డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో వెల్లడయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది. కాంగ్రెస్, బీజేపీ బలాలు, బలహీనతలు ఏంటో విశ్లేషిస్తే..
కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేశ్ బఘేల్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరిని దేశంలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వం సేకరించడంతో రైతులు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. దీంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోమ్‌గార్డులకు జీతభత్యాలు పెంచడంతో వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు.
ఈ పరిణామాలు ప్రధానంగా గ్రామాలలో, విద్యావంతులలో పార్టీ పట్ల సానుకూలతను కలిగిస్తున్నాయి. వీధులలో సంచరించే ఆవుల కోసం ‘గోథాన్ యోజన’ పేరిట పథకాన్ని ప్రారంభించి గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధిని కలిగించడం పట్ల ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీకి నష్టం చేకూర్చవచ్చని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది.
ముఖ్యమంత్రి భూపేశ్‌కు ఉప ముఖ్యమంత్రి టి.ఎస్.సింగ్‌డియో, పీసీసీ చీఫ్ మోహన్ మార్కం మధ్య విభేదాలున్నాయి. ముగ్గురు మూడు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మైనింగ్ ఆరోపణలపై సీసీఎస్ అధికారి సౌమ్య చౌరాసియాను కేంద్ర ఈడీ అరెస్టు చేయడం రాష్ట్రంలో సంచలనం రేగింది. అయితే ఈ అవకతవకలలో ముఖ్యమంత్రి భూపేశ్ ప్రమేయం కంటే కొందరి మంత్రులు, అధికారుల హస్తం ఉందని ప్రజలు భావించడం వ్యక్తిగతంగా సీఎంకు సానుకూలాంశం. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా దెబ్బతిన రహదారులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తోంది.
బీజేపీ బలాలు, బలహీనతలు
ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న బీజేపీ భూపేశ్ ప్రభుత్వం వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకపోవడంతో పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని రాష్ట్ర బీజేపీ ‘మోర్ ఆవాజ్ మోర్ అధికార్’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి ప్రజలకు చేరువయినట్లు పీపుల్స్ పల్స్ తమ సర్వేలో గమనించింది. బస్తార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనలు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. గత ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఇచ్చిన మద్య నిషేధం హామీని ఆ పార్టీ అమలు చేయకపోవడం బీజేపీకి సానుకూలంగా మారుతోంది.
చదవండి: సామాజిక వర్గాల ప్రభావం ఎంత?.. ఎవరు ఎటువైపు మొగ్గు?
గతంలో పదిహేను సంవత్సరాలు పాలించిన బీజేపీ హిందూత్వ అజెండాతోపాటు జాతీయ అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించడంలో ఇవ్వలేదని అసంతృప్తి ప్రజల్లో ఉండడం ఆ పార్టీకి నష్టం చేకూరనుందని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. బీజేపీ జాతీయ అంశాలకు, హిందూత్వ అజెండాకు వ్యతిరేకంగా స్థానిక, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యతిస్తూ ప్రజలకు చేరువవడంలో ముఖ్యమంత్రి భూపేశ్ సఫలీకృతులయ్యారు.
పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈయన కాకుండా పార్టీలో ఇతర ప్రముఖ నేతలైన సరోజ్‌పాండే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు, మరోనేత బ్రిజ్‌మోహన్ అగర్వాల్ బనియా సామాజిక వర్గానికి చెందిన నేత.
దీంతో రాష్ట్రంలో అధికంగా ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత లేదనే భావనను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. గిరిజన తెగకు చెందిన సీనియర్ నేత నంద్‌కుమార్ సాయి 2023 ఏప్రిల్‌లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి నష్టం చేకూర్చవచ్చు. బీజేపీ 15 ఏండ్ల పాలనలో సబ్సీడీ బియ్యం మినహా ఇతర సంక్షేమ పథకాలకు పెద్ద ప్రాముఖ్యతివ్వలేదని, బీజేపీకి మూడుసార్లు అవకాశమిచ్చినట్లుగా కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు పీపుల్స్‌పల్స్ సర్వేలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment