
రచయిత జెఫ్రి ఆర్చర్‌ని న్యూయార్క్‌లోని ‘రీడర్స్ డైజెస్ట్’ సంపాదకుడు ఒక కథ రాయమని కోరాడు. రాయమని ఊరుకోలేదు. కథకు ఒక మొదలు, ఒక మధ్య భాగం, ఒక ముగింపు ఉండాలనీ; కథలోని పదాలు సరిగ్గా వంద ఉండాలి, 99 కానీ, 101 కానీ ఉండకూడదనీ షరతు విధించాడు. పైగా ఇరవై నాలుగు గంటల్లో ఇవ్వాలన్నాడు. జెఫ్రి ఆర్చర్ ఆ సవాల్‌ను స్వీకరించాడు. ఆ కథ ‘అపూర్వం’ (యూనిక్) దిగువ. దీన్ని సరిగ్గా నూరు పదాల్లోనే తెలుగులోకి అనువదించినవారు అనిల్ అట్లూరి. పారిస్, మార్చ్ 14, 1921 కేప్ ఆఫ్ గుడ్‌హోప్ తపాలా బిళ్ల అది. త్రికోణాకారంలో ఉంది. తపాలా బిళ్లల సేకరణ అతని సరదా వ్యాపకం. నోట్లో ఉన్న ఆరిపోయిన సీమపొగాకు చుట్టని మళ్ళీ అంటించుకుని, చేతిలోని భూతద్దంతో దాన్ని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాడు.
‘నేను ఇదివరకే చెప్పాను. ఇవి రెండున్నాయని. కాబట్టి ఇదేమీ అపూర్వమైనది కాదు’ అన్నాడు డీలర్. అతను తపాలా బిళ్లలు కొని, అమ్ముతూ ఉంటాడు. ‘సరే. ఎంత?’ ‘పదివేల ఫ్రాంకులు.’ చెక్‌బుక్ తీసి పదివేలకి రాశాడు. నోట్లోని పొగాకు చుట్ట ఆరిపోయింది. బల్ల మీదున్న అగ్గిపెట్టెలోంచి, అగ్గిపుల్ల తీసి గీసాడు. ఎదురుగా ఉన్న ఆ తపాలా బిళ్లకి అంటించాడు. పొగలిడుతూ, మాడి మసైపోతున్న ఆ తపాలా బిళ్లని చూస్తూ, నిర్ఘాంతపోతూ నోరు వెళ్లబెట్టాడు డీలర్. చిరునవ్వు నవ్వుతూ, ‘మిత్రమా, చూడు. నువ్వు పొరబడ్డావు. ఇప్పుడు నా దగ్గిరున్నది అత్యంత అపూర్వమైనది,’ అన్నాడు అతను.
Comments
Please login to add a commentAdd a comment