ఈవారం కథ: అనుపమ ఆకాశ్ | Anupama Akash Telugu Short Story By Gogineni Mani Sakshi Funday | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: అనుపమ ఆకాశ్

Published Sun, Apr 4 2021 9:39 AM | Last Updated on Sun, Apr 4 2021 10:27 AM

Anupama Akash Telugu Short Story By Gogineni Mani Sakshi Funday

అను..ప..మా..
మునుపటిలా నిన్ను ‘అనూ’ అని చనువుగా  పిలవటానికి ఎందుకో కొంచెం సంకోచంగా అనిపించింది! ఈ ఉత్తరం చదివాక, అలా పిలవగలిగే స్వతంత్రాన్ని నువ్వే ఇవ్వగలవని నాకు నమ్మకంగా అనిపిస్తోంది!
ఇంతకు మునుపు మనిద్దరం చూసిన సినిమాల గురించి, టీవీ ప్రోగ్రాములనూ విశ్లేషిస్తూ చర్చించటం, ఆ చర్చలను సరదాగానే ముగించటం జరిగేది కదా..! కానీ.. నాలుగు రోజుల క్రితం.. ఒక సినిమా ముగింపు నాకు నచ్చలేదని చెప్పగానే.. నీకంత ఆవేశం ఎందుకు వచ్చిందో..! ఆ మాత్రానికే.. న్యాయం వైపు కాకుండా, పురుష పక్షపాతిలా మాట్లాడానని తీర్మానించేశావ్‌!
పెళ్లికి ముందు మనం కలసి చూసిన ఒక సినిమా గురించి.. ‘హీరోయిన్‌ భర్త వలన రకరకాలుగా హింసకు గురవుతూ కూడా అలా అతని దగ్గరే ఉండటమెందుకూ, విడిచి వెళ్లాలిగానీ’ అని నేననటం నిజమే..! ఆ మాటల్ని ఉదహరిస్తూ.. మన పెళ్లి అవగానే, అసలు నైజాన్ని బయటపెడుతూ మగవాళ్లని సమర్థిస్తున్నానని ఆరోపించావ్‌! నీ మాటలకు నవ్వాలో, ఏమనుకోవాలో తెలియలేదు! రెండు సందర్భాల్లోనూ భార్యాభర్తల సమస్యేగానీ స్వరూపం మాత్రం పూర్తిగా వేరే వేరే కదా! అందుకే కదా, నేను ఆ సినిమా ముగింపు ఇంకో విధంగా ఉంటే బావుండేదని అన్నాను! సమస్యని బట్టే పరిష్కార మార్గం ఉండాలి గానీ, అన్ని రోగాలకీ ఒకటే మందులా అనలేం..! నిజమేగా..?

మీ ఇంటికి వెళ్లాలని అంతకుముందే సర్ది ఉంచుకున్న సూట్‌కేసును తీసుకొని కోపంగా వెళ్లిపోతూ.. నా వివరణ బట్టే నీ స్పందనా ఉంటుందని చెప్పావ్‌! తమాషాకి అలా అన్నావని మొదట అనుకున్నాగానీ, ఈ నాలుగు రోజులుగా, నా పలకరింపులకు బదులివ్వకుండా ఫోన్‌ ఆపేయటాన్ని బట్టి, నువ్వు సీరియస్‌గానే భావిస్తున్నావని అర్థమైంది!
అందుకే, ఇక ఆలస్యం చేయకుండా.. నీతో వివరంగా మాట్లాడదామని, కంప్యూటర్‌ ముందు కూర్చుని, నీకిలా ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. 
మన మనసులలో.. ఒక మూల ఒదిగి ఉండిపోయిన కొన్ని సంఘటనల జ్ఞాపకాలు, మనకు విలువైన పాఠాలనే నేర్పిస్తాయి! ప్రేమ, క్షమ.. ఒకే నాణేనికి ఉండే బొమ్మ, బొరుసులాంటివని అనుకుంటాను. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చిన సంఘటనలు వివరిస్తాను. మరి మొదలుపెట్టనా..?
హైస్కూలు చదువులో ఉండగా జరిగిందిది. స్కూలు వదిలాక ఇంటికి వచ్చిన నేను ముందుగదిలో జరిగినది చూసి నిశ్చేష్టుడనై గుమ్మం దగ్గరే రెండు క్షణాలు నిలబడిపోయా.
‘ఎన్నిసార్లు పదే పదే అదే మాట చెబుతావ్‌.. నా మాటంటే లక్ష్యం లేదా..?’ అంటూ నాన్న ఆవేశంగా అమ్మ చెంపమీద ఒక్కటిచ్చాడు!
అమ్మ కూడా కొయ్యబారినట్లయిపోయి.. వెంటనే తేరుకొని, గదిలోకి వెళ్లిన నాన్నని అనుసరించి తనూ వెళ్లింది. నేను కూడా నెమ్మదిగా అమ్మ వెనకాలే వెళ్లి గుమ్మం దగ్గరే ఆగిపోయాను. 

