సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. ఈ విషయంలో విఫలమైంది ప్రభుత్వమే తప్ప, వ్యవస్థ కాదన్నారు. శుక్రవారం సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం వర్చువల్ వేదికగా జరిగింది. ‘కరోనాపై జరుగుతున్న పోరు రాజకీయ విభేదాలకు అతీతమైంది. జాతి యావత్తూ కలిసికట్టుగా ఈ పోరాటం సాగించాలి. ఇందులో భాగంగా, మొట్టమొదటగా మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలి’అని పేర్కొన్నారు.
‘మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యవస్థలు విఫలం కాలేదు. విఫలమైంది మోదీ ప్రభుత్వమే అన్నది సుస్పష్టం. దేశానికి ఉన్న బలాలు, వనరులను ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వినియోగించుకోలేకపోయింది. ప్రజల పట్ల ఏమాత్రం సానుభూతి లేని దేశ రాజకీయ నాయకత్వంతో దేశం యావత్తూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను గాలికొదిలేసింది’అని మండిపడ్డారు. ‘సమయం ఇంకా మించిపోలేదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సామర్థ్యం, దృఢచిత్తం, దూరదృష్టిగల నాయకత్వం అవసరం’అని సోనియా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత కారణంగా దేశం కష్టాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.
ఈ సమయంలో ఎంపీలంతా ప్రజలకు సేవ చేసేందుకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో మహమ్మారిని కలిసికట్టుగా, జవాబుదారీతనంతో ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు స్టాండింగ్ కమిటీలు సమావేశం కావాలన్నారు. ఇటీవల ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో పార్టీ పనితీరు తీవ్ర నిరుత్సాహం కలిగించిందనీ, ఇందుకు కారణమైన పరిస్థితులపై ఆత్మావలోకనం చేసుకుని, పాఠాలు నేర్చుకోవాలని ఎంపీలకు ఆమె సూచించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, తరుణ్ గొగోయ్ సహా మాజీ పార్లమెంటు సభ్యులకు నివాళి అర్పించిన అనంతరం ఈ సమావేశం ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment