జెనెట్‌ టేట్‌.. రెండు పల్లెటూర్ల మధ్యలో పెద్ద హైవే రోడ్డు.. ఒక్కసారిగా..? | The Crime And Thrilling Story By Janet Tate Written By Samhita Nimmana | Sakshi
Sakshi News home page

జెనెట్‌ టేట్‌.. రెండు పల్లెటూర్ల మధ్యలో పెద్ద హైవే రోడ్డు.. ఒక్కసారిగా..?

Published Mon, Aug 26 2024 1:57 PM | Last Updated on Mon, Aug 26 2024 1:57 PM

The Crime And Thrilling Story By Janet Tate Written By Samhita Nimmana

రెండు పల్లెటూర్ల మధ్యలో పెద్ద హైవే రోడ్డు. ఇటువారు అటు వెళ్లాలన్నా, అటువారు ఇటు రావాలన్నా ఆ హైవే దాటాల్సిందే. ఉన్నట్టుండి ఆ రెండు ఊళ్లనూ పెద్దసంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. పైనుంచి హెలికాప్టర్‌తో గాలింపూ మొదలైంది. చుట్టుపక్కల గుంతలు, చెరువులు అన్నీ జల్లెడపడ్తున్నారు. పొదలు, పొలాలు అన్నింటినీ వెతుకుతున్నారు. జనాలు కూడా ఆ వెతుకులాటలో భాగమయ్యారు. డిటెక్టివ్‌ అధికారులు ఒకవైపు, డాగ్‌ స్క్వాడ్‌ మరోవైపు పరుగులు తీస్తున్నారు.

ఇద్దరు అమ్మాయిలు మాత్రం జరిగేదంతా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అధికారులంతా ఒకరి తర్వాత ఒకరు ఆ ఇద్దరినీ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఒక కానిస్టేబుల్‌ పరుగున వచ్చి, ‘క్రైమ్‌ సీన్  రీ క్రియేషన్ కి అంతా రెడీ సార్‌’ అన్నాడు. అప్పటికే పోలీసులంతా ఏది ఎక్కడ ఎలా జరిగింది అనేది ఆ అమ్మాయిల నోట చాలాసార్లు విన్నారు. దాంతో ఆ అధికారుల్లో ఒకడు ఆ అమ్మాయిల వైపు చూసి, ‘పదండి! అసలేం జరిగిందో వివరంగా చూపించాలి. తేడా రాకూడదు. అబద్ధం చెప్పకూడదు, సరేనా?’ అంటూ కాస్త గంభీరంగా గద్దించాడు. ‘సరే సార్‌’ అంటూ భయపడుతూనే ఆ ఇద్దరూ పోలీస్‌ జీప్‌ ఎక్కారు.

జీప్‌ వేగంగా కంకర రోడ్డు వైపు పరుగుతీసింది. హైవే నుంచి ఊరుని కలిపే దారి అది. కారు వెళ్తుంటే స్కూటర్‌ పక్కనే ఆగేంత చిన్న తోవ అది. చుట్టూ గుబురు మొక్కలు, పొదలు. దారి పొడవునా మలుపులే! ఏ మలుపు తిరిగినా అవతల దారి ఇవతలకు కనిపించదు. ఓవైపు  పొలాలు, మరోవైపు పిల్లకాలువలు, వాటిపై చిన్న చిన్న వంతెనలు. ఒంటరిగా వెళ్లాలంటే కాస్త భయపడేలానే ఉంటుందా ప్రదేశం. ఇద్దరిలో ఒక అమ్మాయి, ‘ఇక్కడే సార్‌! ఈ వంతెనే!’ అంటూ జీప్‌ ఆపించింది. ‘సరిగ్గా చెబుతున్నావా?’ అన్నాడు అందులో ఓ అధికారి. ‘యస్‌ సర్‌ ఇదే ఇదే!’ అంది మరో అమ్మాయి. దాంతో జీప్‌లో ఉన్నవారంతా వంతెన మీదే దిగారు.

‘ఇక్కడే సర్‌! నిన్న మధ్యాహ్నం 3 అయ్యేసరికి జెనెట్‌ తన సైకిల్‌ మీద వెళ్తూ వెళ్తూ మమ్మల్ని కలిసింది’ అంది ఒక అమ్మాయి. ‘మరి మీకు ఆ సైకిల్‌ ఎక్కడ కనిపించింది?’ అడిగాడు ఒక అధికారి. ‘అదిగో ఆ మలుపు దాటాక కనిపించింది సర్‌.! తను మా దగ్గరకు వచ్చేసరికే తన దగ్గర చాలా న్యూస్‌ పేపర్స్‌ ఉన్నాయి. దారిలో మేము కనిపించామని ఆగింది. వెళ్తూ వెళ్తూ చదువుకోమని మాకూ ఓ న్యూస్‌ పేపర్‌ ఇచ్చింది సర్‌’ అంది మరో అమ్మాయి. అధికారులతో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ మలుపువైపే నడిచారు. జెనెట్‌ సహా ముగ్గురి వయసూ 13 ఏళ్లే. అంతా ఒకే స్కూల్లో స్నేహితులు. జెనెట్‌ చూడటానికి టామ్‌ బాయ్‌లా కనిపించేది. స్కూల్‌ అయిపోగానే న్యూస్‌ పేపర్స్‌ వేస్తూ పార్ట్‌టైమ్‌ చేసుకునేది. హైవే దాటి ఆ ఊరు నుంచి ఈ ఊరికి.. ఈ ఊరు నుంచి ఆ ఊరికి సైకిల్‌ మీద తిరగడం ఆమెకు కొత్తేం కాదు.

‘జెనెట్‌ మాతో మాట్లాడాక మా ముందే సైకిల్‌ ఎక్కి వెళ్లడం కొంత దూరం వరకూ మాకూ కనిపించింది. మేము తనిచ్చిన పేపర్‌ చదువుకుంటూ, మాట్లాడుకుంటూ జెనెట్‌ వెళ్లిన దారిలోనే నడుచుకుంటూ.. మా ఇళ్లకు బయలుదేరాం. సరిగ్గా ఐదారు నిమిషాలకు ఇదిగో ఈ మలుపు దాటి కాస్త దూరం నడిచేసరికి జెనెట్‌ సైకిల్‌ కిందపడున్నట్లు కనిపించింది. సైకిల్‌ బుట్టలోని న్యూస్‌ పేపర్స్‌ అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. సైకిల్‌ వెనుక టైర్‌ గిర్రున తిరుగుతూనే ఉంది. పేపర్స్‌ గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి. మాకు భయం వేసింది. పరుగున దగ్గరకు వెళ్లాం. ఇదిగో ఇక్కడే. సైకిల్‌ పడి ఉంది. ‘జెనెట్‌! జెనెట్‌!’ అని పెద్దగా అరిచాం. చుట్టూ చూశాం. అదిగో ఆ పొదల వెనుక కూడా వెతికాం.

ఎక్కడా తన అలికిడి లేదు. దాంతో సైకిల్‌ని పైకి లేపి, నడిపించుకుంటూ వాళ్ల ఇంటికి వెళ్లాం. అక్కడ జెనెట్‌ వాళ్ల డాడ్‌కి విషయం చెప్పాం’ అంటూ ఆ అమ్మాయిలు ప్రతి సీన్ ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించారు. ఓ అధికారి ‘సరిగ్గా జెనెట్‌ సైకిల్‌ దొరికిన చోట నిలబడి, సైకిల్‌ ఏ పొజిషన్ లో పడింది? అప్పుడు మీకు జెనెట్‌ అరుపులు వినించలేదా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. దాంతో ఆ ఇద్దరు అమ్మాయిలు సైకిల్‌ పడి ఉన్న పొజిషన్ ని న్యూస్‌ పేపర్స్‌ పడి ఉండటాన్ని ఆ అధికారులకు వివరించారు. రోజులు గడిచినా జెనెట్‌ ఆచూకీ దొరకలేదు.

