కరోనా ఏమోనని అనుమానం సర్ | Saraswathi Rama Telugu Short Story In Sakshi Funday Over Coronavirus | Sakshi
Sakshi News home page

దూరం

Published Sun, Apr 19 2020 9:16 AM | Last Updated on Sun, Apr 19 2020 9:16 AM

Saraswathi Rama Telugu Short Story In Sakshi Funday Over Coronavirus

‘సర్‌... నేను గిరి...’ అని ఏదో చెప్పబోతుంటే దగ్గు అడ్డొచ్చింది. శ్వాస కూడా భారంగా వినిపిస్తోంది అవతల ఫోన్‌లో ఉన్న వాళ్లకు.
‘గిరిజా.. ఏమైంది? ఈ ఫోన్‌ నెంబర్‌ ఎవరిది? నీ ఫోన్‌కు ఏమైంది? వారం రోజుల్నించి ట్రై చేస్తున్నాం’  ఆదుర్దాగా అడిగాడు శ్రీనివాస్‌.
‘సర్‌.. నా ఫోన్‌ కావాలనే వాడట్లేదు. నా పరిస్థితి తెలిస్తే నా కొడుకు తట్టుకోలేడు. నిండా పన్నెండేళ్లు లేవు వాడికి.. నాకేమన్నా అయితే.. ఏమైపోతాడో.. వాళ్ల నాన్న సంగతి తెలుసు కదా మీకు’ అంటూ ఏడ్చేస్తోంది గిరిజ.

కంగారుపడ్డాడు శ్రీనివాస్‌.. విషయం అర్థకాక.. అడిగాడు ఫోన్‌లో ..‘ఎందుకేడుస్తున్నావ్‌? నీ మాట కూడా భారంగా వస్తోంది.. ఏమైంది? పరిస్థితి అంటున్నావ్‌.. విషయం ఏంటో చెప్పు’ ఆందోళనగా.
‘సర్‌..’ అంటూ మళ్లీ దగ్గసాగింది గిరిజ.. దగ్గుతూనే చెప్పింది.. ‘కరోనా ఏమోనని అనుమానం సర్‌’ అని.
పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు శ్రీనివాస్‌. వెంటనే తేరుకొని ‘ఇప్పుడెక్కడున్నావ్‌? ఆసుపత్రికి వెళ్లలేదా?’ అడిగాడు.
ఏడ్వసాగింది గిరిజ. ఏమీ అర్థంకాలేదు శ్రీనివాస్‌కు.
‘ఎక్కడున్నావ్‌?’ మళ్లీ రెట్టించాడు.
‘రూ.. రూమ్‌లో ’ చెప్పింది ఏడుస్తూనే.
‘రూమ్‌లో అంటే మీ హర్‌బాబ్‌ ఇంట్లో లేవా?’ కంగారుగానే అడిగాడు.
‘ఉహూ... కరోనా భయంతో పంపించేశారు. ఫ్రెండ్‌ రూమ్‌లో ఉంటున్నా..’ చెప్పింది ముక్కు తుడుచుకుంటూ.
‘అరే... మరి వాళ్లు ఉండనిస్తున్నారా?’ అడిగాడు.దానికి సమాధానం దాటవేసి.. ‘సర్‌.. ఈ విషయాలేవీ ఇంట్లో వాళ్లకు చెప్పకండి.. నా పిల్లాడికైతే అస్సలు తెలవద్దు. నేను మీకు ఫోన్‌ చేశానని.. బాగున్నానని.. ఇండియాకు వచ్చేస్తున్నానీ చెప్పండి ప్లీజ్‌’ వేడుకుంది.

‘అద్సరే గానీ.. ముందు నువ్వు కువైట్‌ వాళ్ల కరోనా హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి నీ పరిస్థితి చెప్పు.. వాళ్లు ఆసుపత్రిలో చేర్చుకుంటారు. డబ్బు గురించి బెంగపడకు.. ట్రీట్‌మెంట్‌ ఫ్రీనే’ అంటూ ఇంకేదో జాగ్రత్తలు చెప్పబోతుండగానే ‘అలాగేనండీ.. నా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోండి.. ఇక్కడి విషయాలేం వాడికి చెప్పొద్దు ప్లీజ్‌ ’ అంటూ ఫోన్‌ కట్‌ చేసింది. 
ఇవతల శ్రీనివాస్‌కు చాలాసేపటి వరకు మెదడు పనిచేయలేదు. గిరిజ గురించిన ఆలోచనలే. పాపం..  కువైట్‌ వెళ్లడానికి అస్సలు ఇష్టపడలేదు.  ఆ గిన్నెలు, బట్టలేవో ఏ విశాఖపట్నమో.. హైదరాబాదో వెళ్లి తోముతా.. ఉతుకుతా. కనీసం నేను, నా పిల్లాడైనా ఒక్క చోటుండొచ్చు అని భర్త కాళ్లావేళ్లా పడింది. వినలేదు మూర్ఖుడు. రెండు గోదావరి జిల్లాల్లో అప్పులు చేసిపెట్టాడు. పొలమూ పుట్రా, నగానట్రా అన్నీ హారతి కర్పూరం చేశాడు. పైగా అమ్మాయిల పిచ్చి. దానికి తోడు తాగుడు. అప్పులు తీర్చుతూ తన జల్సాలకు కొదువ లేకుండా చూసుకోవడానికే గిరిజను బలవంతంగా కువైట్‌ పంపాడు. పిల్లాడికి ఏడేళ్లున్నప్పుడు వెళ్లింది. ఇప్పటి వరకు రాలేదు. రమ్మని భర్తా ఆడగలేదు. రోజూ కొడుకుతో ఫోన్‌లో మాట్లాడుతుండేది.

పది రోజులుగా అమ్మ ఫోన్‌ లిఫ్ట్‌ చేయట్లేదు.. అని వాడు ఒకటే టెన్షన్‌ పడిపోతున్నాడు. కువైట్‌ వెళ్లడం తప్పనిసరి అయ్యేటప్పటికి భర్త అప్పులు తీర్చడం కన్నా తన కొడుకును బాగా చదివించుకోవాలనే లక్ష్యంతో మాత్రమే వెళ్లింది గిరిజ. వెళ్లిన రెండేళ్ల వరకు తనకు పైసా పంపకపొయ్యేసరకి కొడుకును ఇబ్బందిపెట్టడం మొదలుపెట్టాడు. పిల్లాడి స్కూల్‌కి వెళ్లి అక్కడ గోల చేయడం, గిరిజ వాళ్ల అమ్మవాళ్లింటికి వెళ్లి గొడవలు పెట్టడం.. వాళ్లు గిరిజకు కంప్లయింట్‌ చేయడం వంటివి ఎదురయ్యే సరికి.. భర్త అప్పునూ తన ఖాతాలో వేసుకుంది. సంసారాన్ని ఓ గాడిలోకి తెచ్చే ప్రయత్నం చేసుకుంటోంది అని ఆమె ఆత్మీయులు, బంధువులు సంతోషపడ్తున్న టైమ్‌లో ఈ కరోనా పిడుగేంటో... అనుకుంటూ నిట్టూర్చాడు శ్రీనివాస్‌. తనే ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు.. ఈ చేతులతోనే వీసా ప్రాసెసింగ్‌ చేయించాడు.. భగవంతుడా ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలై తన కొడుకుతో సంతోషంగా ఉండేలా చూడు’ అంటూ మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ కువైట్‌లో తనకు తెలిసిన యాక్టివిస్ట్‌కు ఫోన్‌ కలిపాడు. 
∙∙ 
ఫ్రెండ్‌ ఇంట్లో ఉంటున్నానని అబద్దం చెప్పింది. ఏమని చెప్తుంది మరి? కరోనా భయంతో హర్‌బాబ్‌ వాళ్లు రాత్రికి రాత్రే పాస్‌పోర్ట్‌ తన మొహాన విసిరి.. రావాల్సిన జీతం కూడా ఇవ్వకుండా.. ఏ లెక్కా తేల్చకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తే.. ఎటు వెళ్తుంది? తనలాంటి పరిస్థితే ఉన్న ఆ ఇంటి డ్రైవర్‌ ఆశ్రయం కోరింది తోటి భారతీయుడే అన్న భరోసాతో. దేవుడా.. ఎంత తప్పు చేసింది తను? కష్టంలో ఒకరికి ఒకరం.. నేను తినేదే నువ్వు తిందువుగాని.. అంటూ తన రూమ్‌కి తీసుకెళ్లాడు. ఉన్న దాంట్లోనే ఇద్దరు తింటూ గది దాటి బయటకు వెళ్లకుండా వారం రోజులు బాగానే గడిపారు. ఇంతలోకే అతనికి జలుబు చేసింది. మాత్రలు తెచ్చుకుంటాను అని వెళ్లిన మనిషి అడ్రస్‌ లేకుండా పోయాడు. ఫోన్‌ కూడా ఇంట్లోనే వదిలి. రెండు మూడు రోజులు చూసింది.. నాలుగో రోజూ తెల్లారింది. అయినా మనిషి లేడు. సంబంధించిన సమాచారమూ లేదు. ధైర్యం చేసి అతని ఫోన్‌లోని ఒకటిరెండు కాంటాక్ట్స్‌కి ఫోన్‌ చేసింది.. ‘ఈ ఫోన్‌ అతను ఎవరో.. ఫోన్‌ మరిచి పోయాడు ఎక్కడున్నాడో చెప్తారా’ అని. విని ఫోన్‌ కట్‌ చేసేశారు. తర్వాత రెండు గంటలకు ఆ నంబర్‌ నుంచే  మళ్లీ ఫోన్‌. ‘ఈ ఫోన్‌ అతని పేరు దినేశ్‌. కరోనా పాజిటివ్‌ వచ్చింది.

హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ ఫోన్‌ ఎక్కడ మరిచిపోయాడు. మీకెక్కడ దొరికింది’ అంటూ. ఆ ప్రశ్నల పరంపర అలా కొనసాగుతూనే ఉంది.. చల్లబడి పోయింది గిరిజ. వారం రోజులు.. చిన్న గదిలో ఒక్కదగ్గరే ఉంటూ.. ఒకేచోట పడుకుంటూ.. ఒకే బాత్రూమ్‌ వాడుకుంటూ.. మెదడు మొద్దు బారిపోయింది ఆమెకు. కదలికల్లేవు. చేతిలో చిల్లిగవ్వలేదు. వాలంటీర్ల నంబర్లు లేవు. ఇంకెవరికి చెప్పుకోవాలో.. ఇంకెవరిని సహాయమడగాలో తెలియదు. ఆ షాక్‌లోంచి తేరుకున్నాక తన కొడుక్కి ఫోన్‌ చేసి మనసారా మాట్లాడుకుంది. తర్వాత రెండు రోజులకు ఆమెకూ జలుబు చేసింది.. దగ్గు... జ్వరం వచ్చాయి. ఇక మరణం తప్పదని ఊహించుకుంది. శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి తన కొడుకు గురించి జాగ్రత్తలు చెప్పింది. తనెలా పోయిందో కనీసం ఒక్కరికైనా తెలియాలి అని. ఆ అంతర్మ«థనంతో అలా గోడకు చేరగిల పడిందో లేదో బయట తలుపు బాదిన చప్పుడు ... భయంతో గట్టిగా కళ్లు మూసుకొని అలాగే కూర్చుండిపోయింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా కొట్టారు తలుపుని. కొట్టి ఊరుకోలేదు.. గ్యాప్‌ ఇవ్వకుండా కొడుతూనే ఉన్నారు. తప్పదన్నట్టుగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా హెల్త్‌ వాలంటీర్లు.. అంబులెన్స్‌తో సహా.
∙∙ 
‘థాంక్యూ ప్రసాద్‌.. గిరిజను ఆసుపత్రిలో చేర్పించినం దుకు’ కువైట్‌లో ఉన్న స్నేహితుడికి ఫోన్‌లో కృతజ్ఞతలు చెప్తున్నాడు శ్రీనివాస్‌.
-సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement