ఊరికి జరమొచ్చింది.. | Suspense Thriller Crime Story In Telugu | Sakshi
Sakshi News home page

రాత్రిపూట గజ్జెల చప్పుడు వినిపిస్తోంది..

Published Sun, Mar 7 2021 10:27 AM | Last Updated on Sun, Mar 7 2021 10:27 AM

Suspense Thriller Crime Story In Telugu - Sakshi

భాస్కర్‌ దగ్గర నుండి ఫోన్‌. బద్ధకం వదిలించుకుని ‘‘ ఏరోయ్‌! డీఎస్పీ! ఎప్పుడు ఫోను చేసినా బిజీ అంటుంటావ్‌! ఇంత తెల్లవారుఝామున ఈ ఫోనేంటి?’’ అని కంగారుగా అడిగాడు ఉమాపతి. 
‘‘మీ ఊర్లో దిగాను. స్టేషన్లో ఉన్నాను. అడ్రస్‌ చెప్పు’’
‘‘ఓర్నీ! రాత్రే చెప్పచ్చుగా! స్టేషన్‌కి వచ్చేవాణ్ణి’’... అడ్రస్‌ చెప్పాడు.
చిన్ననాటి మిత్రుణ్ణి చూడగానే ఆనందంగా కౌగిలించుకున్నాడు.            
‘‘చెల్లెమ్మ ఏదిరా?’’ ఇల్లంతా వెదుకుతూ అడిగాడు.                    
‘‘తెలుసున్నవాళ్ళింటికి పెళ్ళికి వెళ్ళింది. రేపొస్తుంది’’         
‘‘అయ్యో! భలే టైం చూసొచ్చానే?’’ 
‘‘ఏం పర్లేదు! నీ ఆతి«థ్యానికి ఏ లోటూ రానివ్వను. కంగారు పడకు. వంటమనిషి ఉన్నాడు.. సర్లే! ఏంటి ఈ ఆకస్మిక రాక?’’             
‘‘అర్జెంటుగా హెడ్‌ ఆఫీసు పని పడింది’’ అన్నాడు భాస్కర్‌.
‘‘అదీ అలా చెప్పు. లేకపోతే నువ్వొస్తావా అంత తీరిగ్గా!’’ అని నవ్వేడు ఉమాపతి.

ఆఫీసు పని అయ్యాక ఇద్దరు మిత్రులూ ఆ రాత్రి టెర్రస్‌ మీద మందుబాటిల్‌ ఓపెన్‌ చేశారు.                      
‘‘నీ కెరీర్‌ లో అతి జటిలమైన కేసుగా ఉండి, అతి చాకచక్యంగా ఛేదించినది ఏదైనా ఉందొరేయ్‌? ఉంటే చెప్పు. సరదాగా వినాలని ఉంది’’ అడిగాడు ఉమాపతి.
‘‘లేకేం? చాలా ఏళ్ళ క్రితం జరిగింది చెప్తాను’’ ఉమాపతి ఇంట్రెస్టుగా వినడం మొదలెట్టాడు.                                                                        
నేను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చెరుకువాడ అనే ఊళ్ళో జాయిన్‌ అయిన రోజులు. పిల్లల చదువుల కోసం సిటీలో ఫ్యామిలీ పెట్టి స్టేషన్‌ పక్కన చిన్న గదిలో అద్దెకు ఉండేవాణ్ణి. ఊరిలో అడుగుపెట్టిన నాకు కనబడిన విచిత్రం ఏంటంటే.. భయం దుప్పట్లో దూరిన ఆ ఊరు జ్వరంతో గజగజ వణుకుతోంది. ఎక్కడ విన్నా అదే వార్త! ఎవ్వరూ రాత్రి ఏడు దాటితే బయటకు రావడం లేదు. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత బర్రెమ్మ ఆకలెక్కువై రాత్రిళ్ళు గ్రామం అంతా తిరుగుతోందని, ఏది కనబడితే అది తినేస్తోందని, మనుషులు ఎవరైనా బయట కనబడితే రక్తం కక్కుకొని చచ్చిపోతారని ఒకటే భయంకరమైన పుకారు ఊరంతా గుప్పుమంటోంది. ముసలోళ్ళు మునగదీసి పడుకుంటే, పడుచోళ్ళు చడీచప్పుడూ లేకుండా పడున్నారు. చంటాళ్ళకి బువ్వపెట్టడం సులువైంది తల్లులకి. చదువుకునే కుర్రాళ్ళు భయపడకపోయినా, నమ్మకపోయినా పెద్దాళ్ళ మాటకు విలువ ఇచ్చి ఇంట్లో ఉండిపోయారు. మొత్తం మీద ఆ ఊరి జనం భయం భయంగానే కాలం గడుపుతున్నారు. కొంతమందికి బయట గజ్జెల చప్పుడు వినబడిందని చెప్పుకున్నారు. మరొకరికి ఏదో నిలువెత్తు ఆకారం చీకట్లోంచి నడిచి  వెడుతున్నట్టనిపించిందని, బయలుకి వచ్చిన కొంతమంది ముసలాళ్ళు గుండె ఆగి చనిపోయారు అని, రకరకాల పుకార్లు ఊరంతా ప్రచారం.

‘‘ఏంటయ్యా! ఇంత చిన్న ఊరిలో జనం అంతా చీకటి పడకుండానే తలుపులు బిడాయించుకుంటున్నారు?’’ కానిస్టేబుల్‌ నరసింహాన్ని అడిగాను. 
‘‘బర్రెమ్మ అమ్మోరు ఊర్లో తిరిగి జనాన్ని పీక్కతింటందని సెప్పుకుంటున్నారండి’’ అతనూ అదే సమాధానం.
‘‘హ్హ ! హ్హ!  జనం ఎంత పిచ్చాళ్ళయ్యా! ఈ రోజుల్లో అమ్మవారు తిరగడం, జనం నమ్మడమూనా! అంతా ట్రాష్‌’’ అని గట్టిగా నవ్వాను. 
‘‘ఆ తల్లిని అనుమానించకండి సర్‌! మీకు తెల్దు. మా చిన్నప్పుడు అమ్మ ముందు ఒకడు అవాకులు చవాకులు పేలితే మర్నాడు పొద్దున్నకి ఊరవతల మర్రిచెట్టు కింద రత్తం కక్కుకుని చచ్చిపడున్నాడు. చాలా పవర్‌ ఫుల్‌ అమ్మోరండి’’ అని వణికిపోతూ చెప్పాడు. 
‘‘సర్లే నీకు, నాకు సరిపడదుగానీ ఓ టీ చెప్పు!’’ అని పనిలో పడిపోయాను.

ఎవరో తలుపు దబ దబ బాదుతున్నారు. వాచీ చూసుకున్నాను. ఉదయం ఐదుగంటలైంది. ఇంత పొద్దున్నే ఎవడాని తలుపు తీశాను. చెమటతో ఒళ్ళంతా  తడిసిపోయి, నరసింహులు గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. 
‘‘ఏమైందయ్యా?’’  
‘‘సాంబయ్యను బర్రెమ్మ చంపేసిందండి’’ అని ఆయాస పడుతూ చెప్పాడు. 
గబగబ యూనిఫాం వేసుకుని, గవర్నమెంటు హాస్పిటల్‌ డాక్టర్‌ రామారావుకి  కవురంపాను. సిద్ధంగా ఉండమని. ఇద్దరం వెళ్ళే చూసే సరికి సాంబయ్య శవం పరమ భయంకరంగా ఉంది. గుడ్లు బయటకి వచ్చేసి, నోట్లోంచి కారిన రక్తం చారికలు చొక్కామీద ఎండిపోయి ఉన్నాయి. సాంబయ్య వయస్సు ఇరవై ఉంటుంది. చుట్టూ ఉన్న జనాన్ని మా కానిస్టేబుల్స్‌ అదుపులో పెడుతున్నారు. సాంబయ్య తల్లి బోరుబోరు మని ఏడుస్తోంది. జాలి వేసింది. ఊరి సర్పంచ్‌ పల్లయ్య నాయుడు, పంచాయతీ స్టాఫ్‌ అక్కడ నిలబడి ఉన్నారు. అందరి మొహాల్లోనూ భయం. ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసి, శవాన్ని పోస్టుమార్టంకి పంపాను. నెమ్మదిగా శవం పడి ఉన్న చుట్టుపక్కల పరిశీలించాను. అంతా బురద బురదగా ఉంది. అక్కడక్కడ అడుగుల ముద్రలు కనబడ్డాయి. పక్కనున్న చెరువులో తూటు మొక్కలు ఆ బురద మీద బయటపడేసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా కలుపు, ముళ్ళతో ఉన్న పిచ్చి మొక్కలతో నిండి ఉంది. పెనుగులాటకు గురి అయ్యినట్టు, మట్టి పైకి లేచినట్టు అక్కడక్కడ కనబడింది. ఎంత తరచి తరచి చూసినా ఏమీ క్లూ దొరకలేదు.

నరసింహం మటుకు ‘‘బర్రెమ్మ తల్లి మా ఊరి మీద ఎంత కోపంగా ఉందో’’ అని గొణుక్కుంటున్నాడు.
కాస్త దూరంగా ఉన్న పెద్ద పెద్ద ఊడల మఱి< చెట్టు ఒకటే సాక్షిగా కనిపించింది. కాస్త దూరంగా బర్రెమ్మ గుడి, దాని ముందు నిలబడిన త్రిశూలం కనబడ్డాయి. నడుచుకుంటూ అక్కడకు వెళ్ళాను. కూడా నరసింహం అమ్మకి దణ్ణాలు పెట్టుకుంటూ వస్తున్నాడు. అక్కడి వరకు చెప్పి గ్లాసులో ఐస్‌ ముక్కలేసుకుని కాస్త విస్కీ పోసుకున్నాడు మరో రౌండుకి. ఉమాపతి ఊపిరి బిగబెట్టి వింటున్నాడు. గ్లాసులో విస్కీ ఖాళీ అవుతున్నా, మత్తు ఎక్కడం లేదు. ‘‘తర్వాత ఏం జరిగింది...?’’ ఆతృతగా అడిగాడు ఉమాపతి.     
‘గర్భగుడి తలుపులు తెరిచి ఉన్నాయి. అమ్మ స్వరూపం మహోగ్రరూపంలో ఉంది. అందరినీ కాపాడే తల్లివి నువ్వు. ఇలా మనుషుల్ని చంపుతావా ! నేను నమ్మను’ అని మనసులో అనుకున్నాను. పూజారి పేరు వీరభద్రం అని చెప్పాడు నరసింహం. ఆరడుగుల ఎత్తున్న అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తున్నాడు. లోపలికి చూసిన నాకు ముందు గదిలో పువ్వులు, కుంకుమ, పసుపు పళ్ళాల్లో పెట్టి కనిపించాయి. మమ్మల్ని చూసిన వీరభద్రం కంగారు పడుతూ లేచాడు. అతను నల్లగా మినుములు పోతపోసిన గుట్టలా ఉన్నాడు. నుదుటికి అడ్డంగా విభూది, నిలువుగా కుంకుమ బొట్టు, జుట్టుని కొప్పుగా కట్టిన తలకట్టుతో, కళ్ళకి కాటుక రాసుకొని, ఆ కళ్ళల్లో ఎర్రజీరతో కనిపించాడు. నడుముకి ఉన్న ఎర్రపంచెను తోలు బెల్టుతో కట్టాడు. పెద్ద బానపొట్ట, కాళ్ళకు పారాణి పెట్టుకున్నాడు.
మమ్మల్ని చూసి ‘‘ఏం కావాలి సారు?!’’ అని అడిగాడు వినయంగా,        
‘‘రాత్రి నువ్వెక్కడ ఉన్నావు?’’
‘‘ఇంట్లోనే సర్‌!’’
‘‘మీ ఇల్లెక్కడ ?’’ 
‘‘ఈ గుడి వెనకాల సర్‌!’’  
‘‘రాత్రి నీకు కేకలు ఏమైనా వినబడ్డాయా?’’ 
‘‘లేదండీ!’’      
‘‘సాంబయ్య చచ్చిపోయాడని తెలుసా?’’  అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను.
‘‘బర్రెమ్మ తల్లి పట్ల అపచారం జరిగిందన్నమాట. ఆ తల్లి ఆకలితో ఉందండి. జాతర జరపాలండి! అమ్మని క్షమించమని అడగాలండి. అప్పుడైనా అమ్మ శాంతిస్తుందేమోనండి!’’  కళ్ళు మూసుకుని ప్రశాంతంగా  మాట్లాడాడు.                                                                                                        
‘‘సర్లే ! సర్లే! అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. స్టేషన్‌కి వచ్చి కనబడాలి’’ 
‘‘అలాగే సారు!’’ అని లోపలికి వెళ్ళాడు.