అప్పుడే ఒక రైతు షాకిచ్చాడు. ‘సైకిల్‌తో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలు నడిచి వెళ్లడం నేను చూశాను. అయితే వాళ్లిద్దరూ ఏ అరుపులు అరవలేదు. ఎలాంటి ఆందోళనలోనూ కనిపించలేదు’ అని సాక్ష్యమిచ్చాడు. మరోవైపు ఓ కానిస్టేబుల్‌ భార్య ఆరోజు మధ్యాహ్నం మూడు దాటాక అటుగా వెళ్తూవెళ్తూ, ఆ ఇద్దరు అమ్మాయిలతో పాటు ఒక టామ్‌బాయ్‌లాంటి అమ్మాయి (జెనెట్‌) ఒక ముప్పయ్యేళ్ల వ్యక్తితో అదే వంతెన మీద నిలబడి మాట్లాడుకోవడం చూశానని సాక్ష్యమిచ్చింది. దాంతో ‘ఆ అబ్బాయి ఎవరు?’ అనే కోణంలో కూడా దర్యాప్తు సాగింది. కానీ పనికొచ్చే ఎలాంటి సమాచారం దొరకలేదు.

అయితే జెనెట్‌ సైకిల్‌ దొరికిన ప్రాంతంలో సుమారు 70 న్యూస్‌ పేపర్స్‌ దొరికాయి. నిజానికి జెనెట్‌ తిరిగే జోన్ లో అన్ని పేపర్స్‌ అవసరం లేదు. సైకిల్‌ బుట్టలో కూడా అన్ని పేపర్స్‌ పట్టడం కష్టమే! కిడ్నాపర్స్‌ కావాలనే న్యూస్‌ పేపర్స్‌ అక్కడ వదిలి, కేసుని డైవర్ట్‌ చేయాలనుకున్నారా? అనేది కూడా తేలలేదు. పైగా జెనెట్‌ మిస్‌ అయిన రోజు మరో పేపర్‌ బాయ్‌ లీవ్‌లో ఉండటంతో, అతడు అందివ్వాల్సిన న్యూస్‌ పేపర్స్‌ కూడా జెనెటే తీసుకుందట! ఆ విషయం తెలియగానే జెనెట్‌ కిడ్నాప్‌ని ముందే ప్లాన్‌ చేశారా? అని కూడా విచారించారు. కానీ క్లారిటీ రాలేదు. పాపం జెనెట్‌ తండ్రి  జాన్‌ సుమారు 40 ఏళ్ల పాటు పోరాడి ఆ దిగులుతోనే మరణించాడు.

జెనెట్‌ స్నేహితులకు అంతా తెలిసే నాటకం ఆడారా? లేక లీవ్‌లో ఉన్న పేపర్‌ బాయ్‌కి జెనెట్‌ కిడ్నాప్‌కి ఏదైనా సంబంధం ఉందా? ఇలా వేటికీ సమాధానం లేదు. 1978లో బ్రిటన్ , ఐల్స్‌బరీలో జరిగిన యదార్థ సంఘటన ఇది. ఆ ఏడాది ఆగస్ట్‌ 19న సైకిల్‌ మీద వెళ్తున్న పదమూడేళ్ల జెనెట్‌ టేట్‌– ఎక్సెటర్‌ సమీపంలో కిడ్నాప్‌ అయ్యింది. 46 ఏళ్లు గడిచినా కేసు తేలలేదు. ఎన్నో నేరాలు చేసి దొరికిన రాబర్ట్‌ బ్లాక్‌ అనే సీరియల్‌ కిల్లర్, తానే జెనెట్‌పై అత్యాచారం చేసి హత్య చేశానని చెప్పాడట. అయితే విచారణ పూర్తి కాకుండానే జైల్లో అతడు మరణించాడు. కొందరు మాత్రం.. ‘రాబర్ట్‌ ఒప్పుకోవడమనేది.. పోలీసుల కట్టుకథ’ అంటారు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement