ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు మన దేశంలోనూ విరివిగా కనిపిస్తున్నాయి గాని, నిజానికి ఇవి వందేళ్లకు ముందు నుంచి కూడా వాడుకలో ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అలనాటి ఎలక్ట్రిక్ కారు. దీనిని అమెరికన్ కార్ల తయారీ కంపెనీ ‘కొలంబియా’ విడుదల చేసింది. ‘కొలంబియా ఎలక్ట్రిక్ ఫేటన్’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీని కొలంబియా కంపెనీ 1905లో ప్రారంభించింది. ఫొటోలో ఉన్న కారు 1908 నాటిది.
అప్పట్లో దీని ధర 1600 డాలర్లు (రూ.1.33 లక్షలు) ఉండేది. ఇప్పటి లెక్కల ప్రకారం దీని ధర 44,00 డాలర్లు (రూ.36.65 లక్షలు) ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ మోడల్ కారుకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఈ కారుకు 24 బ్యాటరీలు పెట్టుకోవాల్సి వచ్చేది. వాటిని రీచార్జ్ చేసుకోవడానికి వీలయ్యేది. ఈ కారు ముందుకు పోవడానికి మూడు గేర్లు, వెనక్కు మళ్లడానికి రెండు రివర్స్ గేర్లు ఉండటం విశేషం.
దీనికి స్టీరింగ్‌వీల్, యాక్సిలేటర్ పెడల్ ఉండవు. కారుకు కుడి పక్కన తెడ్డులాంటి సాధనం అమర్చి ఉంటుంది. దిశను మార్చడానికి డ్రైవర్ దీనిని వాడాల్సి వచ్చేది. వేగాన్ని నియంత్రించడానికి ఎడమవైపు ఉండే కర్రలాంటి సాధనాన్ని వాడాల్సి వచ్చేది. ఇప్పటి తరానికి ఇది చాలా విచిత్రంగా కనిపించినా, ఈ కారు ఇంకా పనిచేసే పరిస్థితిలోనే ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment