ఆమె నా భార్య కాదు! | Suspense Crime Story On Funday | Sakshi
Sakshi News home page

సార్‌, ఆమె నా భార్య కాదు!

Published Sun, Jan 31 2021 10:34 AM | Last Updated on Sun, Jan 31 2021 11:30 AM

Suspense Crime Story On Funday - Sakshi

‘‘సార్‌! ఆమె నా భార్య కాదు!’’ అన్న ఆ వ్యక్తి వంక ఆశ్చర్యంతో చూశాడు క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌.
ఆ వ్యక్తికి  ముప్పయ్యేళ్ళుంటాయి. అతను చెప్పిన వివరాలు ఇవి...
అతని పేరు దిలీప్‌. ఏడాది కిందట ముంబయ్‌కి చెందిన అంజలితో వివాహమయింది. తల్లిదండ్రులు ఓ ప్లేన్‌ క్రాష్‌లో చనిపోవడంతో కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలయిందామె. నాలుగురోజుల కిందట బిజినెస్‌ టూర్‌లో చెన్నై వెళ్ళారు దంపతులు. హోటల్‌ లీలామహల్‌ ప్యాలెస్‌లో బస చేశారు. నుంగంబాకంలో వున్న తన స్నేహితురాలితో రెండురోజులు గడిపివస్తాననీ చెప్పి వెళ్ళిపోయింది అంజలి. తిరిగిరాలేదు. ఆమె మొబైల్‌ ఫోన్‌ అందుబాటులో లేదు. పోలీసు కంప్లెయింట్‌ ఇచ్చి, ఓ బిజినెస్‌ డీల్‌ ఉండడంతో కిందటి రోజే  హైదరాబాద్‌ వచ్చాడు.  
‘‘సార్‌! బేగంపేటలోని హోటల్‌ వివాంతాలో బస చేశాను. ఈరోజు ఉదయం బైటకు వెళ్ళిన నేను తిరిగి హోటల్‌కు వచ్చేసరికి రాత్రి అయింది. రూమ్‌ లాక్‌ తీసి లోపలికి వెళ్లిన నాకు షాక్‌..  ఓ అపరిచిత యువతి నా బెడ్‌ రూమ్‌లో పడుకునివుంది! తానే నా భార్యనంటోంది!’’ చెప్పాడు దిలీప్‌. 
ఆ కేసు చిత్రంగా అనిపించింది శివరామ్‌కి– ‘ఓ స్త్రీ ..ముక్కూ మొగమూ ఎరుగని పరపురుషుడికి భార్యనని చెప్పుకోవడం సంభవమేనా!?’ అనుకుంటూ  ‘‘పదండి, హోటల్‌కి వెళదాం’’ అంటూ కుర్చీలోంచి లేచాడు శివరామ్‌.

‘‘భగీరథ గారూ! ఆమె  నా భార్య కాదు. మీరే నన్ను సేవ్‌ చేయాలి’’ అన్నాడు దిలీప్‌. 
‘‘మీ భార్య అదృశ్యం గురించి చెన్నయ్‌ పోలీసులు పరిశోధిస్తున్నారని చెప్పారుగా?’’ అన్నాడు డిటెక్టివ్‌ భగీరథ.
 ‘‘ఔను. మీరు చేయవలసిందల్లా ఆ నకిలీ స్త్రీని ఎక్స్‌పోజ్‌ చేయడమే’’ చెప్పాడు దిలీప్‌.
వివరాలు అడిగి తెలుసుకుని.. నోట్‌ చేసుకున్నాడు భగీరథ. ఓ అంశం ఆలోచనలో పడేసిందతణ్ణి.

ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌ని కలిసిన డిటెక్టివ్‌ భగీరథకు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
‘ఇంపోస్టర్‌గా చెప్పబడుతున్న ఆ స్త్రీ వద్ద అంజలి సెల్‌ ఫోన్‌ ఉంది. ఆమె సూట్‌ కేస్‌ తాళంచెవి కూడా ఉంది. సూట్‌ కేసులోని దుస్తులు ఆమెకు సరిగ్గా సరిపోతున్నాయి. ఆమె సెల్‌ఫోన్‌లో ఉన్న దంపతుల ఫొటో వారిద్దరిదే! చివరకు ఆమె వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టుకున్న జాయింట్‌ ఫొటోలో కూడా ఆమె, దిలీప్‌ ఉన్నారు! అంతేకాదు, అంజలి స్నేహితురాళ్ళకు వీడియో కాల్‌ చేస్తే, ఆ స్త్రీ అంజలే అని నిర్ధారించారు అందరూ!’
‘‘ఆ దిలీప్‌గాడు ఓ నట్‌లా ఉన్నాడు. స్వంత పెళ్ళాన్ని పట్టుకుని ఇంపోస్టర్‌ అంటున్నాడు. అతణ్ణి సైకియాట్రిస్ట్‌కి అప్పగించాల్సిందే’’ అన్నాడు శివరామ్‌.
‘‘ఇందులో ఏదో పెద్ద కాన్‌స్పిరసీయే ఉందేమోననిపిస్తోంది నాకు’’ అన్నాడు భగీరథ సాలోచనగా. 
హోటల్‌ వివాంతాకి వెళ్ళి ఆ స్త్రీని కలిశాడు భగీరథ. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచి, అందులో ఉన్న తమ జాయింట్‌ ఫొటోగ్రాఫ్‌ని చూపించిందామె. సెల్‌ఫోన్‌ నుంచి ఎవరికో వీడియో కాల్‌ చేసింది. అవతల ఒక  యువతి పిక్చర్‌లోకి రాగానే.. ‘‘హాయ్, సరితా!’’ అంది. వెంటనే ఆ యువతి, ‘‘హాయ్, అంజలీ! ఏం చేస్తున్నావే?’’ అనడిగింది నవ్వుతూ. 
‘‘ముందు నాకీ విషయం చెప్పవే. మొన్న చెన్నయ్‌లో ఉన్న నాలుగు రోజులూ నేను ఎక్కడ ఉన్నానే?’’ అనడిగింది.
 ‘‘ మా ఇంట్లోనేగా? ఏం?’’ అంది సరిత. 
‘‘దిలీప్‌కి నిజంగానే మతిభ్రమించిందా!?’ అనుకుని విస్తుపోయాడు డిటెక్టివ్‌. 

అసిస్టెంట్‌ భావనను ముంబయ్‌ పంపించి, తాను చెన్నయ్‌ వెళ్ళాడు భగీరథ. డీజీపీని కలసి అంజలి ‘అదృశ్యం’ కేసులో పురోగతి లేదని తెలుసుకున్నాడు. అనంతరం హోటల్‌ లీలామహల్‌ ప్యాలెస్‌కి వెళ్ళాడు. 
నిర్ణీత తేదీన దిలీప్‌ దంపతులు తమ హోటల్లో చెకిన్‌ అయ్యారనీ, మర్నాటి ఉదయం ఔటింగ్‌కి వెళ్ళారనీ, రెండోరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక్కడే తిరిగివచ్చాడనీ ‘మేడమ్‌ స్నేహితుల ఇంట్లో వుంద’ని’ బెల్‌ బాయ్‌తో చెప్పాడనీ వివరించాడు మేనేజర్‌. వారికోసం అద్దెకారును హోటలే ఏర్పాటు చేసింది. అది వైట్‌ కలర్‌ టయోటా కారు. దాని రిజిస్ట్రేషన్‌ నంబర్‌: TN–06–CA–5995. సెల్ఫ్‌–డ్రైవ్‌. 
ఆ కారు లాగ్‌బుక్‌ని తెప్పించి పరిశీలించాడు భగీరథ. మొదటి రెండురోజుల్లో సుమారు 1100 కిలోమీటర్ల దూరం తిరిగింది. కొడైకెనాల్‌ గురించి అంజలి తనను కాజ్యువల్‌గా అడిగినట్టు చెప్పింది రిసెప్షనిస్ట్‌. 
‘అంజలి’గా చెప్పుకుంటున్న యువతి ఫొటోను ఆమెకు తెలియకుండా తన సెల్‌లో తీశాడు భగీరథ. ‘‘దిలీప్‌తో వచ్చిన యువతి ఈమెనే?’ తన సెల్‌లోని ఫోటో చూపించి అడిగాడు హోటల్‌ సిబ్బందిని. 
‘కాదు’ అన్నారు.  
ముంబై నుంచి భావన పంపించిన అంజలి ఫొటోని చూపిస్తే .. గుర్తుపట్టారు! 
అద్దెకారులో కొడైకెనాల్‌కి బైలుదేరాడు భగీరథ. చెన్నయ్‌–కొడైకెనాల్‌ నడుమ ఉన్న ఒక్కో టోల్‌ప్లాజా దగ్గరా ఆగి, దిలీప్‌ దంపతులు కొడైకెనాల్‌కి వెళ్ళారనుకుంటూన్న తేదీ ఎంట్రీలను పరిశీలించాడు. వైట్‌కలర్‌ టయోటా కారు వాటిగుండా వెళ్ళినట్టూ, డ్రైవర్‌ పక్కన ఓ యువతి ఉన్నట్టూ.. మరుసటి రోజున తిరుగు ప్రయాణమైనట్టూ... అప్పుడు కారులో డ్రైవర్‌ తప్ప ఇంకెవరూ  లేనట్టూ... సీసీ కెమేరాలలో నమోదయింది. 
భగీరథ కొడైకెనాల్‌ చేరుకునేసరికి రాత్రి అయింది. దాంతో మర్నాడు... దిలీప్‌ దంపతులు నిర్ణీత తేదీన సెయింట్‌ మేరీస్‌ రోడ్‌లో ఉన్న తామరై కోడై హోటల్‌లో బస చేసినట్టు తెలుసుకున్నాడు. ఆ దంపతులు నిర్ణీత తేదీన రాత్రి ఏడు గంటల సమయంలో వచ్చారనీ, మర్నాటి ఉదయం ఏడు గంటలకే దిలీప్‌ ఒక్కడూ వచ్చి చెకవుట్‌ చేశాడనీ తేలింది. హైద్రాబాద్‌కు తిరిగివచ్చిన డిటెక్టివ్‌  తిన్నగా ‘అంజలి’గా చెప్పుకుంటున్న ఆ స్త్రీ వద్దకు వెళ్లాడు. తాను సేకరించిన సాక్ష్యాధారాలతో ఆమెను కన్‌ఫ్రంట్‌ చేశాడు.

ఆరోజు రాత్రి దిలీప్‌తో పాటు డిన్నర్‌కి వెళ్ళలేదు ‘ఆమె’. దిలీప్‌కి ఆమెను చూస్తూంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. తన మాటలను ఎవరూ నమ్మడంలేదు. కానీ నిజం తనకు తెలుసు. తనకే తెలుసు! 
దిలీప్‌ బార్‌కి వెళ్ళి బాగా తాగాడు. డిన్నర్‌ ముగించి సూట్‌కి వచ్చాడు. 
బెడ్‌ మీద పడుకుని టీవీలో ప్రోగ్రామ్స్‌ చూస్తోందామే.   
ఆవేశం ముంచుకొచ్చిందతనికి. ‘‘చెప్పు, ఎవరు నువ్వు? చెప్పకపోతే చంపేస్తాను!’’ అన్నాడు.
‘‘నీ భార్య అంజలిని!’’ కూల్‌గా అందామె.
‘‘’’నో!’’ గట్టిగా అరచాడతను. ‘నువ్వు అంజలివి కాదు. ఎందుకంటే అంజలి లేదు!’’ 
‘‘నా మీద నకిలీ ముద్ర వేసి నా ఆస్తంతా కాజేయాలనుకుంటున్నావు కదూ?’’ కోపంగా అంది.
‘‘నాన్సెన్స్! ఆస్తిని కాజేయాలనుకుంటున్నది నువ్వే. అంజలి చచ్చిపోయింది!’’ రెచ్చిపోయాడు.
‘‘అంత ఖచ్ఛితంగా ఎలా చెప్పగలవ్‌?’’
‘‘ఎలా అంటే తనను నేనేం స్వయంగా చంపేశాను కనుక!’’ స్వీటంతా దద్దరిల్లేలా అరిచాడు. 
‘‘నువ్వే చంపేశావా?’’ 
‘‘ఎస్‌. కొడైకెనాల్‌లో సూయిసైడ్‌ పాయింట్‌ దగ్గర లోయలోకి  తోసేశా’’ 
‘‘దట్స్‌ ఇట్‌!’’ అంటూ చటుక్కున పైకి లేచిందామె. 
అదే సమయంలో యాంటీ–రూమ్‌ నుంచి బైటకు వచ్చారు డిటెక్టివ్‌ భగీరథ, ఇన్‌స్పెక్టర్‌ శివరామ్‌లు. 

క్రైమ్‌ బ్రాంచ్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ లో ఆ కేసు  పూర్వా పరాలను వివరించాడు డిటెక్టివ్‌ భగీరథ.
‘రెండేళ్ళ కిందట.. అంజలికి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు దిలీప్‌. ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్‌ చేసి పెళ్ళిచేసుకున్నాడు. ఆస్తిలో సగం తనకు రాసివ్వమని ఒత్తిడిచేయడం మొదలుపెట్టాడు. తన తదనంతరం అతనే వారసుడంటూ దాటవేస్తూ వచ్చిందామె. అంజలిని తొలగిస్తే తప్ప ఆస్తి తనకు సంక్రమించదనుకున్న దిలీప్‌.. ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. బిజినెస్‌ టూర్‌ మీద చెన్నై వెళ్ళారు దంపతులు. కొడైకెనాల్‌ తీసుకువెళ్ళి, మార్నింగ్‌ వాక్‌ సమయంలో సూయిసైడ్‌ పాయింట్‌ దగ్గర  ఏమరుపాటుగా వున్న అంజలిని క్లిఫ్‌ మీదనుంచి కిందకు తోసేశాడు దిలీప్‌. ఆమె చనిపోయిందనుకుని వెంటనే చెన్నయ్‌కి తిరిగివచ్చేశాడు. అదృష్టవశాత్తూ  క్లిఫ్‌ అంచున పెరిగిన ఓ చెట్టుకొమ్మను పట్టుకుని నిలువరించుకుంది అంజలి. ఆమె అరుపులు విన్నవారు ఫైర్‌ సర్వీస్‌కి ఫోన్‌ చేయడమూ, వాళ్ళు వచ్చి ఆమెను కాపాడ్డమూ జరిగాయి. ట్రామాకి గురైన అంజలి పైకి రాగానే çస్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఓ లోకల్‌ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించారు.

మర్నాడు తెలివిలోకి వచ్చిన అంజలికి భర్త హోటల్‌ గది ఖాళీచేసి వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాంతో అతని కుట్ర బోధపడిందామెకు. భుజానికి తగిలించుకున్న హ్యాండ్‌ బ్యాగ్‌ జారిపోకుండా వుండడం విశేషం. ఆమె మొబైల్‌ ఫోన్‌ అందులోనే ఉంది. చెన్నయ్‌లోని తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి జరిగిందంతా చెప్పింది. ఆమె వెంటనే కొడైకెనాల్‌కి వచ్చి అంజలిని తనతో తీసుకువెళ్ళింది. చెన్నయ్‌కి తిరిగివచ్చిన దిలీప్‌ తన భార్య అదృశ్యమయిందంటూ ఫార్మల్‌గా పోలీస్‌ కంప్లెయింట్‌ ఇచ్చి, హైద్రాబాద్‌ కి చెక్కేశాడు. ముఖాముఖీ కన్‌ఫ్రంట్‌ చేస్తే అతను నేరం ఒప్పుకోడు. రుజువు చేయడం కూడా కష్టమే. అందుకే అతని పద్ధతిలోనే నాటకమాడి ఎక్స్‌పోజ్‌ చేయాలని నిశ్చయించుకున్నారు. అంజలి స్నేహితురాళ్లూ అందులో భాగమే. ఒకామె అంజలిగా హైద్రాబాద్‌లో దిలీప్‌ బసచేసిన హోటల్లో ప్రవేశించడం. ఫేస్‌బుక్‌లో, వాట్సాపలో, మొబైల్‌లో ఫొటోలను మార్ఫింగ్‌ చేసీ, ఇతరత్రానూ ఆమే అంజలి అంటూ అతనికి పిచ్చెక్కేలా చేశారు.

దిలీప్‌.. డిటెక్టివ్‌ భగీరథ సాయం కోరింది.. అదృశ్యమైన భార్యను కనిపెట్టడానికి కాదు ఇంపోస్టర్ని  ఎక్స్‌పోజ్‌ చేయడానికి! అదే డిటెక్టివ్‌లో ఆలోచనలను రేపింది. డిటెక్టివ్‌ సాయం కోరడం ద్వారా తాను చేసిన నేరం నుంచి తప్పించు కోవచ్చను కున్నాడు. డిటెక్టివ్‌కి తాను తీగనందించాడనీ, అతను డొంకంతా కదల్చగలడనీ ఊహించలేకపోయాడు.
పరిశోధన మొదలుపెట్టిన భగీరథ చెన్నయ్, కొడైకెనాల్, నోయిడాలను దర్శించి దిలీప్‌ నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. అంజలిగా వచ్చిన యువతి ఇంపోస్టర్‌ అని గ్రహించాడు. తాను సేకరించిన సమాచారంతో ఆమెను కన్‌ఫ్రంట్‌ చేశాడు. దాంతో నిజం చెప్పేసిందామె. దిలీప్‌ని ఎక్స్‌పోజ్‌  చేసేందుకు స్నేహితురాళ్ళు ఆడుతున్న నాటకంగా వివరించింది. డిటెక్టివ్‌ సలహా ప్రకారం ఆ రోజు రాత్రి డిన్నర్‌కి వెళ్ళలేదామె. దిలీప్‌ కిందకు వెళ్ళగానే డిటెక్టివ్, ఇన్‌స్పెక్టర్‌లు సూట్‌లో ప్రవేశించి సీక్రెట్‌ కెమేరాను అమర్చి, బగ్‌ చేసి, యాంటీ–రూమ్‌లో దాక్కున్నారు. దిలీప్‌ తిరిగిరాగానే అతన్ని రెచ్చగొట్టవలసిందిగా ఆమెతో చెప్పారు. రెస్ట్‌ ఈజ్‌ హిస్టరీ. పోలీసులు అంజలినీ, ఇంపోస్టర్‌గా వచ్చిన ఆమె స్నేహితురాలినీ ప్రవేశపెట్టడంతో వారిని చూసి తల వంచుకున్నాడు దిలీప్‌.
- తిరుమలశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement