
ఒక ప్రశస్తమైన రాత్రి, ఇవాన్ ద్మీత్రిచ్ చెర్‌వ్యకోవ్ అనే ప్రశస్తమైన గుమస్తా ఫన్ట్‌క్లాస్‌లో రెండవ వరసలో కూర్చొని, బైనాక్యులర్స్ సాయంతో ‘కొర్నెవీల్ గంటలు’ అనే నాటకాన్ని ఆనందిస్తూ వుండినాడు.
అతను రంగస్థలాన్ని తిలకిస్తూ, తనకంటే అదృష్టవంతుడైన మానవుడు భూప్రపంచంలో లేడని అనుకుంటూ వుండగా, హఠాత్తుగా...‘‘హఠాతు గా’’ అనేది చౌకబారు నుడికారం అయింది.
కానీ జీవితం నిండా హఠాత్ ఘటనలు వుండగా రచయితలు దానిని వాడకుండా ఎలా వుండగలరు?
కనుక, హఠాత్తుగా అతని ముఖం ముడుచుకుపోయింది, కండ్లు ఆకాశం వైపు తేలిపోయాయి, ఊపిరి స్తంభించింది...బైనాక్యులర్ల నుండి ముఖం పక్కకు తిప్పుకొని, కుర్చీలో వంగి, అతను–అఛ్మూ! అనగా, అతను తుమ్మినాడు. మరి, ప్రతి ఒక్కరికి ఇష్టం వచ్చినచోట తుమ్మే హక్కు వుంది.
రైతులూ, పోలిసు ఇన్‌స్పెక్టర్లూ, గవర్నర్లు కూడా తుమ్ముతారు. ప్రతి వొకరూ తుమ్ముతారు–ప్రతి వొకరూ. చెర్‌వ్యకోవ్‌కు మనస్సంకోచమీమేమి కలగలేదు. అతను చేతిగుడ్డతో ముక్కు తుడుచుకొని, సుసంస్కారి లాగా, తన తుమ్ము ఎవరికైనా ఇబ్బంది కలిగించిందేమో అని చుట్టూ చూసినాడు. అప్పుడు నిజంగా కలిగింది అతనికి మనస్సంకోచం. మొదటి వరసలో, సరిగ్గా అతనికి ముందర కూర్చొని, ఒక చిన్న వృద్ధుడు అతనికి కనిపించాడు, తన బట్టతలా, మెడా, తుడుచుకుంటూ, ఏదో గొణుక్కుంటూ. అతను రవాణా మంత్రిత్వశాఖకు చెందిన సివిల్ జనరల్ బ్రిజాలొవ్ అని చెక్‌వ్యకోవ్ గుర్తించినాడు.
‘‘ఆయన మీద నేను తుమ్మినానే!’’ అనుకున్నాడు చెర్‌వ్యకొవ్.
‘‘ఆయన మా అధికారి కాని మాట నిజమే, కానీ ఇది చాలా అనుచితమైన పని. నేను క్షమాపణ చెప్పుకోవాలి.’’
చెర్‌వ్యకోవ్ చిన్న పొడిదగ్గుతో ముందుకు వంగి, జనరల్ చెవిలో చెప్పినాడు:
‘‘క్షమించండి, సార్. నాకు తుమ్ము వచ్చింది...నేను ఉద్దేశించలేదు...’’
‘‘పోనిలే.’’
‘‘మీరు తప్పక క్షమించాలి. నేను...అది ముందుగా అనుకున్నది కాదు!’’
‘‘ఇక వూరుకో, దయయుంచి! నాటకం విననీ!’’
చెర్‌వ్యకోవ్ కాస్త ఇబ్బంది పడి, వెర్రి చిరునవ్వు నవ్వి, రంగస్థలం మీదికి దృష్టి మళ్లించడానికి ప్రయత్నించినాడు. అతను నటులను చూస్తూ వుండినాడు, కానీ భూప్రపంచంలో కెల్ల అదృష్టవంతుణ్నని అతనికి ఇప్పుడు అనిపించలేదు. అతన్ని పశ్చాత్తాపం పీక్కు తినింది. విరామ సమయంలో అతను బ్రిజాలొవ్ వద్దకు వెళ్లి, కాసేపు తచ్చాడి, చివరకు ధైర్యం కూడగట్టుకొని, ఇలా గొణిగినాడు:
‘‘నేను మీ మీద తుమ్మినాను సార్...క్షమించండి...మరి...నేను అనుకోలేదు...’’
‘‘ఓ, ఏమిటిది...నేను మరచిపోయినాను, నీవింకా దాన్నిపట్టుకోవాల్నా?’’ అన్నాడు జనరల్,
చిరాకుతో అతని క్రింది పెదవి వణికింది.
‘‘మరిచిపోయినానని అనుకుంటున్నాడు. కానీ ఆయన కన్నులలోని ఆ చూపు నాకు తృప్తిగా లేదు,’’ అనుకున్నాడు చెర్‌వ్యకోవ్, జనరల్ వున్న వైపు అపనమ్మకంతో చూస్తూ.
‘‘నాతో మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. ఆయనకు నేను వివరించాలి, నాకా ఉద్దేశం లేదని...అది ప్రకృతి ధర్మమని, లేపోతే, నే నాయన మీద ఉమ్మెయ్యాలనుకున్నానని ఆయన అనుకోవచ్చు. ఇప్పుడలా అనుకోకపోయినా, తరువాత అనుకోవచ్చు!...’’
చెర్‌వ్యకోవ్ ఇంటికి పోయినప్పుడు, తన అసంస్కార ప్రవర్తనను భార్యకు చెప్పినాడు. తన కథను ఆమె మరీ తేలికగా తీసుకున్నట్లు అతనికి అనిపించింది. ఆమె క్షణం సేపు ఆందోళన చెందిన మాట నిజమే, కానీ బ్రిజాలొవ్ ‘‘మన’’ అధికారి కాదని తెలుసుకొని ఆమె నిబ్బరం కోలుకుంది.
‘‘అయినా, మీరు వెళ్లి క్షమాపణ చెప్పుకోవాలి. లేకపోతే, మీకు నలుగురిలో ప్రవర్తించడం తెలియదని ఆయన అనుకుంటాడు,’’ అని ఆమె చెప్పింది.
‘‘అదే మరి! నేను క్షమాపణ చెప్పుకోడానికి ప్రయత్నించినాను, కానీ ఆయన చిత్రంగా ప్రవర్తించినాడు. అర్థమున్న మాట మాట్లాడలేదు. పైగా, సంభాషణకు వ్యవధే లేదు.’’
మరుదినం చెర్‌వ్యకోవ్ తన కొత్త అధికారిక కోటు ధరించి, దారిలో క్రాపు చేయించుకొని, తన ప్రవర్తనను వివరించడానికి బ్రిజాలొవ్ వద్దకు వెళ్లినాడు. జనరల్ రిసెప్షన్ గది నిండా అర్జీదార్లు వుండినారు, జనరల్ కూడా వుండినాడు అక్కడ, అర్జీలు స్వీకరిస్తూ. కొద్దిమందితో మాట్లాడి, తర్వాత జనరల్ కన్ను లెత్తి చెర్‌వ్యకోవ్‌ను చూసినాడు.
‘‘సార్, రాత్రి, ‘ఆర్కేడియ’ నాటకశాలలో, మీకు జ్ఞాపక ముంటుంది’’ అని గుమస్తా ప్రారంభించినాడు.
‘‘నాకు–తుమ్ము వచ్చింది–మీకు క్షమాపణ–చెప్పుకున్నాను...’’
‘‘అబ్బే, అదేముందిలే!’’ అంటూ జనరల్ పక్కనున్న అర్జీదారుని వైపు తిరిగి ‘‘యేమిటి మీ విషయం?’’ అన్నాడు.
‘‘నేను చెప్పేది వినిపించడం లేదు!’’ అనుకొని చెర్‌వ్యకోవ్ వివర్ణుడైనాడు.
‘‘ఆయన కోపంగా వున్నాడన్నమాట...దీన్ని ఇంతటితో వదలి పెట్టకూడదు...ఆయనకు వివరించాలి...’’
జనరల్ చివరి అర్జీదారుని చూసిన తర్వాత తన ప్రైవేటు గదిలోకి పోడానికి మళ్లినప్పుడు, చెర్‌వ్యకోవ్ అతని వెంటబడినాడు, ఇలా గొణుకుతూ:
‘‘క్షమించండి సార్, నా హృదయపూర్వకమైన పశ్చాత్తాపమే నాకు మిమ్మల్ని బాధించే సాహసం ఇస్తున్నది...’’
జనరల్ ఏడ్వబోయేవానిలా ముఖం పెట్టి, అతన్ని వెళ్లిపోమ్మన్నట్లు చేయి వూపినాడు.
‘‘అయ్యా, తమరు నన్ను పరిహాసం చేస్తున్నారు!’’ అంటూ అతను గుమస్తా ముఖం మీది గది తలుపు మూసేసుకున్నాడు.
‘‘పరిహాసమా! ఇందులో వినోదం నాకేమీ కనిపించదే. ఆయనకు అర్థం కాదా? జనరల్ కూడా ఆయన. సరే. నా క్షమాపణలతో ఇక ఆ పెద్దమనిషిని బాధించను. ఎక్కడైనా చావనీ! ఒక ఉత్తరం ముక్క రాసి పడేస్తాను, ఆయన వద్దకిక పోనేపోను! పోను–అంతే!’’ అనుకున్నాడు చెర్‌వ్యకోవ్.
ఇంటికి పోతూ అలా అనుకున్నాడు అతను. కానీ ఉత్తరం రాయలేదు. ఎంత ఆలోచించినా అతనికి ఉత్తరం ఎలా రాయల్నో తోచలేదు. అందువలన అతను మరుదినం జనరల్ వద్దకు వెళ్లవలసి వచ్చింది, పరిష్కారం చేసుకోడానికి.
జనరల్ అతనివైపు ప్రశ్నార్థకంగా చూసినప్పుడు అతను చెప్పసాగినాడు:
‘‘నిన్న మిమ్మల్ని బాధించింది, మీరు సూచించినట్లు, మిమ్మల్ని పరిహసించడానికి కాదు. తుమ్మి, మీకు ఇబ్బంది కలిగించినందుకు మీకు క్షమాపణలు చెప్పుకోడానికి వచ్చినాను...ఇక పరిహాసమంటే, అలాంటిది నా ఊహలోనే వుండదు. అంత సాహసమా నాకు! పరిహాసం చేయాలని మేము అనుకుంటే, ఇక గౌరవం అనేది వుండదు...పెద్ద వాళ్ల పట్ల గౌరవం అనేది వుండదు...’’
జనరల్‌కు ఆగ్రహంతో ముఖం కందగడ్డ అయింది. ఆవేశంతో వణకుతూ, ‘‘దాటు బయటికి!’’ అని గర్జించినాడు.
చెర్‌వ్యకోవ్ భయంతో కొయ్యబారి, ‘‘యేమన్నారు?’’ అని మెల్లగా గొణిగినాడు.
‘‘దాటు బయటికి!’’ అని జనరల్ మళ్లీ అన్నాడు, కాలు నేలమీద తాడిస్తూ.
చెర్‌వ్యకోవ్‌కు తన లోపల ఏదో పుటుక్కుమన్నట్టు అనిపించింది. అతను వాకిలి దాకా వెనక్కి అడుగులు వేసుకుంటూ పోయి, వీధిలోకి నడిచి, వీధుల్లో తిరిగినాడు. కానీ అతనికి యేమీ వినిపంచనూ లేదు, కనిపించనూ లేదు. అతను యాంత్రికంగా వచ్చి ఇంట్లో పడినాడు, అలాగే, అధికారిక కోటుతోనే, సోఫాలో పండుకొని ప్రాణం విడిచినాడు.
మూలం : ఎ. చేహోవ్
అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment