పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్ గ్రామంలో ట్రాక్టర్ నడుపుతున్న రాహుల్
న్యూఢిల్లీ: ఓ సినిమా బాగా ఆడాలంటే పేరు మోసిన హీరో హీరోయిన్లు, కళ్లు చెదిరే గ్రాఫిక్కులు ఉంటేనే సరిపోదు.. ఆ సినిమాకు సంబంధించిన కథనం బాగుండాలి. కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పగలగాలి. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాన పోటీదారు కాంగ్రెస్ పరిస్థితి కథనం లోపించిన సినిమాలాగానే ఉందని హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ రీసెర్చి ఫౌండేషన్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. కాంగ్రెస్‌ను అతిపెద్ద పార్టీగా అవతరింపజేయడంలో రాహుల్ విఫలమయ్యారని, ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయారని తేలింది.
కాంగ్రెస్ ‘సినిమా’లో ‘కథనం’ లోపించింది. ప్రచారంలో మోదీ గురించి తప్ప ఇతరత్రా దేని గురించీ ఆ పార్టీ మాట్లాడలేదు. కానీ నిజం ఏమిటంటే మోదీ ఒక్కరే కీలక విషయం కాలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి లక్ష్యంగా చేసే వ్యతిరేక ప్రచారం వల్ల పొందగలిగేదేమీ ఉండదు. అలాగని రాహుల్ మౌనంగా ఏమీ లేరు. నిన్నమొన్నటి బాలాకోట్ వైమానిక దాడుల వరకు ఆయన మోదీ ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల ముందుంచడంలో ఆయన విఫలమయ్యారు.
‘సూటు బూట్ల ప్రభుత్వం’, ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’, ‘చౌకీదార్ చోర్ హై’ వంటి చెణుకులు బాగానే పేలాయి. ప్రజల్లోకి కూడా బాగానే వెళ్లాయి. కానీ పదే పదే అవే వ్యాఖ్యలు చేస్తుండటంతో రానురానూ పాతబడిపోయిన దలేర్ మెహిందీ, బాబా సెహగల్ పాప్ సంగీతం లాగా విన్పించడం మొదలయ్యింది. మరోవైపు రఫేల్ కుంభకోణం క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదని వెల్లడయ్యింది. భ్రమలు తొలగిపోయి మోదీపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లే తమ వద్దకు రావాలన్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సామాన్యుల్ని కష్టాల పాలుచేసిన నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తేవడంలో కూడా కాంగ్రెస్ విఫలమయ్యింది.
అలాగే ఏపీ, తెలంగాణలతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, రైతులకు కనీస మద్దతు ధర అనేదే ప్రధానాంశంగా ఉండటాన్ని పీపుల్స్ పల్స్ గమనించింది. ఈ అంశాలు కూడా అంతగా హైలైట్ కాలేదు. రూ.65 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి సంబంధించి యూపీఏ–1 నిర్ణయాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగ సమస్యను కూడా కాంగ్రెస్ ఉపయోగించుకోలేక పోయింది. మాటకు కట్టుబడి ఉంటామనే హామీ ఇవ్వడం తప్ప అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో వివరించలేదు. ధరల పెరుగుదల అంశాన్నీ కాంగ్రెస్ పెద్దగా లేవనెత్తలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారంలోకి తెచ్చిన ‘న్యాయ్’ గురించి పార్టీ అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ ప్రస్తావించడం లేదు. చాలామందికి దాని గురించే తెలియదంటే అతిశయోక్తి కాదు.
Comments
Please login to add a commentAdd a comment