నాన్న అలా అమ్మ మీద చేయి చేసుకోవటం నేనెప్పుడూ చూడలేదు. అమ్మ.. నాన్న షర్టు పట్టుకొని ఎందుకలా చేశారని నిలదీస్తుందనుకున్నాను. కానీ.. అక్కడ జరుగుతున్నది వేరేగా ఉంది!
దెబ్బ తిన్న అమ్మే నాన్న తల నిమురుతూ ‘ఏమైంది.. ఆఫీసులో ఏమైనా జరిగిందా..? ఎందుకంత ఆవేశం వచ్చిందీ..?’ అని అనునయిస్తోంది! నాకైతే చాలా చిత్రంగా అనిపించింది. వెనక్కి వచ్చేశా.
ఊరు నుండి ఏదో శుభకార్యానికని వచ్చిన నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, మా మేనత్త అంతా ఆ ముందుగదిలోనే కూర్చుని ఉన్నారు. నేనూ ఒక వార బల్లమీద కూర్చుండిపోయాను. 

రెండు నిమిషాలకే అమ్మ గదిలో నుండి వచ్చి, వంటగదిలోకి వెళ్లి అందరికీ ‘టీ’ చేసి తీసుకువచ్చింది. ఏమీ జరగనట్లు మామూలుగానే ఉంది.
అత్త నాన్నని టీ తాగటానికి రమ్మని కూర్చున్న చోట నుండే కేక పెట్టింది. 
నాన్న వచ్చి అమ్మ పక్కనే కూర్చుని, అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని తన చెంపకు రెండుసార్లు తాటించి ‘ఆవేశంలో తప్పు చేశాను. ఇది చాలా..? కోపం పోలేదంటే కాళ్లూ పట్టుకుంటాను..’ అన్నాడు క్షమాపణ కోరుతున్నట్లుగా. 
అమ్మ మొహంలో కనిపించిన చిన్నపాటి అలకా తొలగిపోయింది. ‘చాల్లెండి..’ అంటూ సరదాగా నవ్వేస్తూ టీ కప్పు అందించింది. 
అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నట్లయి.. మామూలుగానే కబుర్లలో పడ్డారు. 

అందరి మధ్యా చెంపదెబ్బ తిన్నానని అవమానంతో అమ్మ రెచ్చిపోలేదు. శాంతం వహించింది! నాన్న కూడా ఏమాత్రం అహం, భేషజం లేకుండా, గదిలో కాకుండా అందరి మధ్యా క్షమాపణ అడిగాడు! వాళ్లిద్దరూ సమస్యను పెద్దది చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోగలిగారలా!
అందరూ వెళ్లిపోయాక, అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు పక్కన కూర్చుని ఆ విషయం గురించి అడిగాను. ‘అందరి ముందూ కొట్టినందుకు, ఎదురుతిరగటమో, నిలదీయటమో కాకుండా నువ్వే తప్పు చేసినట్లుగా నాన్నని లాలిస్తున్నావేంటో, నే చూశాలే..’ అన్నా. 
అమ్మ చిన్నగా నవ్వింది.

‘అలవాటుగా తప్పు చేసేవాళ్లని సమర్థించలేం గానీ, క్షణికావేశాన్ని అర్థం చేసుకోవాలి... అవునా? కొందరు తమ వాదనకు బలం చేకూర్చుకోవట మన్నట్లుగా ఆడవాళ్లపై చెయ్యి చేసుకుంటారు. మీ నాన్నకు అలాంటి అలవాటు లేదు! మరి అలాంటప్పుడు ఎందుకలా జరిగిందనే ఆదుర్దాయే గానీ నేనేం నామర్దాగా అనుకోలేదు! ఏ సంఘటనని అయినా బేరీజు వేసి చూసుకోవాలనుకున్నప్పుడు నా దగ్గర ఒక తక్కెడ ఉంది. ఒక చిన్న తప్పుకు తూకంగా నన్ను మెప్పించిన ఎన్నెన్నో అనుభూతులను వేసి చూసుకుంటే, అప్పుడు తెలుస్తుంది.. ఆ తప్పు క్షమార్హమా కాదా అన్నది! అర్థమైందిగా..?’ అనడిగింది. 
మళ్లీ నవ్వు మొహంతో చూసి ‘అందరి ముందూ అవమానంగా కొట్టారనే దానికంటే, బెట్టు లేకుండా మెట్టు దిగి వచ్చి, ‘కాళ్లు పట్టుకుంటా’ అని అడగడం గొప్ప విషయంగా నాకనిపించింది!’ అంది.

అప్పుడే నాకో విషయం అర్థమైంది. ప్రేమ బలంగా ఉన్నచోట.. తప్పు తేలికవుతుంది! అవును.. ప్రేమ వెంటే క్షమా ఉంటుంది!
నేరం తీవ్రతను బట్టే శిక్షా ఉండాలి గానీ.. అన్ని సమస్యలకీ ఒకే పరిష్కారమార్గం కాకూడదు! అందుకేనేమో... గుర్రాన్ని, గాడిదను ఒకే గాటను కట్టటమా అనే సామెత పుట్టింది! అవునా..?
ఇక ఇంకో సంఘటన గురించి చెబుతాను. 
నా చదువు పూర్తయ్యిం దని పించి ఉద్యోగాన్వేషణలో ఉండగా, మా నాన్న స్నేహితుడొకరు ఒక సలహా ఇచ్చారు. మాకు కొంచెం దూరంలోనే ఉన్న బస్తీలో ఇంటర్య్వూలకు హాజరయ్యే అభ్యర్థులకు అన్ని విషయాల్లోనూ ట్రైనింగ్‌ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌ పెట్టారనీ, అందులో చేరటం ప్రయోజనకరంగా ఉంటుందనీ!
ఆ వూళ్లోనే మా నాన్నకు చిన్నాన్న కొడుకు, నాకు వరుసకు బాబాయ్‌ అయ్యే ఆయన ఒకరున్నారు. 
మా నాన్న చిన్నాన్న చిన్న వయసులోనే చనిపోతే, మా తాతయ్యే తన తమ్ముడి పిల్లలనూ సొంత పిల్లలుగా చూసుకున్నారట! వాళ్లు ఉద్యోగాలలో స్థిరపడ్డాక అంతగా రాకపోకలు లేవు. దూరాభారం అవటం వలనే కావచ్చు.

నన్ను ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చే ముందు ఆ ఊళ్లోనే ఉంటున్న మా బాబాయ్‌నీ పలకరిద్దామని నాన్న వాళ్లింటికి తీసుకువెళ్లారు.
విషయం తెలిసి బాబాయ్‌ కొంచెంగా నొచ్చుకుని ‘అన్నయ్యా.. వీడిని మా ఇంట్లో ఉంచకుండా, ఎక్కడో రూమ్‌లో ఉండమంటున్నావ్‌. ఇది నాకేం బావుండలేదు. ఒకే చోట సొంత అన్నదమ్ములుగా పెరిగిన వాళ్లమేగా.. ఇప్పుడెందుకు తేడా చూపిస్తున్నావ్‌..? నేనూ లెక్చరర్‌నే కాబట్టి, వీడికి కొంత ట్రైనింగ్‌ ఇచ్చే విషయంలో సాయపడతాను కూడా’ అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.
అప్పుడు పిన్ని ఇంట్లో లేదు. ఎక్కడికో వెళ్లింది. ‘అమ్మాయినీ ఒక మాట అడగాలి కదా’ అని నాన్నంటే, బాబాయ్‌ ‘అవసరం లేదు. తన సంగతి నీకు తెలుసుగా’ అంటూ నాన్న అభ్యంతరాల్ని కొట్టిపారేశాడు. 

దాంతో నాన్న ఏమనలేక, ‘నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడే, ఏ ఫ్రెండ్‌తోనో రూమ్‌ షేర్‌ చేసుకోవచ్చులే’ అంటూ నాకు నచ్చచెప్పటం జరిగింది. నేను వాళ్లింట్లో ఓ ఆరు నెలల పాటు ఉంటాననే విషయానికి పిన్ని అభ్యంతరం చెప్పలేదు. అలాగని మనస్ఫూర్తిగా అంగీకరించినట్లుగానూ అనిపించలేదు. ముభావంగా ఉండిపోయిందంతే. 
నాకు బాధ్యతగా అన్నీ అమర్చిపెట్టేదంతే. నేనూ అవసరం కొద్దీ ఉంటున్నట్లే ఉండేవాడిని. బాబాయ్‌ మాత్రం అప్పుడప్పుడూ దగ్గర కూర్చోబెట్టుకొని నా గురించి అన్ని విషయాలూ ఆరాగా తెలుసుకోవటమే కాకుండా జనరల్‌ నాలెడ్జి పెంచుకోవటం గురించి వివరిస్తూ ఉండేవాడు. ఒకరోజు... నేను కొంచెం దూరంగా కూర్చుని చదువుకుంటున్నప్పుడు, బాబాయ్, పిన్ని ఏవో కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో సందర్భం ఏమిటో తెలియదు గానీ పిన్ని ‘అవును.. నేనేదో తీరుబడిగా ఉండిపోతున్నాననేగా, చెప్పాపెట్టకుండా నెత్తిమీద ఇంకో మూట బరువూ పెట్టేశారూ..’ అంటూ సాగదీయటం స్పష్టంగా వినిపించింది. 
నేనామాటలు విన్నానేమోననే కంగారులో బాబాయ్‌ నా వేపు చూడటాన్ని ఓరకంట గమనించినా తల మాత్రం ఎత్తలేదు. 

రెండు రోజులు మామూలుగానే ఉండి... తర్వాత ఒక ఫ్రెండ్‌ తనతోపాటూ రూమ్‌లో ఉండమని పదే పదే రిక్వెస్టు చేస్తున్నాడు కాబట్టి, అక్కడికి మారతానని బాబాయ్‌కి చెప్పాను. 
బాబాయ్‌కి విషయం అర్థమైనట్లుంది. ఏదో అభ్యంతరం చెప్పబోయేసరికి, నేను అదేమీ వినిపించుకోకుండా, అలా ఫ్రెండ్‌తో కలసి ఉండటమే నాకు బాగుంటుందని చెప్పేశాను. సరేనని అంగీకరిస్తున్నట్లుగానే తన అభిప్రాయాన్ని వివరంగా చెప్పుకొచ్చాడు. 
‘ మీ తాతయ్య మాకు చేసింది వదిలేసినాగానీ, తర్వాత మీ నాన్న మాకు చేసిన సహాయాల్ని మర్చిపోలేం! మాకు పెద్దదిక్కుగా ఉండి, ఇలా మంచి ఉద్యోగాలలో సెటిల్‌ అవటానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాడు. అలాంటి అన్నయ్యకు.. ఇన్నేళ్లకు వాళ్లబ్బాయిని నా దగ్గర కొన్నాళ్లు ఉంచుకోగలిగిన అవకాశం రావటం నాకు చాలా ఆనందం కలిగించిందిరా!

నిజమే, మీ పిన్ని అలా మాట్లాడటం తప్పేనని ఒప్పుకుంటాను. ఎవరేం అనుకుంటే నాకేమిటి అన్నట్లుగా ఏది తోస్తే అది ఆలోచన లేకుండా అనేస్తుండటం ఆమె నైజం! అంతవరకే గానీ, ఎవరినైనా ఆదరించటంలో తేడా చూపించదు. ఈ విషయం నీకూ కొంతవరకు అర్థమయ్యే ఉంటుంది. మీ పిన్ని తొందరపాటు మాటలకు చిన్నవాడివైనా నిన్ను నేను క్షమాపణ అడుగుతున్నా. నువ్వు కుదరదని నీ మాట మీదే నిలబడి రూమ్‌కు వెళ్లిపోయావనుకో, మనుసులో మథనపడుతూ శిక్ష అనుభవించాల్సింది నేనేగా..! అందుకేరా.. మీ పిన్ని అయితేనేం, నేనైతేనేంలే అని.. ఇద్దరం ఒకటేగా అని నిన్ను అడుగుతున్నా.. చెప్పు శిక్షా, క్షమా...? ఏది..?
బాబాయ్‌ మాటలకు నివ్వెరపోయాను! మరుక్షణమే తేరుకుని మనఃస్ఫూర్తిగా బాబాయ్‌కి చెప్పాను. ‘ఇదేంటి బాబాయ్‌.. మీరిలా మాట్లాడటం..! ‘నా మాట కాదని నువ్వు ఇక్కడ నుండి వెళ్లటానికి వీల్లేదురా..’ అని మీరు గట్టిగా ఒక్కమాట చెప్పినా సరిపోతుందిగా! నేనెక్కడికీ వెళ్లను బాబాయ్‌!’ అని చెప్పేశా.

ఆ తర్వాత కొంచెం నిదానంగా ఆలోచిస్తే.. పిన్నిదే పూర్తిగా తప్పనిపించలేదు. నాదీ ఉంది. బాబాయ్‌కి మా మీద ఉన్న ప్రేమాభిమానాల వల్ల వాళ్లింట్లో ఉండగలగటమన్నది నిజమే అయినా, అది ఒక హక్కుగా భావిస్తూ, బాధ్యతలను పంచుకోవటంలో మాత్రం నిర్లక్ష్యం చూపించాననిపించింది!
పిన్ని తెల్లవారుజామునే లేచి, అప్పుడు వచ్చే మంచినీళ్లను పంపు నుండి పట్టి ఇంట్లోకి చేరవేస్తుంది. ఉదయం పూట చాలా హడావిడి పడుతూ ఇద్దరు పిల్లలకూ, బాబాయ్‌కీ క్యారేజీలు సిద్ధం చేస్తుంది. టిఫిను రెడీ చేసి వడ్డించటమూ ఉంటుంది. అదనంగా నేనొక్కడిని. కొంతలో కొంతయినా పని పెరిగినట్లే కదా! ఇలా ఆలోచించి తెలుసుకున్న నేను నా ప్రవర్తనను మార్చుకున్నా.

నేనూ బాబాయ్‌ పిల్లలతో పాటుగా కాకుండా, పిన్ని లేచే టైముకే లేచి, నీళ్లు పట్టటం లాంటి పనులు నా మీద వేసుకున్నా. పిన్ని వెంటే ఉంటూ అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండటం మొదలుపెట్టా. ‘చదువుకున్నోడివి. రేపో మాపో ఉద్యోగంలోనూ చేరతావు. నీకెందుకిలాంటి ఇంటి పనులన్నీ..?’ అంటూ పిన్ని అభ్యంతరం చెప్పబోయింది గానీ, ‘అన్ని పనుల్లోనూ అందరికీ అలవాటు ఉండాలి. ఆడ, మగ, పెద్దా చిన్నా అని తేడాలేం ఉండకూడదు. ఎవరికి తోచినది, చేతనైనది చేయటంలో తప్పేం ఉందీ?’ అంటూ నేను పట్టించుకోలేదు. 

‘ఎంత బుద్ధిమంతుడివి బాబూ’ అన్నట్లుగా పిన్ని నా వేపు ఇష్టంగా చూసింది. అంతేకాదు, అప్పటి నుండీ పిన్నిలోనూ మార్పు కనిపించింది. మునుపు కేవలం మొక్కుబడిగా మాత్రమే నా పనుల్ని చేసే పిన్ని ఇష్టంగా పలుకరించటం, ఆప్యాయంగా నా విషయాలను కనుక్కోవటం చూసేసరికి నాకే ఆశ్చర్యంగా అనిపించింది!
ఈ సంఘటన ద్వారా నాకు అర్థమైన విషయమేమిటో చెప్పనా..?
బాబాయ్, నేను చిన్నవాడినని సంకోచించకుండా క్షమాపణ అడిగి నా అభిమానాన్ని గెలుచుకున్నాడు. 
నేనూ అంతే. బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకు పిన్నిని క్షమాపణ కోరినట్లుగా నా నడవడిని మార్చుకుని పిన్ని ఆదరాభిమానాల్ని గెలుచుకున్నాను.
సమస్యల్ని జయించటానికి క్షమాపణ అనే శక్తిమంతమైన ఆయుధం ఉండగా.. అది ఉపయోగించుకొని సామరస్యంగా బయటపడగలగాలి గానీ, ఘర్షణతో విప్పుకోలేని చిక్కుముడిగా సంసారాన్ని పాడు చేసుకోవటం సబబేనా..?

భార్యాభర్తలు విచక్షణతో ఆలోచించి నిర్ణయించుకోవాలి! అవునా.. అన్నింటికీ విడాకులే పరిష్కార మార్గమనుకోకూడదనేదే నా అభిప్రాయం. అర్థమైందా అమ్మాయిగారూ..! ఇది మాత్రమే నేను చెప్పాలనుకున్నది. అందుకే ఆ సినిమాకు ముగింపు మరోలా ఉంటే ఇంకా బావుండేది అన్నాను. దానికే నువ్వు పురుషాహంకారం చూపించానని ఆరోపించావు. అహంకారం అనేది అంధకారం లాంటిదట! ఆడ, మగ తేడా లేకుండా ఎవరికీ ఉండకూడనిది! అందచందాలు, చదువు సంధ్యలు, ఆస్తిపాస్తులు, స్థితిగతులు.. ఇలాంటివి చూసుకుని అహంకరించే ఆడవాళ్లూ ఉంటారు. అవునా..?
ఏ కారణంతోనైనా అహంకారం అనేది ఎవరికీ కూడా శ్రేయస్కరం కాదని భావించినప్పుడు కేవలం మగపుట్టుకే కారణంగా అహంకారం చూపించటం.. మూర్ఖత్వం కాదా..? నేనటువంటి మూర్ఖుడిలా కనిపిస్తున్నానా.. చెప్పు..?

నీ ఆరోపణకు నా సంజాయిషీ సమంజసంగానే ఉందని అంగీకరించినట్లైతే, నువ్వు నీ సూట్‌కేసును సర్దేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మరి నేను రేపే బయలుదేరి అక్కడకు వస్తున్నాను.
అలా కాకుండా నువ్వు మీ ఇంట్లోనే ఉండిపోవటానికి మొగ్గు చూపిస్తే మాత్రం, నా నిర్ణయమూ విను.  నువ్వు అక్కడికి... అంటే మీ ఇంటికి చేరిన రోజే మా మావగారు ఫోను చేసి ‘నువ్వూ అమ్మాయితోపాటూ వచ్చేసి కొన్నాళ్లు ఉంటే బావుండును కదా’ అని ఆహ్వానించారు. నాకు తెలుసు.. మా అత్తామామలిద్దరూ కూడా చాలా మంచివాళ్లు. తమ అమ్మాయితోపాటుగా నాకూ చోటిచ్చి ఆదరించగలరనే నమ్మకం నాకుంది. కొన్నాళ్లే కాదు, ఎన్నాళ్లైనా ఉండగలను!
అందుకే అడుగుతున్నా.. ఇప్పుడు చెప్పు.. నాతో మనింటికి వెంటనే వచ్చేస్తావా, లేక ఈ ఉద్యోగం వదిలేసి నీతోపాటూ నన్నూ అక్కడే ఉండిపోమంటావా..? నిర్ణయం నీదే మరి!
నీవాడినేనని నమ్ముతున్న 
-గోగినేని మణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement