Peoples Pulse Mood Survey In Chhattisgarh - Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్‌ ఏం చెబుతోంది?

Published Fri, Jul 7 2023 9:07 AM | Last Updated on Fri, Jul 7 2023 12:57 PM

Peoples Pulse Mood Survey In Chhattisgarh - Sakshi

డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్‌ మూడ్‌ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్‌ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్‌, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క  స్థానం వచ్చే అవకాశాలున్నట్లు  వెల్లడయ్యింది.

ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్‌ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది.

వెనుకంజలో ఏ పార్టీ?
2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్‌ 2.96 శాతం అధిక ఓట్లతో 46 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో వెల్లడయ్యింది. 2018లో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి 10 శాతం ఓట్లు తక్కువరాగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 8 శాతం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకున్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉందని సర్వేలో తేలింది.
చదవండి: పెన్‌డ్రైవ్‌ బయటికొస్తే సీఎం రాజీనామా: కుమారస్వామి

కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగడానికి కారణం ఇదేనా?
కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్‌ ఛత్తీస్‌గఢ్‌ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్‌ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్‌’ వంటి నినాదాలకు ప్రజలు ఆకర్షితులయ్యినట్లు పీపుల్‌పల్స్‌ సర్వేలో వెల్లడయ్యింది.

ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్‌ ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప`పైరి కి ధర్‌’’ ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్‌ అంశాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘రామవంగమన్‌ పాత్‌’ పేరిట శ్రీరాముడు వనవాసం చేసిన రాష్ట్ర పరిధిలోని 75 స్థానాలను గుర్తించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ‘‘బెన్‌ ములాఖత్‌’’ పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘కహో దిల్‌ సే, కాంగ్రెస్‌ ఫిర్‌ సే’’, ‘భూపేష్‌ హై తో, భరోసా హై’’ వంటి నినాదాలు ప్రజలకు చేరువవుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని ఓటర్లను పీపుల్స్‌ పల్స్‌ అడగగా కాంగ్రెస్‌ అని 48%, బీజేపీ అని 40%, జేసీసీ అని ఒక శాతం, బీఎస్పీ అని ఒక శాతం, ఎవరూ కారని 10% మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశమిస్తారా అని సర్వేలో ఓటర్లను అడగగా అవకాశం ఇస్తామని 47%, ఇవ్వమని 40%, ఏమీ చెప్పలేమని 13% మంది తెలిపారు.

సీఎం పనితీరు ఎలా ఉంది?
బీజేపీకి మూడు మార్లు అవకాశమిచ్చినట్టే కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశమిద్దామనే అభిప్రాయాన్ని ఓటర్లు వెల్లడిరచారు. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉందని ఓటర్లను ప్రశ్నించగా బాగుందని 45%, పర్వాలేదని 15%, బాగోలేదని 30%, ఏమీ చెప్పలేమని 10% మంది అభిప్రాయపడ్డారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ఓటర్లను సర్వేలో ప్రశ్నించగా 20% సంతృప్తిగా ఉన్నట్టు, 31% పాక్షింగా సంతృప్తిగా ఉన్నట్టు, 17% అసంతృప్తిగా ఉన్నట్టు, 21% పాక్షికంగా అసంతృప్తిగా ఉన్నట్టు, ఏమీ చెప్పలేమని 11% మంది అభిప్రాయపడ్డారు.

ప్రాంతాలవారీగా రాజకీయ వాతావరణం
ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు. 23 స్థానాలున్న ఈ డివిజన్‌లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో, రాష్ట్ర మంత్రి జైసింగ్‌ అగర్వాల్‌ ప్రభావంతో 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ మంచి ఫలితాలను సాధించింది. సింగ్‌డియో కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం ఇక్కడ 2018లో కాంగ్రెస్‌ విజయానికి దోహదపడిరది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఆ పార్టీకి ఇక్కడ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల సింగ్‌డియోకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్‌కు కొంత సానుకూలం. 2018తో పోలిస్తే ఇక్కడ బీజేపీకి ప్రస్తుతం కొంత సానుకూలమైన వాతావరణం ఉందని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది.
చదవండి: 'ఏ'కేద్దాం.. 'బీ' రెడీ!

మధ్య ఛత్తీస్‌గఢ్‌ డివిజన్‌లో రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్‌లో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్‌ స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎస్టీ, సింధి, రాజ్‌పుత్‌, పంజాబీ, బ్రాహ్మిణ్‌ సామాజిక ఓటర్ల ప్రభావం కూడా ఇక్కడ ఉంది.  ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చేందిన వారే. ఈ ప్రాంతంపై పట్టున్న బీజేపీ 2018 ఎన్నికల్లో నష్టపోయింది.

బీజేపీ బలపడ్డట్టు కనిపించినా..
కొన్ని సంవత్సరాల క్రితం కబీర్‌దామ్‌, బీమెత్ర జిల్లాల్లో మతకలహాల హింసతో ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ బీజేపీ బలపడ్డట్టు కనిపిస్తున్నా, సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది. ఈ డివిజన్‌లో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందిన జేసీసీ, బీఎస్పీ బలహీనపడడంతో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రయోజనం కలుగుతోంది. మొత్తంమీద ఈ ప్రాంతంలో బీజేపీ బలపడ్డట్టు కనిపించినా, కాంగ్రెస్‌ ఆధిప్యతం కొనసాగే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement