అరగంట క్రితమే తెల్లవారింది. ఇన్‌స్పెక్టర్ విజయ్ బృందావన్ పార్కులో చేరుకునేసరికి అప్పటికే అక్కడున్న పోలీస్‌లు, ఫోరెన్సిక్ నిపుణులు తమ పనుల్లో నిగమగ్నమై ఉన్నారు. పార్కు చివర గుబురు చెట్ల మధ్య నేలపై ఓ యువకుడి మృతదేహం బోర్లా పడివుంది.
పదునైన కత్తితో గొంతు కోయడం వల్ల యువకుడు మరణించాడని చూడగానే తెలుస్తోంది. అతడి వయసు 30 ఏళ్లు ఉండొచ్చు. శవాన్ని ముందుగా చూసి పోలీసులకు సమాచారం అందించిన తోటమాలిని ప్రశ్నించాడు విజయ్. ‘‘సార్, నేను ఎప్పటిలాగే తెల్లవారినప్పుడు పార్కంతా తిరుగుతూ ఇక్కడికొచ్చి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. మొదట ఇతడు తప్పతాగి ఇక్కడ పడుకున్నాడునుకున్నాను. కాని గడ్డకట్టిన రక్తం చూడగానే విషయం అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను’’ అన్నాడు తోటమాలి.తర్వాత శవం జేబులో ఉన్న ఐడీ కార్డ్ ఆధారంగా పోలీసులు ఆ యువకుడి వివరాలు సేకరించారు. అతడి పేరు మహేష్. నగరంలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. మరో నెల రోజుల్లో నీలిమ అనే యువతితో అతడి పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.
ఇన్‌స్పెక్టర్ విజయ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. హంతకుడు మహేష్ జేబులోని డబ్బు, సెల్‌ఫోన్ ముట్టుకోలేదు కాబట్టి ఈ హత్య దోపిడీ కోసం జరగలేదని అతడు నిర్ధారణకొచ్చాడు. మహేష్ కుటుంబ సభ్యుల్ని విచారిస్తే మహేష్‌కి ఎవరితోనూ వైరం లేదని తెలిసింది. మహేష్ తన కాల్‌సెంటర్‌లో పనిచేసే నీలిమను ప్రేమించాడని, నెలరోజుల్లో పెళ్లివుందనగా ఈ హత్య జరిగిందని వారు తెలిపారు. దాంతో ఈ హత్యకు మహేష్ పెళ్లితో సంబంధం ఉందని విజయ్‌కి అనుమానం కలిగింది. వెంటనే నీలిమ ఇంటికి వెళ్లాడు.
ఆ ఇంట్లో నీలిమతో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లు, తండ్రి చలపతిరావు ఉన్నారు. చలపతిరావు గతంలో మిలటరీలో పనిచేశాడు. తీవ్రవాద దాడిలో ఓ చేతిని కోల్పోయాడు. నీలిమ డిగ్రీ వరకు చదువుకొని కాల్‌సెంటర్‌లో పనిచేస్తోంది. ఆమె చెల్లెళ్లు ఒకరు ఇంటర్, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. చలపతిరావు తన గురించి చెప్పుకున్నాడు. ‘‘టెర్రరిస్ట్ ఎటాక్‌లో నా ఎడమ చెయ్యి పోయింది. నాకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో పిల్లల్ని చదివించాను. అవసరార్థం పలుచోట్ల నైట్ వాచ్‌మెన్‌గా పనిచేశాను. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో నా భార్య మరణించింది. డిగ్రీ పూర్తిచేశాక నీలిమకు గత ఏడాది కాల్‌సెంటర్‌లో ఉద్యోగం వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఆమె పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అంతలోనే ఈ ఘోరం జరిగింది’’ అన్నాడు బాధగా.
విజయ్ నీలిమను పక్కకి పిల్చుకెళ్లి ప్రశ్నించాడు. ‘‘నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా? నీ పెళ్లి మహేష్‌తో జరగటం ఇష్టం లేక అతన్ని హత్య చేశారని అనుమానంగా ఉంది’’ అన్నాడు.‘‘నన్ను ఎవరూ ప్రేమించడం లేదు. ఒక వేళ ప్రేమించినా దాని కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని నేననుకోను. ఈ హత్య వెనక వేరే కారణం వుందనిపిస్తోంది’’ అంది. ఆమె ఏదో విషయం దాస్తున్నట్లు విజయ్‌కి అనుమానం కలిగింది. అయినా ఆమెను మళ్లీ ప్రశ్నించకుండా ఆ ఇంట్లో నుంచి బయటికొచ్చాడు.
బయటకొచ్చాక చుట్టుపక్కల ఇళ్లలో నీలిమ గురించి కూపీ లాగాడు. అప్పుడొక కొత్త సంగతి బయటపడింది. అదేమంటే ఏడాది క్రితమే ఓ దూరపు బంధువుతో నీలిమకు పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి పేరు మోహన్. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందే మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణమేంటో ఎవరకీ తెలియదు. ఈ విషయం గురించి నీలిమగానీ, ఆమె తండ్రిగానీ విజయ్‌కి చెప్పలేదు. రెండు సార్లు పెళ్లికి ముందే పెళ్లికొడుకు చనిపోయాడని ప్రచారమైతే నీలిమకు ఇక సంబంధాలు రావని భయపడ్డారు కాబోలు.
అయితే మోహన్ ఆత్మహత్యకు, మహేష్ హత్యకు ఏదో లింక్ ఉందని విజయ్‌కి అనుమానం కలిగింది. నీలిమకి ఎవరో అజ్ఞాత ప్రేమికుడు ఉండొచ్చు. మోహన్, మహేష్‌ల చావులకు అతనే కారణం కావొచ్చు. ఈ ఆలోచన రాగానే విజయ్ ఏడాది క్రితం మోహన్ ఆత్మహత్య కేసు నమోదు అయిన పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఆ కేసు వివరాలు సేకరించాడు. నగరానికి దూరంగా ఓ పల్లెలో ఉంటున్న మోహన్ కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడాడు. అప్పుడు తెల్సిందేమంటే మోహన్ నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేసేవాడు. నగరం పొలిమేరల్లో ఓ గది అద్దెకు తీసుకొని వుండేవాడు. తనకు దూరపు బంధువైన నీలిమను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నీలిమ పెళ్లికి రాజీ కావడంతో నిశ్చితార్థం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా మోహన్ ఓ రోజు రాత్రి తన గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో గదికి లోపల నుంచి గడియవేసి ఉండటంతో పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావించారు. కాని మోహన్ అకారణంగా ఎందుకు ఆత్మహ్యత చేసుకున్నాడో ఇంతవరకు బయటపడలేదు.
అయితే డిగ్రీ వరకు చదువుకున్న మోహన్ సూసైడ్‌నోట్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకోవడం విజయ్‌కి అసహజంగా తోచింది. పైగా మోహన్ చావుకి కారణమైన విషం పొటాషియం సైనేడ్ అతడికి ఎవరిచ్చారో అంతుపట్టలేదు. మొత్తం మీద ఇది ఆత్మహత్య కేసు కాదనపించింది. ఎవరో మోహన్‌ను తెలివిగా హత్యచేసి దాన్ని ఆత్మహత్యగా మార్చారనిపించింది. ఈ పని నీలిమని మూగగా ప్రేమించే ఏ అజ్ఞాత ప్రేమికుడో చేసినట్టున్నాడు. అతడు ఇప్పటి వరకు నీలిమను పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దర్ని చంపాడు. ఇప్పుడు మూడో వ్యక్తి పెళ్లికి సిద్ధమైతే అతడిని కూడా చంపవచ్చు. ఈ ఆలోచన రాగానే విజయ్‌కి ఓ ఐడియా తట్టింది.
తన ఆలోచనని అమలు చేయడానికి విజయ్ కొత్తగా ఉద్యోగంలో చేరినో ఎస్సైని ఎన్నుకున్నాడు. అతడిపేరు వినోద్. ఇంకా పెళ్లి కాలేదు. విజయ్ వినోద్‌కి తన పథకం గురించి వివరించగానే అతడు ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం వినోద్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నీలిమకి పరిచయమయ్యాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొద్ది రోజుల్లో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఓ రోజు వినోద్ నీలిమ ముందు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. నీలిమ నివ్వెరబోయింది. తన తండ్రిని అడిగి అభిప్రాయం చెబుతానని చెప్పింది. ఓ వారం తర్వాత రాత్రి పదిగంటలకు వినోద్ తన ఇంట్లో ఉన్నప్పుడు అతడి సెల్‌ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ‘మన పెళ్లి గురించి అర్జెంట్‌గా నీతో మాట్లాడాలి. గాంధీ నగర్‌లో పాడుబడ్డ మఠం దగ్గరికి వెంటనే వచ్చేయ్. నా ఫోన్ స్విచాఫ్ అయింది. అందుకే అందుకే ఫ్రెండ్ ఫోన్ నుంచి మెసేజ్ పంపుతున్నాను’ అని వుందా మెసేజ్‌లో. పంపిన వారి పేరు లేకపోయినా అది నీలిమ పంపిన మెసేజ్ అని ఇట్టే గ్రహించాడు వినోద్. ఎందుకైనా మంచిదని నీలిమ నంబర్‌కి రింగ్ చేశాడు. ఫోన్ స్విచ్‌ఆఫ్ అని వచ్చింది.
వెంటనే ఇన్‌స్పెక్టర్ విజయ్‌కి ఫోన్ చేసి తనకొచ్చిన మెసేజ్ గురించి చెప్పాడు. అప్పుడు విజయ్ ‘నువ్వు ఆ మఠం దగ్గరికెళ్లు. ఏం జరుగుతుందో చూద్దాం. బీ కేర్ ఫుల్’’ అన్నాడు. వినోద్ వెంటనే తన బైకుపై మఠం దగ్గరికి చేరుకున్నాడు. కానీ అక్కడ నీలిమ కనపడలేదు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. వినోద్ ఓ పక్కన నిల్చొని ఎదురుచూడ సాగాడు. ఆలోగా అక్కడికి చేరుకున్న విజయ్ వినోద్ దగ్గరికెళ్లకుండా ఓ చెట్టుచాటున నిల్చొని ఏం జరుగుతుందా? అని ఆసక్తిగా చూడసాగాడు. కొద్ది నిమిషాలయ్యాక ఒంటి నిండా శాలువా కప్పుకున్న ఓ వ్యక్తి వినోద్ దగ్గరికి రావడం కనిపించింది. అతడు కాసేపు వినోద్‌తో మాట్లాడాడు. అంతలోనే హఠాత్తుగా ఓ పొడవాటి కత్తి బయటకు తీసి వినోద్‌ను పొడవబోయాడు. కానీ వినోద్ అప్రమత్తంగా ఉండటం వల్ల కత్తి వేటు తగలకుండా పక్కకి జరిగాడు. వినోద్ అతడి చేతిలో కత్తిని లాక్కున్నాడు. శాలువా తొలగి పోవడంతో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా అతనెవరో కాదు, నీలిమ తండ్రి చలపతిరావు!
తర్వాత ఇంటరాగేషన్‌లో చలపతిరావు తన నేరాన్ని అంగీకరించాడు. ‘‘టెర్రరిస్టు దాడిలో నేను చెయ్యి పోగొట్టుకున్న తర్వాత సైన్యం నుంచి నాకు రిటైర్‌మెంట్ ఇచ్చారు. నష్టపరిహారంగా అందిన సొమ్ము కొన్నాళ్లకు ఖర్చయిపోయింది. దాంతో చాలా చోట్ల వాచ్‌మెన్‌గా పని చేశాను. ఒక చెయ్యి లేకపోవడం వల్ల తొందరగా పని దొరికేది కాదు. దొరికినా తక్కువ జీతం ఇచ్చేవారు. నాలుగేళ్ల క్రితం సరైన చికిత్స లేక నా భార్య అనారోగ్యంతో మరణించింది. నా వద్ద డబ్బు ఉంటే ఆమెను కాపాడుకునే వాణ్ణి. ఎలాగోలా పెద్దమ్మాయిని నీలిమను మాత్రం డిగ్రీ వరకు చదివించాను. గత ఏడాది ఆమెకు ఉద్యోగం రావడంతో మా జీవితం గాడిన పడింది. కానీ నీలిమ అందగత్తె కావడమే నాకు శాపమైంది. ఆమెను పెళ్లాడటానికి కుర్రాళ్లు ఎగబడ్డారు. ఆమె పెళ్లిచేసుకొని వెళ్లిపోతే ఇద్దరు పిల్లల చదువులు ఆగిపోతాయని నాకు భయమేసింది. అందుకే ఆమెకొచ్చే పెళ్లి సంబంధాలను ఏదో ఒక సాకుతో తిరస్కరించేవాణ్ణి. కానీ మా దూరపు బంధువుల అబ్బాయి మోహన్ సంబంధాన్ని తిరస్కరించలేకపోయాను. పైగా తన పెళ్లి కాగానే ఇద్దరు చెల్లెళ్లను చదువులు మాన్పించి ఓ బట్టల షాపులో పనికి పంపిస్తానని నీలిమ చెప్పడంతో నాకు పుండుమీద కారం చల్లినట్టు అయింది.
మోహన్‌ని హత్య చేసైనా సరే, ఈ పెళ్లి జరక్కుండా ఆపాలనుకున్నాను. అందుకే గతంలో నేను పని చేసిన ఓ ల్యాబ్‌లో నుంచి రహస్యంగా పోటాషియం సైనైడ్ దొంగిలించి రాత్రి పూట మోహన్ గదికి వెళ్లాను. ముందుగా అతడికి నా పరిస్థితి వివరించి రెండు మూడేళ్లు పెళ్లి వాయిదా వేద్దామని కోరాను. దానికతను ఒప్పుకోలేదు. అయినా నేను కోప్పడలేదు. అవకాశం కోసం ఎదురు చూశాను. అంతలో అతడు బాత్రూంలోకి దూరాడు. నేను వెంటనే అతడి వాటర్ బాటిల్‌లోకి సైనేడ్ వేసిసి బయటికెళ్లిపోయాను. తర్వాత అంతా నేను ఊహించినట్టే జరిగింది. నాపైన ఎవరికీ అనుమానం రాకపోవడంతో నాకెంతో ధైర్యం వచ్చింది. అదే ధైర్యంతో మహేష్‌ని కూడా హతమార్చాను. మహేష్ నీలిమని తరచుగా బృందావన్ పార్కులో చీకటి పడ్డాక కల్సుకొనేవాడు. వాళ్లిద్దరు చాలసేపు కబుర్లు చెప్పుకొని ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లిపోయేవారు. ఓ రోజు నీలిమ వెళ్లిపోయే వరకు నేను చెట్టు చాటున ఉండి ఆనక మహేష్‌ను పలకరించాను. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అతడిని పార్కు చివర నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాను. అక్కడ నా శాలువలో దాచి తెచ్చుకున్న కత్తిని బయటికి తీసి హఠాత్తుగా అతడి గొంతు కోసేశాను. అతడి నోట్లోంచి ఆర్తనాదం కూడా బయటకి రాలేదు. అదృష్టవశాత్తు రెండో సారి కూడా నన్ను ఎవరూ చూడలేదు.
రెండు సార్లు ఇలా జరగడంతో నీలిమ ఇక కొన్నాళ్లు పెళ్లి గురించి మర్చిపోతుందనుకున్నాను. కాని ఇంతలోనే ఆమె వినోద్ గురించి చెప్పగానే పెళ్లి కుదరక ముందే అతడిని కూడా చంపెయ్యాలనుకున్నాను. నీలిమ రోజూ రాత్రి పదిగంటలకు ఫోన్ స్విచాఫ్ చేస్తుంది. వారం క్రితం పార్కులో నాకొక పాత ఫోన్ దొరికింది. ఆ ఫోన్‌తో వినోద్‌కు మెసేజ్ పంపి నిర్జన ప్రదేశానికి రప్పించాను. అతడిని కూడా చంపేస్తే ఈ హత్యలన్నీ నీలిమను ప్రేమించిన ఎవరో అజ్ఞాత హంతకుడు చేస్తున్నాడని పోలీసులు నమ్ముతారనుకున్నాను. కాని వినోద్‌ను మీరే నియమించారని ఊహించలేకపోయాను. ఓ ఆడపిల్లల తండ్రిగా అభద్రతా భావానికి గురై నేనే హత్యలు చేశాను తప్ప నాకు ఎవరి మీద కక్ష లేదు’’ కుమిలిపోతూ అన్నాడు చలపతిరావు. ఇన్‌స్పెక్టర్ విజయ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘నిన్ను చూసి తిట్టుకోవాలో, జాలిపడాలో నాకు అర్థం కావడం లేదు. నీ కూతురికి ప్రేమగా నచ్చజెప్పి ఉంటే ఆమె నీ బాధను అర్థం చేసుకునేది. నీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పుడు మార్గంలో వెళ్లి వారికి భవిష్యత్తే లేకుండా చేశావ్’’ కోపంగా అన్నాడు విజయ్.
-మహబూబ్ బాషా
Comments
Please login to add a commentAdd a comment