అది ద్వాపరయుగం. వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజన చేశాడు. నాలుగు భాగాలనూ తన నలుగురు శిష్యులైన జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతులకు అప్పగించాడు. లోకంలో వాటిని ప్రచారం చేయమని వారిని ఆదేశించాడు. వ్యాసుడి ద్వారా వైశంపాయనుడు యజుర్వేదాన్ని పొందాడు. గురువు ఆదేశం మేరకు యజుర్వేద ప్రచారం కోసం శిష్యులకు బోధించసాగాడు. వైశంపాయనుడి శిష్యులలో యాజ్ఞవల్క్యుడు మిగిలిన శిష్యులందరి కంటే చాలా తెలివైనవాడు. గురువుకు శ్రద్ధగా శుశ్రూష చేస్తూ, ఆయన వద్ద యజుర్వేదాన్ని కూలంకషంగా నేర్చుకున్నాడు.
అదే కాలంలో ఒకనాడు మహర్షులందరూ మేరుపర్వతం మీద సభను ఏర్పాటు చేశారు. అన్ని రాజ్యాల్లో ఉన్న మహర్షులందరికీ వర్తమానం పంపారు. మహర్షులందరూ ఆ సభకు తప్పక రావాలని, ఎవరైనా సభకు రానట్లయితే వారికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని తీర్మానించారు.
మహర్షుల సభకు రావలసినదిగా వైశంపాయనుడికి కూడా వర్తమానం అందింది. అయితే, కారణాంతరాల వల్ల ఆయన ఆ సభకు వెళ్లలేకపోయాడు. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం వైశంపాయనుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది.
ఈ పరిణామానికి వైశంపాయనుడు ఎంతగానో దిగులు చెందాడు. బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే ఉపాయమేమిటని మహర్షులను అడిగాడు. ‘ఎవరైనా తపస్సు ధారపోస్తే బయటపడవచ్చు’ అని వారు తరుణోపాయం చెప్పారు. ఇదంతా జరిగినప్పుడు ఆశ్రమంలో యాజ్ఞవల్క్యుడు లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు.
గురువుకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కల్పించడానికి వైశంపాయనుడి మిగిలిన శిష్యులంతా ఆశ్రమ ప్రాంగణంలో తపస్సు ప్రారంభించారు. అదే సమయానికి యాజ్ఞవల్క్యుడు వచ్చాడు. ఆశ్రమంలో తన సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు వారంతా తపోనిష్ఠలో ఉన్నారో అతడికి అర్థంకాలేదు.
నేరుగా గురువు వైశంపాయనుడి వద్దకు వెళ్లాడు. ‘గురువర్యా! నా సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉన్నారేమిటి? నేను లేనప్పుడు వారికి ఏదైనా దీక్ష ఇచ్చారా? లేదా ఏదైనా బృహత్కార్యం కోసం వారంతా తపస్సు చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. ‘నాయనా! మేరుపర్వతం మీద మహర్షుల సభ జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను ఆ సభకు వెళ్లలేకపోయాను. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తించింది.
తరుణోపాయం కోసం నేను మహర్షులనే ఆశ్రయించాను. వారు చెప్పిన తరుణోపాయం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలగాలంటే ఎవరైనా తమ తపః ఫలాన్ని నాకు ధారపోయవలసి ఉంటుంది. తపః ఫలితాన్ని నాకు ధారపోయాలనే నా శిష్యులంతా తపస్సుకు పూనుకున్నారు’ అని చెప్పాడు వైశంపాయనుడు. ‘గురువర్యా! వీళ్లంతా అల్పజ్ఞులు.
వీళ్ల తపస్సు వల్ల మీకు పాపవిమోచన కలగడానికి ఎన్నాళ్లు పడుతుందో! నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీకోసం ఘోరమైన తపస్సు చేస్తాను’ అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సహాధ్యాయులను అల్పజ్ఞులుగా సంబోధించిన యాజ్ఞవల్క్యుడిపై వైశంపాయనుడికి పట్టరాని కోపం వచ్చింది. ‘సాటివారిని అవమానించే నీలాంటి గర్వాంధుడితో నాకు పనిలేదు. నీలాంటి వాడికి నాకు శిష్యుడిగా ఉండే అర్హత కూడా లేదు.
నేను చెప్పిన విద్యను ఇక్కడే వదిలేసి వెళ్లు’ హూంకరించాడు వైశంపాయనుడు. యాజ్ఞవల్క్యుడు స్వాభిమాని. గురువు మాటలు అతడికి అవమానంగా తోచాయి. గురువు వద్ద నేర్చుకున్న విద్యనంతా అక్కడే నల్లని నెత్తురుగా కక్కేశాడు. అతడు కక్కిన నెత్తురు కృష్ణ యజుర్వేదమైంది. ఆ నెత్తుటిని తిత్తిరి పక్షులు తిన్నాయి. తిత్తిరి పక్షులు తినేసిన నెత్తురు ఆ తర్వాత తైత్తరీయోపనిషత్తు అయింది.
గురువు వద్ద నేర్చుకున్న వేదాన్నంతా కక్కేసిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడి కోసం తపస్సు చేసి, ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. సూర్యుడి వద్దనే నేరుగా వేదవిద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సూర్యుడి వద్ద నేర్చుకున్నది శుక్లయజుర్వేదమైంది. ఈ వేదభాగాన్నే యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వ, మధ్యందినాదులకు బోధించాడు.
యాజ్ఞవల్క్యుడు బోధించిన శుక్లయజుర్వేదం ‘వాజసనేయ సంహిత’గా ప్రసిద్ధి పొందింది. వాజః అంటే అన్నం. సని అంటే దానం. యాజ్ఞవల్క్యుడి తండ్రి నిరతాన్నదానం చేసేవాడు. అందువల్ల ఆయనకు వాజసని అనే పేరు వచ్చింది. వాజసని కొడుకు కావడం వల్ల యాజ్ఞవల్క్యుడికి వాజసనేయుడు అనే నామాంతరం ఏర్పడింది. - సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment