ఈ వారం కథ: రాముడు- భీముడు | Ramudu Bheemudu Telugu Weekly Short Story By Dondapati Krishna | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: రాముడు- భీముడు

Published Sun, May 30 2021 12:36 PM | Last Updated on Sun, May 30 2021 12:40 PM

Ramudu Bheemudu Telugu Weekly Short Story By Dondapati Krishna - Sakshi

చేతికర్రను దడికి ఆనించి లోపలికొచ్చాడు రాముడు. పక్కనే ఉన్న తొట్టిలో చెంబుతో నీళ్ళు ముంచుకుని చేతులు కడుక్కున్నాడు. ఆ నీళ్ళు కాళ్ళ పైనే పడడంతో నిట్టూర్చుతూ ఇంటి దర్వాజ వైపు చూశాడు. తలుపు దగ్గరికి వేసి ఉంది. పక్కకి చూశాడు. బండపై బట్టలుతుకుతూ రెండో కోడలు కనిపించింది. ‘ఇట్రామ్మా... ఓ ముద్ద పడేయ్‌...’ సంశయిస్తూ పిలిచి, వసారాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ‘డెబ్బై యేళ్లొచ్చినా మూడు పూటలు తినకుండా ఉండలేవే! మాకేమో అరిగి చావదు. నువ్వు మాత్రం ముద్ద తక్కువైతే అల్లల్లాడిపోతావ్‌. ఏం పని వెలగబెడతావో... బట్టలు మురికి చేసి పెడతావ్‌.

నీకేమన్నా పాలేర్లు ఉన్నారనుకున్నావా?’ అక్కసును కక్కుతూ పళ్ళెంలో అన్నం వేసుకొచ్చింది. ‘ఏంటోనమ్మా! ఏదో అంటన్నావ్‌. నాకేమో ఇనపడి చావదు. పిల్లోడు లేడా?’ ముద్ద కలుపుతూ అడిగాడు. ‘నీ చెవుడు మా చావుకొచ్చిందిలే. అరవలేక ఛస్తున్నాం. ఇగో... మంచినీళ్ళు! తిండం అయిపోతే పిలువ్‌. నేనెళ్లి బట్టలు ఉతుక్కోవాలి. మాకేం పాలేర్లు లేరిక్కడ!’ లోటాలో మంచినీళ్ళు పెట్టేసి విసవిసా వెళ్ళింది. అతను భోజనం చేశాక, స్నేహితుడు భీముడు చెంతకు వెళ్ళాడు. అతనెళ్ళగానే ఇల్లంతా మళ్ళీ కడుక్కుందామె.
∙∙
ఉగాది పండుగను పురస్కరించుకుని చైత్ర శుక్ల పాడ్యమి నాడు వేపపువ్వుతో తనువంతా అలంకరించుకున్న భీముడిని చూడగానే రెండో కోడలు తనపై కక్కిన అక్కసు ఆవిరైపోయింది. ఆప్యాయంగా భీముడిని నిమిరాడు రాముడు. తనువంతా కదిలించి ఆనందాన్ని తెలియజేశాడు భీముడు. అక్కడే చతికిలపడుతూ భీముడిని ఆర్తిగా చూశాడు రాముడు. ‘రెండో కోడలు ఎన్నెన్ని మాటలందిరా భీముడూ! నీ దగ్గర కూకుంటే కాత్తంత మట్టి అంటుతుంది. అది కూడా ఉతకలేరా? ఆల్లతో వాదించలేకే ఇట్టా చెవుటోడిగా ఉండిపోతున్నారా. ముద్ద పెట్టడానికీ ఏడుపే, బట్టలుతకడానికీ ఏడుపే!’ పెద్దవేరును తలగడగా మార్చుకుని పడుకున్నాడు రాముడు. అతనికి ఐదుగురు అన్నదమ్ములు. తండ్రినుంచి వచ్చిన ఇరవై సెంట్ల వాటా గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న ఇళ్ళ స్థలంగా మారిపోయింది.

రోడ్డుపక్కనుంచి చిన్న కాలువ వేయడంతో రెండు సెంట్లు కరిగిపోయి పద్దెనిమిది సెంట్లు మాత్రమే మిగిలింది. ఆ కాలువ ద్వారా వెళ్ళే నీళ్ళకు మట్టి కొట్టుకుపోకుండా అతని వాటాలో వేపమొక్క నాటాడు. నాటిన ఐదేళ్లకు బలమైన శాఖలతో విస్తరించిందది. పుష్టిగా ఎదగడంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు రాముడు. భుజ బలంలోనూ, గదా యుద్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరుడిగా పేరొందిన భీమసేనుడు పేరు మీదుగా దానికి ‘భీముడు’ అని పెట్టుకున్నాడు. చెట్టు మొదట్లో ఎత్తుగా మట్టి పోసి కూర్చోవడానికి వీలుగా సరిచేసుకున్నాడు. దాంతో నలుగురు అక్కడకు రాసాగారు. జనం అలా ఒకచోటే చేరడంతో కల్లుగీత కార్మికుడైన మల్లన్న అక్కడే మకాం ఏర్పాటు చేసుకుని కల్లు కాంపౌండుగా వాడుకోసాగాడు. రాముడికి నలుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళు! ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతనికిచ్చిన ఐదు సెంట్లలో పెద్ద ఇల్లు కట్టి పదిమంది సంతానాన్ని నెట్టుకొచ్చాడు. కొన్నాళ్ళకు అతని భార్య కాలం చేసింది. రోజూ మల్లన్న వెళ్ళగానే ఆ చెట్టు మొదట్లో పడుకుని భార్య జ్ఞాపకాల్ని నెమరువేసుకోడం, ఆరోజు జరిగినవన్నీ చెప్పడం అతని దినచర్య.

రాముడు బాధపడుతున్నప్పుడు భీముడు హోరుగా వీస్తూ ఆకులు రాల్చేవాడు. అతను ఆనందపడినప్పుడు మంద్రమైన రాగాన్ని ఆలపిస్తున్నట్లు ఆకుల్ని కదిపేవాడు. అతను చెప్పే ప్రతి మాటకు భీముడు స్పందించడంతో సాంత్వన పొందేవాడు. రెండో కోడలింట్లో జరిగిన సంగతి చెప్తూ బాధ పడ్డాడు రాముడు. అతని బాధను చూడలేక మెల్లగా గాలి వీస్తూ రాముణ్ణి నిద్ర పుచ్చాడు భీముడు. అతని ఓదార్పుకు కరిగిపోతూ అతని ఒడిలో కునుకు తీశాడు రాముడు. ఎవరో భీముడి రెమ్మల్ని విరుస్తున్న శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచాడు. వేపపువ్వు కోసం ముగ్గురు పిల్లలు ఇబ్బంది పడుతూ కనిపించారు. వారికి వేపపువ్వు కోసిచ్చాడు. అవి పట్టుకుని ఆనందంతో ఎగురుకుంటూ వెళ్ళారు పిల్లలు. వాళ్ళ మోములో విరిసిన సంతోషాల్ని చూశాక అతని మనస్సు తేలిక పడింది. ‘పిల్లలకేనా... మాకూ ఇచ్చేదుందా...’ అప్పుడే అక్కడకొచ్చిన సూరయ్య అడిగాడు. ‘మా భీముడు ఎవర్నీ కాదనడు’ అంటూ అతని చేతిలో కూడా వేపపువ్వు పెట్టాడు.

అది తీసుకుంటూ చుట్టూ చూశాడు సూరయ్య. అతనెందుకలా చూస్తున్నాడో అర్థంకాక ‘ఏంటి సూరయ్య, దేనికోసం ఎతుకుతున్నావ్‌?’ అడిగాడు రాముడు. ‘మల్లన్న ఎల్లిపోయాడా, లేదా అని...’ ‘ఎల్లిపోయాడులే. చెప్పు...’ ‘ఆ మల్లన్నను ఇక్కడెందుకు కల్లు అమ్ముకోనిస్తున్నావ్‌? కుర్రోల్లంతా తాగుడికి బానిసలైపోతున్నారంటే వినవేం...’ ‘ఆ మల్లన్న మీద నీకెందుకంత దుత్త! మనం ఏ పనైనా చేసుకుని బతగ్గలం! కానీ, ఆ మల్లన్న అదొక్క పనే చేయగలడు. అదెంత కట్టమో తెల్సా... తాటిచెట్టు ఎక్కేటప్పుడో, దిగేటప్పుడో ఆడి నడుంకున్న తాడు తెగిందంటే ఆల్లావిడ మెడలో తాడు తెగినట్లే! అప్పుడా ఇల్లు రోడ్డున పడ్డట్టే! సిగరెట్లు, మందు తాగొద్దని ఎవరెన్ని చెప్తున్నా జనం ఇండం లేదు! ఆళ్ళకి లేని బాధ మనకెందుకు...’ ‘సరే! నీ ఇష్టం!’ నిర్వేదంగా అక్కడ్నుంచి నిష్క్రమించాడు సూరయ్య.

మనుషుల తీరు ఒక పట్టాన అర్థం కాదు రాముడికి. ఎందుకిలా ఉంటారోనని ఆలోచనల్లో పడ్డ అతనికి ఎదురుగా తన నలుగురు కొడుకులు కనిపించారు. ఆస్తి పంపకాల్లో తనకి న్యాయం జరగలేదని చిన్నకొడుకు గొడవకు దిగాడు. అతను చేస్తున్న హంగామాకు చుట్టుపక్కల వాళ్ళు చేరి చోద్యం చూస్తున్నారు. ఎవరూ మధ్యలో కలగజేసుకునే బాధ్యతను తీసుకోలేదు. ‘నాకు న్యాయం జరగలేదు. పంపకాలు మళ్ళీ చేయాల్సిందే’ ఫిర్యాదు చేశాడు చిన్నకొడుకు. ‘పెద్దల్లో పెట్టే, అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం కదరా! ఇప్పుడేంటి ఈ తిరకాసు?’ అడిగాడు మూడోకొడుకు. ‘నీకిద్దరు కొడుకులు పుట్టేసరికి ఆస్తి మీద కన్ను కుట్టిందా?’ అన్నాడు రెండోకొడుకు. ‘కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందని ఇవన్నీ నీకెవరు నూరుపోశార్రా?’ అడిగాడు పెద్దకొడుకు. రాముడుకు తన తండ్రినుంచి సక్రమించిన పద్దెనిమిది సెంట్ల భూమిలో ముగ్గురు కొడుకులకు తలో ఆరు సెంట్లు పంచిచ్చాడు. ప్రభుత్వమిచ్చిన స్థలంలో కట్టిన ఇల్లును చిన్నోడికిచ్చాడు.

కట్టినిల్లు చిన్నోడికి ఇచ్చాడని మిగతా ముగ్గురూ తండ్రిపై కోపంగా ఉన్నారు. మిగతా ముగ్గురికీ ఆరు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి తనకు మాత్రం ఐదు సెంట్లలో ఇల్లు ఇచ్చాడని చిన్నోడు కోపంగా ఉన్నాడు. మొదటి ముగ్గురూ కాయకష్టం ఎరిగినోళ్ళు కాబట్టి స్వయంగా ఇల్లు కట్టుకోగలరని, చిన్నోడు చదువుకున్నోడు కాబట్టి పని చేసుకోలేడని ముందుచూపుతో కట్టినిల్లు రాసిచ్చాడు రాముడు. అతని ముందుచూపు వాళ్లకు ముల్లులా గుచ్చుకుంది. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందాని లోలోన బాధపడ్డాడు. ‘చచ్చినోళ్ళను చితి కాలిస్తే బతికున్నోళ్ళను చింత కాలుస్తుందన్న సంగతి కూడా వాళ్లకి తెల్వట్లేదురా భీముడు!’ ‘ఇనపడదంటావ్‌. చురకలంటిస్తూనే ఉంటావ్‌. మాటలకేం కొదవ లేదు’ కోప్పడ్డాడు చిన్నకొడుకు. ‘వాళ్ళేం అంటున్నారో విన్నావంట్రా భీముడూ... పదిమంది సంతానాన్ని ఓ దారికి తెచ్చి, కూతుళ్ళ పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు, పిల్లల ఆలనా పాలనా... ఎన్నని చెప్పన్రా నా బాధ! ముద్ద పెట్టడానికే ఏడుస్తున్నారంటే రేపు నన్ను తగలెయ్యడానికి కూడా ఏడ్చేలా ఉన్నార్రా. వాన రాకడ, ప్రాణం పోకడ తెలుస్తుందా? నాకెందుకురా ఆస్తులు! ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది.

ఒకే కడుపున పుట్టిన వాళ్ళు ఒకరెక్కువ, ఒకరు తక్కువెలా అవుతార్రా?’ రాముడి బాధనర్థం చేసుకున్న భీముడు బలంగా వీస్తూ ఆకులు రాల్చాడు. అకస్మాత్తుగా చెలరేగిన దుమ్ము కళ్ళల్లోకి వెళ్ళకుండా అక్కడున్నవారు కండువాలు అడ్డం పెట్టుకున్నారు. భీముడు తనకు సంఘీభావం తెల్పడంతో అతనివంక ప్రేమగా చూశాడు రాముడు. తండ్రి గతం మొత్తం తవ్వుతుంటే బిత్తరచూపులు చూశారు అన్నదమ్ములు. అక్కడున్న వాళ్ళెవరూ వాళ్లకు మద్దతు తెలుపలేదు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వాళ్ళక్కడ్నుంచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ‘నా బాధ నీకొక్కడికే అర్థమవుతుందిరా భీముడూ... ఆస్తి పంపకాల్లో భాగంగా నిన్ను కూడా అమ్మేసి డబ్బులు పంచమంటున్నారు. మనూరి గ్రామపెద్దకు పురమాయించారు కూడా! ఆయనకి నీమీద బాగా గురి! అందుకే ఎంత రేటైనా కొంటానని అడుగుతున్నాడ్రా. నిన్నెలా దూరం చేసుకుంటారా?’ భీముడు పొదిగిట్లో ఒదిగిపోయాడు రాముడు. భీముడు అందించిన ఆత్మీయ స్పర్శకు తల వంచాడతను. ఒక్కో ఆకు మెల్లగా రాల్చసాగాడు భీముడు. ఊహించినట్లే ఎవరూ కనిపెట్టని విధంగా వాతావరణంలో మార్పులు జరిగాయి.

మూడు పూటలూ భోజనం చేయడానికి వాటాల ప్రకారం పద్దెనిమిదేళ్ళుగా నలుగురు కొడుకుల ఇంటికి తిరుగుతున్నా, రాత్రి పడుకోవడానికి మాత్రం చిన్నోడింటికి వచ్చేస్తాడు రాముడు. తన జీవిత భాగస్వామి ఆ ఇంట్లోనే కాలం చేసిందని, ఆమె జ్ఞాపకార్థం తాను కూడా ఆ ఇంట్లోనే కాలం చేయాలన్నది అతని కోరిక. పొద్దు పోయినా రాముడు ఇంటికి రాకపోయేసరికి గుమ్మంవైపు చూస్తూ కూర్చున్నాడు చిన్నకొడుకు. ఆపసోపాలు పడుతూ మల్లన్న అక్కడకు రావడంతో కంగారుపడ్డాడు. ‘ఏంటి మల్లన్నా... ఇలా వచ్చావ్‌?’ ‘అయ్యగార్ని ఎంత లేపుతున్నా లేవడం లేదు బాబు. నాకేదో భయంగా ఉంది. మీరోసారి రండి’ మల్లన్న చెప్పడంతో భీముడు దగ్గరికెళ్ళి పొదిగిట్లో నిద్రపోతున్న తండ్రిని తట్టి లేపాడు. అదతని శాశ్వతనిద్ర అని తెలియడానికెంతో సమయం పట్టలేదు.

అతని కోరిక తీరకుండానే, అతని సమస్యను ఓ కొలిక్కి తేకుండానే కాటికి దగ్గరయ్యిన తండ్రిని చూసి కుమిలిపోయాడు. ఇంటిముందు శవాన్ని పడుకోబెట్టి బంధువులకు సమాచారమిచ్చాడు. ఆ రాత్రి గడిచింది. దహన సంస్కారాల నిమిత్తం చేసే ఏర్పాట్లలో కదలిక లేదు. కారణాలు తెలీక బంధువులతోపాటు గ్రామస్తుల్లో కూడా అనుమానాలు చెలరేగాయి. సంప్రదాయం ప్రకారం పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి కాబట్టి ఏర్పాట్లన్నీ చేసి తదుపరి కార్యక్రమాన్ని ముగించమని పెద్దలు సూచించారు. ‘సంప్రదాయమని నా మీదకు తోసేయ్యడం ఏం బాలేదు. మూడోవాడు ముసలోడి నుంచి రెండు గేదల్ని తీసుకుని, వాటినమ్ముకుని ఇల్లు కట్టుకోలేదా? రెండోవాడు పెళ్లవ్వగానే అసలేం పట్టించుకోకుండా వెళ్లిపోలేదా? అప్పులు చేసి చిన్నోడిని ఇంత చదువు చదివిస్తే హాయిగా ఉద్యోగం చేసుకోవడం లేదా? వీళ్ళందర్ని వదిలేసి నేనొక్కడినే చేయాలా?’ మొండివాడు రాజు కన్నా బలవంతుడన్నట్లు మూర్ఖంగా అందరివంకా చూస్తూ అన్నాడు పెద్ద కొడుకు. ‘ముసలోడి ఫించన్‌ డబ్బులన్నీ ఏమవుతున్నాయ్‌? వేప చెట్లమ్మిన డబ్బులు ఏం చేశాడు? రెండు సెంట్ల భూమి కొట్టుకుపోయినప్పుడు గోవర్నమెంట్‌ వోళ్లు డబ్బులిచ్చారుగా, ఏమయ్యాయి?’ మేమేం తక్కువ కాదంటూ కోడళ్ళు.

గ్రామస్తులంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఆ వాదోపవాదాలకు గుండెల్లో గూడుకట్టుకున్న బాధలా ఆకాశంలో మబ్బులన్నీ ఒకేచోట చేరి వీక్షించసాగాయి. వాటి ఆవేదనను తెలియజేస్తున్నట్లు మెరుపులు మెరిశాయి. గాలులు వీచాయి. అనంతవాయువుల్లో కలిసిన రాముడి ఆత్మ అక్కడే తిరగసాగింది. వంతులేసుకోకుండా చితికి నిప్పంటించి తనకు మోక్షం కలగజేయమని ఘోషిస్తోంది. అతని కూతుళ్ళు తలోమాట అందుకున్నారు. ‘మీకసలు బుద్ధుందారా? తండ్రి శవం ముందు పెట్టుకుని సిగ్గు లేకుండా ఏంటా వాదులాటలు? అందరూ నవ్విపోతారు... నలుగురు కొడుకులుండీ కర్మకాండలు చేయలేందంటే ముసలోడి ఉసిరి తగులుతుంది... తలో చెయ్యి వేయండి...’ అంటూ మందలించారు. ‘ముసలోళ్ళు ఉండగా బోల్డంత తిన్నారుగా! అవేం గుర్తురావడం లేదా? మీరే వాటాలేసుకోండి. మీ ఆరుగురు అక్కాచెల్లెళ్లు తలో చెయ్యి వేస్తే తద్దినం కూడా ఘనంగా చేయొచ్చు. బావోళ్ళు కూడా ఇక్కడే ఉన్నారుగా...’ వాళ్ళన్న మాటకు కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లయ్యింది సోదరీమణుల పరిస్థితి. నచ్చజెప్దామనుకున్న గ్రామస్తులు వారి ప్రవర్తను చూసి ఆగిపోయారు.

ఇంతలో భీముడు చనిపోయాడనే సంచలన వార్త అందింది. ఎంత పెద్ద తుఫానొచ్చినా, భీభత్సమైన గాలులు వీచినా తొణకని భీముడు ఇప్పుడు చిన్న ఈదురుగాలులకు నేలకొరగడం అందరికీ వింతగా తోచింది. నిజమో, కాదోనని నిర్థారించడానికి కొంతమంది వెళ్ళారు. విషయం తెలుసుకున్న రాముడి ఆత్మ భీముడి దగ్గరికి చేరుకుంది. నేలకొరిగిన భీముణ్ణి చూసి సంతోషిస్తూ, ‘నేనంటే నీకెంత ప్రేమరా భీముడు! నేను లేనని తెలిసి నువ్వే వచ్చేస్తున్నావా? నిజమేలే... నేను లేకపోతే నీకెవరు కబుర్లు చెప్తారు. నిన్నెవరు పట్టించుకుంటారు. వాళ్ళెలా వంతులేసుకుంటున్నారో చూడరా... కాటికి పోయిన పీనుగు, కట్టెల పాల్గాక ఇంటికొస్తుందా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడు...’ ప్రేమగా తడుముతూ అంది రాముడి ఆత్మ. అవునన్నట్లు తలూపింది భీముడి ఆత్మ. ‘రాముడి గురించి అందరికీ తెలుసు. కొడుకులుండగా నేను ఖర్చులు పెట్టుకోవడం సంప్రదాయం కాదు కాబట్టి ఈ వేపచేట్టును నేను కొంటాను. ఐదువేలు ఖరీదు చేసే చెట్టుకు పదివేలిస్తాను. కాదనకండి! కనీసం ఈ డబ్బులతోనైనా కార్యం జరిపించండి’ అని గ్రామ పెద్ద ప్రతిపాదించడంతో, కొడుకులేం అంటారోనని వారివంక చూశాయి కలిసిన ఆత్మలు. తమకొచ్చిన నష్టమేమీ లేదని భావించిన కొడుకులు వారి సమ్మతిని తెలియజేశారు.

పుత్రుల స్వార్జితంతో జరగాల్సిన తండ్రి కర్మకాండలు బయటవాళ్ళ దయాదాక్షిణ్యాలతో జరుగుతున్నాయని రాముడి కూతుళ్ళు బాధపడసాగారు. అంతలో మల్లన్న జనంనుంచి ముందుకొచ్చి ‘అయ్యగారి దయవల్ల, భీముడి దయవల్ల నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తున్నాయ్‌. ఆల్లిద్దరి అనుబంధం గొప్పది కాబట్టే ఇద్దరూ ఒకేరోజు ఇలా... దయచేసి ఆల్లిదర్నీ ఏరు చేయొద్దు. భీముణ్ణి అమ్మేసి ఆరి బంధానికి ఖరీదు కట్టొద్దు. అయ్యగారు నా తాన ఒక్క రూపాయి ముట్టలేదు. ఈ కార్యానికయ్యే ఆ డబ్బేదో నేనే ఇత్తా. ఇట్టైనా నా ఋణం తీర్చుకోనివ్వండి ’ అంటూ రెండు చేతులెత్తి వేడుకున్నాడు. మా చేతికేం అంటుకోకుండా ఎలా జరిగినా మాకిష్టమేనన్నట్లు ‘మాకేం అభ్యంతరం’ లేద’న్నారు కొడుకులు. కందకు లేని దురద కత్తికెందుకన్నట్లు మౌనం వహించారు కూతుళ్ళు.

తన కోరుకున్నట్లు భీముడు తనకు దక్కనందుకు గ్రామపెద్ద మల్లన్నవైపు కోపంగా చూశాడు. ‘నాదో సిన్న కోరిక బాబు... భీముడి పుల్లలతోనే రాముడి చితికి నిప్పంటించండి. అప్పుడు ఆల్ల ఆత్మలు సాంతిస్తాయి...’ అన్న మల్లన్న కోరికను స్వాగతించారు గ్రామస్తులు. ‘భీముడూ... చూస్తున్నావా? మల్లన్న మనిద్దర్నీ కలుపుతున్నాడురా. మన ఋణం తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా... బతికుండగా ఓదార్పునిచ్చావ్, చచ్చిపోయాక నాతో నువ్వొస్తూ ధైర్యాన్నిస్తున్నావ్‌. నాకది చాలురా... మీ కుటుంబం చల్లగా ఉండాలి మల్లన్నా...’ అంటూ దీవించింది రాముడి ఆత్మ.

మద్దతు తెలిపింది భీముడి ఆత్మ. ఊరిచివరనున్న శ్మశానంలో రాముడి దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరిగాయి. పెద్ద కొడుకు చితికి నిప్పంటించాడు. ఎగసిపడే అగ్నిపర్వతంలా చితి జ్వాలలు చెలరేగుతుండగా భీముడి రెమ్మల్ని దానిపై వేశారు. అవి పచ్చిగా ఉన్న కారణంగా రాముడుకి కపాల మోక్షం ఆలస్యంగా లభించింది. భీముడు ఆత్మకు మోక్షం లభించగానే చుట్టుపక్కల వాతావరణమంతా దాని వాసన పరుచుకుంది. రెండు ఆత్మలు ఏకమై అనంత సృష్టిలో ప్రయాణం చేయసాగాయి.
చదవండి: World No Tobacco Day: పొగాకు నమలడంతో వచ్చే సమస్యలివి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement