు. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుల వద్దనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, త్వరలోనే జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో బోథ్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అల్లూరి ప్రపుల్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల కన్వీనర్ సాబ్లే నానక్‌సింగ్, నాయకులు ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, ఆడె వసంత్‌రావు, సాబ్లే ప్రతాప్‌సింగ్, గులాబ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ది సెన్సార్ పాలన
* స్వైన్‌ఫ్లూ నివారణలో సర్కారు విఫలం * ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి కరీంనగర్: ఎన్నికలకు ముందు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు పథకాలన్నింటికీ కత్తెర్లు పెడుతూ.. సెన్సార్ పాలన నడుపుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం కరీంనగర్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు నోచుకోకున్నా.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆకర్ష్ పథకం మాత్రం సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు భూపంపిణీ, ఫాస్ట్, బీడీకార్మికులకు జీవనభృతి, చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యల నివారణపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యో గం వస్తుందని నిరుద్యోగులను ఆశపెట్టి నేడు టీపీఎస్సీ సిలబస్ మారుస్తున్నారన్నారు. ఎంసెట్ ఎవరు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నివారణలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా అందరూ విఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రే ఈ విషయాన్ని అంగీకరించాక ప్రజల కు ఆరోగ్య భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నాగార్జునసాగర్ నీటి వాటా కోసం వెళ్లిన తెలంగాణ ఇంజినీర్లపై ఏపీలో భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడలేని బీజేపీ ప్రజల కోపతాపాలకు గురికాకతప్పదన్నారు.