పోస్టుమార్టం రిపోర్టులో కొత్త విషయాలేమీ బయటపడలేదు. గొంతు నొక్కుకుపోయినట్టు, ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుని మరణించి ఉండవచ్చని రాశాడు డాక్టర్‌. ఊరిలో అడుగుపెట్టిన నెలరోజులకే ఈ కేసు నాకు తలనొప్పి తెప్పించింది. ఎక్కడా తాడూబొంగరం లేదు. సాంబయ్య తల్లి మీరమ్మని ‘ఎవరి మీద అయినా అనుమానం ఉందా?’ అని అడిగాను. చెప్పలేకపోయింది. చాలా సేపు ప్రశ్నించాను. అయినా చెప్పలేకపోయింది. 
‘‘ఆ రోజు నీ కొడుకు ఎందుకు బయటకి వచ్చాడు?’’ అడిగాను.
‘‘పొలం కళ్ళెంలో కోసిన పంట ఉంది బాబు. కాపలా పడుకోడానికి వెళ్ళాడు. మరి పొలంలో పడుకోక, బయటకి ఎందుకు వచ్చాడో తెలియడంలేదు’’ అంది. 
ఏం చేయాలో తెలియక కేసు విషయాలు పై వాళ్ళకి తెలియజేసి ఊరుకున్నాను.

‘తర్వాత ఏం జరిగింది ?’’ ప్లేట్‌లో ఉన్న జీడిపప్పు నోట్లో పెట్టుకుంటూ అడిగాడు ఉమాపతి.
‘‘ఆరు నెలలు అయ్యింది. పైనుంచి చీవాట్లు. ఫైల్‌ మూసేశాము. కానీ కళ్ల ముందు కొడుకు కోసం ఏడుస్తున్న మీరమ్మ కనబడి నిద్రపట్టేది కాదు’’ 
‘‘ రాత్రిళ్లు ఊరి పరిస్థితి ఏంటి?’’ ఉమాపతి అడిగాడు .
‘‘అదే సందేహం నాకూ వచ్చింది. రాత్రిళ్లు నేను కాపలా కాసినన్నాళ్లూ ఆశ్చర్యంగా ఏ విధమైన గజ్జెల చప్పుడూ వినబడలేదు. కానీ చివరకు క్లూ దొరికింది’’ తాపీగా సిగరెట్టు నోట్లో పెట్టుకుని లైటర్‌తో వెలిగిస్తూ  చెప్పాడు భాస్కర్‌.
తాగుతున్న గ్లాసు పక్కన పెట్టి ‘‘క్లూ దొరికిందా! ఎలా ? చెప్పు చెప్పు’’ అని ముందుకు వంగాడు ఉమాపతి.
‘‘ఆరోజు సర్పంచి పల్లయ్య నాయుడు కూతురి పెళ్ళికి వెళ్ళాను. ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాడు నాయుడు. భోజనాలు అయ్యాక ‘సారు! వచ్చే ఆదివారం అమ్మవారి జాతర. ఊరి జనం భయపడుతున్నారు. అమ్మవారికి జాతర జరిపిస్తే ఊరికి పట్టిన అరిష్టం పోతుందని గుడి పూజారి వీరభద్రం చెప్పాడు. ఊరేగింపు కూడా పెట్టాం. తమరు పర్మిషన్‌ ఇవ్వాల’ అని రిక్వెస్ట్‌ చేశాడు. ‘సరే! గొడవలు లేకుండా జరిపించండ’ని పర్మిషన్‌ ఇచ్చాను’’

జాతర బ్రహ్మాండంగా జరుగుతోంది. వీరభద్రం దగ్గరుండి అన్నీ జరిపిస్తున్నాడు. నాయుడు  దర్జాగా ఇంటి అరుగు మీద కూర్చుని, మధ్య మధ్యలో ఊరంతా తిరుగుతూ, బాణసంచా కాల్పిస్తున్నాడు. పులి వేషగాళ్ళు, గరగ డాన్సు వాళ్ళు డప్పు శబ్దాలకు లయబద్ధంగా నాట్యం చేస్తున్నారు. నేను పదిమంది కానిస్టేబుల్స్‌ను తీసుకొని, ఊరంతా బందోబస్తు కట్టుదిట్టం చేశాను. అర్ధరాత్రయ్యింది. వీరభద్రం ప్రతి ఏడాది అమ్మవారిలా చేసే నృత్యం చేస్తున్నాడు. అమ్మవారిలా చీర కట్టుకున్నాడు. అమ్మోరు పూనినట్టు వీరంగం వేస్తున్నాడు. వెనకాల డప్పులు కొడుతున్న వాళ్ళ చేతి నరాలు పొంగుతున్నాయి. దానికి లయబద్ధంగా ఇతను చేస్తున్న నృత్యం చూసి నేను కూడా ఆశ్చర్యపోయి అప్రయత్నంగా దణ్ణం పెట్టాను. నా దృష్టి అతని కాళ్ళ మీదే ఉంది. వెంటనే నా మస్తిష్కానికి వచ్చిన ఒక సందేహం, నన్ను జాగరూకుడిని చేసింది. ‘అమ్మ గజ్జెల చప్పుడు వినిపిస్తోంది రాత్రిళ్లు’ అనే మాట స్ఫురణకి వచ్చింది. వీరభద్రం కాళ్ళ వైపు చూశాను. అతని ఆట అయ్యి, అలసిపోయి ఒక చోట కూర్చున్నాడు. కాగడాల కాంతిలో అతని కాళ్ళకి కట్టుకున్న గజ్జెల దండలో రెండు మువ్వలు లేకుండా ఖాళీగా కనబడింది. వెంటనే, నరసింహాన్ని తీసుకొని, సాంబయ్య చనిపోయిన స్థలానికి వెళ్ళి బ్యాటరీ లైట్ల కాంతిలో వెతకడం మొదలుపెట్టాము.
‘‘నరసింహం! ఎక్కడైనా మువ్వలు దొరికితే చెప్పు’’ గట్టిగా అరిచాను. 
తెల్లవారింది. లోకసాక్షి ఉదయించాడు. ఆ వెలుగు అక్కడ ఉన్న మొక్కల మీద పడుతోంది. నా కళ్ళు సూర్య కాంతిని మించి పరిశీలిస్తున్నాయి. దొరికింది ఒక మువ్వ.. తుప్పల మీద నిలవ ఉన్న నీటిలో స్వచ్ఛమైన నిజంలా మెరుస్తూ. మరొకటి నరసింహం మొక్కల మధ్యలో దొరకబుచ్చుకున్నాడు.

‘‘వెంటనే వీరభద్రాన్ని నాలుగు పీకి నిజం రాబట్టాను’’ తాగుతున్న గ్లాసు పక్కన పెట్టాడు భాస్కర్‌.
‘‘వీరభద్రం అంత పని ఎందుకు చేశాడు? సాంబయ్యకు అతనికి ఏమిటి గొడవ? మీరమ్మని దిక్కులేని దాన్ని చేశారు కదా పాపం’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఉమాపతి.
‘‘వీరభద్రం చంపలేదు... సాయం చేశాడు’’ 
‘‘మరి ఎవరు చంపారు?’’
‘‘చంపినవాడు పల్లయ్య నాయుడు’’ అని తాపీగా బాటిల్లో విస్కీ గ్లాసులో పోసుకున్నాడు భాస్కర్‌.
‘‘ఆ.. ! మళ్ళీ ఇదేం ట్విస్టు?’’ 
‘‘నాయుడి కూతురు, కాలేజీలో చదువుతున్న సాంబయ్య ప్రేమించుకున్నారు. అది తెలిసిన నాయుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ‘ఆడి కులమేటి! నా కులమేటి! ఆడి అంతస్తేమిటి!  ఆడికి నా కూతురు కావలిసి వచ్చిందా?’ అని శివాలెత్తిపోయి, అతనికి నమ్మిన బంటు అయిన వీరభద్రానికి విషయం చెప్పాడు. డైరెక్టుగా గొడవ చేస్తే అసలే మొండిదైన కూతురు ఏ అఘాయిత్యం చేస్తుందో అని భయపడి, ఇలా ఒక నెల ముందు నుంచి, వీరభద్రం అమ్మవారిలా అర్ధరాత్రిళ్లు గజ్జెలతో నడిచి, ఊరి మధ్యలో పుకారు వ్యాపింప చేశారు. నెమ్మదిగా ఒక రోజు ప్లాన్‌ చేసి, సాంబయ్యని మట్టుపెట్టారు. నాయుడు.. సాంబయ్య పీక నొక్కి, గుండెల మీద కాలు వేసి తొక్కి చంపాడు. అతనికి సాయం చేసే హడావుడిలో వీరభద్రం కాళ్ళకి ఉన్న గజ్జెల్లో రెండు తెగి పడ్డాయి. అది చూసుకోలేదు. మనకు అదే ఆధారం అయ్యింది. ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు’’ అన్నాడు భాస్కర్‌.
‘‘ఊరికి భయం అనే జ్వరం తగ్గింది’’ అని నవ్వాడు ఉమాపతి.
- చాగంటి ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement