ఈవారం కథ: క్షణం తర్వాత.. | Short Telugu Story By Chidatala Devadanam Raju In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: క్షణం తర్వాత..

Published Sun, May 23 2021 1:30 PM | Last Updated on Sun, May 23 2021 1:30 PM

Short Telugu Story By Chidatala Devadanam Raju In Sakshi Funday

కొత్తరాజు అసలు పేరు వేరు. బతుకు తెరువు వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చినపుడు ఫలానా ఆయన అని చెప్పడానికి ఉపయోగించిన పేరు స్థిరపడిపోయింది. కొంత చేను కౌలుకు తీసుకున్నాడు. తర్వాత కాలంలో పొదుపుగా సంసారం నడుపుకుంటూ రెండెకరాలు కొనుక్కున్నాడు. 
ఆ ఊరిలో ఒక వీధి సందు చివర బంగాళాపెంకుల ఇల్లు కట్టుకున్నాడు. సడీ చప్పుడూ లేని ప్రాంతం. ఇంటి ముందు కొబ్బరాకుల దడి. పక్కన నిమ్మచెట్టు... మందారమొక్క...కొంచెం దూరంలో కొబ్బరిచెట్టు.
అకస్మాత్తుగా కొత్తరాజుకు ఒక ఆలోచన వచ్చింది. 
అటూ ఇటూ చూశాడు. దడి దాక వెళ్లాడు. ఎవరూ వస్తున్న జాడ లేదు. 
ఎండ పొడి పొడిగా రాలుతోంది. నీడలు తూర్పు వైపు సాగుతున్నాయి. చెట్ల మీంచి పిట్టలు 
నిలయ విద్వాంసుల వాద్యగోష్టిలా సవ్వడి చేస్తున్నాయి. 
వాకిట్లో మనవరాలు చిన్ని బోర్లా పడుకుని కూనిరాగాలు తీస్తోంది. చిన్నిని తనకు అప్పగించి వంట గదిలో మురిపీలు చేయడంలో శాంతమ్మ, రమ తంటాలు పడుతున్నారు. మురిపీల్ని గోరుమిటీలు అని కూడా అంటారు. బొటనవేలు కనుపు మీదుగా ఒత్తుతూ అందమైన నగిషీలుగా పంచదార పాకంతో రుచికరమైన తినుబండారంగా తయారు చేస్తారు. వాళ్లిద్దరూ కనీసం గంట వరకూ బయటకు రారు. 

ఇదే అదను. తల్లీకూతుర్లిద్దరూ వంట గదిలో పనిలో ఉండగానే తన ఆలోచన అమలులో పెట్టాలి.
కొత్తరాజు పంచెను మోకాలు పైకి బిగించి కట్టుకున్నాడు. ఇంటి వెనుక కొట్టుగది దగ్గరకెళ్లాడు. తలుపు తీసుకుని గునపం తీసుకున్నాడు. పార కోసం వెదికాడు. కనపడలేదు. గునపంతో మందారమొక్కకు మూడడుగుల దూరంలో తవ్వడం మొదలెట్టాడు. 
మట్టి గుల్లగానే ఉంది. పోటేసి చేతివేళ్లతో మట్టి తొలచి గోయి తవ్వాడు. రెండడుగుల లోతు...అడుగు వెడల్పు. చెమట పట్టింది. భుజం మీది తువ్వాలుతో ముఖం తుడుచుకున్నాడు. పక్కకు ఒరిగి ముక్కు చీదాడు. దగ్గొచ్చింది. తువ్వాలు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా దగ్గాడు.         
ఇంతలో సుబ్బడొచ్చాడు. 
‘ఖాళీగా ఉండవు కదా...ఏదో ఒకటి పుణుక్కుంటూనే ఉంటావు. ఏం చేస్తున్నావు? ’ సుబ్బడు అడిగాడు. కొత్తరాజులో కంగారు. బేలగా చూశాడు. వెంటనే గంభీరంగా మారిపోయాడు.

‘ఏం లేదు... ఏం లేదు...ఈవేళప్పుడు వచ్చావేంటి? మీ అమ్మాయిని తీసుకొచ్చేసావా? ’ మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. కొత్తరాజులో దాచుకున్నా దాయలేని తత్తరపాటు కనిపించింది. ఏదో దాస్తున్నాడని సుబ్బడు పసిగట్టాడు. పరిశీనగా చూశాడు. అర్థం కాలేదు. 
కొత్తరాజు ఎప్పుడూ అంతే. తోచింది చేస్తాడు. అనుకున్న పని నుంచి వెనక్కి తగ్గడు. అలుపు లెక్క చేయడు. నిరంతరం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడని నలుగురూ అనుకోవాలి. తన దేహశక్తి మీద అపార నమ్మకం. చిన్నపుడు చేసిన ఘన కార్యాలు కథలుగా చెబుతుంటాడు. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అయినా చెప్పుకుంటూ పోతాడు. 

కొత్తరాజుకి చిట్కా ప్రయోగాలు ఇష్టం. అతని వ్యక్తిత్వంలోనే ఒక వింత దాగి ఉంది. ప్రతీదీ రహస్యమే. మామూలు విషయాన్ని కూడా అదేదో ముఖ్యమైనదన్నట్టు చెవిలో చెబుతాడు. భుజం మీద చేయి వేసి దూరంగా తీసుకెళ్లి రహస్యమన్నట్టు గుసగుసలతో గొంతు తగ్గించి మాట్లాడతాడు. తీరా చూస్తే ఏమీ ఉండదు. నలుగురిలో చెప్పే మాటే అయినా అలాగే చేస్తాడు. చుట్టూ జనం నవ్వుకుంటున్నా పట్టించుకోడు. అయినదానికీ కానిదానికీ గోప్యత పాటిస్తాడు. విచిత్రం ఏమిటంటే కాసేపటికే రహస్యం బట్టబయలవుతుంది. 
నూతి దగ్గరకెళ్లి చేతులు కడుక్కున్నాడు. సుబ్బడి చెంతకు వచ్చాడు.. 
 ‘ సుబ్బా...కొంచెం పనుంది..రేవు కలుద్దాం’  మనవరాలిని ఎత్తుకుని ఇంటి లోపలికి వెళుతున్నట్టుగా అడుగులేసాడు. సుబ్బడు ఆశ్చర్యపోయాడు. సుబ్బడు సరదా కబుర్ల కాలక్షేపానికి వస్తాడు. గంటో రెండు గంటలో అవీ ఇవీ మాట్లాడుకుంటారు. ఊళ్లో సంగతుల్ని కలబోసుకుంటారు.    
‘ఒక్క క్షణం... ఏవో నా బాధలు చెప్పుకోడానికి వస్తే...నన్ను వదిలించుకోడానికి చూస్తావ్‌... ఈవేళ ఉదయం నా కోడలితో జరిగిన గొడవకు చద్దామనుకున్నాను... అది చెప్పుకుందామని...’ నిష్టూరంగా అన్నాడు సుబ్బడు. కొత్తరాజు ఆగాడు. తీక్షణంగా చూశాడు.     
‘ఏం మాట్లాడుతున్నావ్‌.. బుద్ధీజ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? చచ్చి ఎవర్ని ఉద్ధరిస్తావ్‌... చస్తాడట... చస్తే ఏముంది? ఈవేళ ఒకటి రేపు రెండు....రోజులెళ్లిపోతాయి... సమస్య వస్తే బతికి సాధించు...అంతే గానీ చస్తాడట...వెళ్లు ...గోదాట్లో దూకు...ముందు ఇక్కడ్నుంచి బయటకు  తగలడు...క్షణంలో సగం ఆలోచిస్తే ఎవడైనా బలవంతంగా చస్తాడా? ’ విసురుగా కోపంగా అన్నాడు కొత్తరాజు. అక్కడితో ఆగలేదు. అయిదు నిమిషాల పాటు తిడుతూనే ఉన్నాడు. సుబ్బడు నిర్ఘాంతపోయాడు. ముఖం మాడ్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. 

కొత్తరాజు విరుచుకుపడటానికి కారణముంది. రెండేళ్ల క్రితం కొడుకు చిన్న మాట పట్టింపుతో కోడలితో దెబ్బలాడి పురుగుమందు తాగి చనిపోయాడు. అప్పట్నుంచీ అర్థంతర చావుల ప్రసక్తి వస్తే చాలు తనను తాను నియంత్రించుకోలేడు. కొడుకు శవం ఇంటికి రాగానే కనీసం ఏడవలేదు. కఠిన శిలలా ఉండిపోయాడు. ఎవరైనా ఓదార్చడానికి వచ్చినపుడు అతని ధోరణి వింతగా ఉండేది. 
‘జీవితం నుంచి పారిపోయేవాడు నా కొడుకే కాడు. తండ్రిగా నన్ను చంపినోడు కొడుకేంటి? పుట్టలేదనుకుంటాను ’ అనేవాడు. 
మనవరాలిని ఖాళీగా ఉన్న పురి కట్టుకునే చప్టా మీద పడుకోబెట్టాడు.
భుజం మీది తువ్వాలు గట్టిగా గాలిలో విదిలించాడు. తల చుట్టూ తలపాగాలా చుట్టుకున్నాడు. అచ్చమైన రైతులా ఉన్నాడు. మరోసారి వీధి వైపు చూశాడు. వెనక్కి వచ్చి ఇంట్లోకి తొంగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అంటే వంట ఇంట్లో పని ఇంకా పూర్తి కాలేదన్నమాట. అది అంత తొందరగా అయ్యేది కాదు.
గోతి దగ్గరకు వెళ్లాడు. వంగొని దాని లోతును కొబ్బరాకు ఈనెపుల్లతో కొలిచాడు. ఎందుకైనా మంచిదని అదే పుల్లతో చిన్ని దగ్గరకెళ్లి సరి చూసుకున్నాడు. సరిపోతుందనుకున్నాడు.

సరిగ్గా అదే సమయంలో రామమ్మ వచ్చింది. 
‘ అదెందుకు... బాబుగారో...సాయానికి రానా?’ అని అడుగు ముందుకేసింది పైట సర్దుకుంటూ.
రామమ్మ కేసి చూశాడు. పుష్టిగా ఉంటుంది. నల్లని కళగల ముఖం. పెద్దబొట్టు. మెడలో చెమటకు నానిన పసుపుతాడు. అస్తమానం పైటను చేతితో సవరించుకుంటుంది. 
‘అబ్బే...అవసరం లేదు. ఎందుకొచ్చావ్‌? ఏం కావాలి?’ విసుగ్గా అడిగాడు.         
‘నాకేమీ వద్దండి. అమ్మగారు ఊరగాయ పచ్చడి ఇత్తారని వచ్చాను ’ అని లోపలికి తొంగి చూసింది
 రామమ్మ.. చిన్నీ దగ్గరకెళ్లి చేతులూపి డాన్సు చేస్తున్నట్టు నటించి నవ్వించింది. బుగ్గ మీద చిటికె వేసింది. తల తిప్పి కొత్తరాజు కేసి చూసింది.
‘ఇంట్లో ఆడాళ్లు చాలా హడావుడిగా ఉన్నారు. రేపు రా...నువ్వొచ్చావని చెబుతాలే. ఇపుడు వాళ్లు నీకు దొరకరు. మాట్లాడేంత తీరిక లేదు’ అన్నాడు. ‘పలారం గానీ సేత్తనారేంటీ? అయితే అపుడే వత్తాన’ పైటను గట్టిగా పట్టుకుని అంది రామమ్మ.
కొత్తరాజు నవ్వుకున్నాడు. వెనక్కి చూసుకుంటూ వెళ్లిపోయింది. 

‘జిడ్డులా వదలదేమో అనుకున్నాను. అసలు నేనెందుకు భయపడుతున్నాను? ఇది రహస్యంగా చేయాల్సిన పనా?’ తొలిసారి అనుకున్నాడు. 
చిన్ని తనకేసే చూస్తోంది. ఎత్తుకున్నాడు. మూడేళ్లు దాటినా బుడి బుడి అడుగులేసే సమయం ఇంకా రానట్టే ఉంది. మాటలు కూడా సరిగ్గా పలకదు. కాళ్లు బాగానే ఉన్నాయి. తేడా ఏమీ ఉన్నట్టు అనిపించదు. ఎందుకో నడక ఆలస్యం అయింది. రమ బెంగ పెట్టేసుకుంది. తన బిడ్డ అవిటిది అవుతుందేమోనని భయపడుతోంది. ఎందరు ధైర్యం చెబుతున్నా వినడం లేదు. 
చిట్కా వైద్యం అమలు చేయాలనే తాపత్రయం తనది. చెబితే భరించలేరు. ఒప్పుకోరు. విడమరచి చెప్పినా అర్థం చేసుకోరు. అందుకే ఈ రహస్యపు ఏర్పాటు....
కొత్తరాజు ఆకాశం కేసి చూశాడు. పడమటి వైపున ఉన్న సూర్యుడికి నమస్కారాలు చేశాడు. 
చాక్లెట్టు చిన్ని నోట్లో పెట్టాడు. చప్పరిస్తోంది తాత కళ్లలోకి చూస్తూ. 
చిన్నిని జాగ్రత్తగా గోతిలో నిలుచోబెట్టాడు. మరో చాక్లెట్టును చేతిలో ఉంచాడు. 
మట్టిలో నడుము దాకా కప్పెట్టాడు. ఆడాళ్లు గంటసేపు ఇటు పక్కకు రాకపోతే చాలు. వస్తే రణరంగమే.
వాళ్లకు సర్ది చెప్పడం కష్టం. ఒకరోజు ఇలా దొంగచాటుగా చేసింతర్వాత మరో రెండు రోజులు ఒప్పించి చేయొచ్చనుకున్నాడు. 
నడక కొంతమంది పిల్లల్లో ఆలస్యం అవుతుంది. తొందరగా నడక రానివాళ్లను గోతిలో నడుం దాక నేలలో పాతుతారు. అలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి నడక వస్తుందని తాత చెప్పేవాడు. పూర్వం రోజుల్లో ఈ పద్ధతి  అవలంబించేవారు. ఈ తరం వాళ్లకు మోటుగా అనిపిస్తుంది. ఎగతాళిగా ఉంటుంది.
మట్టిని కాళ్లతో ఒత్తాడు. తర్వాత ‘కీ’ ఇస్తే గెంతులేసే బొమ్మను చిన్ని ముఖం దగ్గరగా ఉంచాడు. ఆ బొమ్మ ఆడుతుంటే చిన్ని సంతోషంగా నవ్వింది. 
సరిగ్గా అపుడే మరో ఆలోచన వచ్చింది. చిన్నికి తొందరగా నడక రావాలని దేవుడ్ని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టాలనిపించింది. మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదనుకున్నాడు. కొబ్బరికాయ లేదు. కొత్తరాజుది మనసులో అనుకుంటే చాలు అది మొక్కుగా భావించే మనస్తత్వం. ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లలేడు. కొబ్బరికాయ సంపాదించడం ఎలా? 
చుట్టూ చూశాడు. ఎత్తు తక్కువ ఉన్న కొబ్బరిచెట్టు దగ్గరకెళ్లాడు. తల పైకెత్తి చెట్టును గమనించాడు. 
ఇరవై అడుగుల ఎత్తుంటుంది. కాయలు గుత్తులుగా ఉన్నాయి. 

కొత్తరాజు చూరున ఉన్న పలుపుతాడును అందుకున్నాడు. దానికి సాయంగా తాటినారతో నేసిన తాడుకూడా తీసుకున్నాడు. ఇలాంటి చెట్లను అవలీలగా ఎక్కగలిగే అనుభవం ఉంది. కొడవలిని తలపాగాలోకి అమరేలా జొనిపాడు. 
కొబ్బరిచెట్టు కాండం చుట్టూ వదులుగా పైకి జరుపుకునేలా పలుపుతాడు కట్టాడు. అలాగే తాటినారతో నేసిన తాడును చంక కిందుగా ఉండేలా బిగించుకున్నాడు. నెమ్మదిగా పలుపుతాడు మీద నిలబడి చేతులతో పైకి కదుపుతూ అంచెలంచెలుగా ఎక్కుతున్నాడు. సగం చెట్టు ఎక్కి కింద ఉన్న చిన్నిని చూశాడు. కళ్లు మిటకరించి అటూ ఇటూ తిప్పుతూ చూస్తోంది. ఒక కోడిపుంజు– పెట్టను తరుముతూ వచ్చి చిన్నిని చూసి ఆగిపోయింది. నవ్వుకుంటూ ఇంకా పైకి వెళ్లడానికి దృష్టి సారించాడు.
మరో మూడడుగులు పాకాడు. ఆయాసంగా ఉంది. కాళ్ల సత్తువ చాలదనిపించింది. ఒక దశలో కిందికి దిగిపోదామనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా ప్రారంభించి తలపెట్టిన పని మధ్యలో వదిలేసి రావడం సుతరామూ ఇచ్చగించని మనిషాయె. ధీరుడు...సాహసికుడు ఎలా వెనుదిరుగుతాడు?  ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకే వెళతాడు.                 
కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కళ్లు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇష్ట దైవాన్ని తలచుకున్నాడు. ఓపిక తెచ్చుకుని మరి కొంత దూరం పాకాడు. కడుపు భాగంలో గీసుకోవడంతో మంటగా ఉంది. ఎర్రగా కమిలింది. చురుక్కుమంటోంది. చలిచీమలు గుట్టలుగా పేరుకుని చెట్టు మీద బారులు తీరి తిరుగాడుతున్నాయి. 
ఇంకా కొంచెం శ్రమపడితే కాయలు చేతికందుతాయి. 
కంటిలో ఏదో పడింది. మండుతోంది. నలక లాంటి పురుగేదో పడింది. వేలితో కంటి లోంచి దాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. కాసేపటికి బయటకు వచ్చేసింది.అమ్మయ్య...అనుకున్నాడు. 

కొబ్బరికాయ కోశాడు. చేతితో పట్టుకుని చప్పుడు రాకుండా ఉండటానికి గడ్డిమోపు మీదకు విసిరాడు. మిగిలిన గెలలోని కాయలు కోద్దామనుకున్నాడు. ఆ చప్పుడుకు ఇంట్లో వాళ్లు వచ్చేస్తారని భయపడి మానేసాడు. ఒక్క కాయ కోసం ఇంత సాహసం చేసాడంటే ఎవరైనా నమ్ముతారా?  నమ్మరు.
కిందికి చూశాడు. చుట్టుపక్కల తిరిగే ఊరకుక్క నేలను వాసన చూస్తూ చిన్ని దగ్గరకు వచ్చింది. చుట్టూ తిరిగింది. చిన్ని ఏడవడం మొదలెట్టింది. కుక్క ధైర్యంగా మరింత దగ్గరకు వెళ్లింది. అక్కడున్న బొమ్మను నాలుకతో నాకి కాళ్లతో తొక్కి చూసింది. కొత్తరాజు గమ్మున చెట్టు దిగాలనుకున్నాడు.
కాళ్లు స్వాధీనంలోకి రాలేదు. గుండె బరువెక్కినట్లనిపించింది. ఊపిరి బిగపెట్టింది. శ్వాస తీయడానికి ఇబ్బందిగా ఉంది. చెమటలు పడుతున్నాయి. దేహంలో ఏదో తెలియని గందరగోళం. సన్నగా గుండెలో నొప్పి. నేలను చూడ్డానికి తల వంచాడు. కళ్లు మసక కమ్మాయి. రక్త ప్రసార చలనం ఆగినట్టుగా...ముసుగు కప్పిన పొరలు ...చీకటి తెరలుగా కమ్ముకుంటున్నాయి.
చిన్ని ఏడుపు పెరిగింది. 

ఏడుపు చెవులకు సోకిందో ఏదైనా అవసరం పడిందో రమ ఇవతలకు వచ్చింది. చిన్నిని చూసింది. మతిపోయింది. ‘ నాన్నా ’ అంటూ అరచింది. తండ్రి కనిపించలేదు. ఎక్కడకు వెళ్లాడు? ఏం చేస్తున్నాడు?
ఇంతలో ఏమైందంటూ ఆరా తీస్తూ శాంతమ్మ వచ్చింది. రమ ఏడుస్తూనే అక్కడే ఉన్న గునపంతో నెమ్మదిగా మట్టి తీస్తోంది. 
చిన్నిని గుండెకు హత్తుకుంది. తల్లి చంక ఎక్కగానే భుజం మీదకు వాలిపోయింది. 
‘తాతయ్య ఎక్కడున్నాడూ...చిన్నీ ...తాత...తాత...’ అని అడిగింది.         
ఈలోపులో శాంతమ్మ గడ్డి మోపు మీద ఉన్న కొబ్బరికాయను చూసింది. తల పైకెత్తి చెట్టు పైకి చూడగానే భర్త కనిపించాడు.
‘ఏమండీ...అక్కడే ఉండిపోయారేంటి? దిగండి...’ అంది కొబ్బరిచెట్టు పైకి చూస్తూ.
కదలిక లేదు. ఉలుకు లేదు. పలుకు లేదు. కొయ్యబారి ఉన్నాడు. అస్తవ్యస్తంగా ఒరిగి ఉన్నాడు. 

కొత్తరాజు ఇక లేడన్న సంగతి వాళ్లిద్దరికీ అర్థమవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇద్దరూ ఏడుస్తూ చెట్టు మొదలనే కూలబడిపోయారు. ఊహించని సంఘటన. 
శాంతమ్మ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత తతంగం జరగడానికి చాలా సమయం పట్టింది. 
‘కొంతమంది అంతే. వయసు గమనించరు. ఇంకా బాల్యం లోనే ఉన్నట్టుగా అనుకుంటారు. లేకపోతే ఏమిటండీ? కొత్తరాజు ఇంకా కుర్రాడనుకుంటున్నాడా? ఆయన మాటలు చేతలు తెలిసినవాళ్లమే కదా. అలాగే అనుకుంటాడు. అన్ని వేళలా దుందుడుకుతనం పనిచేయదండీ... క్షణమన్నా ఆలోచించాలి కదా. క్షణం తర్వాత ఏముంది? అంతా శూన్యం ’ ఓ పెద్దాయన అంటున్నాడు.
‘బెట్టు చేయకుండా పెద్దరికాన్ని అంగీకరించాలి. అయ్యా... పెద్దోళ్లారా... కాస్తంత నిశ్శబ్దంగా ఉండండి. ఉన్న చోటున ప్రశాంతంగా గడపండి. ఇంకా బాల్యంలోనే ఉన్నామనే భ్రమ నుంచి బయటకు రండి. దయచేసి ఇదొక పాఠం అనుకోండి,  నాయనలారా ’ ఓ కుర్రాడు చేతు జోడించి అక్కడున్న  పెద్దలకు నమస్కరిస్తూ నాటకీయంగా అంటున్నాడు.
చదవండి: ఈవారం కథ: భార్య
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement