Telugu Story: ఈ వారం కథ: భద్రప్ప బడి! | Gowkanapalli Maheshwar Reddy Telugu Weekly Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

Telugu Story: ఈ వారం కథ: భద్రప్ప బడి!

Published Sun, Apr 25 2021 9:43 AM | Last Updated on Sun, Apr 25 2021 7:40 PM

Gowkanapalli Maheshwar Reddy Telugu Weekly Story In Sakshi Funday

ఎక్కడి నుంచో ‘బుడక్‌.. బుడక్‌.. బుడ బుడ బుడక్‌ ’ అంటూ కర్ణకఠోరంగా వినిపిస్తోంది.  కుక్కలన్నీ కట్టగట్టి మొరుగుతున్నాయ్‌. గంపల కింద, చెట్ల కొమ్మల మీద ఉన్న కోళ్లు ఏదో విపత్తు వచ్చినట్లు ‘కొక్కొక్కో.. కొక్కొక్కో’ అంటూ భయంభయంగా గుసగుసలు పోతున్నాయి.  ‘‘ఈయప్పకు ఇంగ టైమే దొరకలేదంటనా?’’ అంటూ ఎవరో చాలా గట్టిగా, కోపంగా అంటున్నారు. అది.. అది నాన్న గొంతు! ఠక్కున మెలకువ వచ్చింది. ‘అంటే ఇందాకటి నుంచి  వినిపిస్తున్నవన్నీ నిజమేనన్నమాట. కల కాదు!’ అనుకుంటూ మంచంమీద దిగ్గున లేచి కూర్చున్నాను. పన్నెండున్నర శ్రుతిలో నాన్న గొంతుతోపాటు ఇందాకటి శబ్దాలన్నీ వీధిలోంచే వస్తున్నాయ్‌. టైమ్‌ ఎంత అయి ఉంటుందో అనుకుంటూ ఎదురుగా ఉన్న గోడ వైపు చూశాను. ఎప్పుడో పాతికేళ్ల కిందట ప్రొద్దుటూరులో పెదనాన్న తెచ్చిన పాత చెక్క గడియారంలో సమయం 3:25 గా చూపిస్తోంది. ‘అంటే ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. మరి ఏంటి ఈ గోల? కొంపదీసి ఎవరైనా గొడవ పడుతున్నారా?’ ఆ ఆలోచన రాగానే నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయింది. చటాలున మంచం దిగి, గబగబా వీధిలోకి పరిగెత్తాను. 

‘‘ఆ.. మయేస గూడా లేసినాడే’’ అంది అమ్మణ్ణి వదిన ఇంట్లో నుంచి బయటకు వస్తున్న నన్ను చూసి. ‘‘ఇంత గోల అయితాంటే కుంభకర్ణుడైనా నిద్ర లెయ్యాల్సిందే’’ అన్నాడు కొండయ్యన్న ‘వీడొకలెక్కా’ అన్నట్లు నావైపు చూస్తూ. వాళ్లిద్దరితోపాటు అమ్మానాన్న ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు. పగిలిన గాజుముక్కలా, పాత సినిమాల్లో హీరోల నుదిటిపై ఉండే బొట్టులా సన్నగా ఉండి, కనిపించీ కనిపించకుండా ఉన్నాడు ఆకాశంలో చంద్రుడు. వెన్నెల అంతంతగానే ఉండడంతో అమ్మ కిరసనాయిలు బుడ్డి వెలిగించి తెచ్చి అరుగు మీద ఓ వారగా పెట్టింది. ఊరంతటికీ కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయి నెలపైనే అయ్యింది. అందువల్ల ఊర్లో ఎక్కడా బల్బనేదే వెలగడం లేదు. బాగు చేయించడానికి అధికారులు ఎవరూ రాకపోవడమూ, ఊర్లో వాళ్లు డబ్బు ఖర్చవుతుందని ఎవరికి వారే పట్టించుకోకపోవడంతో నెల నుంచి కిరసనాయిలు బుడ్లు, లాంతర్లే గతి అయ్యాయి. డబ్బున్న ఒకరిద్దరి ఇళ్లలో మాత్రం జనరేటర్‌తో వెలుగుతున్న బల్బులు దర్పం చూపుతున్నాయి. పగలు పొలాల్లో పనులతో అందరూ తీరిక లేకుండా ఉండడంతో పెద్ద సమస్య లేదు కానీ, రాత్రిళ్లు ఫ్యాన్లు తిరగక, దోమల బాధతో నిద్ర కరువైంది చాలా మందికి. 

మా ఇల్లు పూర్తిగా బోద కొట్టం అయినప్పటికీ రెండు భాగాలుగా ఉంటుంది. రెండింటి మధ్యలో కాస్త జాగా ఉంది. అందులో నాలుగైదు మంచాలు వేసుకొని పడుకోవచ్చు. పైన కప్పు లేకపోవడంతో  ఆరుబయట పడుకున్నట్లే ఉంటుంది. అందువల్ల కరెంటు లేకపోయినప్పటికీ వెన్నెల ఉండే రోజుల్లో మాకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. 
‘‘బొడ్డెమ్మ కాడికి వచ్చినట్లుండాడు’’ అంటోంది అమ్మ ఎదురుగా రామన్న గారి ఇంటి దగ్గర అందరూ గుమికూడి ఉండడాన్ని చూస్తూ. ఆ మాటలకు ఔననంటున్నట్లు తలూపుతూ ‘‘అట్నే ఉందిత్తా సూచ్చాంటే’’ అని అంది అమ్మణ్ణి వదిన. ఆ మాటలతో నాన్న గొంతు మరోసారి ఖంగుమంది. 

‘‘ఈడు ఆన్నుంచి ఊరంతా తిరిగ్యాలకు తెల్లారతాది. ఆమైన అంతసేపూ మనమంతా నిద్దర్లేక సావాల్నా’’ అన్నాడు కోపంగా. 
నాన్న మాటలు అటు నడి వీధిలోని దేవళం దాటి ఆవతల రెండిళ్ల వరకు ఇటు మా వీధి చివరింటి దాకా వినిపించాయి. అందరూ ఒక్కసారిగా మా ఇంటివైపే చూశారు. ఈ గోలలోనే మా వీధిలో ఉండే చిన్నాపెద్దా అందరూ నిద్రలేచారు. ఎవరెవరి ఇంటి బయట వాళ్లు నిలబడి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లోనూ ఒక రకమైన ఆతృత కనిపిస్తోంది. 

చూస్తుండగానే బుడక శబ్దం దగ్గరవుతోంది. రామన్న గారి ఇంటి దగ్గరి మలుపులోకి రాగానే చేతిలో బుడకతో కనిపించిందో భారీ కాయం. ఒక్కసారిగా అందరూ సైలెంట్‌ అయిపోయారు. ఎవరికి వారే కళ్లు మిటకేసుకొని చూస్తున్నారు. గుసగుసలూ ఆగిపోయాయి. ఇంకాస్త దగ్గరయ్యాడు ఆ భారీకాయుడు. పైనుంచి కింద వరకు నల్లటి చొక్కా వేసుకొని ఉన్నాడు. దానిమీద ఎరుపు, కాషాయం, గులాబీ రంగులోని మూడు ఉత్తరీయాలు మెడను చుట్టుకొని కిందకు వేలాడుతున్నాయి. ఎర్రటి పంచెను గోచీ కట్టాడు. భుజమ్మీద నల్లటి పొడుగాటి కట్టె ఉంది. దానికి అక్కడక్కడ ఇనుప తొడుగులున్నాయి. ఆ కర్రకు సరిగ్గా మధ్యలో పిడిలాగా ఉంది. ఒక చేత్తో ఆ కర్రను పట్టుకొని ఉన్నాడు. రెండో చేతికి తాయెత్తు, పెద్ద కడియం కనిపిస్తోంది. అదే చేతిలోనే డమరుకం లాంటి బుడక ఉంది. మెడ నిండా పూసలతో చేసిన రకరకాల దండలు, తాయెత్తులు గుత్తులుగా ఉన్నాయి. మీసాల్ని పెనవేసుకొని నల్లటి గడ్డం కనిపిస్తోంది. కళ్ల చుట్టూ, ముక్కు మీదుగా పసుపు, కుంకుమ మిశ్రమం పట్టించి ఉంది. నుదుటిన తెల్లటి బూడిద శివుడి మూడో కన్నులా కనిపిస్తోంది. తలకు కిరీటం లాంటిది బంగారు వర్ణంలో మెరుస్తోంది. కళ్లు ఎర్రని నిప్పులా కణకణ మండుతున్నాయి. 

అర్థం తెలియని మంత్రాలేవో గంభీరంగా చదువుతూ మరింత దగ్గరికి వచ్చాడు. ఒక్కో ఇంటి దగ్గర నిమిషంపాటు ఆగుతూ, ఆ ఇంటిని చూస్తూ బుడకను వాయిస్తూ మంత్రాలు చదువుతున్నాడు. కొందరు ఆయనకు చేతులు జోడించి మొక్కుతున్నారు. మరికొందరు దూరంగా జరుగుతున్నారు. పిల్లలు భయంభయంగా పెద్దల చాటున దాక్కుంటున్నారు. చిత్రంగా ఆయన వెంటే కుక్కలు మొరుగుతూ వస్తున్నాయి కానీ అతని దరిదాపులకు మాత్రం రావడం లేదు. 
‘‘ఎవరుమ్మా ఆయప్ప? అట్లా ఉన్నాడు?’’ అని మెల్లగా అమ్మను అడిగా. ‘‘కాటిపాపడు లేరా’’ చిన్నగా చెప్పింది అమ్మ. 
చూస్తుండగానే మా ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటిని తేరిపార చూస్తూ ఏదో గొణిగాడు. అమ్మ వెనక నిలబడి ఉన్న నా వైపు చూస్తూ ‘‘చిన్నోడా?’’ అంటూ నాన్నను అడిగాడు. ఒక్కసారిగా ఆయన నోటి వెంట నా ప్రస్తావన వచ్చేసరికి ఒళ్లు ఝళ్లుమంది. అప్పటివరకూ నిద్ర చెడగొట్టినందుకు కోపంతో ఉన్న నాన్న సైతం ఆ మాటలకు చప్పున చల్లబడ్డాడు. ‘‘అవును’’ అన్నాడు ఆశ్చర్యాన్ని గొంతులో కనిపించకుండా. 

వీధిలో చివరి ఇల్లు సైతం పూర్తయ్యాక,æమంత్రాలు చదవడం, బుడక వాయించడం ఆపేసి కింది వీధి గుండా చకచకా నడుచుకుంటూ వెళ్లాడు ఆ కాటిపాపడు. అప్పటిదాకా గుమికూడిన వాళ్లందరూ ఎవరి పనులకు వాళ్లు మళ్లారు. ఆడవాళ్లలో కొందరు గేదెలకు పాలు పితికేందుకు వెళ్లగా, మరికొందరు ముగ్గు వేయడానికి ఇళ్ల ముందు నీళ్లు చల్లుతున్నారు. పిల్లోళ్లు మళ్లీ దుప్పట్లలోకి దూరారు. పెద్దోళ్లు యథావిధిగా బీడీలు, సిగరెట్లు తాగుతూ కాఫీ, టీ కోసం ఎదురుచూస్తున్నారు. నాకు మాత్రం ఆ కాటిపాపడు వేళగాని వేళ ఎందుకొచ్చాడో, భిక్ష కూడా తీసుకోకుండా ఊరికే మంత్రాలు చదువుకుంటూ ఎందుకెళ్లాడో అసలేమీ అర్థం కాలేదు. తెల్లవారుజామున నాలుగున్నర అయ్యింది. పాల గంగాధర స్కూటర్‌ హారన్‌ మోగించుకుంటూ నడివీధి దేవళం దగ్గరికి వచ్చాడు. రోజూ తాను వచ్చేసరికి గుడి దగ్గర పాలగిన్నెలతో ఎదురుచూసే ఆడోళ్లు ఆ రోజు ఒక్కరూ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయాడు. గొణుక్కుంటూ చుట్టుపక్కల చూశాడు. పెద్ద గిన్నె నిండా పాలు తీసుకొని వస్తూ కనిపించింది సిద్ధమ్మత్త. 

‘‘క్కా.. యాడికి బోయినారంతా.. ఇంగా ఒక్కరూ కనపల్యా’’ అన్నాడు.  ‘‘ఎవరో కాటిపాపోడు వచ్చిన్యాడు బ్బిగా. ఎనుములు బెదురుకోని పాలీవని ఆయప్ప పోయిందాక ఈదుల్లోనే ఉన్యారంతా. వచ్చారులే’’ అంటూ పాలుపోసి వెళిపోయింది ఆ అత్త. కాసేపటికే పాలగిన్నెలతో గంగాధర దగ్గర ఆడోళ్లంతా ముసిరారు. 

‘‘బ్బీ.. గంగాధర దగ్గరికి పోయి పది రూపాయల పాలు పోయిచ్చుకుని రాపో’’ అని లోపల్నుంచే ఆర్డరేసింది అమ్మ. 
రోజూ అమ్మే తెస్తుంది. ఈరోజు నేను ముందే నిద్ర లేవడం, ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడే మిగిలిపోవడంతో పాలు తెచ్చే బాధ్యత నాపై పడింది. గబగబా ఇంట్లోకి వెళ్లి పెద్ద గ్లాసు ఒకటి తీసుకొని దేవళం దగ్గరికి బయల్దేరాను. 
ఆపాటికే అక్కడ చేరిన ఆడోళ్లంతా ముచ్చట్లలో పడిపోయినారు. వాళ్ల మాటలన్నీ కాటిపాపడి గురించే. ‘‘వలకల కాడుండే అంగన్‌బడిలో ఉండాడంట. నిన్న సాయంత్రమే దిగినాడని తోట కాడికి పోతాంటే మాదిగోళ్లు సెప్పినారు. ఆయప్ప పేరు భద్రప్పంట. ఆయప్ప పెళ్లాం గూడా వచ్చిందన్యారు’’ అంటోంది ఒకామె. 
‘‘వలకల కాడనా?!!’’ వింటుండే ఆడోళ్లలో చాలామంది ఆశ్చర్యంగా నోరు తెరిచినారు. 
నేను కూడా వచ్చిన పని మరిచిపోయి వాళ్ల మాటలు వినసాగాను. 

‘‘పొద్దనీడి తోట కాడికి ఆ వలకల మధ్యలోంచి పోవాలంటేనే బయం బయంగా ఉంటాది. ఆయప్ప ఆడుండే పిండిబడిలో ఎట్టుండాడో!’’ మరొకామె అంది. 
‘‘ఆయప్పకేం బయం. మంత్రిచ్చినాడంటే దయ్యాలన్నీ పరిగెత్తవూ’’ అంది ఇందాక భ్రదప్ప గురించి చెప్పినామె తాను దగ్గరుండి చూసినట్లు. అందరూ తనవైపే చూస్తుండడంతో మరింత ఉత్సాహంగా చెప్పసాగింది. ‘‘పూలకుంటలో ఇళ్లన్నీ తగలబెట్టింది ఈయప్పనే అంట’’ అంది. 

‘‘ఎట్టెట్టక్కా! పూలకుంటలో ఈయప్పేనా ఇళ్లు కాల్చింది. ఎందుగ్గాల్చినాడంట? ’’ అనడిగిందొకామె.  
‘‘ఆ వూళ్లో బిచ్చకు బోయింటే ఎవ్వరూ బెయ్యలేదంట. ఇంగా కొందరేమో ఆయప్పను తిట్టి, మెడబట్టుకొని తోసినారంట. ఆయప్ప ఊరుకుంటాడా? ఒక నిమ్మకాయ తీసుకొని యిసిరేచ్చే ఆ నిమ్మకాయ యాడదానా పోయిందో ఆడిదాంకా ఇళ్లన్నీ కాలిపోయినాయంట. ఆ దెబ్బకు ఆయప్పను కొట్టినోళ్లు మళ్లా కాళ్లమిందబడి చెమించని అడిగినారంట. ఊరంతా కలసి ఆయప్పకు సాంగెం మాదిరి బియ్యం, కొర్రలు, జొన్నలు, కజ్జికాయలు, అప్పచ్చులు పెట్టి, తలా రోంత డబ్చిచ్చి పంపిచ్చినారంట’’ అంటూ ముగించింది. 
వింటున్న ఆడోళ్లలో ఈసారి ఎవరికీ గొంతు పెగల్లేదు. భద్రప్పకు ఎవరెవరు ఎంతెంత డబ్బు, ధాన్యం ఇచ్చుకోవాల్సి వస్తుందో అని లోపల్లోపలే లెక్కలు వేసుకుంటున్నట్లున్నారు. 

‘‘ఈరోజే ఇయ్యాలంటనా? ’’ ఎవరో అడిగారు గుంపులోంచి. 
‘‘లేదు.. ఆయప్ప మనూర్లో నెలపైనే ఉంటాడంట. అప్పటిదాంకా రోజూ ఒకరింట్లో విందు బెట్టాలంట. చెనిక్యాయలు, కందిబ్యాళ్లు, అల్చందలు, పెసుళ్లు, బియ్యం అన్నీ ఇయ్యాలంట. అయ్యన్నీ ఆయప్ప ఊరిడిసేటప్పుడు ఎత్తకపోతాడంట. ఏ ఇంటికొచ్చేదీ ఆయప్పే రోజూ సాయంత్రం చెప్తాడంట’’ అందామె. 

అంతే.. ఆ మాటతో చాలామంది మొఖాల్లో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అసలే రెండేళ్ల నుంచి కరువు. పంటలు అంతంత మాత్రంగానే పండుతున్నాయి.. అదీ నీటి సౌకర్యం ఉండేవాళ్లకు మాత్రమే. మిగిలిన వాళ్లను వానదేవుడు కరుణించడం లేదు. పాలు పోయడానికి వచ్చిన వాళ్లలోనూ చాలామందికి నీటి సౌకర్యం ఉండే పొలాలు లేవు. అందుకే వాళ్లలో ఆ కలవరం. 

వీళ్ల మాటలు వింటూనే తన పని తాను చేసుకుపోతున్నాడు గంగాధరన్న. అందరి దగ్గరా పాలు పోయించుకుని, ఆఖర్లో నాతోపాటు మరో ఇద్దరి చెంబుల్లోనూ కొన్ని పాలు పోసి డబ్బు తీసుకొని, బిందెల మూతి బిగించి స్కూటర్‌కు అటొకటి ఇటొకటి తగిలించాడు. 

పాలు తీసుకొని వచ్చి, ఇంట్లో ఇచ్చానన్నమాటే కానీ నా ఆలోచనల్నీ దేవళం దగ్గర విన్న మాటల చుట్టూనే తిరుగుతున్నాయి. అసలే ఇంటర్‌ సెకండియర్‌ ఫైనల్‌ పరీక్షలు దగ్గరికొచ్చాయి. రోజూ తెల్లారుజామునే లేచి, కాసేపు చదివితే కానీ పాఠాలు బుర్రకెక్కవు. అలాంటిది ఇప్పుడాయన నెలపాటు రోజూ ఇలాగే వస్తాడంటే పొద్దున్నే చదువుకోవడం కష్టమైనట్లే. నిద్ర కూడా తక్కువవుతాది. ఇప్పుడెలా అని దిగులు పట్టుకుంది. 

ఊరికి, హరిజనవాడకు సరిగ్గా మధ్యలో రోడ్డు పక్కనే ఉంటుంది శ్మశానం. ఊర్లో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాన్ని ఆ శ్మశానం పక్కనే, రోడ్డుకు ఆనుకొని నాలుగేళ్ల కింద కట్టారు. అందులోనే భార్యతోపాటు మకాం వేశాడు భద్రప్ప. ఎలా చేరాడో తెలియదు కానీ హరిజనవాడలో ఉండే వెంకటయ్య.. భద్రప్పకు అసిస్టెంట్‌గా చేరాడు. అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లల కోసం ఉంచిన తిండి, సామగ్రి మాత్రం వాళ్లు ముట్టుకోవడం లేదు. పిల్లోళ్లను అక్కడి వరకు తీసుకుపోకుండా ఊర్లోనే ఉండే బడి దగ్గరికే పేలాల పిండి, ఉంటలు తెచ్చి ఇస్తోంది ఆయా వీరమ్మ. 

భద్రప్ప రోజూ తెల్లారుజామునే రావడం మొదలుపెట్టాడు. అతని చేతి నుంచి అదే ‘బుడక్‌ బుడక్‌’ మోత. చిత్రంగా మొదటి రోజు వెంటపడిన కుక్కలు ఆ తరువాత మానుకున్నాయి. మొరగడం కూడా మానేశాయి. అదీ భద్రప్ప ఘనతగానే ఊళ్లో ప్రచారమైంది. కుక్కలు అరవకుండా నోటికి బంధనం వేశాడని చెప్పుకున్నారు. ఇలా భద్రప్ప లీలల్లో రోజుకొకటి ఊర్లో షికారు చేస్తోంది. శ్మశానంలో ఉండే దయ్యాలు అంగన్వాడీ కేంద్రంలోకి రాకుండా చుట్టూ అష్టదిగ్బంధనం చేశాడని, తెల్లారుజామున తాను ఊర్లోకి వచ్చినప్పుడు ఒంటరిగా ఉండే భార్యను అవి ఏమీ చేయకుండా ఉండేందుకు రక్షణగా తాయెత్తు కట్టాడని, వెంకటయ్యకూ ఓ తాయెత్తు కట్టి, కొన్ని మంత్రాలు కూడా నేర్పించాడని.. ఇలా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. 

మొదట ఊళ్లోకి భద్రప్ప ఒక్కడే వచ్చేవాడు. తర్వాత వెంకటయ్య తోడుగా రావడం ప్రారంభించాడు. రోజూ ఒకరింట్లో భార్యా సమేతంగా విందు భోజనం ఆరగిస్తున్నాడు భద్రప్ప. సాయంత్రం వెళుతూ వెళుతూ దండిగా బియ్యం, వేరుశెనగ కాయలు, కందులు, జొన్నలు తీసుకుపోతున్నాడు. చిత్రంగా ఊర్లో బాగా డబ్బు, తోటలు ఉండే వాళ్లను మాత్రమే భద్రప్ప ఎంచుకుంటున్నాడు. అది అర్థమయ్యాక మా ఇంటికి ఎట్టిపరిస్థితుల్లోనూ రాడని రూఢీ అయ్యింది. 

భద్రప్ప నిద్ర చెడగొడుతుండడంతో ఆ కొరత తీర్చుకునేందుకు రోజూ సాయంత్రం ఏడు గంటలకే భోజనం ముగించి నిద్రకు ఉపక్రమిస్తున్నాడు నాన్న. నా పరిస్థితే అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది.  తెల్లవారుజామునే లేచి చదువుదామంటే భద్రప్ప గోలకు ఏమీ ఎక్కడం లేదు. పోనీ రాత్రిళ్లు చదువుదామంటే పుస్తకం పట్టుకోగానే నిద్రపట్టేది. ఏంచేయాలో తెలియక భద్రప్పను లోలోపలే కసిగా తిట్టుకుంటున్నా. ఈ సమస్య త్వరగా మాయం కావాలని దేవున్ని కోరుకున్నా. 

నా మొర చాలా త్వరగానే ఆలకించాడు దేవుడు. అప్పటికే భద్రప్ప ఊర్లో మకాం వేసి ఇరవై రోజులకు పైనే అయ్యింది. ఓ రోజు రాత్రి తొమ్మిది గంటలకు దేవళం దగ్గర ఎవరో గట్టిగా అరుస్తుండడం వినిపించింది. వెంటనే హడావిడిగా బయటకి వెళ్లా. మా పక్క ఇల్లు దాటగానే దేవళం ఉంది. ఊర్లోని నాలుగు వీధులూ కలిసేది అక్కడే. గుడి ఎదురుగా పెద్ద వేపచెట్టు, దాని చుట్టూ అరుగు ఉన్నాయి. గుడికి కుడి పక్క నాటకాలు, డ్రామాలు ఆడేందుకు వీలుగా ఓ స్టేజీ ఉంది. అక్కడ కూర్చొని గట్టిగా గట్టిగా అరుస్తున్నాడు లక్ష్మయ్య. 

‘‘ఎవడోడు.. యాన్నుంచి ఒచ్చినాడు.. నల్లసొక్కా ఏస్కోని, నాలుగు నల్లపూసల దండలు మెళ్లో బేసుకుంటే మంత్రాలొచ్చాయా?.. మొగోడైతే నా మీద మంత్రం జెయ్యమను.. వాని మంత్రాలకు సింతకాయలు గూడా రాలవు.. వాడో నేనో తేలిపోవాలి ఈరోజు’’ అంటున్నాడు. దాంతోపాటే అలవోకగా బూతులు వస్తున్నాయి. లక్ష్మయ్య గురించి ఊరందరికీ తెలిసి ఉండడంతో ఎవరూ ఆపడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఆ గోల చూసి ఐదారు ఇళ్ల ఆడోళ్లు ఒకచోట చేరారు. విషయం భద్రప్పకు తెలిస్తే ఏమవుతుందో అని వాళ్లలో వాళ్లే గుసగుసలు పోతున్నారు. ఇదిలా జరుగుతుండగానే నేరుగా దేవళం దగ్గరికి వచ్చాడు నాన్న. లక్ష్మయ్య ఊర్లో ఎవరి మాటైనా విన్నాడంటే అది నాన్న మాటే. అందుకే నాన్న వచ్చి గట్టి అరవగానే గొనుక్కుంటూ ఇంటిబాట పట్టాడు లక్ష్మయ్య. 

ఆశ్చర్యంగా ఆ మరుసటి రోజు తెల్లవారుజామున భద్రప్ప రాలేదు. నాకు బాగా నిద్ర పట్టటడంతో పూర్తిగా తెల్లారేంతవరకు మెలకువ రాలేదు. నిద్ర లేచాక గుర్తొచ్చింది భద్రప్ప సంగతి. ఏం జరిగిందో? తిట్టినందుకు లక్ష్మయ్యను ఏమైనా చేశాడో? అని ఆందోళన కూడా కలిగింది. వీధిలోకి వెళ్లా. చౌడయ్య మామ ఇంటి దగ్గర గుమిగూడి ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు వీధిలో వాళ్లంతా. వాళ్ల మధ్యలోకి దూరాను. 

‘‘పిండిబడిలో లేరంట. మాదిగోళ్ల వెంకటయ్య పొద్దన్నే పోయి చూచ్చే భద్రప్ప, ఆయప్ప పెళ్లాంతోపాటు రూమ్‌లో సామాన్లు గూడా ఏమీ లేవంట’’ అంటున్నాడు కొండయ్యన్న.  
‘‘రాత్రి లక్ష్మయ్య తిట్టడం వల్లనే పోయినాడంటావా?’’ అన్నాడు చౌడయ్య మామ. 
‘‘ఎట్టయితేనేం. పీడ పోయింది. ల్యాకపోతే తెల్లారుజామున వచ్చాంటే నిద్ర ల్యాక సచ్చామింటిమి. చేలల్లో పనులూ సరిగా చేసుకోలేకపోతాంటిమి’’ అంటోంది అమ్మణ్ణి వదిన. 

వాళ్ల మాటలు విని నాకు మాత్రం చాలా సంతోషం వేసింది. భద్రప్ప గోల తప్పిందని సంబరపడ్డా. కానీ.. ఎంత ఆలోచించినా హఠాత్తుగా ఊరిని ఎందుకు వదిలిపెట్టి వెళ్లాడో తెలియడం లేదు. నన్నే కాదు ఊర్లో అందరినీ ఇదే ప్రశ్న తొలచివేస్తోంది. వారం గడిచే కొద్దీ భద్రప్ప సంగతిని ఊళ్లో వాళ్లు దాదాపు మర్చిపోయారు. నాకు మాత్రం ఎలాగైనా కనుక్కోవాలనే కోరిక ఉండేది. సరిగ్గా పది రోజుల తర్వాత అనుకోకుండా నా ప్రశ్నకు సమాధానం దొరికింది.   

ఆ రోజు.. తోట దగ్గరికి వెళుతుంటే ఊరి బయట గేదెలు తోలుకెళుతూ కనిపించాడు లక్ష్మయ్య. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేనూ మాటలు కలిపి, సమయం చూసి భద్రప్ప విషయం గురించి అడిగాను. ఆ రోజు మత్తులో తిట్టావా? లేక నిజంగానే తిట్టావా? అని కూడా అడిగాను. నా ప్రశ్నలు విని ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. తర్వాత ‘ఈ ఊళ్లో మా కుటుంబం ఇంకా బతికే ఉందంటే అది మీ నాయిన వల్లే. అందుకే ఇప్పటి దాంకా నాకు, మీ నాయినకు మాత్రమే తెలిసిన ఆ రహస్యాన్ని నీకు చెప్తాండా. కానీ నువ్వు మాత్రమ ఎవరికీ చెప్పకు రా బ్బిగా’అంటూ నాతో ఒట్టు వేయించుకున్నాడు. ‘సరే’నని చేతిలో చేయి వేశా. అటూ ఇటూ చూసి మెల్లగా నోరు విప్పాడు.
‘‘వాడు అసలు కాటిపాపడే కాదు’’ అన్నాడు. 

ఆ మాటతో ఉలిక్కిపడ్డాను. వెంటనే ‘‘నీకెలా తెలుసు?’’ ఠకీమని వచ్చిందా ప్రశ్న నా నోటి నుంచి.
మళ్లీ అటూ ఇటూ చూసి గొనుగుతున్నట్లు అన్నాడు ‘‘వాడు నా తమ్ముడు’’
ఈసారి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. కాసేపటి వరకు తేరుకోలేకపోయాను. తిరిగి ఏదో అడగబోయే లోపు తనే మొదలెట్టాడు. 

‘‘ఇరవయ్యేండ్ల కిందటి దాంకా మాగ్గూడా గెయి కాడ ఐదెకరాల తోట ఉన్యాది. మా పక్క తోట కాపోళ్లు దావకు, గెయిలోని నీళ్లకు మాతో రోజూ కొట్లాడతాన్యారు. వాళ్లేమో పదిండ్లోళ్లు. మా నాయిన ఒక్కడే. ఊరికూరకనే మా నాయిన్ను కొట్టడానికి వచ్చాన్యారు. మా నాయినా మొండోడే.. మీ నాయిన అండగా ఉండడంతో వాళ్లతో అట్నే తగులాడ్తాండ్య. కానీ.. ఆ కాపోళ్లు మాత్రం పిల్లోళ్లమని గూడా సూడకుండా మమ్మల్నీ నానా తిట్లూ తిడతాన్యారు. ఓ రోజు పందులు తోట్లో పడకుండా కాపలా కాసేందుకు నేను, చిన్నోడు తోటకాడికి పోయినాం. తెల్లారితే గంగమ్మ తిన్నాళ. పొట్టేల్ని కోచ్చామని మొక్కుబడి ఉండడంతో ఆ రోజు కాపలాకు నాయన రాల్యా. ఇంటికాడ్నే ఉన్యాడు. తోట కాడికి నేను, చిన్నోడే పోతిమి. అర్ధరేత్రి కాస్త కునుకు పట్టడంతో చిన్నోన్ని సూచ్చాండమని చెప్పి పడుకున్యా. రోంత సేపటికి మెలకువ వచ్చి చూచ్చే చిన్నోడు లేడు. గబగబా మంచె దిగి కేకేచ్చి. గెయి కానుంచి పరిగెత్తుకుంటా వచ్చినాడు. మనిషి బాగా పదుర్తనాడు. ‘యాడికి పోయిన్యావు రా’ అంటే సెప్పల్యా. తెల్లారుజామున నాలుగ్గంటకు తిరిగి ఇంటికి బయల్దేర్నాం. దావలోనే కాపోళ్ల నడిపోడు ఎదురైనాడు. తోటకు నీళ్లుగట్టను పోతాన్నెట్టుండాడు.

మమ్మల్ని జూసి తిట్లందుకున్యాడు. మేమేమో తలొంచుకొని ఇంటికొచ్చినాం. అప్పటికే తిన్నాళ బోయెందుకు ఇంటి కాడ నాయిన, అమ్మా ఎడ్లబండితో సిద్ధం ఉన్యారు. మేమూ రెడీ అయ్యి దావ పట్టినాము. తిరిగొచ్చేటపుడు తిన్నాళలో చిన్నోడు తప్పిపోయినాడు. ఎంత ఎదికినా కనపల్య. అమ్మా, నాయినా, నేను ఏడ్సుకుంటా ఇంటికొచ్చేసరికి ఊళ్లో కాపోళ్ల నడిపోడు సచ్చిపోయినాడని తెలిసింది. గెయికాడ తోటకు నీళ్లు కట్టనుబోయి కరెంటు తగిలి సచ్చిపోయినాడని ఊరంతా అనుకుంటనారు. నాకు రోంత అనుమానం వచ్చింది. రాత్రి చిన్నోడే కరెంటు తీగను తెంచి పెట్టినాడేమో అనుకున్యా. నాయినకు, అమ్మకు చెప్పినా. వాళ్లు ఆ మాట ఇంగేడా అనొద్దని ఒట్టేయించుకున్యారు. మీ నాయిన్ను పిలిచి, విషయం చెప్పినారు. అయితే, నడిపోడు చనిపోయిందాని మీద వాళ్లింటోళ్లకు ఎలాంటి అనుమానం రాకపోవడంతో విషయం బయటపడలే. ఆ తర్వాత కొన్ని రోజులకు మా భూమిని దగ్గరుండి వాళ్లకే అమ్మించి, సమస్య తెగ్గొట్టినాడు మీ నాయిన. మేము కుంటబాయి కాడ భూమి తీసుకుని బతుక్కుంటనాం. అందుకే మీ నాయినంటే నాకు అభిమానం’’ అన్నాడు నా వైపు చూస్తూ. 
‘‘అది సరేన్నా.. భద్రప్పే మీ తమ్ముడని ఎలా కనుక్కున్నావ్‌?’’ అడిగాను నేను. 

‘‘ చిన్నప్పుడు ఒగసారి వాన్ని రాయితో కొట్టిన్యా. ఆ దెబ్బకు వాని ఎడం సెవ్వుకు పెద్ద మచ్చ ఏర్పడిన్యాది. అట్నే వాని ఎడంసేతి సిటికెనేలు కాడ పెద్ద పుట్టుమచ్చ ఉన్యాది. వాడెప్పుడైనా కనబడ్తాడేమో అని ఈ గుర్తులు మర్సిపోవద్దురా అని మాయమ్మ సెప్తాండ్యా. భద్రప్ప సేతికి, సెవికి ఈ రెండు మచ్చలూ కనిపిచ్చినాయి. అందుకే నిన్న పొద్దన ఎవరూ లేనప్పుడు పోయి వాన్ని కలిసినా. వాడు నా తమ్ముడేనని ఒప్పుకున్యాడు. ఆ రోజు స్టార్టర్‌కు కరెంటు వచ్చేలా తగిలిచ్చినానని, అందుకే తిన్నాళ్లలో పారిపోయాననీ సెప్పినాడు. జరిగిందేదో జరిగింది మళ్లా ఇంటికిరా అన్యా. వాడు ఇన్లా. ఆ బాధలోనే రాత్రి తాగి వానిమింద తిట్లందుకున్యా. కానీ, తెల్లారే ఎళ్లిపోతాడని నాకూ తెలియదు’’ అని ముగించినాడు ఆకాశం వైపు చూస్తూ. 

ఏం చెప్పాలో తెలియక నేను అలాగే ఉండిపోయినా. ఆ తర్వాత నేను ఇంటికొచ్చా. 
కాలక్రమంలో మరో ఇరవయ్యేళ్లు గడిచాయి. నా చదువు పూర్తయ్యి హైదరాబాద్‌లో పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ఎప్పుడైనా సెలవుల్లో ఇంటికెళితే ఇప్పటికీ శ్మశానం పక్కన అంగన్‌వాడీ కేంద్రాన్ని చూసినప్పుడల్లా నాకు భద్రప్పే గుర్తుకొస్తాడు. 
ఊర్లో వాళ్లందరూ దాన్ని ఇప్పటికీ అంగన్‌బడి, పిండిబడి అని పిలుస్తున్నా నాకు మాత్రం అది భద్రప్ప బడిగానే ముద్ర పడిపోయింది.  

- గౌకనపల్లె మహేశ్వరరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement