బారక్‌పోర్/ కృష్ణానగర్: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం డిమాండ్ చేశారు. ఆరోగ్య అత్యయిక స్థితిని ఎదుర్కొనడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటి వేవ్ సద్దుమణిగాక... ఎంతో సమయం లభించినా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి కేంద్రం ఏమాత్రం సంసిద్ధం కాలేదన్నారు. అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్, టీకాల సరఫరా లేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయని... ఈ సమస్యను అధిగమించడానికి మోదీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. బారక్‌పోర్‌లో ఆమె శనివారం మాట్లాడుతూ... దేశంలో ఒకవైపు వ్యాక్సిన్లకు కొరత ఉంటే మరోవైపు మోదీ అంతర్జాతీయంగా తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి విదేశాలకు టీకాలను ఎగుమతి చేశారన్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభానికి ఆయనే కారణమని, అందుకే ప్రధాని రాజీనామా చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు, కార్యాకర్తలు వచ్చి బెంగాల్‌లో కోవిడ్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment