డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో తేలింది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విశ్లేషిస్తే.. ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాన్ని బస్తార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి.
ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతంలో 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను సాధించింది. ఎస్టీలతోపాటు గోండ్, మారియా`మురియా, భాత్ర హల్బీట్ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. ఇక్కడ ఓబీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ.
సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. బస్తర్‌లో మత మార్పిడి ఘటనలతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ కారణాలతో బీజేపీ 2018తో పోలిస్తే కొంత బలపడే అవకశాలున్నాయి. ఈ ప్రాంతంలో సర్వ్ ఆదివాసీ సమాజ్ ఓట్లను చీల్చినా సీట్లు గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది.
రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జగదల్‌పూర్, అంబిక్‌పూర్, కోబ్రా, రాయిగఢ్ మొదలగు నగరాల్లో రాజపూత్, బ్రాహ్మిణ్, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్ బ్యాంక్ అధికం. ఓబీసీలో సాహు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు.
ఈ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల కొంత మొగ్గు ఉంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మారర్ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. దేవాంగన్ సామాజిక వర్గం బీజేపీ పట్ల మొగ్గు చూపుతుంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాభల్యం ఉన్న యాదవ్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది.
చదవండి: ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది?
ఎస్సీలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ప్రధానంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండుల ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ, సర్వ్ ఆదివాసీ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు.
ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్, ఓరాన్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది. హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment