పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నాడు డాక్టర్ ప్రమోద్. ఎదురుగా సీఐ రవీంద్రనాథ్ కుర్చీలో వెనక్కి జారగిలబడి, కాళ్లు బార్లా చాపి కూర్చుని ఉన్నాడు. రవీంద్ర కాళ్లు ఊపుతున్నాడు. సీఐ బూట్లు ప్రమోద్‌కు తాకీతాకనట్లు తాకుతున్నాయి. తగలడానికి తగలకపోవడానికి మధ్య వెంట్రుక వాసి కంటే దూరం లేదు. తన కాళ్లు డాక్టర్‌కి తగులుతాయేమోననే స్పృహ సీఐలో ఏ కోశానా ఉన్నట్లు లేదు. తగిలితే పోయేదేముంది అనే నిర్లక్ష్యం కూడా ఉన్నట్లుంది అతడిలో. ఆ బూట్లు తనకు తగులుతాయేమోనని ప్రమోద్ మరింత కుంచించుకుపోయి కుర్చీలో ఒదుగుతున్నాడు. అతడు ఒదిగేకొద్దీ సీఐలో ఉత్సాహం రెట్టింపవుతోంది.
‘‘ఆ చెప్పు... ట్రీట్‌మెంట్ చేయాలని తెలీదా’’ సంబోధన లేదు, నేరుగా సూటిగా ఉందతడి ప్రశ్న. అతడి ప్రశ్నలో నువ్వు ట్రీట్‌మెంట్ చేయలేదు అనే ఆరోపణ కలగలిసిపోయి ఉంది.
‘... అంటే, తాను ట్రీట్‌మెంట్ చేయలేదనే అతడి అభిప్రాయమా’ ప్రమోద్ మెదడులో మరో ప్రశ్న ఉదయించింది. అదే మాట అనగలిగిన పరిస్థితి కాదు. ఆ సంగతి అతడికి తెలుసు. అందుకే గొంతు పెగల్లేదు.
‘అయినా... తాను ట్రీట్‌మెంట్ చేయలేదని అతడికై అతడే నిర్థారణకు వచ్చేశాక ఇక నేను చెప్పేదేముంటుంది. అతడు వినేదేముంటుంది. నిర్ధారణకు వచ్చిన విషయం మీద ఇక దర్యాప్తు ఎందుకు? తీసుకోవలసిన చర్యలేంటో తీసుకుంటే పోతుందిగా... ఎలాగూ చట్టం చేతుల్లోనే ఉందాయె’ ప్రమోద్ పెదవులు విడివడడం లేదు. కానీ, బుర్రలో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి.
‘‘ఏం మాట్లాడకుండా కూర్చుంటే... మేము రిపోర్ట్ ఏం రాసుకోవాలి’’ గద్దించాడు సీఐ.
‘ఆల్రెడీ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు కదా’ ప్రమోద్ బుర్ర బదులిస్తూనే ఉంది కానీ మౌనం వీడడానికి మనసే అంగీకరించడం లేదు.
‘‘నీతోపాటు హాస్పిటల్‌లో ఇంకా ఎవరున్నారు? ఆ లేడీతో నీకు పనేంటి’’ సీఐ స్వరంలో బూతు పలుకుతోంది.
ప్రమోద్ నిలువెల్లా కంపించిపోయాడు. ‘మై గాడ్! హాస్పిటల్‌లో నర్సింగ్ స్టాఫ్ లేడీస్ ఉంటారు కదా! అది కూడా తప్పేనా’ పెనుగులాడుతోంది అతడి మనసు.
‘‘డాక్టర్‌వని చూస్తున్నా. నోరు మెదపకపోతే మా పద్ధతులు మాకుంటాయ్’’ మా పద్ధతులు అనే మాటను ఒత్తి పలుకుతూ మళ్లీ గదిమాడు సీఐ.
‘‘మీరే పద్థతిలో విచారణ చేసుకున్నా సరే. నేను చెప్పేది మొదటి రోజే చెప్పేశాను. ఇక చెప్పడానికేమీ లేదు’’ అప్పటికి పెదవి విప్పాడతడు. ఆ గొంతులో ఆవేదనతోపాటు నిస్సహాయత.
‘‘ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఉన్నావ్. ఏం డాక్టర్‌వి బే నువ్వు. నీకు డిగ్రీ ఇచ్చినోడెవడు? డాక్టర్ కోర్సు చదివి వచ్చావా, పట్టా కొనుక్కుని బోర్డు పెట్టావా’’ సీఐ మాటల్లో వెటకారం తెలుస్తూనే ఉంది ప్రమోద్‌కి.
ఆవేశంతో బ్లడ్ ప్రెషర్ పెరగడమూ తెలుస్తోంది. అణచుకోవడం తప్ప చేయ గలిగిందేమీ లేదనే గ్రహింపు అతడిని అదుపు తప్పనివ్వకుండా ఆపుతోంది. వైద్యం చేయడంతోపాటు సహనంగా ఉండడం, సంయమనాన్ని కోల్పోకుండా ఉండడం కూడా కోర్సులో భాగమే. అయితే ఆ సంయమనాన్ని ఇలాంటి చోట పాటించాల్సి రావడం నిజంగా దురదృష్టం. సీఐ మొబైల్ ఫోన్ రింగయింది. పేరు చూడగానే విసుగ్గా ముఖం పెట్టి కానిస్టేబుల్‌ని పిలిచి ఫోన్ ఇచ్చాడు రవీంద్ర.
ఫోన్‌తో పక్క గదిలోకి వెళ్లాడు కానిస్టేబుల్.
‘‘సర్... అలాగే సర్’’
‘‘...........’’
‘‘ఆ పని మీదే ఉన్నాం సర్’’
‘‘.................’’
‘‘ఎంతమాట సర్... ఇంతకంటే మాకు ముఖ్యమైన పనులేముంటాయ్ సర్. దొరవారు విచారిస్తున్నారు సర్. అందుకే ఫోన్ తియ్యలేకపోయారు సర్’’
సీఐ మీద ఈగ వాలనివ్వకుండా, అవతలి వ్యక్తి పట్ల వినయవిధేయతలతో బదులిస్తున్నాడు కానిస్టేబుల్.
స్టేషన్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతుండడంతో కానిస్టేబుల్ మాటలు సీఐ రవీంద్రకి, డాక్టర్ ప్రమోద్‌కి వినిపిస్తూనే ఉన్నాయి.
కానిస్టేబుల్ వచ్చి ఫోన్ టేబుల్ మీద పెట్టి, సీఐ చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడో ప్రమోద్‌కు అర్థం కాకుండా జాగ్రత్త పడ్డారు వాళ్లు. కానీ సీఐ ముఖం చెప్తోంది అది ఏదో అయిష్టమైన విషయమేనని. అసలే ప్రసన్నత లేని రవీంద్ర ముఖం మరింత అప్రసన్నంగా మారడం కనిపిస్తూనే ఉంది.
‘‘మినిస్టర్ ఇంటి నుంచి ఫోన్. మినిస్టర్ గారి కోడలు అన్నం తినడం లేదట’’ హూంకరించాడు సీఐ.
‘‘హాస్పిటల్‌లో మేం చేయగలిగింది చేశాం. మా దగ్గరకు వచ్చేటప్పటికే కొన ఊపిరితో ఉండడం వల్ల ట్రీట్‌మెంట్‌కి సహకరించలేదు. డెత్ సమ్మరీలో అదే రాశాను’’ అన్నాడు ప్రమోద్ అభావంగా.
∙∙
కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది రజిత. ప్రమోద్ ఏమీ మాట్లాడకుండా రజితను తప్పించుకుంటూ లోపలికి వచ్చాడు. ఏదో అడగబోయిన రజిత కొంచెం తమాయించుకుంది. ఎప్పట్లా సోఫాలో కూర్చోకుండా నేరుగా బెడ్‌రూమ్‌లోకెళ్లి పోయాడు. అతడి వెనకే వెళ్లింది రజిత. ప్రమోద్ బాత్‌రూమ్‌లో కెళ్లడంతో రజిత తిరిగి హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంది. ఏం చేయాలో తోచక రిమోట్ తీసుకుని చానెల్స్ మారుస్తోంది.
‘‘ప్రమోదుడొచ్చాడా’’ అంటూ తన గదిలో నుంచి బయటికొచ్చింది కాత్యాయిని.
‘వచ్చాడు మోదం లేకుండా’ అనాలనిపించింది రజితకు. తనకున్నంత బాధ ఆవిడకు కూడా ఉంటుంది కదా! ఫ్రస్టేషన్‌లో తను మాట తూలి పెద్దామెను బాధ పెట్టడం దేనికి అని సరిపెట్టుకుంది.
‘‘వచ్చారత్తయ్యా! స్నానానికెళ్లారు’’ ముక్తసరిగా బదులిచ్చింది.
‘‘పాప ట్యూషన్ నుంచి ఇంకా రాలేదా’’ అంది కాత్యాయిని కోడలి వైపు చూస్తూ.
‘‘వస్తుందిలెండి. టైమ్ ఉంది కదా’’ అన్నది రజిత.
ఇంతలో ప్రమోద్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏం జరిగిందో తనే చెప్తాడని ప్రమోద్ ముఖంలోకి చూస్తోంది రజిత.
కాత్యాయిని గబగబా కిచెన్‌లోకి వెళ్లింది. ఒక కప్పులో సేమ్యా పాయసం, మరో కప్పులో దూద్‌పేడాతో వచ్చింది.
‘‘నీ బర్త్‌డే రోజు దేవుడికి పూజ చేసుకోకుండా, స్వీటు తినకుండా వెళ్లిపోయావురా నాన్నా! ఇన్నేళ్లలో ఏ పుట్టినరోజుకైనా నా చేత్తో చేసిన సేమ్యా పాయసం తినకుండా ఉన్నావా! అడిగి మరీ చేయించుకునే వాడివి. ఈ రోజు పొద్దున నేను పిలుస్తున్నా వినకుండా అంత పొద్దున్నే వెళ్లిపోయావు. ఇప్పుడైనా కొత్త బట్టలు వేసుకుని రా! నేను మధ్యాహ్నం బాబా మందిరానికెళ్లి నీ పేరుతో బాబాకి పేడా ప్రసాదం పెట్టాను. తిను’’ అని పక్కన కూర్చుని కొడుకు వీపు మీద చేయి వేసి నిమురుతోంది కాత్యాయిని.
‘‘వద్దమ్మా! ప్లీజ్!’’ ప్రమోద్‌కి మాట రావడం కష్టంగా ఉంది.
‘‘మీ తల్లి మనసు ఆరాటమే తప్ప, కొత్త బట్టలు వేసుకుని స్వీట్ తినే కండిషన్‌లో ఉన్నామా అత్తయ్యా’’ అన్నది రజిత తల్లీకొడుకును మార్చి మార్చి చూస్తూ.
‘‘ఏమైంది నాన్నా, పోలీసులు ఏమన్నారు’’ ఉండబట్టలేక అడిగింది కాత్యాయిని.
‘‘మంత్రి గారి కోడలు అన్నం తినడం లేదట’’ ప్రమోద్ మాటకు విచిత్రంగా చూశారు అత్తాకోడళ్లిద్దరూ.
‘‘ఆమెకి అంత ప్రేమ ఉన్నప్పుడు సిచ్యుయేషన్ క్రిటికల్ కాకముందే తీసుకురావాల్సింది’’ అన్నది రజిత రిమోట్ తీసుకుని టీవీని మ్యూట్‌లో పెడుతూ. ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆ కోపం ఆమె మాటలో పలుకుతోంది.
‘‘ఎంత అధికారం ఉంటే మాత్రం ఇంత దురాగతమా’’ కాత్యాయిని గొంతు వణుకుతోంది.
ప్రమోద్, రజిత... ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించారు.
‘‘ఒకరి జోలికెళ్లకుండా మన బతుకేదో మనం గుట్టుగా బతికే వాళ్లం. మన మీద ఈ నిందలేంటి నాన్నా!’’ కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ వాపోయింది కాత్యాయిని.
బయట అడుగుల చప్పుడు... ఆ అలికిడికి ముగ్గురి చెవులూ రిక్కించుకున్నాయి.
‘‘హర్షిత వచ్చినట్లుంది’’ పరిస్థితిని శాంత పరచడానికి ప్రమోద్ మాట మార్చాడు.
‘‘పపా! మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’’ లోపలికి వస్తూనే బ్యాగ్ పక్కన పడేసి, తండ్రికి షేక్ హ్యాండిచ్చి ప్రమోద్‌కు మరో పక్కన కూర్చుంది హర్షిత.
కూతురు బర్త్‌డే గ్రీటింగ్స్ చెబితే థాంక్స్ చెప్పడానికి కూడా పెదవులు విడివడడం లేదు ప్రమోద్‌కి.
‘‘ఉదయం నేను నిద్రలేచేటప్పటికే వెళ్లి పోయావెందుకు? మిడ్ నైట్ ట్వల్వ్‌కి గ్రీటింగ్స్ చెప్తామనుకున్నాను. మమ్మీని నిద్రలేపమని చెప్పాను కూడా... నన్ను లేపలేదు. ఉదయం నేను లేచేసరికే నువ్వు వెళ్లి పోయావు’’ బుంగమూతి పెట్టి తండ్రి భుజం పట్టి గుంజుతోంది హర్షిత.
‘‘పప్పా! నీ పేరు వాట్సాప్‌లో వస్తోందట. మా ఫ్రెండ్ చెప్పింది. టీవీలో కూడా వచ్చిందట’’ అన్నది హర్షిత.
‘‘త్వరగా డ్రెస్ మార్చుకుని రా’’ కూతుర్ని గదిమింది రజిత.
తల్లి మాటలు పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంది హర్షిత.
‘‘పపా! యాక్చువల్లీ ఆ పెట్‌కేమైంది’’
‘‘తిన్నదరక్క తిండి మానేసింది’’ ఈ సారి కటువుగా పలికింది కాత్యాయిని గొంతు.
‘‘అమ్మా! మూగజీవాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? అయినా ‘డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడంతటి వాడు’ అని చెప్పి చెప్పి నన్ను డాక్టర్‌ని చేశావు కదా’’ నిర్వేదంగా ఉంది ప్రమోద్ మాట.
‘‘కుక్క చనిపోయినందుకే ఇంత చేస్తున్నారు. మనిషి పోయి ఉంటే ఇంకెంత రాద్ధాంతం చేసేవాళ్లో’’ మాట బొంగురుపోతోంది రజితకి.
‘‘ప్రాణం దేనిదైనా ఒకటే... అలా తక్కువ చేసి మాట్లాడకు’’ అనునయంగా అన్నాడు ప్రమోద్.
‘‘అయినా వాళ్ల కుక్క రెండు రోజులు తిండి తినకపోతే వాళ్లకే పట్టలేదు. మూడో రోజు మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నప్పుడు నీ చేతుల్లో పెట్టి ఇప్పుడా మాటలేంటిరా కన్నా. ఇందుకా నిన్ను డాక్టర్‌ని చేసింది. నువ్వేమో యానిమల్ లవర్‌వి. ‘నోరు లేని జంతువుల బాధను మనసుతో గ్రహించాలమ్మా’ అని ఏవేవో చెప్పి చివరికి పెట్ డాక్టర్‌వయ్యావు. ఇప్పుడు ఆ మంత్రి గారింటి కుక్క చావడం మన చావుకొచ్చినట్లుంది. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ గడప తొక్కామా’’ దుఃఖంతో గొంతు పూడుకుపోవడంతో మాట ఆగిపోయింది కాత్యాయినికి. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కొడుకు తల నిమురుతోందామె.
‘‘పపా! అదిగో ఇష్క్’’ హర్షిత గట్టిగా అరిచింది. టీవీలో చనిపోయిన కుక్క ఫొటోను చూపిస్తున్నారు.
కెమెరా ఆ ఫొటోను పట్టుకున్న చేతి నుంచి... ఆ వ్యక్తి ముఖం మీదకు ఫోకస్ అయింది. కళ్ల నీళ్ల పర్యంతం అవుతోంది ఒక యువతి.
‘‘అసలే అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. ఆరో నెల గర్భిణి. ఇష్క్ పోయిన రోజు నుంచి ఇంత వరకు అన్నమే తినలేదు’’ పక్కనే ఉన్న మరో మహిళ చెబుతోంది.
‘‘ఇది పూర్తిగా డాక్టర్‌ల నిర్లక్ష్యమేనని మీరు భావిస్తున్నారా’’ మైక్ ఆమె ముఖం మీద పెడుతూ అడుగుతోంది న్యూస్ రిపోర్టర్.
ఆ మహిళ ఏదో చెప్పబోయింది. ఇంతలో మళ్లీ రిపోర్టరే... ‘‘రోజూ మీరు ఇష్క్‌కి ఏం తినిపించేవారు’’ అని అడిగింది.
ఆ మహిళ తనకేమీ తెలియదన్నట్లు అయోమయపడింది. క్షణంలోనే తేరుకుని ఇష్క్ పోయిన దుఃఖంలో అన్నం మానేసిన యువతి వైపు చూసిందామె.
రిపోర్టర్ వెంటనే మైక్‌ను ఆ యువతి ముఖం మీదకు మార్చింది. కెమెరా కూడా యువతి వైపు ఫోకస్ అయింది.
‘‘యాక్చువల్లీ... ఇష్క్ అస్సలు ఏమీ తినదు. పెడిగ్రీ కూడా నేను పెడితే తప్ప తినదు. బిస్కట్‌లు కూడా సగం కొరికి, కాళ్లతో నలిపి ఇల్లంతా పోసేది. అల్లరెక్కువ’’ పక్కనే ఉన్న మహిళ అందించిన కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంటూ చెప్పింది యువతి.
రిపోర్టర్‌కి ఉత్సాహం ఎక్కువవుతోంది.
‘‘దట్ డే... అంటే... మీ ప్యార్ చనిపోక ముందు రోజు... సారీ మీ ఇష్క్ చనిపోక ముందురోజు తనకు మీరే తినిపించారా’’ చనిపోయిన ఇష్క్ మీద తన గొంతులో ప్రేమకు ఒలికించడానికి ప్రయత్నిస్తోంది రిపోర్టర్.
‘‘నేను తినిపించలేదు’’ అన్నదా యువతి ఇంకేం ప్రశ్నలడుగుతారోననే భయం ఆమె కళ్లలో.
‘‘ఎందుకు తినిపించలేదు? అప్పటికే ఇష్క్ తినడం మానేసిందా’’ గొప్ప సమయస్ఫూర్తితో సూటిగా ప్రశ్నలడుగుతున్నాననుకుంటోంది రిపోర్టర్.
ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయం ఆ యువతిలో. ఆమె కళ్లు ఎవరి కోసమో వెతుకుతున్నాయి.
కెమెరా తన మీదనే ఫోకస్ అయి ఉండడంతో ఏదో ఒకటి చెప్పక తప్పదనుకుని ‘‘ఇష్క్‌కి మా పెట్ అటెండెంట్ టైమ్‌కి టైమ్‌కి ఫుడ్ పెడుతుంటాడు. ముందురోజు అతడేం పెట్టాడో తెలియదు’’ నసిగిందామె.
‘‘మరి మీరు పెట్టకపోతే మీ ఇష్క్ ఏమీ తినదు కదా! మీరు రోజూ ఇష్క్‌కి ఫుడ్ పెట్టరా’’ రిపోర్టర్ కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. నవ్వకుండా పెదవులను బిగపట్టుకుంటోంది కానీ ఆమె కళ్లు నవ్వుతున్నాయి.
‘పోలీస్ ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అంతకంటే ఎక్కువగా మైండ్‌ని స్క్ర్యూ చేస్తోంది’∙అనుకుంటూ ఆందోళనను దాచుకుంటోందా యువతి.
కెమెరా అక్కడ గుమిగూడిన అందరినీ కవర్ చేస్తోంది. వాళ్లలో పెట్ అటెండెంట్ కూడా ఉన్నాడేమోనని ఆసక్తిగా చూస్తున్నారు వీక్షకులు. సాధారణ వీక్షకులతోపాటు ప్రమోద్ ఇంట్లో వాళ్లు కూడా.
అతడి జాడ దొరికినట్లు లేదు. రిపోర్టర్ ఫ్రేమ్‌లోకి వచ్చింది.
‘‘చూశారుగా! మంత్రిగారింటి కుక్క’’ కుక్క అన్నందుకు వెంటనే నాలుక్కరుచుకుని, విశాలంగా ఒక నవ్వు నవ్వి ‘‘మంత్రి గారింటి పెట్ ఇష్క్ గారి ప్రాణాలు పోయాయి. ఇష్క్ గారు లేకపోతే మంత్రి గారి కోడలు అన్నం తినరు. ఆమె అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆరు నెలల గర్భిణి. ఆమె అన్నం తినకపోతే ఆమె కడుపులో ఉన్న మంత్రి గారింటి వారసుడు కూడా అన్నం మానేసినట్లే. ఇంతటి దయనీయమైన స్థితికి కారణం ఏమిటి? ఎవరు? సమయానికి వైద్యం చేయని డాక్టర్లా? ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారు? మంత్రి గారింటి పెట్‌కే ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల గతి ఏమిటి?’’ ఎటు నుంచి ఎటో సాగిపోతోంది టాపిక్. హటాత్తుగా సీన్ కట్ అయి న్యూస్ ప్రెజెంటర్ తెర మీదకొచ్చి మరో వార్తను అందుకుంది.
∙∙
ఉదయం ఏడు గంటలకే టీవీ ముందు కనిపించింది కాత్యాయిని. ‘‘ఏంటమ్మా! ఈ డిబేట్‌లు నీకు నచ్చవు కదా! ఎందుకు చూస్తున్నావ్’’ అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు ప్రమోద్. అతడి కళ్లు ఎర్రగా ఉన్నాయి.
కాత్యాయిని మాట్లాడలేదు. టీవీ సౌండ్ పెంచింది. డాక్టర్ ప్రమోద్ నిర్లక్ష్యం వల్లనే మంత్రి గారింటి పెట్ చనిపోయిందా? లేక మరేదైనా కారణంతో చనిపోయిందా? అని సాగుతోంది డిబేట్. టీవీలో కనిపిస్తున్న ఐదుగురిలో ఒక్కరికి కూడా ప్రమోద్ తెలియదు. అయినా అతడి గురించి తమకు ఎంతో తెలిసినట్లు ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.
మనదేశంలో పెట్ అంటే అస్సలు లక్ష్యం ఉండడం లేదంటూ ఓ యానిమల్ యాక్టివిస్టు ఆవేశంగా మాట్లాడుతోంది. ‘‘ఒక మూగ జీవం ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తి డాక్టర్ అయినా సరే ఉరి తీయాల్సిందే. అంతటి కఠినమైన శిక్షలు ఉంటే తప్ప నోరు లేని ప్రాణుల ప్రాణాలను కాపాడడం సాధ్యం కాదు. ఒక చిన్న ప్రాణం, తన బాధేంటో చెప్పుకోలేక చనిపోయింది’’ దాదాపుగా కన్నీళ్లు పెట్టుకుంటోందా యాక్టివిస్టు.
ఆశ్చర్యంగా... టీవీ స్క్రీన్ మీద ప్రమోద్ ఫొటో ప్రత్యక్షమైంది. అది కూడా ఓ రెండేళ్ల కిందట ప్రమోద్, రజిత, హర్షిత సమ్మర్ వెకేషన్‌లో టూర్‌కెళ్లినప్పుడు తీసుకున్న ఫొటో. అందులో హర్షిత జూలో ఒక కుందేలును తాకుతూ తీసుకున్న ఫొటో. ఒక్క క్షణం అదిరిపడ్డాడు ప్రమోద్. ఇది మీడియాకు ఎలా చేరింది. తనకు ఫేస్‌బుక్ అకౌంట్ కూడా లేదు. రజిత కూడా పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయదు. ఎలా సాధ్యమైంది... రజిత తన ఫ్రెండ్స్ ఎవరికైనా వాట్సాప్ చేసి ఉంటుందా? ఆలోచిస్తుంటే బుర్ర తిరిగిపోతోందతడికి.
∙∙
మంత్రి గారి పెట్ మరణం వార్త పాతదైపోయింది మీడియాకి. ప్రమోద్‌కి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోన్ రావడం లేదిప్పుడు. మీడియాలో వచ్చిన కవరేజ్ తెలిసి మంత్రి గారే ఇంట్లో వాళ్లను గట్టిగా చివాట్లేశారని, డాక్టర్ మీద కేసు కోర్టుకు వెళ్లకుండా ఆపేశారని అనధికార వార్తలు షికారు చేశాయి కొన్నాళ్లు. ప్రమోద్ ఎప్పటిలాగే హాస్పిటల్‌కెళ్తున్నాడు.
ఓ రోజు ఉదయం...
‘‘పాపకు స్కూల్ వ్యాన్ రాలేదు. మీరు దించుతారా’’ హర్షిత లంచ్ బాక్స్ సర్దుతూ అడిగింది రజిత.
‘‘అలాగే’’ అని బైక్ తీశాడు ప్రమోద్.
∙∙
రాత్రి భోజనాలైన తర్వాత బెడ్‌రూమ్‌లో రజితతో ఒకే ఒక్క మాట చెప్పాడు ప్రమోద్. ‘‘రజితా! నువ్వు చెప్పినట్లే మనం ఫారిన్‌కెళ్దాం. అక్కడ ఉద్యోగాల కోసం రేపటి నుంచే ట్రై చేస్తాను. అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు. మనతో వస్తానంటే తీసుకెళ్దాం. ఇక్కడే ఉంటానంటే అమ్మ కోసం ఏదో ఒక అరేంజ్‌మెంట్ చేయాలి. ఏం చేయాలనేది మళ్లీ ఆలోచిస్తాను’’ అని అటు తిరిగి పడుకున్నాడు.
రజితకు ఏమీ అర్థం కాలేదు. కానీ గుచ్చి గుచ్చి ప్రశ్నించే పరిస్థితి కాదని మాత్రం అర్థమైంది. ఇష్క్ గొడవ జరిగినప్పుడు ఇక్కడ వద్దు, వేరే దేశం వెళ్లిపోదామని ఎంత చెప్పినా వినలేదు. పారిపోవడం నాకిష్టం లేదు. నా తప్పు లేకపోయినా సరే ముఖం చాటేస్తే ఏదో తప్పు చేశాడనే అనుకుంటారు. ఇక్కడే ఉండితీరుతానని మొండిగా వాదించాడు. ఇప్పుడేమో తర్కవితర్కాలేవీ లేకుండా నిర్ణయం చెప్పి ఊరుకున్నాడు. కారణం ఏమై ఉంటుంది... ఆలోచనలతో రజితకు నిద్రపట్టడం లేదు.
అటు తిరిగి పడుకున్న ప్రమోద్‌కు కూడా నిద్రపట్టడం లేదు. మెదడు చెప్పిన మాటలను మనసు అడ్డుకుంటోంది. తానీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది రజితకు ఎప్పటికీ చెప్పడు. ఈ రోజు స్కూల్‌లో విన్న మాటలను కూడా చెప్పడు. రజితకు చెప్తే అమ్మకు చెప్పేస్తుంది. ఆ మాటలు వింటే అమ్మ తట్టుకోలేదు. అమ్మకు గుండాగిపోతుంది. అందుకే తన నోరు పెగలదెప్పటికీ.
ఎవరికీ చెప్పకూడదనుకున్నా సరే... ఆ మాటలు చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. పాపను దించి బైక్ రివర్స్ చేసుకుంటున్నప్పుడు తమ పిల్లల్ని దించడానికి వచ్చిన ఇద్దరు పేరెంట్స్ మాటలలి. ‘‘అదిగో అతడే ప్రమోద్. అదే... మంత్రి గారి పెట్‌ను చంపేసిన డాక్టర్. కేసు కూడా పెట్టారు. పోలీసులను బతిమాలుకుని, మంత్రి కాళ్లు పట్టుకుని ఎలాగో బయటపడ్డాడు. ఎవర్ని ఎవరికి తార్చి బయటపడ్డాడో. సొసైటీలో స్టయిల్‌గా తిరుగుతున్నాడు’’.
దిండును చెవుల మీదకు లాక్కున్నాడు ప్రమోద్. మాటలు వినిపిస్తున్నది బయటి నుంచి కాదు. అతడి లోపల్నించి. లోపల్నుంచి వినిపించే మాటలను ఆపే దిండు ఉండదు. చికాగ్గా లేచి కూర్చున్నాడు. రజిత, పాప నిద్రపోతున్నారు.
‘ఇంత వరకు జీవించిన గౌరవప్రదమైన జీవితం ఒక్కరోజులో తుడిచిపెట్టుకుపోయింది. ఇష్క్ ప్రాణాలతోపాటు తన క్యారెక్టర్ కూడా గాల్లో కలిసిపోయింది. చివరకు మంత్రిగారింటి పెట్‌ను చంపిన డాక్టర్‌గా గుర్తిస్తోంది సమాజం’ అనుకుంటూ రెండు చేతుల్లో తలను పట్టుకున్నాడు ప్రమోద్.
-వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment